Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా వచన కవిత్వంలో ''నానీ''లు ఓ వినూత్న ప్రక్రియ. ఎందరో కవులు... నానీలు రాశారు. రాస్తున్నారు. 1997లో ఆచార్య డా|| ఎన్.గోపి నానీల్ని సృష్టించారు. దాదాపు 300 నానీ కవితా సంపుటాలు వెలువడ్డాయి ఇప్పటిదాకా. రెండు దశాబ్దాలుగా కాల పరీక్షకు నిలబడిన ఈ ప్రక్రియ ఎందరో యువకుల్ని ఆకర్షించింది.
బాల సాహిత్యం రాసే కౌలూరి ప్రసాదరావు ''నానీల ప్రసాదం'' అంటూ యీ కవితా సంపుటి తీసుకువచ్చారు. దాదాపు 150కి పైగా నానీలున్న యీ సంపుటిలో మనసు కదిలించే నానీల్ని కొన్ని మచ్చుకు చూద్దాం..
మెట్టా నాగేశ్వరరావుకు ఈ నానీల సంపుటి అంకితం చేశారు కవి కౌలూరి..
''పుస్తకం హస్తభూషణం ఒకనాడు / సెల్యులర్ సర్వభాషణం ఈనాడు'' (పేజీ : 15) అంటారు. ఈనాడు ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థి నుండి ఆన్లైన్ పాఠాలు పుణ్యమా అని అందరికీ ముఖ్యావసరం అయింది.
మానవీయ కోణాన్ని ఆవిష్కరించే మరో మంచి నానీ (పేజీ : 21) మనని ఆలోచింపజేస్తుంది.
''రాయిలోని దేవుడిని చూస్తున్నావు / మనసుని మాత్రం రాయిని చేస్తున్నావు'' అంటారు.
అలాగే వ్యంగ్యాత్మకంగా మరో చక్కటి నానీ (పేజీ : 41) రాసారు. ఉగాదిని దృష్టిలో పెట్టుకొని... అదీ పంచాంగంపై రాసారు.
''అవమానమే / రాజపూజ్యం లేదు / ఎన్ని ఉగాదులకైనా / పేదవాడ్ని కదా!'' సృష్టి ధర్మాన్ని అద్భుతంగా యువ దంపతులపై చక్కటి భావోస్వారక 'నానీ' (పేజీ : 55) ఈ కవి రాసారు. అదేమంటే... గర్భం దాల్చిన భార్య స్థితిని కవిత్వీకరించి చెప్పాడు కవి.
''గెడ్డం మాసింది / ఆమె జిరాక్స్ మెషినైంది / ఫొటో స్టాట్ వచ్చాకే / క్షవరం''.
మానవ జీవితాలకు గ్యారెంటీ లేదు ఈ కరోనా (దు)స్థితిలో- అనే అర్థం స్ఫురించేలా ఈ కవితలో (నానీ) కవి ఇలా అంటారు.
''సెల్ఫోనుకి / సీలింగ్ ఫ్యానుకీ వారంటీ - జీవితానికే లేదు గ్యారంటీ..'' (పేజీ : 55).
నాలుగు పదాల నానీలో రెండు రెండు భాగాలు - మరి రెండు లైన్లలో ఒక చరపు (పంచ్) ఉండాలి. అన్నీ నానీలు బాగున్నాయి. - కవికి అభినందనలు.
(నానీల ప్రసాదం(కవిత్వం), రచయిత : కౌలూరి ప్రసాదరావు, పేజీలు : 56, ప్రతులకు : కౌలూరి ప్రసాదరావు, వేళ్ళ చింతలగూడెం- గోపాలపురం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 534316, సెల్ : 9346700089)
- తంగిరాల చక్రవర్తి, 9393804472