Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆసఫ్జాహి వంశస్తుల పాలనలో మగ్గిపోయిన తెలంగాణ ప్రజలను జాగృతం చేయడానికి అనేక పరిస్థితులు దోహదం చేశాయి. ఈ స్థితిలో హైదరాబాద్ సంస్థానానికి చెందిన ఆఘోరనాథ చటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ కయాం మొదలైన ప్రముఖులు తెలంగాణ ప్రజలలో కొంత చైతన్యాన్ని కలిగించారు. కానీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. 20వ శతాబ్ద ప్రారంభం నుండే తెలంగాణలో జాతీయ చైతన్యం కలిగింది. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి జరిగిన ప్రయత్నాల్లో 'గ్రంథాలయోధ్యమం' మొట్ట మొదటిది.
గ్రంథాలయోధ్యమానికి ఆది పురుషుడు కొమరరాజు వెంకట లక్ష్మణరావు 1901లో మునగాల రాజ రావిశెట్టి రంగరావు సహాయంతో హైదరాబాద్‌లో 'శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాష నిలయాన్ని' నెలకొల్పాడు. ఇదే తెలంగాణలో స్థాపించిన ప్రథమ గ్రంథాలయం. తరువాత 1904లో లక్ష్మణరావు కృషి ఫలితంగా హన్మకొండలో 'రాజరాజ నరేంద్ర భాష నిలయం' 1905లో 'ఆంగ్ల సంవర్ధిని నిలయం' సికింద్రాబాద్‌లో వెలిశాయి. లక్ష్మణరావు గ్రాంథలయ స్థాపనతో తృప్తి చెందక అమూల్యమైన తెలుగు సాహిత్యాన్ని ముద్రించి ఆంధ్ర ప్రజలను విజ్ఞాన వంతులను చేయడానికి 1906లో హైదరాబాద్‌లో విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలిని ప్రచురించారు. ఆ విధంగా ఏర్పాటు చేసిన గ్రంథాల యోధ్యమం తెలుగు భాష ప్రచారంతో పాటు నిజాం ప్రజా వ్యతిరేక ఫర్మాణాలను (జీ.ఓలను) వ్యతిరేకిస్తూ అనేక తీర్మానాలు చేశారు. ప్రతి ఏట గ్రంథాలయ మహాసభలు జరుపుతూ తెలుగు ప్రజలను ఏకం చేశారు. ఉర్దూ రాజ భాషగా ఉన్నప్పటికీ మరాఠి భాష కొంత మేరకు అమలులో ఉంది. 60 శాతం ప్రజలున్న తెలుగు మాత్రం మాట్లాడడానికి, చదవడానికి నోచుకోలేదు. తెలుగు మాట్లాడిన వారిని హీనంగా చూసేవారు. గ్రంథాలయ మహా సభ లలో ప్రభుత్వ విధానాలను భూ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించారు. కౌలుదారులకు రక్షణ కల్పించాలని, తావాన్ (జరిమాన) శిస్తులు తగ్గించాలని రాజు గారికి మెమోరాండాలు ఇచ్చారు.
ఆంధ్ర జన సంఘం స్థాపన
ఆంధ్రజన సంఘం ఒక విచిత్ర సంఘటన వల్ల ఆవిర్భవించింది. తెలంగాణాలోని జనాభాలో సగం తెలుగు వారైనప్పటికీ తెలుగు భాషకు ఆదరణ లేదు. ఉర్దూ భాష రాజభాషగా ఉండేది. మరాఠీ భాషకు కొంతవరకు ప్రాముఖ్యం ఉండేది. సభలలో సాధారణంగా ఉర్దూ, మరాఠీ భాషలలో మాట్లాడేవారు. ఆ స్థితిలో 1921 నవంబరు 12న హైదరాబాదులో 'వివేకవర్ధిని' థియేటర్లో డి.కె.కార్వే అనే పండితుని అధ్యక్షతన ఒక సభ జరిగింది. ఆ సభలో వక్తలందరూ ఉర్దూ, మరాఠీలో మాట్లాడారు. ఆ సందర్భంలో ఆల్లంపల్లి వెంకట రామారావు అనే హైదరాబాదు న్యాయవాది మాట్లాడటానికి లేచి తన ఉపన్యాసాన్ని తెలుగులో ప్రారంభించాడు. ప్రారంభించిన వెంటనే సభికులు, వక్తలందరు హేళన చేస్తూ నవ్వసాగారు. ఈ సంఘటన ఆ సభలో పాల్గొన్న తెలుగు వారందరికీ ఎంతో అవమానంగా అనిపించింది. ఆనాటి రాత్రి కొందరు ఆంధ్రులు టేకుమళ్ళ రంగారావు అనే ప్రముఖుని ఇంట్లో సమావేశమై తెలుగు భాష, తెలుగు సంస్కతులను అభివద్ధి పరచడానికై 'ఆంధ్రజన సంఘం' అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ హైదరాబాదులో ఆంధ్ర తెలుగు భాషాభివద్ధికి కషి చేసింది. దాంతో నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమం ప్రారంభమైంది. 1922 ఫిబ్రవరి 14న ఆంధ్ర జన సంఘం మొదటి సమావేశం కొండ వెంకటరంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆ సమావేశంలో తెలంగాణ సాంస్కృతిక అభివృద్ధి గురించి మాత్రమే చర్చలు జరిగాయి.
ఆంధ్ర కేంద్ర జనసంఘం 1923-30
తెలంగాణా ప్రాంతంలో ఉన్న తెలుగు సంస్థలన్నీ కలిపి ఒకే సంస్థగా రూపొందించటానికి 1923లో హైదరాబాదు లో 'ఆంధ్రజన కేంద్ర సంఘాన్ని' ఏర్పాటు చేశారు. బారిష్టర్ రాజగోపాలచారి అధ్యక్షులుగాను, మాడపాటి హన్మంతరావు కార్యదర్శిగానూ నియమితులయ్యారు. 1923 జూలై 27న హైదరాబాదులో దీని ప్రథమ సమావేశం జరిగింది.
పత్రికల కృషి
ఆంధ్రోద్యమానికి తెలంగాణా పత్రికలు కూడా గొప్ప కషి చేశాయి. సురవరం ప్రతాప రెడ్డి 'గోల్కొండ పత్రిక' 1922లో సబ్నవీసు వెంకట రామ నరసింహారావు సంపా దకత్వంలో స్థాపించిన ఈ 'నీలగిరి' పత్రిక, అదే సంవ త్సరంలో బద్దిరాజు సీతారామ చంద్రరావు సంపాదకత్వంలో వెలువడిన 'తెలుగు పత్రిక' ఇంకా కాకతీయ, తెలంగాణా, సుజాత, శోభ, మొదలైన పత్రికలు ఆంధ్ర భాషా సాహిత్యాలకు గొప్ప సేవ చేశాయి. చిలుకూరి వీరభద్రరావు రచించిన 'ఆంధ్రుల చరిత్ర', సురవరం ప్రతాపరెడ్డి రచించిన 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' ఖండవల్లి లక్ష్మీరంజనం రచించిన 'ఆంధ్రుల చరిత్ర సంస్కతి' ఆంధ్రుల గత వైభవాన్ని స్ఫురణకు తెచ్చి గొప్ప చైతన్యాన్ని కలిగించాయి.
ఆంధ్ర మహిళా సభ
1930లో దుర్గాబాయి దేశ్‌ముఖ్ మొదలైన అభ్యుదయ భావాలు కలిగిన మహిళలు ఆంధ్ర మహిళా సంఘాన్ని స్థాపించారు. ఈ సంస్థ నిజాం ఆంధ్ర మహాసభలతో పాటు ఆంధ్ర మహిళా సభవారు కూడా 10 సభలు జరిపారు. ఆంధ్రమహిళా సభ స్త్రీ జనోద్దరణకు స్త్రీ విద్యకు పాటుబడి తెలంగాణా స్త్రీలలో గొప్ప చైతన్యం తెచ్చింది.
నిజాం ఆంధ్ర మహాసభ 1930-1946
తెలంగాణా ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మార్చి స్వాతంత్య్ర సమరాన్ని జరిపిన సంస్థ నిజాం ఆంధ్ర మహాసభ. ఆంధ్రజన కేంద్ర సంఘం 'నిజాం ఆంధ్ర మహాసభ'గా మారి తెలంగాణా - స్వాతంత్య్రోద్యమాన్ని ప్రారంభించింది. 1930లో జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర జన కేంద్ర సభ తనను ఆంధ్రమహాసభగా ప్రకటించుకున్నది. 1930 నుంచి 1946 వరకు 13 ఆంధ్ర మహాసభలు జరిగి తెలంగాణా జాతీయోద్యమంలో ప్రముఖపాత్ర వహించాయి. 1937లో నిజామాబాద్‌లో జరిగిన 6వ మహాసభలో కేవలం ఆంధ్రులేగాక నిజాం రాజ్యంలోని అన్ని రాజ్యాల భాషల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని అందరూ పాల్గొనవచ్చని ప్రకటించారు. 1940లో జరిగిన 7వ మహాసభ నిజాం ప్రభుత్వం నియమించిన అయ్యంగార్ కమిటీ సూచించిన రాజ్యాంగ సంస్కరణలను బహిష్కరించాలని, అతివాది అయిన రావి నారాయణ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా మితవాది అయిన మాడపాటి హనుమంతరావు, కొండా వెంకట రంగారెడ్డి, ముందుముల నరసింగరావు వ్యతిరేకించారు. కాని రావి నారాయణ రెడ్డి తీర్మానాన్ని అధికులు బలపరిచారు. దాంతో ఆంధ్ర మహా సభలో అతివాద, మితవాద వర్గాలు ఏర్పడ్డాయి. 1944లో భువనగిరిలో జరిగిన 11వ సభలో రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ మహాసభకు 10వేల మంది ప్రజలు హాజరైనారు. వామపక్ష భావాలు కలిగివారి అధిక్యతతో రావి నారాయణరెడ్డి అధ్యక్షునిగా ఎన్నికైనాడు. 12వ మహాసభ 1945లో ఖమ్మంలో జరిగింది. ఆ సభతో ఆంధ్ర మహాసభ పరిసమాప్తమై 'సంఘం'గా అభివృద్ధి చెందింది. అణా (6 పైసలు) చెల్లించి సంఘంలో సభ్యత్వం చేరారు. సంఘంలో సభ్యత్వం చేరిన వారు తరువాత కమ్యూనిస్టు పార్టీ స్థాపనకు కృషి చేశారు. ఆరుట్ల లక్ష్మీ నర్సింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రాంచంద్రరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి లాంటి వాళ్ళు సభ్యులుగా చేరారు. భువనగిరిలో జరిగిన 11వ మహాసభను కమ్యూనిస్టు పార్టీ సభగా కెవి.రంగారెడ్డి, ఎం.రాంచందర్‌రావు అభివర్ణించారు. తెలంగాణ రైతులు మహాసభ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడానికి దారీతీసి ప్రభుత్వ చర్య 'బలవంతపు లెవీ ధాన్య వసూళ్ళు' కాగ ప్రజలపై అధిక పన్నుల భారం కూడా తోడైంది. మార్కెట్ ధరకు సగం మాత్రమే లెవీ ధర చెల్లించేవారు. అవి కూడా చాలా కాలానికి డబ్బులు ఇచ్చేవారు. అన్ని వృత్తులు, కులాల వారు భూస్వాములకు, అధికారులకు ఉచితంగా సేవలు అందించే బేగార్ పద్ధతి అమలులో ఉంటుంది. పల్లెల్లో అందమైన ఆడపిల్లలను దొరలకు ఉంపుడు గత్తెలుగా, బానిసలుగా, ఆడ బాపలుగా పంపే పద్ధతి కొనసాగింది. ఫ్యూడల్ ధౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ ప్రజలను సంఘటిత పరిచిన ఆంధ్ర మహాసభకు ప్రజలు పెట్టుకున్న పేరు 'సంఘం'గా స్థిరపడింది. పీడిత ప్రజలంతా సంఘం ఆధ్వర్యాన ఏకం కావడం సంఘం ఇచ్చిన కార్యక్రమాలను అమలు జరపడం మొదలు పెట్టారు. ప్రజల మనుసులలో సంఘం బాగా నాటుకపోయింది. నైజాంను ఎదురించే ఐక్యతను సంఘం ప్రజలలో నింపింది.
రైతు పోరాటాలు ఆరంభం
మొట్టమొదటిసారి 1933 జూన్ 3వ తేదీన నల్లగొండ జిల్లా భువనగిరి వద్ద 1000 మంది రైతులు హైదరాబాదుకు వచ్చి మాలు జారీ ఆఫీసుకు పోయి మెమోరాండం ఇచ్చారు. శిస్తు తగ్గించాలని, అక్రమ పన్నులు నిషేధించాలని, భూమిపై సాగుదారుకు హక్కు కల్పించాలని ఉద్యమంగా వచ్చారు. రాష్ట్రంలో నీటిపారుదల కల్పించాలని కోరారు. ఏటేటా పంటల ధరలు తగ్గడాన్ని ప్రభుత్వం దష్టికి తెచ్చారు. ఈ ఐక్యత రైతుల్లోను చైతన్యం కల్గించింది. మొండ్రాయి (జనగామ-నల్లగొండ ప్రాంతాలలో) కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ (సంఘం) నాయ కత్వాన 3000 మంది లంబాడీ రైతులు కడారు నర్సింహారావు దేశ్‌ముఖ్‌కు వ్యతి రేకంగా పెద్దఎత్తున ఉద్యమించారు. 70 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. తాము సాగు చేస్తున్న భూములను రక్షించు కున్నారు.
ఎర్రబాడు దొర లుగా పేరొందిన జన్నా రెడ్డి ప్రతాపరెడ్డి సూర్యా పేట ఏరియాలో లక్ష ఎకరాల భూమిపై అక్రమంగా హక్కు కలిగినట్టు తన స్వాధీనంలో అట్టిపెట్టుకున్నాడు. ఎడపెల్లి, నూతనకల్లు గ్రామాల నుండి 3000 మంది రైతులు గాజుల రాంచంద్రయ్య, సంఘం నాయకత్వాన 4 గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించి తిరిగి స్వాధీనం చేసుకు న్నారు. వీరి పోరా టానికి భయపడి నాటి నైజాంప్రభుత్వం దేశ్‌ముఖ్ జన్నారెడ్డి ప్రతాపరెడ్డి భూములు వదులు కున్నారు. దేశ్‌ముఖ్ నివాసం హైదరాబాదు కు మార్చుకున్నాడు.
భూములను ఆక్ర మించిన 1000 మంది రైతులు స్వాధీనం చేసుకు న్నారు. పాత సూర్యా పేటలోని పేదల భూములను ఆక్ర మించిన భూస్వామి లక్ష్మీకాంతారావుకు వ్యతిరేకంగా సంఘం నాయకత్వాన 1000 మంది రైతులు పెద్ద పోరాటం చేశారు. తమ 1000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. హుజూర్నగర్ తాలూకాలోనే బక్కపంతుల గూడెం భూసా ఆక్రమణలో ఉన్న 500 ఎకరాల భూమిపై సంఘం నాయకుడు బలపనూరు బాపయ్యల నాయకత్వాన 1500 మంది రైతులు, ప్రజలు తిరగబడి భూమి ఆక్రమించారు. తుల గూడెం భూస్వామి భోగాలు నాయకుడు తీగెల మల్లారెడ్డి గూడెం (హుజూర్ నగర్ తాలూకా) లోని గ్రామ పహరి 600 ఎకరాలు ప్రజల సాగులోనున్న భూమిని ఆక్రమించారు. సంఘం నాయకులు 4000 మంది రైతులు, ప్రజలు ఉద్యమం సాగించి ఆక్రమించారు. ఇదే తాలూకాలో మేళ్ళ చెరువు భూస్వామి 600 ఎకరాలు ఆక్రమించగా సంఘం నాయకత్వాన వీరభద్రరావు, 6000 మంది ఉద్యమం చేశారు.
ఇదే కాలంలో ఆసీఫాబాద్ ప్రాంతంలో కొమరంభీం నైజాం ప్రభుత్వంపై దాడికి దిగాడు. సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నైజాం ప్రభుత్వని ముపుతిప్పలు పెట్టాడు. నైజాం అధికారాన్ని కొనసాగనివ్వకుండా ఆ ప్రాంతాన్ని స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించుకున్నాడు. నైజాం ప్రభువు ఆంగ్లేయులతో కలిసి మోసం ద్వారా 1940 సెప్టెంబర్ 1న కొమరంభీంను కాల్చి చంపారు. అతనితో పాటు మరో 12 మందిని కాల్చి చంపారు.
కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు
1934 సెప్టెంబర్‌లో కాకినాడలో ఏడుగురితో ఆంధ్ర ప్రాంత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. చలసాని జగనాథ్రావు, పుచ్చలపల్లి సుందరయ్య, సి.హెచ్. రాజేశ్వరావు, మాకినేని బసవపునయ్య లు ఉన్నారు. 1934లో పార్టీపై నిషేధం విధించిన 1948లో తొలగించారు.
1936 ఏప్రిల్‌లో అఖిలభారత కిసాన్‌సభ ఏర్పడింది. భూస్వామ్య విధానం రద్దు కావాలనే ప్రధాన నినాదంతో పాటు ఆంగ్లేయులు భారతదేశం నుండి వెళ్ళిపోవాలన్న లక్ష్యాన్ని ప్రకటించారు. మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, కొండావెంకటరంగారెడ్డిల ఆధ్వర్యంలో 1922 ఫిబ్రవరి 14 ఆంధ్రజన సంఘం ఏర్పడింది. 1930 నాటికి ఇదొక రాజకీయ శక్తిగా రూపొందింది. అప్పటికే ఆంధ్రప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభావంతో, హైదరాబాద్‌లో మగ్దూం మోహియోద్దీన్ నాయకత్వాన ''కామ్రేడ్స్ అసోషియేషన్'' 1939 డిసెంబర్ 13న ఏర్పడింది. ఇందులో సయ్యద్ అలంకుంద్మీరి, రాజ్‌బహుదూర్ గౌర్, ముర్తుజాహైదర్, సయ్యద్ ఇబ్రహీంలతో కలిసి ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటుకు బూర్గుల రామకృష్ణారావు అభినందనలు తెలిపారు. ముగ్దుం మోహియోద్దీన్ రైల్వే కార్మికులలో పని చేశారు.
అప్పటికే తెలుగు భాష ప్రచారం పేరుతో గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. వాటికి ఎన్నికలు, మహాసభలు, జరిపారు. గ్రంథాలయ ఉద్యమం బాగా బలపడింది. భాష పేర జరిగే ఈ మహాసభలలో నిజాం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. ఆ సందర్భంగానే ఏర్పడిన ఆంధ్ర మహాసభలో సంఘ సభ్యులు పెద్దఎత్తున చేరారు. నైజాం ఈ సంస్థపై నిషేదం ప్రకటించడంతో అనేక మంది అభ్యుదయ వాదులు ఆంధ్రజన సంఘంలో చేరారు. అతివాదుల ప్రభావం పెరగడంతో వ్యవస్థాపకులు సంఘం విడిచి వెళ్ళారు. ఆ తర్వాత సంఘం పేరుతో రైతాంగ సమస్యలు తీసుకొని ఉద్యమాలు జరిగాయి. ఆ విధంగా కమ్యూనిస్టు పార్టీ నైజాం ప్రాంతంలో ''సంఘం'' పేరుతో కార్యకలాపాలు కొనసాగింది. తెలంగాణలో 1941లో పెరవెల్లి వెంకట రమణయ్య, ఏ గురువారెడ్డి, రవి నారాయణరెడ్డి, వేములపల్లి వెంకటేశ్వర్రావు, ఆరుట్ల లక్ష్మీనర్సింహ్మారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలతో నైజాం ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. దీనికి సి.హెచ్. రాజేశ్వర్‌రావు హాజరైనారు. పెరవెల్లి వెంకట రమణయ్య తరువాత కమ్యూనిస్టు పార్టీకి రాజీనామ పెట్టి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారు. 1947 వేములపల్లి వెంకటేశ్వరావు, ఆ తరువాత బద్దం ఎల్లారెడ్డి 1956 వరకు కార్యదర్శులుగా పని చేశారు. కమ్యూనిస్టు పార్టీలో సర్వదేవబట్ల, రామనాథం, చంద్రగుప్త చౌదరి, హబిబోద్ధిన్, రంగసాని గోపాల్‌రెడ్డి, విడి దేశ్‌పాండే (ఔరంగబాద్)తో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది.
1944లో ఆంధ్రమహాసభ భువనగిరిలో జరిగింది. కడవెండి గ్రామం నుండి నల్లా నర్సింహ్ములు, దొడ్డి మల్లయ్య, ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, పిట్టల నర్సయ్యలు సంఘంలో చేరారు. 1944 అక్టోబర్ 3న గ్రామంలో దావూత్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. దీనికి నాయకులు ఆరుట్ల రాంచెంద్రారెడ్డి వచ్చారు. కమిటీ అధ్యక్షుడుగా దావూద్రెడ్డి, కార్యదర్శిగా నల్లా నర్సింహ్ములు, సభ్యులుగా యర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, దొడ్డిమల్లయ్య, మాచర్ల కొండయ్య, మచ్చ రామయ్యలు తలా అణా (ఆరుపైసలు) చెల్లించి సంఘం సభ్యులుగా చేరారు. అప్పటికే వారం వారం ప్రజాశక్తి వారపత్రిక వస్తున్నది. విస్నూరు దొర ఉద్యమాన్ని అణచి వేయాలని నాయకుల్ని అరెస్టు చేయించాడు. సీతారాం పురంలో ఆయన తల్లి జానమ్మ వద్ద ఉన్న 80 పుట్ల వడ్లను జప్తు చేశారు. దీనితో అసహనానికి గురైన తల్లీకొడుకులు ఉద్యమాన్ని దెబ్బతీయాలని కక్ష పెంచుకున్నారు. ఈ సందర్భంగానే చాకలి ఐలమ్మ ఆస్థిని కాజేయడానికి పథకం వేశారు.
1940లో కాశింరజ్వి అడ్వకేట్ నాయకత్వాన 60 వేల మంది ముస్లింలతో రజాకార్ ప్రయివేట్ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. నైజాం ప్రభువుకు తమ సేవాలు అందిస్తామని 'ఇతేహదుల్ ముస్లిమీన్' పార్టీని స్థాపించాడు. నెలవారీ ఖర్చులు తీసుకుంటూ నైజాం సైన్యాలకు తోడుగా తన సైన్యాలను జత చేశాడు. రజాకార్ అనగా వాలంటీర్ అని అర్థం. వీరు దోపిడీలు, దొంగతనాలు, మానబంగాలు విచ్చలవిడిగా చేశారు. అప్పటి నుండి 1951 వరకు నైజాంకు, భారత పోలీసులకు తోడుగా ఉన్నారు.
ఈ విధంగా ఎక్కడికక్కడ పోరాటాలు కొనసాగుతూ వచ్చాయి. ప్రజా చైతన్యం నిజాం సైన్యాలు, జమీందార్లకు గుండాలు, రజకారు సైన్యాలు నిలబడలేకపోయాయి. చాలా విజయాలు సాధించారు. ఆ విధంగా నైజాం ప్రాంతం అంతా ప్రభుత్వ నిర్భందానికి వ్యతిరేకంగా జమీందార్లకు అనుకూలమైన పర్మానాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు ప్రజలను ఐక్య పరిచాయి. ఈ అన్ని పోరాటాలకు పరాకాష్ఠాగా పాలకుర్తి ఐలమ్మ పోరాటం సాగింది.
జమీందార్లపై రైతులు, ప్రజలు భౌతికంగా పోరాటాల్లోకి దిగారు. అనేక విజయాలు సాధించారు.
జమీందారీ జమీందారు
ధర్మాపురం పూసుకురు రాఘవరావు జమీందారు
ముడ్రాయి కడారి నర్సింహరావు భూస్వామి లంబాడీల భూముల అక్రమణ
ఎరపాడు జన్నారెడ్డి ప్రతాప్‌రెడ్డి 1.5 లక్షల ఎకరాలు
బేతఓలు తడకమల్ల సీతరామంద్రారావు 1941-44
బక్కపంతుల గూడెం భోగాల వీరారెడ్డి భూస్వామి వడ్డీలు
మల్లారెడ్డి గూడెం పటేల్ పట్వారీల దోపిడి ధాన్యం లేవి
మేళ్ళ చెరువు బంజరుదార్లు భూములు ఆక్రమణ
ఆళ్ళీపురం- తిమ్మపురం అన్వర్‌పాషా భూములు ఆక్రమణ
ముల్కలగూడెం పింగిలి రంగారెడ్డి భూముల ఆక్రమణ
నసికల్లు వెంకటనర్సింహ్మారెడ్డి 2000 ఎకరాలు భూముల ఆక్రమణ
పై విధంగా జమీందార్ల భూస్వాములపై పోరాటానికి రైతులు, ప్రజలు, వ్యవసాయ కార్మికులు స్వచ్ఛందంగా దాడులు చేసి తమ భూములను ఆక్రమించుకున్నారు.
- సారంపల్లి మల్లారెడ్డి, 9490098666