Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఒక తల్లి తన పిల్లలకు మంచి ఆలోచనా విధానాన్ని నేర్పగలిగితే, సమాజానికి ఆమె ఎంతో ఉపకారం చేసినట్లే'' అంటారు హీరో పవన్ కల్యాణ్. వాస్తవిక దృక్పథంతో ఆలోచించడం, మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండడం తాను తన తల్లి (కొణెదల అంజనా దేవి) వద్ద నుంచి నేర్చుకున్నానంటారు. నిజానికి ఆమె పెద్దగా చదువుకోలేదు. ఐదు లేదా ఆరో తరగతితో చదువు ఆపేశారట. ఐనా పుస్తకాలు చదవడంలో ఆమెకు విశేషమైన ఆసక్తి. అది పవన్‌కు కూడా అలవడింది. రోజూ లైటు వెలిగించి, దణ్ణం పెట్టుకోవడం ఆమె అలవాటు. ''ఎవరికమ్మా ఆ దణ్ణాలు?'' అని పవన్ కళ్యాణ్ ఒక రోజు తల్లిని అడిగాడు. కుతూహలంగా మామూలుగా ఏ లక్ష్మీదేవి పేరో లేదా మరే దేవత పేరైనా ఆమె చెబుతారని అనుకున్నాడు. కానీ ఆమె ''థామస్ అల్వా ఎడిసన్‌కు దణ్ణం పెడతానురా.. ఆయన ఎలక్ట్రిక్ బల్బ్‌ను కనిపెట్టడం వల్లే కదా.. ఇవాళ మనం ఎంతో వెలుగును చూడ గలుగుతున్నాం'' అనే సరికి అమ్మలో అంతర్లీనంగా ఉన్న ఆ కృతాజ్ఞతా భావానికి ఎంతగానో ముగ్ధులయ్యారు పవన్. మనకి ప్రత్యక్షంగా మేలు చేయకపోయినా, సమాజానికి మంచి చేసే వారి పట్ల కూడా మనం కృతజ్ఞులమై ఉండాలని, అప్పుడే పవన్ కల్యాణ్‌కు స్ఫురించింది!
- బి.కె.ఈశ్వర్