Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనలో చాలా మంది తమకు జీవితంలో ఎదిగేందుకు అవకాశాలు లభించడం లేదని వాపోతారు. తాము ఎంత కష్టపడినా తమ కష్టాలు తీరడం లేదని బాధపడతారు. తమకు జీవితంలో బాగుపడే అదృష్టం లేదని దు:ఖిస్తారు. అవకాశాలు మనకు ఎన్నడూ లభించవు. ఆ అవకాశాలను మనమే సృష్టించు కోవాలి. లేదా అవకాశాలు లభించినపుడు వాటిని వదల కూడదు. వాటిని చిన్న చూపు చూడవద్దు. అదృష్టాన్ని కాదు ఆత్మ విశ్వాసాన్ని నమ్మండి. మీ పనుల కోసం ఎవరిమీదనో భారం వేయవద్దు. మీ పనులను మీరే చక్కబెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్నత స్థానానికి చేరిన వారంతా తమకు తామే అవకాశాలను సృష్టించుకుని వాటి ఆధారంగా పైకి ఎగబాకిన వారే. ప్రతి చిన్న సమయాన్ని ఒక అవకాశంగా తీర్చి దిద్దుకోవాలి. మనలో చాలా మంది ఏ పని చేసేందుకైనా మంచి ముహుర్తం ఉండాలని, కాలం కలిసి రావాలని ఎదురు చూస్తారు. ఇది సరికాదు. మనకు ప్రతి రోజు ప్రతి నిమిషం విలువైనదే. మిత్రమా.. వెయ్యి మైళ్ల దూరమైనా ఒక్క అడుగు తోనే ప్రారంభమవుతుంది. ఆ ఒక్క అడుగు వేసేందుకు మనమెంతో సంకోచిస్తాం. ఏమి జరుగుతుందోనని భయ పడతాం. అయిష్టత, అనాసక్తి వ్యక్తపరుస్తాం. చివరకు అవకాశం చెయ్యి దాటిపోయిన తరువాత దానిని గుర్తిస్తాం. కానీ అప్పటికే విలువైన సమయం గడిచిపోతుంది. గొప్ప గొప్ప పనులు సాధించాలని పథకాలు వేసుకోవడం కంటే, చిన్న చిన్న పనులు పూర్తి చేయడం ఎంతో ఉత్తమం. అసలు ప్రారంభంకాని పనేది ముందుకు సాగదు. మనలో చాలా మంది ఏ పని ప్రారంభించకుండా దేనికైనా ఉత్తమ సమయం రావాలని చెబుతారు. ప్రతి పనికి ఒక మంచి ముహుర్తం ఉంటుందని అది చూసుకుని పనులు మొదలు పెట్టాలని కొంతమంది భావిస్తారు. వాస్తవంగా మంచి సమయం చెడు సమయం అంటూ ఉండదు. అన్ని మంచి సమయాలే. అన్ని ఉత్తమ క్షణాలే. మన ఆలోచన, దృక్పథాన్ని అనుసరించే పనులు జరుగుతాయి. వారాలను, తిథులను, ముహుర్తాలను చూసుకుంటూ మనకు లభించిన విలువైన సమయాన్ని వృధా చేయరాదు. గడిచిన కాలం మళ్లీ ఎప్పటికీ తిరిగి రాదు.
ఈ ప్రపంచంలో మనం దేనినైనా సంపాదించుకోగలం కాని గడిచిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి సంపాదించు కోలేం. శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని అనుసరిస్తూ, మనం ఉత్పాదక రంగంలో కొనసాగాలి. మనం స్వయంగా ఉపాధి పొందుతూ ఇతరులకు ఉపాధి కల్పించే పనులను చేపట్టాలి. మనం చేయాల్సిన పనులన్నింటినీ తరువాతెప్పుడో ప్రారంభిం చాలని రోజులు, నెలలు సంవత్సరాలు గడిపేస్తాం. ఈ లోపల వయస్సు పెరుగుతుంది. ముందటి ఉత్సాహం కొంత సన్నగిల్లు తుంది. బాధ్యతలు పెరుగుతాయి. చాలా సందర్భాలలో మనకేదో సాధించాలని బలమైన కోర్కె ఉంటుంది.కానీ దానిని సాధించడానికి ఆచరణలో పని ఎలా ప్రారంభించాలో మాత్రం స్పష్టత ఉండదు. ఈ విషయాలన్నింటినీ ఆలోచిస్తూ సమయాన్ని గడిపేస్తాం. మీ ఆలోచనలన్నింటినీ ఒక కాగితంపై రాయండి. మీరు జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా రాయండి. మీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళిక సిద్ధం చేయండి. ఆ లక్ష్య సాధనంలో ఎదురయ్యే అడ్డంకులను ముందుగానే ఊహించండి. వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి. మీ లక్ష్యాన్ని విని కొంత మంది నవ్వుకోవచ్చు. హేళన చేయవచ్చు. మిమ్మల్ని అభినందించక పోగా నిరుత్సాహపర్చవచ్చు. ఇపుడు మిమ్మల్ని నిరుత్సాహానికి గురి చేసిన వారే మీరు విజయం సాధించిన తరువాత మిమ్మల్ని అభినందిస్తారు. ఆ రోజు కోసం వేచి ఉండండి.
మనలో చాలా మంది అనేక పనులు చేయాలని పథకాలు వేస్తారు. కానీ పనుల పట్ల చిత్తశుద్ధి పట్టుదల లేనందున వాటిని ప్రారంభించరు. ప్రారంభం కాని పనులు ఎన్నటికీ పూర్తికావు. తమ పిల్లలతో స్వేచ్ఛగా అనేక విషయాలు చర్చించాలని తల్లిదండ్రులు భావిస్తారు. కానీ ఆ పనులను ఎన్నటికీ పూర్తి చేయరు. ప్రతి రోజు నడక ప్రారంభించాలని, వ్యాయామం చేయాలని ఆలోచిస్తారు. కానీ ఆ పనులను ఆచరణలో పెట్టరు. కొంత మంది రచయితలు కావాలని, లేదా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలని యోచిస్తారు. కానీ ఆ పనులు సాధించడానికి తగిన ప్రయత్నాలు చేయరు. దీంతో మనకు జీవితంలో లభించిన విలువైన సమయం గడిచిపోతుంది. మనం గడిచిపోతున్న సమయాన్ని గురించి పట్టించుకోం. భవిష్యత్తు గురించే ఆలోచిస్తాం. ఈ రోజు అంతటి ప్రధాన మైనది కాదని, మరుసటి రోజు గురించి ఆలోచిస్తాం. మిత్రమా.. మనకు భవిష్యత్తు ఒక్కొక్క రోజుగా మాత్రమే ఎదురవుతుంది. మనకు ప్రతి రోజు ప్రధానమైనదే. అందుకే ఈ రోజును పగటి కలలు కంటూ వృధా చేయవద్దు. మీ జీవిత కలలను సార్థకం చేసుకొనేందుకు ఈ రోజే పనులు ప్రారంభించండి. ఈ క్షణం నుంచే మీ లక్ష్య సాధన కోసం ముందడుగు వేయండి.
- జి గంగాధర్ సిర్ప,
8919668843