Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాశంలో ఏర్పడే మెరుపు లేదా పిడుగు అనేది విద్యుత్ యొక్క ఒక రూపం. మేఘాలలో ఏర్పడే ఋణావేశ (నెగిటివ్ ఛార్జ్) నీటి బిందువులు నుండి విద్యుత్తు, ధనావేశం (పాజిటివ్ ఛార్జ్) వైపుకి ప్రవహించటాన్ని మెరుపు లేదా పిడుగు అని పిలుస్తారు. మేఘంలోని చిన్న చిన్న నీటి బిందువులు, మంచు స్పటికాలు ఋణావేశాన్ని లేక ధనావేశాన్ని కలిగి ఉంటాయి. ఋణావేశం గల నీటి బిందువులు మేఘం క్రిందిభాగంలో ఉంటే, ధనావేశం గల నీటి బిందువులు మేఘం పైభాగాన్ని ఆక్రమిస్తాయి.
మెరుపు మూడు విధాలుగా ఏర్పడే అవకాశం ఉంది. మొదటిది ఒకే మేఘంలోని ఋణావేశం గల నీటి బిందువుల నుండి ధనావేశం గల నీటి బిందువుల వైపుకు విద్యుత్ ప్రసరణ జరిగి మెరుపు ఏర్పడవచ్చు. రెండవది ఒక మేఘంలోని ఋణావేశం గల నీటి బిందువుల నుండి మరొక మేఘంలోని ధనావేశం గల నీటి బిందువుల వైపుకు విద్యుత్ ప్రసరణ జరిగి మెరుపు ఏర్పడవచ్చు. మూడవది ఒక మేఘంలోని ఋణావేశ నీటి బిందువుల నుండి ధనావేశం గల భూమి వైపుకు విద్యుత్ ప్రసరణ జరిగి మెరుపు ఏర్పడవచ్చు. ఈ మూడింటిలో చివరిది అతి ప్రధానమైనది.
భూమి, భూమిపై గల మానవజాతి, జంతువులు, వస్తువులు ఒక్క మాటలో చెప్పాలంటే భూమిపై గల సర్వస్వము ధనావేశంగా పనిచేస్తాయి. కాబట్టి మేఘంలోని ఋణావేశ నీటి బిందువుల నుండి ధనావేశం గల భూమి వైపుకు విద్యుత్ ప్రసరణ జరిగినప్పుడు ఏర్పడే మెరుపు లేదా పిడుగు మానవాళికి పెను విధ్వంసాన్ని కలగజేస్తుంది. ఒక సాధారణ మెరుపు 300 మిలియన్ వోల్టుల విద్యుత్తుకు సమానం. మెరుపు 30,000 డిగ్రీ సెంటిగ్రేట్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత సూర్యుని ఉపరితలంపై గల ఉష్ణోగ్రత కంటే ఐదు రెట్లు ఎక్కువ. వేసవికాలంలో భూమి బాగా వేడెక్కడం వలన మెరుపులతో కూడిన వర్షాలు సర్వసాధారణం. సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగితే 12% పిడుగులు పెరిగే అవకాశం ఉంది. భారతదేశంలో పిడుగుపాటు ద్వారా 23% ఇతరులు మరణిస్తే, 77% రైతులు మరణిస్తున్నారు.
కొన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా మెరుపు లేదా పిడుగుపాటు ప్రమాదం నుండి బయటపడవచ్చును. మెరుపు, ఉరుము మధ్య సమయం 30 సెకన్ల కంటే తక్కువగా ఉంటే, వెంటనే భవనంలోకి ప్రవేశించండి (ఎందుకంటే పిడుగుపాటు దగ్గరిలో ఉంది అని అర్థం). చివరిగా గమనించిన మెరుపు తర్వాత 30 నిమిషాలు తర్వాత తర్వాత బయటికి వెళ్ళొచ్చు. మేఘానికి, భూమిపై గల వస్తువుల (మానవులు, చెట్లు, ఇనుప స్తంభాలు, ఎత్తైన ప్రదేశాలు మొదలగునవి) మధ్య దూరం పెరిగిన కొద్దీ పిడుగుపాటు ప్రమాదం తగ్గుతుంది. మేఘానికి భూమిపై గల వస్తువుల మధ్య దూరం తగ్గిన కొలది పిడుగుపాటు ప్రమాదం పెరుగుతుంది.
బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు పిడుగుపాటు నుండి కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు:
1. 59% పిడుగుపాటు ప్రమాదాలు బహిరంగ ప్రదేశాలలోనే జరిగినట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. తుఫాను ప్రాంతం నుండి 20 మైళ్లకు పైగా దూరంలో కూడా పిడుగులు పడవచ్చును. కాబట్టి మనం ఉన్న ప్రదేశం మేఘావృతమై ఉండి వర్షం లేనప్పటికీ పిడుగు శబ్దం విన్నా, మెరుపును చూసినా... వెంటనే గట్టి పునాదితో కట్టిన భవనాల్లోకి ప్రవేశించాలి (కాంక్రీట్ స్లాబ్ గలవి). షెడ్లు, డగౌట్స్, బస్ షెల్టర్లు నిజమైన రక్షణను అందించవు.
2. బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదు. ఆరుబయట పంట పొలాలలో పనిచేసే రైతులు గాని, ఇతరులుగానీ ఎక్కువగా పిడుగుపాటుకు గురవుతుంటారు. ఉదాహరణకు చెట్ల కింద, ఎత్తైన స్తంభాల కింద, మైదానాలలో, పొలాలలో, ఎత్తైన ప్రదేశాలపై, ఉపరితల నీటి వ్యవస్థలైన నదులు సరస్సులు, స్విమ్మింగ్ పూల్స్ వద్ద ఉండకూడదు. బోటింగ్ చేయకూడదు. పతంగులు ఎగిరి వేయకూడదు. అంటే ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే (బహిరంగ ప్రదేశాల్లో అస్సలు వుండకూడదు) వుండాలి.
3. దఢమైన భవనాలు అందుబాటులో లేనప్పుడు కారు, వ్యాను, బస్సుల్లో వున్నప్పుడు ఆయా వాహనాల కిటికీలు మూసి వాహనం లోపల ఉండాలి. దీనికి కారణం వాహనాలు పూర్తిగా, పైకప్పుతో సహా లోహంతో తయారుచేయబడి ఉంటాయి. కాబట్టి ఫెరడే గేజ్/ ఫెరడే షీల్డ్ అనే నియమం పనిచేసి ఈ వాహనాల లోపల ఉన్న వ్యక్తులు పిడుగుపాటుకు గురికారు. ఫెరడే గేజ్/ ఫెరడే షీల్డ్ అనే నియమం పనిచేయడం వల్లనే విమానాలు పిడుగుపాటుకు గురికావు. ఆటోలు సురక్షితం కాదు ఎందుకంటే వీటి పై కప్పు లోహంతో కప్పబడి ఉండదు. ద్విచక్ర వాహనాలను నడపకూడదు.
4. పిడుగులు పడుతున్న వాతావరణ పరిస్థితులు ఉండి, మన మెడపై లేదా చేతులపై వెంట్రుకల చివరలు లేచి నిలబడితే లేక మన దగ్గరలోని లోహపు వస్తువులు కంపిస్తునట్లయితే పిడుగుపాటు జరగబోతున్నట్లుగా గుర్తించవలెను. ఆ సమయంలో మనం బహిరంగ ప్రదేశాల్లో వుంటే... వంగి తలను మోకాళ్ళ మధ్య ఉంచి ముని పాదాలపై భూమిపై దగ్గరగా ముడుచుకొని కూర్చోవాలి (క్రౌచ్ డౌన్). భూమి పై పడుకోకూడదు. పిడుగు భూమిపై పడినప్పుడు భూమి విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు శరీరం భూమిని తాకకుండా ఉంటే మంచిది. మరొక విషయం ఏమిటంటే ఇలా కూర్చున్నప్పుడు కండ్లు మూసుకొని, చెవులను చేతులతో కప్పుకోవలెను. ఎందుకంటే పిడుగు పడినప్పుడు వెలువడే కాంతి, శబ్దం కంటి చూపును, వినికిడి శక్తిని తగ్గించే అవకాశం ఉంది.
5. పిడుగులు పడే సమయంలో ఎవరైనా సమూహంలో ఉన్నట్లయితే, మనిషికి, మనిషికి మధ్య దూరం వుండేలా చూసుకోవాలి. ఎందుకంటే పిడుగు పడితే గాయపడే వారి సంఖ్య తగ్గుతుంది.
6. పిడుగులు పడే వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు గొడుగును, ఇతర విద్యుత్ వాహకాలైన వస్తువులను తీసుకొని బయటకు వెళ్ళకూడదు.
7. బహిరంగ ప్రదేశంలో ఉన్నట్లయితే, లోయ కానీ, లోతట్టు ప్రాంతాలలో కానీ ఉండాలి (కానీ ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండండి). విద్యుత్ ఆవేశం కలిగిన మేఘానికి, లోయకు మధ్య దూరం పెరిగి పిడుగుపాటుకు గురయ్యే అవకాశాలు తక్కువగా వుంటాయి. ఎత్తైన ప్రదేశాలలో ఉన్నట్లయితే మేఘానికి మరియు ఎత్తైన ప్రదేశానికి మధ్య దూరం తగ్గి పిడుగు పడే అవకాశం ఉన్నది.
8. రబ్బరు టైర్లు, రబ్బరు-సోల్డ్ బూట్లు, చెప్పులు మెరుపు నుండి ఎటువంటి రక్షణను అందించవు.
భవనం లోపల ఉన్నప్పుడు పిడుగుపాటు నుండి కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు:
1. దఢమైన భవనాలు పిడుగుపాటు నుండి పూర్తిగా రక్షణ కల్పిస్తాయి. ఉదాహరణకు ఇండ్లు ఆఫీసులు మరియు షాపింగ్ మాల్స్ మొదలగునవి.
2. బహుళ అంతస్తుల భవనాలలో ఉండవలసి వచ్చినప్పుడు సాధ్యమైనంతవరకు సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ వంటి దిగువ అంతస్తులలో ఉండటం మంచిది.
3. పిడుగులు పడే సమయంలో కాంక్రీట్ ఫ్లోర్లపై పడుకోవడం కానీ, కాంక్రీట్ గోడలపై వాలడం కానీ చేయకూడదు. కాంక్రీట్ గోడలు, ఫ్లోరింగ్‌లోని ఏదైనా మెటల్ వైర్లు, బార్ల గుండా మెరుపులు ప్రయాణించవచ్చు. కిటికీలు, తలుపులులకు దూరంగా గది మధ్యలో ఉండాలి.
4. మంచంపై పడుకోవడం, సోఫా, కుర్చీలపై కూర్చోవడం వల్ల ప్రమాదం ఉండదు.
5. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, గేమ్ సిస్టమ్‌లు, వాషింగ్మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్, ఎయిర్ కండిషనర్లు, కేబుల్ ఇంటర్నెట్ వంటి ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం మానుకోండి. ఎందుకంటే ఈ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్ పరికరాల వైరును కరెంట్ ప్లగ్‌లో ఉంచడం ద్వారా అవి పనిచేస్తాయి. ఈ వైరు ద్వారా మెరుపు విద్యుత్తు ప్రవహించవచ్చు. కావున ఈ ఎలక్ట్రిక్ పరికరాల వైరును కరెంట్ ప్లగ్ నుండి తొలగించాలి. వైరు సాయం లేకుండా పనిచేసే ఇంటర్నెట్, సెల్ ఫోన్ లాంటివి ఉపయోగించుకోవచ్చును.
6. ఉరుములతో కూడిన వర్షం సమయంలో నీటికి సంబంధించిన పనులు చేయవద్దు. ఎందుకంటే నీటి సరఫరాకు వినియోగించే పైపుల ద్వారా (ప్లంబింగ్ ద్వారా) మెరుపు ప్రయాణించవచ్చు.
ప్రధమ చికత్స:
పిడుగు పాటుగు గురైన వ్యక్తిని తాకటం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. కావున వెంటనే 108 కి ఫోన్ చేసి, పిడుకుపాటుకు గురైన వ్యక్తి శ్వాస, మెడభాగం దగ్గర దవడ కింది భాగంలో పల్స్ స్పందనను పరిశీలించాలి. గుండె ఆగినట్లుగా భావిస్తే (CPR) సీపీర్ నిర్వహించాలి. పిడుగుపాడుకు గురైన వ్యక్తి, ఆ చుట్టుపక్కన వున్నవారు సాధ్యమైనంత త్వరగా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలి. ఎందుకంటే ఆ ప్రదేశంలో తిరిగి పిడుగుపాటు జరిగే అవకాశం ఉంటుంది.
- డా||శ్రీధరాల రాము,9441184667