Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ మహౌద్యమ రథసారధిగా ప్రజానీకాన్ని నడిపిం చిన మహానాయకుడు. చీకటిలో మగ్గుతున్న జాతికి వెలుతురును పంచిన సూర్యుడు. ఆయనే మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. రాజకీయ ప్రతిభనే కాదు కవితా ప్రతిభ లోనూ మేటి అనిపించుకున్నవారు. చిన్నప్పటి నుంచే తెలుగు సాహి త్యాన్ని ఔపోసన పట్టిన ఆయన కవిత్వరచనలోనూ తన ప్రత్యేకతను కనబరిచారు. అంతేకాదు 2011 లో వచ్చిన 'జై బోలో తెలంగాణ' సినిమా కోసం 'గారడి జేస్తుండ్రు గడిబిడి జేస్తుండ్రు' అనే పాటను రాశారు. తెలంగాణ యాసలో సాగిన ఈ పాట అవినీతిని ఖండిస్తూ ఓ తూటాలా దూసుకుపోతుంది.
అపారమైన ప్రతిభా వ్యుత్పత్తులను కైవసం చేసుకున్న ఆయన 2011 లో వచ్చిన 'జై బోలో తెలంగాణ' సినిమాలో 'గారడి జేస్తుండ్రు గడిబిడి జేస్తుండ్రు తొండికి దిగుతున్రు మొండికి పోతున్రు' అనే పాటను రాశారు. దోపిడీ విధానానికి,అలవాటుపడ్డ స్వార్థపూరితమైన నాయకులు ఎలా ఉంటారో ఈ పాటలో తెలియజేశారు చంద్రశేఖర రావు. పాట మొత్తం తెలంగాణ యాసలో కదం తొక్కి సాగుతుంది. మన భాష పటుత్వాన్ని, పదునుదనాన్ని ఈ పాటలో పదిలంగా పరిచారు. అవినీతిమార్గంలో నడిచే నాయకులు భేతాళ మాంత్రికుల లాగా మాయలు చేస్తూ,నాటకాలాడుతూ,జనాన్ని మోసంచేస్తు న్నారని, తింటున్న అన్నాన్ని కూడా దొంగిలించజూసే మూర? వ్యవస్థ ఉందని, అది తెలంగాణ తేజోమయ వికాసానికి చీకటిలా అడ్డుపడుతుందని ఈ పాటలో వివరిస్తారు.
ఓట్ల కోసం వచ్చి ప్రజల ముంగిట దండాలు బెట్టే నాయకులు న్నారని, వారి మాటలకు సైసైలు గొట్టేవాళ్ళూ ఉన్నారని, సమన్యాయ పాలనాపద్ధతిని విడిచిపెట్టి తిరిగే బడాబాబులున్నారని చెబుతు న్నారు. ఆస్తులతో, అంతస్తులతో హాయిగాఉంటూ తమ పొట్ట నింపు కుంటారేగాని నిస్వార్థపూరితమైన భావనను రవ్వంత కూడా మనసు లోకి రానివ్వరని అవినీతి నాయకుల వ్యక్తిత్వాన్ని ఈ పాటలో పట్టి చూపిస్తారు. అక్రమ పాలకులు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. అప్పుడే ప్రేమగా మసలుకోవడం, అప్పుడే గుద్దులాడుకో వడం, జండాలు పట్టుకుతిరగడం, ప్రజలకు బంధువుల్లా నటిస్తూ వారి చెంతనే ఉండడం ఇలా అస్తవ్యస్తమైన పరిస్థితుల మధ్యన వాళ్ళ ప్రవర్తన చిత్రవిచిత్రంగా ఉంటుందంటూ దుర్వ్యవస్థను,వాళ్ళ దురాక్రమణను కళ్ళకు కట్టినట్టు చూపించారు.
సమాజాన్ని చాలా లోతుగా పరిశీలనాదక్పథంతో చూసే నేర్పు కవికి ఉండాలి. సామాజిక పరిస్థితులపై, ప్రజల కష్టనష్టాలపై ప్రత్యేక మైన దష్టి సారించిన ప్రజాకవిగా చంద్రశేఖరరావు ఈ పాట ద్వారా మనకు కనిపిస్తారు. సమాజాన్ని పరిశీలించే కవిగానే కాకుండా నాయకుడిగా సమాజాన్ని నీతిబాటలో నడిపించేవారిగా కూడా ఆయన కనిపిస్తారు.అది ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనదగిన విషయం.
కిరాయి మూకల దుర్నీతిని, చీకటి పరిపాలనావ్యవస్థను, కిరికిరి పెట్టి చెలగాటమాడే కుట్రదారులను నిలదీసి ప్రశ్నించిన తీరు ఈ పాటలో కనబడుతుంది. దోపిడీ పాలకులు పేదల బతుకులతో చెలగాటమాడుతున్నారని, పరిపాలన ఒక వ్యాపారమైపోతుందని తెలియజేస్తున్నారు. మనుషుల వ్యాపారమే కాదు వాళ్ళ మనసులూ వ్యాపారమే అంటారు. దోచుకునే దొంగబుద్ధుల విధానానికి సమాధి కట్టే దిశగా ఆయన కలం అడుగువేసిందిక్కడ. వెలుగుల దిశగా నడుస్తున్న తెలంగాణ దేదీప్యమానంగా వెలుగుతూ ఉండాలన్నదే ఆయన ఆశ,శ్వాస. తెలంగాణే తన ఊపిరి అంటూ పిడికిలెత్తిన ఆయన మహౌన్నత ఆశయం ఈ పాట నిండా కనిపిస్తుంది.
ఇలా - తన పాటతో అవినీతి పాలనకు చరమగీతం పాడారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని రెపరెపలాడించారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని అవినీతి వ్యవస్థపై ఎక్కుపెట్టారు. నిజాయితీతో నిలబడి, నిక్కచ్చితనాన్ని కలిగి ఉండాలనే సందేశం ఈ పాటలో ఉంది. అలా ఉన్నప్పుడే అది న్యాయబద్ధమైన పాలనగా, అలా ఉన్నవాడే నిజమైన నాయకుడిగా చరిత్రకెక్కుతాడన్నది వాస్తవం. ఆ వాస్తవాన్ని ఈ పాటలో చాటి చెప్పారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు.
పాట :-
గారడి చేస్తుండ్రు గడిబిడి చేస్తున్రు/తొండికి దిగుతున్రు మొండికి పోతున్రు / బెమాను నాయకులూ బెతాలా మాంత్రికులు/ బాజారున దూకిన్రు బాఘోతం ఆడిన్రు / ఏ అరవై ఎల్ల యుద్దంలోన పొద్దూ పొడిసేను/అరె అద్దమ రాతిరి తెలంగాణా ముద్దుగ వస్తేను
నోటికాడికి వచ్చిన బుక్కకు అడ్డం పడుతున్రు/అరె రారే రారే నాలిముచ్చుల నాటకాలకు పరదా తిస్తుండ్రు
వోట్లకు వచ్చి జనం ముంగట జై జై అన్నారు/వీరి మాటలకు అఖిల పక్షముల సై సై అన్నారు
పంపకాలకు దిగయ్యలకు అడ్డం పడుతుండ్రు/గజకర్ణ గోకర్ణ విద్యలతో మాయలు పన్నిండ్రు
మంది కొంపలె ముంచిండ్రు/విరు మస్తుగా ఆస్తులు పెంచిండ్రు
భూతాలోలె పట్టిండ్రు/విలు భూములు కబ్జా పెట్టిండ్రు
ఇగ దోపిడీ కోటలు కులుతున్నాయని లబలబలాడిండ్రు /హౌరు పల్లేరు కయలోలె సర్కారు తుమ్మవోలె సమైక్య వదులాయే
పార్టీలన్నీ పక్కకు పెట్టి దోస్తీ కట్టిండ్రు/జండాలన్ని బందుకుపెట్టి బందువులయ్యిండ్రు
దిక్కుమాలినా దీక్షలు పట్టి దిల్లకులదిండ్రు/గుద్దులాడుకునే నాయకులంతా ముద్దులాడుకుండ్రు
కిరాయి మూకల పోరాటం / ఇది కిరికిరి పెట్టె చెలగాటం
జనముకు పట్టని జంజాటం / ఇది దోపిడాదారుల ఆరాటం
బతుకే బ్యారం లంబాచారం / అంతా వ్యాపారం
మనుషుల వ్యాపారం వీళ్ళ మనసులు వ్యాపారం / జగడం వ్యాపారం వీళ్ళకు జనమే వ్యాపారం.
- తిరునగరి శరత్ చంద్ర
6309873682