Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భార్యాభర్తల మధ్య అవగాహన, అన్యోన్యత, సమన్వయం ఉన్నట్లయితే ఆ సంసారం సాఫీగా సాగుతుంది. సంసారం అనే బండికి భార్యాభర్తలు ఎడ్ల లాంటివారు. అందులో ఏ ఒక్క ఎద్దు సరిగా నడవకపోయినా బండి ముందుకు సాగదు. సర్దుబాటు అవగాహనా కలిగిన దంపతులు జీవితాన్ని ఉల్లాసంగా గడుపుతారు. వివాహం అనే బంధంతో ఒక్కటైన ఇద్దరు వ్యక్తులు పెండ్లికి ముందు వేర్వేరు వాతావరణంలో పెరిగి పెద్దవుతారు. ఇద్దరి అభిరుచులు వేరు వేరుగా ఉంటాయి. అలాంటప్పుడు ఒకరి అభిప్రాయాలను, అభిరుచులను మరొకరు గౌరవించాలి. అర్థం చేసుకోవాలి. ఇద్దరి మధ్య సమస్యలు తలెత్తినపుడు సర్దుబాటు చేసుకోవాలి.
సుశీల వయస్సు 26 సంవత్సరాలు. ఆమెకు వివాహమై 4 సంవత్సరాలైంది. చీటికి మాటికి భార్య భర్తలు కలహించుకునే వారు. 2 సంవత్సరాల పాటు ఆయన ఆమె ఆగ్రహాన్ని తగ్గించ డానికి ప్రయత్నించాడు. ఆ తరువాత ముభావంగా ఉంటూ ఆమెకు క్లుప్లంగా సమాధానాలు చెప్పాడు. తమ దాంపత్యం నిస్సారంగా తయారైందని సుశీల గ్రహించింది. కానీ ఈ సమస్యను ఎలా అధిగమించాలో ఆమెకు అర్థం కాలేదు. ఒక రోజు సుశీల తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ రెండు రోజులు గడిపింది. తన స్నేహితురాలు ఆమె భర్త ఇద్దరు ఎంతో అన్యోన్యంగా, సంతోషంగా ఉండడాన్ని గమనించింది. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించు కోవడాన్ని గమనించింది. ప్రయత్నిస్తే తాము కూడా అలా ఉండగలమని గుర్తించింది. ఇంటికి వచ్చిన తరువాత భర్తతో చనువుగా ఉండడం ప్రారంభించింది. త్వరలోనే ఆయనలో మార్పు కనిపించింది. ఇంటి పనులను ఇద్దరు సమానంగా పంచుకుని ముందుకు సాగారు.
తన కుటుంబ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మలచు కోవడం గాని, నిరుత్సాహపూరితంగా రూపొందించుకోవడం గాని అధికంగా గృహిణిపైనే ఆధారపడి ఉంటుందని మానసిక నిపుణుల అభిప్రాయం. ఒకప్పుడు మాతృస్వామిక యుగం మన సమాజంలో అమల్లో ఉండేది. ఆ కాలంలో కుటుంబ పెద్దలుగా మహిళలే ఉండేవారు. కాలక్రమంలో పురుషాధిక్యత ప్రారంభమైన తరువాత స్త్రీలకు కష్టాలు, కన్నీళ్లు గృహహింస ప్రారంభమైంది. ప్రస్తుత లాక్డౌన్ సమయంలో కుటుంబ సభ్యులందరూ ఇండ్లకే పరిమిత మయ్యారు. గృహిణిపై మరింత భారం పెరిగింది. దీంతో అనేక కుటుంబాల్లో కలహాలు ఎక్కువయ్యాయి. సరిగ్గా ఈ సమయంలోనే మహిళలు పడుతున్న కష్టాలను పురుషులు గుర్తించాలి. వారికి సహకరిం చాలి. కుటుంబ బాధ్యతలను ఇద్దరు సమానంగా మోయాలి. ఎల్లప్పుడు సంతోషంగా జీవితాన్ని గడిపి తీరాలన్న దృక్పధాన్ని మీరు సంతరించుకున్నట్లయితే మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీరు అనుసరించే సానుకూల దృక్పధమే మీ జీవితాన్ని తీర్చి దిద్దుతుంది. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నైనా సంతోషంగా ఉండి తీరాలని మీరు నిర్ణయించుకున్నపుడు గతంలో మిమ్మల్ని బాధించిన సంఘట నలు స్వల్పంగా కనిపిస్తాయి. ఈ దృక్పధాన్ని మీరు సంతరించు కున్న తరువాత మీరు మరికొన్ని ప్రధాన అంశాలను గుర్తించాలి. మీలో మీకు తెలియని, మీరు గుర్తించని ఎన్నెన్నో ప్రతిభా సామర్థ్యాలు న్నాయి. మీ సత్తాను సవ్యంగా అంచనా వేసుకుని సరిగ్గా వినియోగించుకోగల నైపుణ్యాన్ని అలవరుచుకోవాలి. మీకు ఏ అంశంపై ఎక్కువ మక్కువ ఉందో మీ అభిరుచు లేమిటో ఒక సారి సమీక్షించుకోవాలి. వాటిని గుర్తించి కాగితంపై రాసుకోవాలి. అలాగే అనునిత్యం మీరు చేస్తున్న పనులు మీకెంత మాత్రం సంతృప్తిని కలిగించనపుడు, మీరు చేయగలిగిన ఇతర పనులేమిటో పరిశీలించాలి.ఇంటి పనులతో పాటు మీ అభిరుచులను పెంపొందించే ఇతర పనులపై సయితం మీరు శ్రద్ధ పెట్టి, మీ ప్రతిభను విస్తృతం చేసుకోవాలి.
అలాగే మీ బలహీనతలేమిటో అరమరకలు లేకుండా గుర్తించగలగాలి. ఏయే సందర్భాల్లో మీరు ఆభద్రతా భావనకు లోనై చలించిపోతుంటారో గమనించండి. మీరు బాల్య దశలో ఉన్నపుడు అనేక విషయాలు జరిగి ఉంటాయి. వాటినే మననం చేసుకుని మనసును కలత చెందనీయవద్దు. మిమ్మల్ని బాధి స్తున్న సంఘటనలను ఒక కాగితంపై రాసుకొండి. ఆ సంఘట నలకు చలించవద్దని బలంగా నిర్ణయించుకొండి. మీ మనస్సు ను దృఢంగా తయారు చేసుకొండి. వర్తమానంలో సంతోషంగా జీవించడానికి ప్రయత్నించండి. భవిష్యత్తుపై ఆశ పెంచుకొండి. మొదట చిన్నచిన్న లక్ష్యాలను ఏర్పాటు చేసుకొండి. వాటిని పూర్తి చేయండి. మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మరిన్ని పనులను విజయవంతంగా పూర్తి చేసేందుకు ఆ ఉత్సాహం స్ఫూర్తిగా పని చేస్తుంది. అదే సమయంలో మీ ప్రవర్తనను మీరు అదుపు చేసుకోగల సామర్థ్యాన్ని అలవర్చుకుంటారు. ఇక ముఖ్య విషయమే మిటంటే మిమ్మల్ని మీరు ఎట్టిపరిస్థితుల్లోనూ కించపర్చు కోవద్దు. ఇతరుల మాదిరిగా అందంగా, ఆకర్షణీయంగా లేనన్న అపరాధ భావనతో సతమతం కావద్దు. అందం ఆకర్షణ మన మాట తీరులో మనసులో, మన ప్రవర్తనలో ఉండాలి తప్ప, బాహ్య రూపంలో ఉండనక్కరలేదు. అందం కొలమానం కాదని గుర్తించాలి.
- జి.గంగాధర్ సిర్ప,
8919668843