Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊరు నడి మధ్యన వెడల్పాటి రాతి చప్టా. రాతి చప్టా మీద పొడవాటి దిమ్మ. ఆ దిమ్మ మీద గోచీ కట్టుకుని చేతిలో కర్ర పుచ్చుకుని ఒక కాలు ముందుకి ఒటి వెనక్కీ వేసి 'స్టడీ' గా నించున్న విగ్రహం.
ఊరు నిద్దరోయింది. గాలి కూడా వీయడం మానేసి నిద్రకుపక్రమించింది. ఆకాశంలో మబ్బులు కమ్మేసిన చంద్రుడు జీరో బల్బులా మసక మసగ్గా వెలుగుతున్నాడు.
రాతి చప్టా మీద ఓ ఆకారం అడ్డదిడ్డంగా పడుంది. ఉండుండి అటూ ఇటూ దొర్లుతుంది. దూరంగా ఒక కుక్క మొరిగింది. అది విని మరోటి జుగల్బందీ మొదలు పెట్టింది. ఆపైన కొన్ని కోరస్ అందుకున్నది. దిమ్మ మీది విగ్రహం కదిలింది. స్లోమోషన్లో కిందకి దిగింది. చేతిలో కర్ర అలాగే ఉంది. బొడ్లో దోపుకున్న గడియారం ముళ్ళు కదలకుండా నిలబడ్డయి. కిందికి దిగిన విగ్రహం మనిషిలా కదిలింది. చప్టా చివర దొర్లుతున్న ఆకారాన్ని పిలిచింది. నాయనా! బాబూ! భాయిసాబ్! అని ఎన్ని మార్లు అన్నా ఆ ఆకారం పట్టించుకోలేదు. మనిషైన విగ్రహం కర్రతో ఒక్కటిస్తే బావుండేది కాని ఎట్టి పరిస్థితుల్లోనూ హింసకు తెగబడదు అది. అందువల్ల కర్రని చప్టా మీద పెట్టి పెద్ద శబ్దం వచ్చేట్టు తాటించింది. నిశ్శబ్దంగా ఉండడం వల్ల అది యింకా పెద్దగా చప్పుడు చేసింది.
అడ్డదిడ్డంగా పడున్న ఆకారం అతికష్టంగా కళ్ళు తెరిచి 'నేను ఇంటికి రానుఫో' అని అరిచింది. తను తప్పతాగి పడుంటే ఎప్పటిలాగానే కొంపకు తీసుకుపోవడానికి వచ్చిన భార్య అనుకుని. ఆ ఆకారం నోరు తెరవడంతో వాసన గుప్పుమంది. చప్టా అంతా అది వ్యాపించడానికి అట్టే సమయం పట్టలేదు.
ముక్కుమూసుకుంది విగ్రహం. ఎవరనుకుంటున్నావో నేను బాబూ నేను బాపూని అన్నది.
'బాపూ నువ్వెందుకు వచ్చినవు బాపు. అది రాలే' అన్నది ఆకారం విసుక్కుంటూ.
'నేను మీ నాయనను కాదు నాయనా నన్ను అందరూ బాపు అంటారు' అన్నది విగ్రహం.
'అయితే ఏంటిప్పుడు' అంటూ మరో వైపు దొర్లాడు 'దేవదాసు'
'దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్భయి అయిదేళ్ళయింది కదా. అమృతోత్సవ వేళ దేశం ఎంత అభివృద్ధి చెందిందో ఎంత బాగుపడిందో చూద్దామని వచ్చా. నువ్వేమయినా చెప్పగలవా?' అన్నది విగ్రహం.
'ఏమిటీ అభివృద్ధా, అమృత్సవము బాగుపడ్డామా?' మాటలు ముద్దగా వచ్చినయి.
'మద్యనిషేధం అమలు కాలేదా నాయనా?' అన్నది విగ్రహం.
'నిష్షేదమా చచ్చూరుకుం టారు. గవర్నమెంట్లు నడిచేదే మా వల్ల. మేం తాగడం మానేస్తే అందరూ పస్తులుండాల్సిందే. ప్రజా ప్రతినిధులకు జీతాలెవడిస్తాడు మీ బాపా?' అన్నాడు 'డోసుదాసు'.
'జీతాలా? ప్రజా సేవకు జీతాలా?' విస్తుపోయింది విగ్రహం.
'జీతాలేమిటి భత్యాలేమిటి వాళ్ళిష్టం ఎంత కావాలంటే అంత పెంచుకుంటారు. కష్టపడు, అడుక్కో, దోచుకో ఈ మూడే సంపాదించుకోడానికి. మొదటిది వదిలేసి మిగతా రెండూ ఆళ్ళే కాదు అందరూ ఫాలో అవుతున్నారు. ఓట్లు అడుక్కుంటున్నారు లంచాలు అడుక్కుంటున్నారు. మొత్తం మీద దోచుకుంటున్నారు' అంటూ పూర్తిగా మెలకువ వచ్చి లేచి కూచున్నాడు 'సీసాదాసు' తాగింది దిగిపోయింది.
'అయితే రామరాజ్యం రానేలేదా' అని వాపోయింది విగ్రహం.
రామరాజ్యమా, రావణ రాజ్యమా కీచక రాజ్యం వచ్చింది. 'నిర్భయ' కేసు, 'దిశ'కేసు తెలీదూ అన్నాడు మత్తు దిగినోడు.
ఎక్కడ్నించో పరుగెత్తుకు వచ్చిన ఓ పాతికేళ్ళ అమ్మాయి దిమ్మ వెనుక దాక్కుంది. అదుర్దాగా అటు అడుగులు వేసింది విగ్రహం. 'ఎవరమ్మా నువ్వు ఏం చేస్తున్నావు' అని అడిగింది.
'నలుగురు రౌడీలు వెంటపడితే ఇక్కడ దాక్కున్నాను' అంది ఆడకూతురు వణికిపోతూ.
ఎందుకు భయం, అర్థరాత్రి ఆడది నిర్భయంగా తిరగ గలగడమే స్వాతంత్య్రం కదా అన్నది విగ్రహం.
'అదింకా రాలేదులే' అంది ఆమె దిమ్మకు అతుక్కుపోతూ. 'అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అన్నీ ఉన్నయి. ఏమీ మారలేదు. తెల్లవాడి జాగాను నల్లవాడు ఆక్రమించాడు అంతే' అంది.
ఉన్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచారు. కొత్త ఉద్యోగాలు రావు. నిరుద్యోగం ఇంకో శతాబ్దం దాకా ఇలాగే ఉంటుంది. ఓట్ల కోసం సబ్సిడీలిస్తారు పథకాలు అమలు చేస్తారు. ప్రజలందరిరినీ లంచగొడుల్ని చేస్తారు. నీతి నియమాల్ని నిలువునా పాతేస్తారు' అన్నారెవరో. వెనక్కి తిరిగి చూసింది విగ్రహం. తాగుబోతు తన వెనకే నిలబడి మాట్లాడుతున్నాడు.
వాసనకి ముక్కు ముక్కలైపోతుందనుకుంది విగ్రహం. ఇంకా ఇలాగే ఉంటే ఎన్ని అకృత్యాలు వినాల్సి వస్తుందోనని భయపడ్డది విగ్రహం. స్లో మోషన్లో చప్టామీద నుంచి దిమ్మ మీదికి చేరి ఎప్పటిలాగే ఓ కాలు ముందుకీ ఓటి వెనక్కీ ఉంచి ఎవరినీ కొట్టలేని కర్రతో నిలబడిపోయింది నిశ్చలనంగా.
- చింతపట్ల సుదర్శన్, 9299809212