Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాదాపు 14 కథలున్నాయి ఈ సంపుటిలో పెద్దింటి అశోక్ కుమార్, సంగిశెట్టి శ్రీనివాస్గారలు ఈ కథల గురించి చక్కటి ముందుమాట రాసారు. శ్రీనివాస్ గారు అన్నట్లు ఈ కథలన్నీ దళిత జీవితాల సంఘర్షణను, మానవ సంబంధాలను, మహిళా సమస్యలు - వారి సాధికారిత, మాదిగ ఆశ్రిత కులాల దయనీయస్థితికి అద్దం పడతాయి.
ఆశ్రిత బతుకులు / నిర్లక్ష్యం / మహిళ / రక్షణ / గురుదక్షిణ / ఆమె / బతుకు / ఉత్సవం / కీర్తిశేషులు / గర్వభంగం / భాష్పవాహిణి / ఒంటరి / ఆటోడ్రైవర్ / పడిలేచిన కెరటం - లాంటి కథలు పాఠకుల్ని పాఠకుల్ని ఏకబిగువున చదివిస్తాయి.
కథాసంకలనానికే టైటిల్‌గా ఉన్న ''రక్షణ'' కథ స్వప్నం నుంచి వాస్తవంలోకి వచ్చి.. పాఠకుల్ని కార్యాచరణ దశగా కదిలిస్తుంది.
శర్మ, శాస్త్రి అనే ఇరువురు బ్రాహ్మణులు చర్చించుకొనే మాటలు.. కొత్త కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చివేసే ఆలోచనలు... 60 పేజీలకు కుదించాలనే కుట్ర(లు)... ప్రొఫెసర్ మల్లయ్యకు కలలో కనిపించి.. నో.. నో.. అంటూ అరిచే ఆయనకు భార్య 'జయ' వచ్చి మంచినీళ్లు అందించి... స్వప్నం గురించి తెల్సుకుని సమాధానపరుస్తుంది. 'ఆటోడ్రైవర్' అనగానే హీరో రజనీకాంతతో! నాగార్జునో చిత్రించిన సినిమా కథ కాదు. 'ఆటోడ్రైవర్'గా జీవిస్తూ కష్టపడి కూతురును చదివించి ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్‌గా 'గీతిక'ను నిలబెట్టి.. ఆమెకు భోజనం తీసుకెళతాడు- సాదాసీదా దుస్తులు- కాకిచొక్కా- తెల్లగా ఉన్న జుట్టు- పెరిగిన గడ్డం; పాత చెప్పులు- ధరించిన ఆటోడ్రైవర్‌ను నర్సులు, వాచ్మెన్, ఇతరులు చులకనగా చూస్తారు... గుండె ఆపరేషన్ చేసి బైటకి వచ్చిన గీతికను పేషంట్ తల్లి కాళ్లా వేళ్ళాపడి బతిమాలడం- గీతిక తండ్రిని చూసి బతిమాలడం, తన గదిలోకి తీసుకెళ్ళడం కథాంశం. ''ఆమె''కథలో మండలాభివృద్ధి అధికారిణి భారతి గెలిచినా మహిళా సర్పంచులతో జరిపిన మీటింగ్- పురుషులు (సర్పంచుల భర్తలు) ఆధిక్యత చూపడం- వార్ని వారించడంతో కథ ముగుస్తుంది. ఛైన్ స్నాచింగ్‌ను ఛేదించి సదరు మహిళకు బ్యాగ్ అందించే పోలీసు అధికారిణి బ్యాగ్ పోగొట్టుకున్న లెక్చరర్ శిష్యురాలు అవ్వడం కథాంశం. బాల్యవివాహాల్ని ఆపిన తీరు బాగుంది. ఈ కథలో.. మహిళా దినోత్సవ ప్రాధాన్యత-బ మున్సిపల్ వర్కర్స్‌పై చిత్రించి కథ ''ఉత్సవం'' కమీషనర్ రేణుక- మహిళా ఛైర్మన్ వాణిని మందలించి మహిళా సాధికారత వైపు నడిపిస్తుంది. అన్ని కథలు సందేశాత్మకమే. రచయిత్రి ప్రయత్నం అభినందనీయం.
(రక్షణ- రచయిత్రి : డా.తాళ్ళపల్లి యాకమ్మ, పేజీలు : 116, వెల : 100/-, ప్రతులకు : సోమారపు వీరస్వామి, ఇ.నెం. 1-6-64, నర్సంపేట రోడ్డు, మహబూబాబాద్ - 506101, సెల్ : 9704226681)
- తంగిరాల చక్రవర్తి,
9393804472