Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజాన్ని ఎంత లోతుల్లో పూడ్చిపెట్టినా అవసరం అనుకున్నప్పుడల్లా విత్తనం మొలకెత్తినట్లు బయట పడుతూనే ఉంటది. జ్యోతిరావు పూలే గురించి కూడా మనం ఈ విధంగానే అనుకోవాల్సి వస్తుంది. మనువాదులు విద్యా వ్యవస్థలో ఉండి ఆయన చరిత్రను బయటకు రాకుండా కప్పిపెట్టారు. కాని బహుజన సోయి ఉన్న మేధావులు తమ పూర్వీకులు, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ లక్ష్యాలు, ఆశయాల గురించి నిత్యం శోధిస్తూనే ఉన్నరు. అలా పాలమూరు మట్టి నుండి శోధిస్తున్న ప్రముఖ తెలంగాణ మలిదశ ఉద్యమకారులు, న్యాయవాది, నవలా రచయిత, నికార్సయిన బహుజనవాది బెక్కం జనార్ధన్ మహాత్మ జ్యోతిరావుపూలే గారి గురించి శోధించి నేటి తరానికి ఆయన జీవితాన్ని తెలియజేయాలని ఆశయంతో ''సత్య శోధకుడు'' అనే ఈ పుస్తకాన్ని మన ముందుకు తెస్తున్నరు. గతంలో పాలమూరు లో జరుగుతున్న దొరలు, భూస్వాముల దోపిడిని ఎదిరించిన పాలమూరు ముద్దుబిడ్డ ''పండుగ సాయన్న'' వీరత్వాన్ని నవలగా తెచ్చిండ్రు. అదే విధంగా కనుమరుగైపోతున్న బహుజన వీరులను, వారి త్యాగాలను నేటి తరంతో పాటూ ముందు తరానికి అంద జేయాలని, అది మన బాధ్యతని వీరు సంకల్పించి చదువుల తల్లి ''సావిత్రిబాయి ఫూలే'' గారి జీవిత చరిత్రను కూడా ఇదివరకే పుస్తకరూపంలో తీసుకొచ్చిండ్రు. మనువాదులు నిచ్చెన మెట్ల వ్యవస్థను నెలకొల్పి ఒక మానవ జాతిని నాలుగు విభాగాలుగా అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజించి పై మూడు వర్ణాలకు వెట్టిచాకిరి చేసే విధంగా శూద్రులను చిత్రీకరించిండ్రు. శూద్రులను విద్యకు, పరిపాలనకు, ఆర్థిక స్వాతంత్రానికి దూరం చేసిండ్రు. ఒక మనిషిని జంతువు కన్నా హీనంగా చూడటం జ్యోతిరావు పూలే గమనించి ఈ వ్యవస్థ మారాలి, మనుషులు అంతా ఒక్కటే అని ఈ దేశ మూల నివాసులైన శూద్రులకు జ్ఞానం కావాలి, అది కేవలం విద్య వల్లనే వస్తుందని గ్రహించి పాఠశాలలు స్థాపించి మరీ ముఖ్యంగా స్త్రీలను కేవలం వంట, పడక గదులకి పరిమితం చేసిన మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా పోరాటం చేసి, స్త్రీల కోసం, దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పాఠశాలలు స్థాపించి, 9 ఏళ్ల వయసు గల తన భార్య సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి ఆ తల్లి ద్వారా స్త్రీలకు, బాలికలకు విద్యను బోధించే విధంగా జ్యోతిరావు పూలే కషి చేశారు. తద్వారా తమ ధర్మాన్ని మంట కలుపుతున్నారని మనువాదులు కోపోద్రికులై పూలే పై హత్య ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఆయన ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ఇదంతా 150 సంవత్సరాల క్రితం జరిగిన గాని నేటి సమాజానికి అంతంత మాత్రమే తెలుసు. దానికి కారణం విద్యా వ్యవస్థలో బహుజనులు ఎక్కువగా లేకపోవడమే. సింహాలు తమ చరిత్రను తాము చెప్పుకోలేనంత కాలం వేటగాడు చెప్పింది చరిత్ర అవుతుంది అన్నట్లు మనువాదులు రాసిందే, చెప్పిందే మన చరిత్ర అనుకోని ఎక్కువ శాతం భ్రమలో ఉన్నాం. కానీ మన చరిత్రను తెలుసుకునే ప్రయత్నం అక్కడక్కడ ఇలా బెక్కం జనార్దన్ వంటి వారు చేయడం వల్ల మన పూర్వీకుల చరిత్ర కూడా ఘనమైనదని తెలుస్తున్నది. వారి త్యాగాలు, ఆశయాలు మనం తెలుసుకున్ననాడే మన చరిత్రను మనం నిర్మించుకోగలం. ప్రజల చేత భారతదేశ స్వాతంత్య్రానికి పూర్వమే ''మహాత్మా'' అని పిలవబడ్డ ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే. అటువంటి నాయకుని గురించి మన ముందుకు సత్యశోధకుడిగా తీసుకు వస్తున్నందుకు బెక్కం జనార్దన్ అన్నకు కతజ్ఞతలు. ఇటువంటి మహనీయుల ముఖ్యంగా బహుజనుల చరిత్రలు ఇంకా ఎన్నో ముందు తరానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేసుకుంటూ... బెక్కం జనార్థన్‌కు అభినందనలు...
(సత్యశోధకుడు (పూలే జీవిత చరిత్ర), రచయిత : బెక్కం జనార్థన్, వెల : రూ. 25/-, ప్రతులకు : బెక్కం జనార్థన్ (అడ్వకేట్) నారాయణ, ఇ.నెం. 1-2-110/ఎ, సుభాష్ నగర్, మిత్ర కాలనీ, మహబూబ్ నగర్ - 509001, సెల్ : 9985011302;
అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...)
- కెపి లక్ష్మీ నరసింహ, 9010645470