Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్త్రీలను గౌరవించే దేశం మనది అని స్త్రీ దేవి స్వరూపమని ఇలా ఎన్నో చెబుతారు. కాని నిజజీవితంలో స్త్రీల పరిస్థితి ఈ దేశంలో ఎలా ఉందో అందరికీ తెలుసు. ముఖ్యంగా నీతి అనే ఒక్క కొలమానంతో స్త్రీ జీవితాన్ని ఎన్ని రకాలుగా అస్త్యవ్యస్తం చెయవచ్చో మన సమాజంలొ ఎన్నో చోట్ల కనిపిస్తున్న జీవితాలను పరిశీలిస్తే అర్ధం అవుతుంది. స్త్రీ నైతికత ను ప్రపంచంలో ఎవరైనా ప్రశ్నించవచ్చు, నీతి పేరు మీద ఆ స్త్రీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చు. స్త్రీ అనుమతి లేకుండా ఆమెను బలవంతంగా అనుభవించే పురుషుడి జీవితంలో సమాజం పెద్దగా జోక్యం చేసుకోదు. కాని పురుష అహంకారానికి, బలానికి నిస్సహాయంగా మిగిలిపోయిన అత్యాచార విక్టీంలను సమాజం ఎలా చూస్తుంది? అసలు తమపై అత్యాచారం జరిగితే ఆ స్థ్రీ తరువాత సమాజంలో బ్రతకగలదా? సమాజం, ఆమె నా అనుకునే వ్యక్తులు ఆమెను మాములుగా తమతో కలుపుకోగలుగుతారా? ఈ రోజుల్లో కూడా అత్యాచార విక్టీమ్ పట్ల అంతులేని క్యూరియాసిటీ మీడియా చూపించే అతి, సమాజంలో ఆమె ఎదురుకోవలసిన ప్రశ్నలు, వివక్ష, వెకిలిచూపులు ఎన్నో. అత్యాచార విక్టిమ్ల పై సమాజ దృష్టి ఎలా ఉంటుందో చెప్పే సినిమాలు కొన్ని వచ్చాయి. ఎన్నో భాషల్లో. కాని ఈ విషయం పై 1986 లో వచ్చిన హిందీ చిత్రం ''అంగారే'' ఎన్నో కోణాలలో సమాజంలో పరిక్షలు ఎదుర్కునే ఒక అత్యాచార విక్టిమ్ కథను చాలా బాగా చూపించగలిగింది. ఇది పెద్ద్ కమర్షియల్ హిట్ కాకపోవచ్చు. గొప్ప సినిమాగా కొందరు పరిగణించకపోవచ్చు. కాని అత్యాచార విక్టిమ్ను నిస్సహాయంగా పడుపు వృత్తికో లేదా జైలుకో మాత్రమే చేర్చగల మన సమాజ వ్యవస్థను చూపించిన మంచి చిత్రంగా ఇది గుర్తుండిపోతుంది. ఇందులో స్మితా పటేల్ నటన చాలా గొప్పగా ఉంటుంది.
ఆర్మీ మేజర్ కూతురు ఆర్తి. తండ్రి చనిపోయిన తరువాత తమ్ముడి భాద్యత తీసుకుని ఆరోగ్యం సరిగ్గా లేని తల్లిని చూసుకుంటూ ఉంటుంది. తమ్ముడు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్న సమయంలో పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ సహాయంతో సరైన సమయంలో తమ్ముణ్ణి వ్యసనాలకు దూరం చేయగలుగుతుంది. భాధ్యత తెలుసుకుని తమ్ముడు నేవీలో చేరి అక్కను సంతోషపెడతాడు. విజయ్ ఆర్తి ని ప్రేమిస్తాడు. కాని తన మనసు ఆమెకి చెప్పేలోపలే విజయ్ స్నేహితుడు, రవి ఆర్తిని వివాహం చేసుకుంటానని ముందుకు వస్తాడు. ఉన్నత కుటుంబానికి చెందిన రవితో వివాహానికి ఏమీ అభ్యంతరాలు కనిపించవు ఆర్తి తల్లికి. పెద్దల అనుమతి, ఆశిర్వాదంతో ఆర్తి రవిల నిశ్చితార్ధం జరుగుతుంది. ఉద్యోగ విషయంలో రవి అమెరికా వెళ్ళాల్సి వస్తుంది. తిరిగి వచ్చి వివాహం చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు రవి.
కుటుంబ పోషణ కోసం ఆర్తి జాలి అనే ఒక వ్యాపారస్తుని వద్ద సెక్రటరీగా పని చేస్తుంటుంది. జాలి ఒక స్మగ్లరు. అతనిపై విజయ్ నిఘా వేసి ఉంచుతాడు. ఆర్తి తనకు లోబడట్లేదనే అక్కసుతో జాలి ఒక రోజు ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తాడు. ఆ రాత్రి ఒంటరిగా ఇంటికి వచ్చే ఆర్తిని ఒక యువతి రక్షిస్తుంది. ఆమెను ఇంటిని చేరుస్తుంది. ఆర్తి నిజాయితీ గల స్త్రీ. పెద్ద లాయర్ అయిన రవి తండి, తన కాబోయే మామగారికి తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంది. అతని సలహాతో పోలీస్ రిపోర్ట్ర్ ఇవ్వడానికి సిద్దపడుతుంది. కాని ఆ మామగారు ఆమెను పోలీస్ స్టేషన్కు వెళ్ళకుండా ఆపుతాడు. ఆర్మీ మేజర్ కూతురైన ఆర్తి ఆత్మహత్య చేసుకోవాలనో, సిగ్గుతో ముడుచుకుపోవాలనో కానీ అనుకోదు. తనకు న్యాయం జరగాలని, తన కాబోయే భర్త కుటుంబాన్ని తాను మోసం చేయకూడదని, న్యాయాన్ని రక్షించే శక్తి ఉన్న ఆ కుటుంబం తనకు ఆదుకుంటుందని ఆశపడుతుంది. కాని ఆమె మామగారు పెళ్ళి ఆపేస్తాడు. కారణం చెప్పకుండా రవి ఆర్తిల మధ్య కమ్యూనికేషన్ లేకుండా చేస్తాడు. పెళ్ళి ఎందుకు ఆపుతున్నారని అడిగిన ఆర్తి తల్లికి ఆమె కూతురు పతిత అని, చెడిపోయిందని చెబుతాడు. గుండె పగిలిన ఆ తల్లి చనిపోతుంది. ఆర్తి ఒంటరయిపోతుంది. గవర్నమెంటు వారు క్వార్టర్ ఖాళి చేయమంటే ఒక హాస్టల్ లో చేరి ఒంటరిగా జీవిస్తుంటుంది.
పెళ్ళి ఎందుకు ఆగిపోయిందో తెలియని విజయ్ ఆర్తిని కలుస్తాడు, వివాహం ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ఆమెకు తన మనసు చెప్పవచ్చని తాను ఎప్పటినుండో ఆర్తిని ప్రేమిస్తున్నానని చెబుతాడు. అతనికి కూడా ఆర్తి తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంది. అంతా విని అప్పుడు పెళ్ళి గురించి ఆలోచించమంటుంది. ఆదర్శభావాలున్న విజయ్ ఆమెను తాను వివాహం చెసుకుంటానని చెప్పి తన తల్లికి ఆర్తిని పరిచయం చెస్తాడు. రవి అమెరికా నుంచి వచ్చి ఆర్తిని విజయ్ ను చూసి ఆర్తి తనను ఎందుకు వద్దనుకుందో అర్ధం అయిందని కోపం చూపిస్తాడు. కాని ఆర్తి అతనికి నిజం చెబుతుంది. తన ప్రమేయం లేకుండా, తనను అడగకుండా తన తల్లి తండ్రులు ఆర్తికి చేసిన అన్యాయాన్ని భరించలేక రవి ఆమెకు క్షమాపణ చెప్పి తిరిగి అమెరికా వెళ్ళిపోతాడు. విజయ్ తో వివాహం అని అనుకున్న తరువాత ఆర్తి నెల తప్పుతుంది. విజయ్ తల్లి ఆమెను కోడలిగా స్వీకరించదు. తనను కాదని ఆమెను వివాహం చేసుకుంటే తాను బ్రతికి ఉండనని కొడుకుని బెదిరిస్తుంది. ఆర్తి విజయ్ పరిస్థితి గమనించి ఊరు వదిలి వెళ్ళిపోతుంది. ఆమెకు మళ్ళి తనను రేప్ జరిగిన రాత్రి ఇంటికి చేర్చిన స్త్రీ కనిపిస్తుంది. ఆమె ఒక నాట్యగత్తె. ఆమె ఆర్తిని తమ మధ్యకు ఆహ్వానిస్తుంది. ఆమె దగ్గర నాట్యగత్తెగా ఆర్తి ఉండిపోతుంది. గౌరవస్తుల మధ్య కన్నా అక్కడే ఆమెకు రక్షణ దొరికిన భావన కలుగుతుంది. అయితే నాట్యం చేస్తుందే తప్ప శరీరాన్ని అమ్ముకోదు. అందుకు ఆ స్త్రీ కూడా ఆమెను బలవంత పెట్టకుండా ఆమెకు రక్షణగా నిలబడుతుంది.
విజయ్ ఎంత ప్రయత్నించినా జాలిని సాక్షాధారాలతో చట్టం ముందు హాజరు పరచలేకపోతాడు. అతని గుట్టు బైటపెట్టీ చట్టపరంగా అతనికి శిక్షవేయించాలని ఎంతో ప్రయత్నిస్తుంటాడు విజయ్. ఈ లోపల సెలవుల కోసం వచ్చిన ఆర్తి తమ్ముడు అక్కను నాట్యగత్తెగా చూసి భరించలేకపోతాడు. విజయ్ చెప్పిన నిజాన్ని విని జాలిని చంపుదామని వెళ్ళి అతని చేతిలో మరణిస్తాడు. చివరకు ఆర్తి జాలిని చంపి జైలుకి వెళ్ళడం. ఆమె కథ విన్న జడ్జి ఆమెకు తక్కువ శిక్ష వేయడం, చివరకు ఆమె విడుదలయి విజయ్ ని పెళ్ళి చేసుకోవడం ముగింపు.
ఇది పక్కా కమర్షియల్ ఆంగిల్లో తీసిన సినిమానే కాని చెప్పాలనుకున్న పాయింట్ ని చాలా స్పష్టంగా చెప్పె ప్రయత్నం చేసారు దర్శకుడు. అప్పట్లో అత్యాచారానికి గురి అయిన ప్రతి స్త్రీ ఆత్మహత్య చేసుకోవాలని లెదా న్యూనతా భావంతో కొట్టూకుపోతూ, లేదా అత్యాచారం చేసిన వాడినే పెళ్ళీ చేసుకోవడం సినిమాలలో కనిపించేది. ఈ మూడు తప్ప మరో రీతిలో అత్యాచార భాధితురాలు జీవించగలదని సమాజం అంగీకరించని రోజులవి. కాని ఆ భావజాలానికి భిన్నంగా ఇందులో ఆర్తి అలాంటివేవి చూపించదు. బ్రతకాలనుకుంటుంది. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కావాలని కోరుకుంటుంది. అలాగే నిజాయితీగా తాను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న కుటుంబానికి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటుంది. అది సిగ్గుపడవలసిన విషయంగా లేదా తన వ్యక్తిత్వాన్ని కించపరిచే సంఘటనగా చూడడానికి ఒప్పుకోదు. రవితో సంబంధం తప్పిపోయాక విజయ్ తనను వివాహం చేసుకుంటానని అన్న తరువాత తన మొదటి అనుభవం ఆధారంగా నిజం చెప్పకుండా దాచిపెట్టవచ్చు. కాని ఆమె అలా చేయదు. వివాహానికి నమ్మకం పునాది అని నమ్మే బలమైన వ్యక్తిత్వం గల స్త్రీ. అందుకే విజయ్ కి కూడా నిజం చెబుతుంది. తనను స్వీకరించడానికి సిద్దపడే అతన్ని వివాహం చేసుకుని గృహిణీగా బ్రతకాలని అనుకుంటుంది. ఎక్కడా ఆత్మన్యూనతా భావంతో కొట్టుకుపోదు. కాని తనకి వివాహం నిజాయితీగా ఉంటే జరగదని అర్ధం చేసుకుని నాట్యగత్తెగా ఉండిపోవడానికి సిద్దపడుతుంది. అక్కడ కూడా డబ్బు కన్నా తన వ్యక్తిత్వమే తనకు ముఖ్యం అని చెబుతుంది. ఆ ఇంటి యజమానురాలు తనను వ్యక్తిగా గుర్తించి గౌరవించినందుకు ఆమె పట్ల అదే భాద్యతను గౌరవాన్ని ఆమె చూపెడుతుంది. తనకు బైటి ప్రపంచంలో కన్నా ఆ ఇంట్లోనే నిజమైన గౌరవం దొరుకుతుందని అర్ధం చేసుకుంటుంది.
ఒక మేజర్ కూతురు, దేశభక్తురాలు, నిజాయితీ గల స్త్రీ జీవితంలో ఆమె ప్రమేయం లేకుండా జరిగిన ఒక్క సంఘటన ఆధారంగా ఆమెలోని సుగుణాలను గుర్తించలేని సమాజం, మరో మగాడు ఆమెను బలవంతంగా అనుభవించాడని అది ఆమె నోటి ద్వారానే విన్న వాళ్ళు కూడా ఆమెను ఒక బహిష్కతురాలిగానే చూడడం ఆమెకు గౌరవంగా బ్రతికే అన్ని దారులను మూసివేయడమే కదా. ఆ స్థితిలో ఆమె సభ్య సమాజం హర్షించని నాట్యగత్తెగా మారడం వెనుక కారణం ఎవరు అన్నది ఈ సినిమాలో ఆర్తి అడిగే ప్రశ్న. చివరకు హత్య, జైలు కొంత నాటకీయత కలిపి నడిచినా, అలా బలయిన స్త్రీల పట్ల సమాజ వైఖిరి ఎందుకు అంత క్రూరంగా ఉంటుందో ఆత్మగౌరవం గల స్త్రీ ఎవరో చేసిన దానికి శిక్ష ఎందుకు అనుభవించాలో ఆలోచించమని చెప్పే సినిమా ఇది. హై సొసైటి పేరుతో ఎన్నయినా సహించే సమాజం ఒక మధ్య తరగతి స్త్రీ పై జరిగిన అన్యాయానికి ఆ స్త్రీ జీవితాన్ని సమిధను చేయడం ఎంత అన్యాయం. వృత్తి పరంగా లాయర్ అయి న్యాయ అన్యాయాలను తన దృష్టితో చూసే రవి తండ్రి, , సీతమ్మ వారి కష్టాలను కన్నీళ్ళతో వినే భక్తురాలయిన విజరు తల్లి, ఇలాంటీ వారు కూడా అన్యాయం జరిగిన స్త్రీ నిజాయితీగా అది చెప్పి తనను గౌరవించమని స్వీకరించమని అడిగితే స్వీకరించలేకపోవడానికి స్త్రీ నైతికత పట్ల ఉన్నఛాందస ఆలోచనలే కారణం. ఒక మగవాడి స్పర్శ తప్ప స్త్రీ నీతిని నిర్ణయించే మరో కొలమానం లేని ప్రపంచంలో స్త్రీ జీవితం బజారుపాలు అవడానికి చిన్న కారణం చాలు. ఈ నిజాన్ని చూపించే చిత్రం అంగారే. రెండు సార్లు తనకు వివాహం అయే అవకాశం చేయుజారి పోవడం, తనపై అత్యాచారం చేసిన జాలి పెళ్ళికి సిద్దపడడం. అతని జీవితానికి ఎటువంటి అడ్డూ లేకపోవడం చూసి ఆర్తి లో కోపం పెరిగిపోతుంది. జాలిని నిలదీస్తుంది. చివరకు అతని చేతిలో తాను ప్రాణంగా ప్రేమించె తమ్ముడు చనిపోయాడని తెలిసి ఆమె జాలిని హత్య చేస్తుంది.
ఇందులో ఆర్తి పాత్రలో స్మితా పాటిల్, విజయ్ గా రాజ్ బబ్బర్, రవి గా రాజేష్ ఖన్నాలు నటించారు. కిషోర్ కుమార్ పాడిన ''ప్యార్ కర్తే హై జిసే'' అనే పాట చాలా మంచి ప్రేమ గీతమని చెప్పవచ్చు. చాలా మంది మర్చిపోయిన ఈ సినిమాలో ఆ పాట కూడా పెద్ద పాపులర్ కాదు. రాజేంద్ర కిషన్ రాసిన ఈ పాట సాహిత్యం చాలా బావుంటుంది. ఈ సినిమా యూ ట్యూబ్లో ఉంది. ఆర్తిగా స్మిత నటన చాలా ఆకట్టుకుంటుంది. నాకు నచ్చిన స్త్రీ పాత్రలలో ఆర్తి ఒకటి. ఒక విక్టీమ్ లా కాకుండా అత్మగౌరవం అణువణువూ నింపుకున్న ఆర్తి అందరికీ నచ్చుతుంది.
- పి.జ్యోతి,
9885384740