Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అబ్బా! ఈ రోజు కూడా ఈ గోంగూర పప్పేంటే అమ్మా! నీవు 'వంట ఇంటి కూరల తోట' పెంచుతున్నావని, ఇలా ఈ ఆకులతో నన్ను ఆవునో గేదెనో చేయకే!'' విసుక్కున్నాడు వినోద్.
ఆమె నవ్వి వూరుకుంది. మరేం లేక, తప్పనిసరై తిని వెళ్ళాడు వినోద్. నాలుగు రోజులకు ఒంట్లో నలతగా అనిపించి నాన్న స్నేహితుడైన ఇంటి వైద్యుని దగ్గరకెళితే, ''నీకు కాల్షియం తగ్గింది, మందులు తినే బదులు గోంగూర పదిరోజుల పాటు తిను. మీ నాన్నగారు నా క్లాస్మేట్ అందుకని, మందులు ఇవ్వక ఆహారంలోనే ఆరోగ్యం కలిగించే మార్గాలు చెప్తున్నాను. ఆకు కూరల్లో ఉండే పోషకాలు ఏమందు లేసుకున్నా రావు వినోద్! గోంగూరలో 56 క్యాలరీలు, మాంసకత్తులు-1.7గ్రా., క్యాల్షియం 1720 మి.గ్రా., ఇనుము 2.28గ్రా, కెరోటిన్ 2898 మై.గ్రా, విటమిన్ సి.20.2మి.గ్రా ఉంటాయి. వీటన్నింటికీ అనేక మందులు తినే బదులు గోంగూర తిను చాలు'' అని పంపాడు.
వినోద్‌కు అర్థమైంది. ఇంట్లో రసాయనాలు లేని ఆకుకూరలేకాక కూరగాయలన్నీ రోజంతా కష్టపడి టెర్రేస్‌లో పండిస్తూ రోజూ ఏదో ఒక ఆకుకూర ఎందుకు చేస్తుందో. ఇహ ఆరోజు నుండీ మారు మాట్లాడక అమ్మ చేసినవన్నీ తినసాగాడు.
ఏ పిల్లలైనా అంతే, పిల్లలేంటి పెద్దలు కూడా. ఆకు కూరల్లోని ఆరోగ్య రహస్యాలు తెలిస్తే, తినను తప్ప ఆక్షేపించను నోరు తెరువరు. ఆకుకూరలు అంటే బెండ, వంకాయ, కాకరకాయ లాంటి కూరలు కాక ఆకులనే పప్పుగా, కూరగా, చట్నీగా ఇంకా అనేక రకాలుగా వండుకుని తినేవన్నమాట.
మన దేశంలో ముఖ్యంగా తెలుగువారు చేసుకునే ఆకు కూరలు తోట కూర, గోంగూర, బచ్చలి, చుక్క కూర, ఇంట్లో పోపులో వాడే మెంతులు చల్లితే మొలిచే మెంతికూర, అలాగే ధనియపు గింజలు చల్లితే మొలిచే కొత్తిమీర, పుదీనా అన్ని కూరల్లో సాంబారులో, చారులో వేసుకోడమేకాక చట్నీగా చేసుకునే బంగారు కరివేపాకు, స్పినచ్ అని పిలుచుకునే పాల కూర, కంటికి మేలుచేసే పొన్నగంటి కూర, చింత చెట్టు నుంచీ వచ్చే లేత ఆకైన చింతచిగురు, ఎన్నో విటనిన్స్ ఉండే మునగ కాయలేకాక మునగాకు, ఉల్లికాడలు, నగర వాసులకు తెలీక వినగానే చిరాకు అనిపించే చిర్రాకు, పెరుగు తోట కూర, అవిశ ఆకు ఇంకా చాలా రకాల ఆకుకూరలు మనకు ఎంతో మేలు చేస్తాయి.
యదార్థానికి ఇవి ఆరోగ్యపు గనులు. నిజం తెలిసిన పూర్వులు తమ పొలాల్లో, ఇళ్ళ వద్దా ఆకు కూరలు పెంచుకుని తినేవారు. అందుకే వారి ఆరోగ్యం అంత బాగా ఉండి 80 వసంతాలు వచ్చినా చక్కని కంటిచూపుతో ఇబ్బంది లేకుండా చూడటం, నడవడం, పొలం పనులకెళ్ళడం చేసేవారు. మహిళలు 80 ఏళ్ళైనా బియ్యం దంచుకోడం, పిండి రుబ్బుకోడం, విసురుకోడం చేసేవారు. వారి ఆహారపు అలవాట్లే వారి ఆరోగ్యానికి మెట్లు.
ఆకుకూరల్లో కెలోరీలు, కార్బొహైడ్రేట్లు తగినంతగా ఉండి, శరీరానికి మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఏదో ఒక ఆకుకూర తీసుకొనే వారిలో మధుమేహం వచ్చే అవకాశం తక్కువ అనొచ్చు. అంతేకాక సుఖ విరోచనం అవుతుందని అనుభవరీత్యా తెలుస్తుంది. కనీసం ఆకుకూరలు వారానికి మూడు సార్లన్నా తీసుకుంటూ వుండటం శ్రేయస్కరం. ఆకులతో పాటు కొన్ని ఆకుకూర మొక్కల కాండన్నీ కూడా తినటానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు తోటకూర కాండతో చక్కని పొడికూర చేస్తే భోజనం మొత్తం దాంటోనే తినేయవచ్చు. అంత బాగా ఆరోగ్యమూ తెచ్చుకోవచ్చు.
ఆకు కూరలు అనేక రకాలైనా వీటి పోషక విలువలు పోకుండా, వండే విధానాన్ని బట్టి అన్నీ మనకు ఆరోగ్య కారకాలే. మనకు దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులు గల మొక్కలు ఉన్నాయి. మట్టు బచ్చలి, తోటకూర, పుదిన, పాలకూర, చుక్కకూర వంటి మొక్కలు పొట్టిగా, గుబురుగా పెరుగుతాయి. ఇవి స్వల్ప కాలపరిమితి గలవి. మరలా వేసి పెంచుకుంటూ ఉండాలి. చాలా వరకూ ఇవన్నీ మన వంట ఇంటి తోటగా పెంచుకోవచ్చు.
ప్రకతి మనకు ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకు కూరలు మొదటివి. ఇవి మన శరీరానికి కావలసిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ, తేలిగా ఆహారం అరిగేలా చేస్తూ మనకు ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా ఆహారాన్ని రుచికరంగా చేస్తాయి కూడా. అందరూ ఆకుకూరలను ఇళ్ళలో పండించుకోలేరు కనుక మార్కెట్ నుంచీ తెచ్చిన ఆకుకూరలను వండే ముందు కచ్చితంగా ఒకటికి రెండు సార్లు ముందుగా ఉప్పు నీటిలో ఆ తర్వాత వేరే నీటిలో ఉంచి, ముంచి కడగటం తప్పనిసరి. ఎందుకంటే వాటిలో చిన్న చిన్న పురుగులు, ధుమ్మూ, ధూళి చేరి మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఆకుకూరల్లో పోషక పదార్ధాలు అధికంగాగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదలకు, దఢత్వాన్నీ, చక్కని ఆరోగ్యాన్నీ ఇస్తాయి. ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుప ధాతువు కలిగి ఉంటాయి. శరీరంలో ఇనుము లోపం కారణంగా అనీమియా వ్యాధికి గురయ్యే బాధ తప్పించుకోను ఆకు కూరలు తినడం మంచిది. పైగా ఇతర కూరలకన్నా ఆకుకూరలు వెలకూడా కాస్త తక్కువగానే ఉంటుంది.
విటమిన్-ఎ లోపం కారణంగా చిన్నపిల్లలకు సైతం కంటి చూపుకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. ఆకుకూరల ద్వారా లభించే కెరోటిన్ మన శరీరంలో విటమిన్-'ఎ'గా మారి అంధత్వం రాకుండా చేస్తుంది. విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంట చేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు, ఎక్కువ నీటిలో ఉడికించి ఆనీరు పార బోయ కూడదు. తగినంతేనీరుపోసి వండాలి. వండేప్పుడు ఆవిరి కూడా పోకుండా జాగ్రత్తపడాలి. ఆవిరిద్వారా విటమిన్-సి వ్యర్థమవుతుంది. ఇంతటి ఆరోగ్య ప్రయోజనాలున్న పదిరకాల పరమౌషధాల లాంటి ఆకుకూరల గురించిఈ రోజు మనం రవ్వంత చెప్పుకుందామా!
తోటకూర-దీని శాస్త్రీయనామం : ''అమరాంథస్ గాంజెటికస్''
ఆకుకూరలలో ప్రధానమైనది 'తోటకూరకాడలాగా అలా వ్రేలాడుతున్నా వే!' అనే సామెత ఉంది మనదేశంలో అంతా ఎక్కువగా పెంచేదీ, తినేదీ కూడా ఇదే. దీనిలో రెండు రకాలున్నాయి. మొక్క తోట కూర, కొయ్య తోటకూర. దీనిలో పోషక విలువలు వంద గ్రాములకు-మాంసకత్తులు 18 గ్రాములు, విటమిన్లు ఎ, కే, బి 6, సి, రిబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, మినరల్స్ -కాల్సియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, కాపర్, ఉన్నాయి. ఇన్ని పోషకాలు మరే ఆకుకూరలోనూ లభించవు అనవచ్చు.
తోటకూర పులుసుగా, పొడికూరగానూ, టమాటోతో కలిపి పప్పుగానూ, పులుసు, తోటకూర వడలు ఇంకా అనేక రకాలుగా, వంటచేసే వారి అభిరుచిని అనుసరించీ అమోఘంగా రుచికరంగా వండుకోవచ్చు.
గోంగూర- గోంగూర పచ్చడి తెలుగు వారికి అత్యంత ప్రీతికరమైన పచ్చడి. ఆంధ్రా , తెలగాణా ప్రాంత తెలుగు వారంతా ఈ అమత ప్రాయమైన పచ్చడితో కడుపు నింపుకోడం కద్దు. గోంగూరతో పప్పు, పులుసు కూర, పచ్చడి, గోంగూర కొబ్బరి పచ్చడి, నిల్వ పచ్చడి, పండుమిర్చి చేర్చి పండ్ల గోంగూర అని రకరకాలుగా దీని మర్మమెరిగిన వారు దాచుకుని తింటారు.
గోంగూర ఈ పేరు చెప్తే నోరు ఊరని తెలుగు వాళ్ళు ఉండరు. తెలంగాణాలో దీన్ని కుంటి కూర అంటారు. గోంగూర పుల్లగా రుచిగా ఉండటం మాత్రమే కాదు ఆరోగ్యకారకాలైన అనేకం ఉన్నాయి. ముఖ్యంగా దీనిలోని పీచు పదార్ధాలు మనకెంతో ఎంతో మేలు చేస్తాయి. గోంగూరలోని ముఖ్యమైన విటమిన్స్ ఎ, బి1, బి9, సి.కార్బోహైడ్రేట్ అధికంగానూ కొవ్వు చాలా తక్కువగానూ ఉంటుంది. పొటాషియం, కాల్షియం, సోడియం, ఐరన్ కూడా సమద్ధిగా మనకు కావలసినంత అందిస్తుంది. గోంగూరలో ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండటాన రక్త ప్రసరణ సజావుగా జరిగి బీ.పీ సరిగా ఉంచుతుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయి తగ్గించే గుణం గోంగూరలో ఉంది. షుగర్ వ్యాధి గ్రస్తులు సైతం గోంగూరని నిర్భయంగా తిని పంచదార ఫ్యాక్టరీలు కాకుండా చూసుకోవచ్చును. అంతేకాదు గోంగూర రోగనిరోధకశక్తిని పెంచుతుంది. గుండె, కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ వంటి వ్యాధులను గోంగూర తినడం ద్వారా నివారించుకోవచ్చు.
పాలకూర:
ఆంగ్లంలో దీన్ని స్పినచ్ అంటాం. దీన్ని ఒకవిధంగా పోషకాహార నిధి అనవచ్చు. దీనిలోని ఫ్లేవనాయిడ్స్ అనే పోషకం వయసుతో పాటు వచ్చే మతిమరపును మాయం చేస్తుంది. పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయంటే ఆశ్చర్యం వేయడం లేదూ!. ఇవి యాంటీ క్యాన్సరర్స్. దీన్ని మనం పప్పులోనూ, కొన్ని కూరల్లోనూ, చపాతీ, లోనూ చాలా రకాల సూప్స్‌లో, పకోడీలలో, పన్నీర్‌తో కలిపి వండే కూరలతోనూ వాడుకుంటాం. దీనిలోని ఇనుము శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి, జ్వరం, పిత్త, వాయు శ్వాస సంబంధమైన రోగాల నుండి కాపాడుకునేందుకు తోడ్పడుతుంది. పాలకూరను ఎలాగైనా సరే ప్రతిరోజూ తినే ఆహారంతో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పాలకూరలో 26 క్యాలరీలు, 2.0 గ్రా మాంసకత్తులు, 73మి.గ్రా. కాల్షియం, 10.9మి.గ్రా. ఇనుము ఇంకా ఎన్నో పోషకాలు ఉన్నాయి.
బచ్చలికూర- పెరట్లోనో ఇంటి ముందు ఎండతగిలే బాల్కనీలోనో చక్కగా ఒక మట్టి తోట్లో చిన్న మొక్క వేసుకుంటే, లేదా ఒక్క విత్తు నాటుకుంటే చక్కని బచ్చలికూర కమ్మగా పప్పు, కూర, కందతో కలిపి వండే కమ్మని సాంప్రదాయక బచ్చలికూర తినవచ్చు. ఇది కూడా కొద్దిగా పులుపుతో కూడిన మంచి రుచికరమైన ఆకుకూర. దీన్లో దుబ్బు బచ్చలి, తీగ బచ్చలి అని రెండు రకాలు. రకాలు వేరైనా చేసే మేలు ఒకటే. బచ్చలికూర మంచిపోషక శక్తి కలది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. పప్పు, సలాడ్లలాగా కూడా తీసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు పెరగాలంటే బచ్చలి రసం తాగాలి. బచ్చలి కూరలో విటమిన్ 'ఎ' అధికంగా ఉండటం వలన కంటి ఆరోగ్యానికి మంచిది. దీన్లో విటమిన్ ఎ దాదాపు 63శాతం వుంటుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా ఆపుతుంది.
బచ్చలిరసం రక్త నాళాలను విడదీయడానికి సహాయపడే ఒక రకమైన సమ్మేళనం. ఇది రక్తపోటును తగ్గించి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. రోజూ బచ్చలికూర సూప్ తినడం వల్ల రక్తపోటు, ధమనుల ధడత్వం తగ్గుతాయని ఒక అధ్యయనంలో తేలింది. బచ్చలికూర రసంలో విటమిన్ సి 38 శాతం ఉంటుంది. విటమిన్ సి చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, మంట, నుండి రక్షిస్తుందని అధ్యయనాల వలన తేలింది.
చుక్కకూర- చుక్కకూరను కొందరు పుల్లబచ్చలి అని కూడా అంటారు. చుక్క కూర -పొట్టిగా జానెడు కంటే కొంచెం ఎక్కువ ఎత్తులో గుట్టగా, మందమైన ఆకులతో కొద్దిగా బచ్చలి ఆకులను పోలిన పుల్లనికూర. అందరికీ దొరికే రుచికరమైన ఆరోగ్యాన్నిచ్చేది ఈ చుక్కకూర. తేలికగా జీర్ణమవుతుంది. పుల్లగా రుచిగా వుంటుంది. దీన్ని పప్పుతోనూ, పులుసు గాను, పచ్చడిగాను, కూరగాను, ఇంకా ఎన్నో రకాలుగాను ఉపయోగిస్తాం. చుక్కాకు రసం ఒక ఔన్సు తీసి పెరుగులో కాని, పాలతో కాని కలిపి తాగితే మూడు రోజుల్లో కామెర్ల వ్యాధి తగ్గుతుంది అంటారు ఆయుర్వేద వైద్యులు. అనేక రకాల చర్మవ్యాధులు తగ్గిస్తుంది. మలబద్దకం పోతుంది. పిల్లలు పెద్దలు అంతా కమ్మని పుల్లని రుచివున్న చుక్క కూరను చక్కగా భుజిస్తారు.
విటమిన్ ఎ, సి, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అందు వలన రక్తకణాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. రక్తహీనతను నివారిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చుక్కాకులు దళసరిగా, పెళుసుగా ఉంటాయి. మంచి రుచికరమైన ఆకు, పప్పుతో చేర్చి వండితే ముద్దమీద ముద్ద పొట్టలోకి దిగిపోతుంది. జఠరాగ్ని పెంచును. కఫం, వాతం రోగాలను పోగొడుతుంది. మలబద్దకాన్ని తొలగించి సుఖవిరేచనం అవుతుంది. ఏ ఆకు కూరైనా మలబధ్ధకాన్ని తీసేస్తుంది. ఆకలై తినడం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో విసర్జన సరిగా కావటమూ అంతే ముఖ్యం. ఎక్కువగా లాలాజలం ఊరే వారికి ఆ కఫం పోను చుక్కకూర ఎక్కువ మార్లు ఏదో రూపంలో తీసుకోడం అవసరం.
మెంతికూర:
మెంతి ఆకు -మనం ఆహారంలో పోపులో వేసుకునే మెంతులు చల్లితే మొలిచేదే మెంతి ఆకు. ఇది జానెడు ఎత్తుగా పెరిగాక కోసి పప్పులో వేసుకుంటాం ఇంకా అనేక రకాలుగా వాడుకుంటాం. బాగా చలువచేస్తుంది. ప్రతి రోజూ మనం ఆహారంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతావకాయగానూ చింతకాయ మెంతి పచ్చడి గానూ మెంతి మజ్జిగానే కాక దోసె పిండిలో కూడా మెంతి గింజలను వాడుతాం. చారు, పులుసు, పోపులోనూ వాడతాం. మెంతి పూరీ, చపాతీల రుచి తింటేనే తెలుస్తుంది.
మెంతులలో చాలా ఔషద గుణాలు న్నాయి. ఇటీవల జరిగిన పరిశోధనల్లో షుగర్ నియంత్రణకు మెంతులు ఎంతో ఉపకరిస్తాయని, చెడు కొలెస్టరాల్, నిర్ధారణ ఐంది. ఇదంతా ఎందుకు చెప్పుకుం టున్నామంటే మెంతుల్లో ఉండే గుణాలకంటే అధికంగా మెంతాకులో ఉంటాయని చెప్పడమే. మెంతులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని, హిందీలో మెథీ అనీ అంటారు. ఈ ఆకుకు కొద్దిగా జిగటగా ఉంటుంది. ఎక్కువసేపు నీటిలో ఉంచితే ఆకు పాడైపోతుంది. ఆకురసం రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్ర పడుతుందని, ఆకు రసాన్ని నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూల కాయం తగ్గుతుందనీ, నిపుణుల ఉవాచ.
మునగాకు- మునగ కాయలేకాక మునగ ఆకుకూర తిన్నా మూలిగే ముసలి వారు కూడా చకచకా నడిచేస్తారు. మునగ కాయలతో చేసే సాంబార్‌తో పది ఇడ్లీలు సునాయాసంగా లోనికి పోతాయి. తర్వాత పొట్టబాధ పొట్టది. అన్ని ఆకుకూరలలో కన్నా దీనిలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి, ఐరన్, కాపర్ కూడా ఎక్కువగా ఉండడం వలన రక్తహీనతను నివారిస్తుంది, ఎముకలకు బలాన్నిస్తుంది.
మునగ ఒక చెట్టు. దీని శాస్త్రీయ నామం మొరింగా ఓలీఫెరా. దీనికి కాచే ములక్కాడలూ, మునగాకూ మంచి పోషకాలనిచ్చే ఆహారం. ములక్కాడలు సన్నగా పొడవుగా ఉంటాయి. మునగ చెట్టు సుమారు 10 మీటర్ల ఎత్తు పెరిగి, కాండం నుండి కొమ్మలు వేలాడుతుంటాయి. ములగాకు ఆకులు కూడా చాలా బలమైన ఆహారం. బాక్టీరియా, శిలీంధ్ర, కీటక సంహారిగా దీనిని ఉపయోగిస్తారు. మునగాకులు చాలా పుష్టికరమైన ఆహారం. వీనిలో బీటా కెరోటీన్, విటమిన్ సి, మాంసకత్తులు, ఇనుము, పొటాషియం ఎక్కువ వున్నాయి. ఆకులను ఎండబెట్టి పొడిగా చేసి సూప్‌లలో, సాస్‌లలో వాడుతారు. మునగాకులలో ఎన్నో ఔషధ గుణాలున్నా యి. మునగాకుతో పొడికూర చేస్తే చాలా రుచిగా ఉండటమే కాక ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుంది.
విటమిన్ ఎ, సి, సున్నము, ఐరన్, కాపర్, పొటాషియం ఇందులో ఎక్కువగా ఉండడం వలన రక్తహీనతను నివారిస్తుంది, ఎముకలకు బలాన్నిస్తుంది. వంద గ్రాముల ఆకుల్లో కాల్సియం - 440 మిల్లీ గ్రాములు, ఇనుము- 0.85 మి.గ్రా, బీటా కెరోటీన్లు అధికంగా వుంటాయి. మునగాకుతో రొట్టెలు, వడలు, మరెన్నో విధాలుగా భుజిస్తారు.
కొత్తిమీర
మన పోపుల పెట్టెలో ఉండే ధనియాలను చల్లితే వచ్చే మొక్కలే ఈ కొత్తిమీర. మంచి సువావన కలిగి ఉంటుంది. ఈ ఆకు, చాలా లేతగా తేలికగా తెగుతుంది. వంటకాలలో అధికంగా వాడతాం. అంతేకాక కొత్తిమీరతో పచ్చడికొత్తిమీర కారం దోసె, ఇడ్లీలలోకి చాలా రుచిగా ఉంటుంది.
దీని శాస్త్రీయ నామం ''Coriandrum sativum''. మనం తీసుకునే అన్ని రకాల వంటకాలలో విరివిగా కొత్తిమీర వేసుకుంటాం. రుచికి రుచి, సువాసనతో పాటుగా ఆరోగ్యం కూడా అందిస్తుంది కొత్తిమీర. కొత్తిమిరి నిండా విటమిన్లు, ఖనిజ లవణాలు సమద్ధిగా ఐరన్ కుడా ఉన్నాయి. యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యవంతమైన కణాల కోసం ఉపయోగపడుతుంది. వద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. రక్త హీనతనూ, కొలెస్ట్రాల్‌నూ కూడా తగ్గించే గుణం ఈ ఆకుకు ఉంది. కొత్తిమీర రసం విటమిన్-ఎ, బి1, బి2, సి, ఐరన్ లోపాలను తగ్గిస్తుంది. గహ చికిత్సల్లో అజీర్ణం, వికారం, మొదలైన వాటికి వాడుతారు.
కరివేపాకు- పేరు వినగానే మనకు వేప గుర్తు వస్తుంది. కరివేపాకు ఒక రకమైన సుగంధ భరితమైన ఆకు. ఇది కరివేప చెట్టు నుండి లభిస్తుది. కరివేపాకును తెలంగాణాలో కళ్యామాకు అంటారు. బయోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు సంరక్షణకు బాగా వాడుతున్నారు. అరుగుదల శక్తిని పెంచుతుంది. కరివేపాకులని ఇంగ్లీషులో కర్రీ లీవ్స్ అనీ స్వీట్నీం లీవ్స్ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం స్వీడన్ దేశపు వక్ష శాస్త్రవేత్త 'యోహాన్ ఏండ్రియాస్ మర్రే 'పేరు మీదుగా ''మర్రయా కీనిగీ'' అని వాడుకలోకి వచ్చింది. కూర, చారు, పులుసు, కారప్పొడి, చట్లీ ఎన్నెన్నో వంటల్లోనేకాక వంటకాలలో సువాసనకూడా కోసం వాడుతాం. మనదేశంలో చాలా మంది ఈ చెట్టుని పెరట్లో పెంచుకుంటారు. కరివేప ఆకుల్లో కేల్సియం, ఫాస్ఫరస్, ఫైబర్, విటమిన్-ఎ, విటమిన్-సి ఉన్నాయి.
ఆయుర్వేదంలో దీని ఉపయోగం అధికం అనేక మందుల తయారీలో వాడుతారు. కరివేపాకులో బంగారం ఉందంటానికి కారణం దానిలోని ఆరోగ్య లక్షణాలే అనవచ్చు
పుదీనా- మంచి వాసనతో పాటు కమ్మని రుచితో నోరూరిస్తుంది. పుదీనాలో ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. రుచితో పాటు ఔషధ గుణాలున్న పుదీనా ఆకును ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. పుదీనా ఆకును ఆహారంలో ఏదో రూపంలో రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికే కాక.. చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. పుదీన ఆకుల్లో సుమారు 5 వేల 480 మైక్రో గ్రాముల విటమిన్లు జిటా కెరోటిన్ రూపంలో ఉన్నాయని పరిశోధనల ద్వారా తెలుస్తున్నది. పుదీనా ఆకుల్లో ఉండే ఖనిజ లవణాలు, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ సి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మాంసకత్తులను సులభంగా జీర్ణం చేసేందుకు పుదీనా ఆకు దోహదపడుతుంది పొట్టనొప్పికి, మలబద్ధకం ఉన్నవారు పుదీన టీ తాగితే అవి మన జోలికి రావని చెప్తారు. కీళ్ల నొప్పులు, షుగర్ వ్యాధికి ఇది చాలా మంచిది.
ఇంకా ఎన్నో రకాల మనకు మేలుచేసే ఆకుకూరలు ఉన్నాయి. మరో మారు వాటి గురించీ వివరంగా చెప్పుకుందాం. ఈ ఆకుకూరల గురించీ చదివాక తప్పక ప్రతిరోజూ ఆకుకూరలు తిని వైద్యునికి దూరంగానూ ఆరోగ్యానికి దగ్గరగానూ ఉందామా!
- ఆదూరి హైమావతి,
8790224030