Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనగాం తాలుకాలో విసునూరు రామచంద్రారెడ్డి 40 గ్రామాల భూస్వామి. 45 వేల ఎకరాలు కలిగిన వారు. ఆంధ్ర మహాసభల కార్యకర్తలను అనేక నిర్భంధాలకు గురిచేశారు. తన గుండాలతో దాడులు చేయించారు. అనేక మందిపై అక్రమ కేసులు బనాయించారు. 1945లో తన జమీందారిలో వున్న కామారెడ్డి పల్లెలోని మహమ్మద్ బందగిని హత్య చేయించాడు. అతడి అన్నను తన గుండా గ్యాంగ్‌లో పెట్టుకొని కామారెడ్డి, సీతారాంపురం, కడివెండి గ్రామాలపై నిరంతరం దాడులు చేయించాడు. సీతారాం పురంలో అతని తల్లి జానమ్మ అనేక దౌర్జన్యాలను చేసింది. రైతుల చేలు లూటి చేయించడం, పశువులను తోలక పోవడం చేసేది.
జమీందారు రాంచంద్రారెడ్డి కడవెండిలో ఆడ గూండా లను పోగు చేశాడు. ప్రజల ఊరేగింపులను వీరు అటకాయించి ఆడ గుండాలు భూతులు తిట్టేవారు. రాళ్ళ విసిరేవారు. హిందుమహసభ కార్యకర్తలు వీరిని తరిమికొట్టారు. గ్రామాలలో సామాన్య రైతుల నుండి లెవీ గల్లా వసూళ్ళ చేసేవారు. పండిన పంటలో సగం తక్కువ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయడమే లెవీగల్లా ఉద్దేశం. ఆ విధంగా వసూళ్ళు చేసిన లెవీగల్లాను ప్రభుత్వ వినియోగానికి ఉపయోగించే వారు. విసునూరు రామచంద్రారెడ్డికి చెందిన కడవెండిలోని 800 బస్తాల వడ్ల నిల్వలను జప్తు చేసి చీప్ సెక్రటరీ గ్రెగ్సన్కు రిపోర్టు చేశారు. అతను వచ్చేవరకు ఇక్కడ ధాన్యం కాపలా కాశారు. చివరికి 6000 బస్తాలను లెవికింద తీసుకువెళ్ళారు. దీనిని అవమానంగా భావించాడు.
తిరుగుబాటు రగిలించిన అగ్నికణం
పాలకుర్తి గ్రామంలో సంఘాన్ని గట్టిగా బలపరిచిన చాకలి ఐలమ్మ పొలాన్ని స్వాధీనం చేసుకోవాలని జమీందారు ప్రయత్నాలు ప్రారంభించారు. అంతకు ముందురోజే పాలకుర్తిలో జరిగిన బహిరంగ సభపైకి తన గుండాలను పంపాడు. గుండాల నాయకుడు ఒనమాల వెంకడును కార్యకర్తలు చితకతన్ని పంపించారు. ఈ ఘటనపై 14 మంది సంఘ నాయకులపై కేసు పెట్టారు. గ్రామంలో భయబ్రాంతులు సృష్టించారు. ఈ పరిస్థితులలో పొలం అక్రమణకు 100 మంది కూలీలను, 100మంది గుండాలను పంపించాడు. సంఘ నాయకులు 23 మంది గుండాలపై దాడి చేశారు. ''బతుకు జీవుడా'' అంటూ పారిపోయారు. అదేరాత్రి విసునూరు నుండి పోలీసులు వచ్చి ఐలమ్మ ఇంట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకవెళ్ళే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు ఎదురు తిరగడంతో ధాన్యం ముట్టుకోలేకపోయారు. బీంరెడ్డి నర్సింహరెడ్డి, చకిలం యాదగిరిరావు, నల్ల ప్రతాపరెడ్డి, మరో ఆరుగురిని తీసుకెళ్ళి విపరీతంగా దెబ్బలు కొట్టారు. ఇంత జరిగినా ధాన్యాన్ని, పొలాన్ని స్వాధీనం చేసుకోలేక పోయాడు. పేరుమోసిన దేశ్‌ముఖ్, విసు నూరు రాంచంద్రారెడ్డిపై సాధించిన విజయంగా ప్రజలను ఉత్సాహ పరిచింది. ఈ ఘటనపై పాటలు పాడుకుంటు గ్రామాలలో ప్రచారం చేశారు. ''తన జీవితంలో ఎన్నడూ ఎరుగనంతటి ఘోర ఓటమి''గా జమీందారు భావించాడు.
దొడ్డి కొమరయ్య ఆత్మార్పణం : 1946 జులై 4
ఈ సంఘటనతో విసునూరు దేశ్‌ముఖ్ బాగా రెచ్చిపోయాడు. పోలీసుల సహాయంతో కడవెండి గ్రామానికి చెందిన నాయకులను హత్య చేయాలని పథకం వేశాడు. ఈ పథకంలో భాగంగా అనేక మంది ప్రజలపై కేసులు పెట్టాడు. వారిలో 15 మందిని అరెస్టు చేయించాడు. వారు తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. ఆ రోజుల్లో ఎంత నిర్భంధం ఉన్నా సరే, ప్రజలు సంఘం కార్యాలయానికి వచ్చేవారు. తమ కార్యక్రమాన్ని గూర్చి చర్చించుకొనే వారు. ఆ విధంగా సమావేశమై చర్చించు కొనటాన్ని అరికట్టేందుకు గాను, వారిపై కోర్టులలో కేసులు పెట్టి భయపెట్టేట్లయితే తన హత్యా పథకాలు, అమలు జరపవచ్చునని అతడు భావించాడు. పోలీసు అధికారులు, జమీందారుతోను, అతని గూండాలతోనూ, కలిసి మొత్తం పథకమంతా తయారు చేశారు. జమీందారు యధేచ్ఛగా వ్యవహరించటం కోసం వాళ్ళక్కడ నుండి వెళ్ళిపోయారు.
అది 1946 జూలై 4వ తేది. తప్ప తాగిన గూండాలు నాయకుల ఇండ్లపై రాళ్ళు విసిరారు. ప్రజలు లాఠీలు, వడిసెలలు, చేతబూని నినాదాలు చేసుకుంటూ ఊరేగింపు జరిపారు. ఆ ఊరేగింపు ప్రధాన వీధిలోనే వున్న జమీందారు ఇంటిదాపుకు వచ్చేసరికి, జమీందారు యింటి పక్కన ఒక పాకలో అప్పటికే సిద్ధంగా వున్న గూండాలు ఊరేగింపుపైకి కాల్పులు జరిపారు. ఊరేగింపుకు నాయకత్వం వహిస్తున్న గ్రామసంఘ నాయకుడు దొడ్డి కొమరయ్యకు తుపాకీతూటా పొట్టలో గుండా దూసుకుపోయింది. ఆయన అక్కడికక్కడే మతిచెందాడు. ఆయన అన్న దొడ్డి మల్లయ్య కాలికి తూటా తగిలి కిందపడి పోయాడు. మంగలి కొండయ్య నుదుటికి దెబ్బతగిలింది. అతని సోదరుడు నరసయ్య ముంజేతికి గాయమైంది.
అయినా ప్రజలు భయకంపితులై పారిపోలేదు. రక్తానికి రక్తం అని నినాదాలు చేసుకుంటూ వారు జమీందారు భవనాన్ని చుట్టుముట్టారు. జమీందారు భవనానికి పక్కనే పాకలో వున్న గూండాలు ఆది చూచి బయపడిపోయారు. ప్రజల కోపాగ్ని నుండి తప్పుకుని బతికి బయటపడటం సాధ్యం కాదని తలంచారు. జమీందారు భవనపు ఎత్తయిన గోడలు తమకు రక్షణ నివ్వగలనని భావించారు. జమీందారు భవనంలోకి దూకారు. అయితే ప్రజలప్పటికే ఆ భవనాన్ని చుట్టుముట్టారు. జమీందారు భవనానికి నిప్పంటించడం కోసం ఎండుగడ్డి మోపులతో ప్రజలు వచ్చి పడ్డారు. రెండు వేల మంది ప్రజలక్కడ చేరారు. కొంతమంది గడీని చుట్టుముట్టారు. మరికొంత మంది ఊరి వెలుపల కాపలా కాస్తున్నారు. ఇంకా కొందరు గ్రామ వీధులలో తిరుగుతున్నారు. ప్రజలు ఆగ్రహంతో అట్టుడికిపోతున్నారు.
ఈ వార్త విని, విసునూరు రామచంద్రారెడ్డి కొడుకు బాబూరావు (జగన్ మోహన్) విసునూరు నుండి, కత్తులు, బల్లేలు, పిస్తోళ్ళు చేతబూని 400 మంది గూండాలను తీసుకొచ్చాడు. గ్రామం వెలుపల కాపలా కాస్తున్న ప్రజలు వాళ్ళను చూసి ఆకాశం దద్దరిల్లేటట్లు నినాదాలు చేశారు. వడిసెలతో రువ్వుతూ మూకవుమ్మడిగా గూండాల మీదికి వెళ్ళారు. ఆగ్రహావేశపరులైన జన సామాన్యాన్ని చూచిన గూండాలు, తుపాకి కాల్పులు సహితం ప్రజల పురోగతిని ఆపజాలవని ఉహించారు. ప్రాణాలు దక్కితే చాలునని కాలికి బుద్ధి చెప్పి పారిపోయారు. ఊరు ప్రజలు వాళ్ళను మూడు మైళ్ళ దూరం తరిమి కొట్టారు. అనేక మంది గూండాలకు రాళ్ళదెబ్బలు తగిలాయి. వాళ్ళలో చాలామంది, పారిపోతూ మాదాపురం తండాలో దాక్కున్నారు. అయితే, అక్కడి ప్రజలు పరిస్థితిని గమనించి ఆ గూండాలను తరిమి వేశారు. పేరుమోసిన గూండా అనుముల రామిరెడ్డిని ఒకచోట పట్టుకున్నారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి, సి.యాదగిరిరావు తదితరుల నోళ్ళలో మూత్రం పోసిన వాళ్ళలో వాడూ వొకడని తెలిసిన ప్రజలు అతనిని చితకదన్ని పంపించారు. గూండాలు ఎక్కి వచ్చిన బండ్లను ముక్కలుముక్కలు చేశారు. జమీందారు మామిడి తోటలో ఒక్క చెట్టయినా మిగల కుండా నరికేశారు.
సరిగ్గా అదే సమయంలో 60 మంది రిజర్వు పోలీసులు ఆ గ్రామానికి వచ్చారు. గూండాలపై తాము చర్య తీసుకుంటామని ప్రజలకు చెప్పి, అక్కడి నుండి వెళ్ళిపొమ్మన్నారు. ప్రజలక్కడి నుండి చెదిరిపోయిన తర్వాత గూండాలకు సురక్షితంగా జమీందారుకు అప్పగించారు. ఇదంతా జరిగిన తర్వాత సంఘ నాయకులపై ఆరు కేసులు పెట్టారు. గూండాలపై దాడి చేశారని, గడీని చుట్టుముట్టారని, దానికి నిప్పంటించటానికి ప్రయత్నించారని ఆరోపణ చేశారు. గూండాలలో ఎవరినీ అరెస్టు చేయలేదు. వాళ్ళ మీద ఏ కేసూ పెట్టలేదు. అయినా ప్రజలు చలించలేదు. దొడ్డి కొమరయ్య మతదేహానికి, శవపరీక్షానంతరం వేలాది ప్రజలు ఆ గ్రామాలన్నింటా పెద్ద వూరేగింపుతో అంత్యక్రియలు జరిపారు. పరిసర గ్రామాల ప్రజలు కూడా ఆ వూరేగింపులో పాల్గొన్నారు. జమీందారు ఎదుట తాము తలవంచేది లేదని, సంఘం కోసం తామంతా ఇనుమడించిన శక్తితో పనిచేస్తామని వారంతా ప్రతినబూనారు. ఆ తర్వాత మూడు నెలల కాలంలో వారు, జమీందారు మనుషులను పొలాలలోకి రానివ్వలేదు. పనిచేయ నివ్వలేదు. ఈ సంఘటన అనంతరం అమర వీరుని శ్లాఘించే పాటలు పాడుకుంటున్నారు.
దేశ్‌ముఖ్ రాంచంద్రారెడ్డి కొడుకు బాపురెడ్డి హైదరాబాదు పారిపోతుండగా జనగామ రైల్వేస్టేషన్లో చంపివేశారు. ప్రజల ప్రతిఘటన 300-400 గ్రామాలకు వ్యాపించింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో ప్రదర్శనలు జరిగాయి. కమ్యూనిస్టు పార్టీ పత్రిక విస్తృత ప్రచారం చేసింది. పోలీసులు 156 కేసులు నమోదు చేశారు. జనగామ, సూర్యాపేట, దేవరుప్పల, హుజూర్ నగర్లలో మిలట్రీ దాడులు కొనసాగాయి. జిల్లాను మిలట్రీపరం చేశారు. వారాలు, నెలల తరబడి ఈ దాడులు సాగాయి. రాజాకార్లు, పోలీసులు ఇండ్లు లూటీలు చేశారు. వీరి దౌర్జన్యాలను తిప్పి కొట్టడానికి రైతులు, ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. 1946 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలుపు ఇవ్వబడింది. వర్గ పోరాటం ప్రారంభమైంది. అన్ని కులాల వారు, మతాల వారు సంఘం నాయకత్వాన ఏకమై పోరాడారు. తమ మధ్యనున్న కుల వివక్షతలు, మత వివక్షతలు పక్కనబెట్టారు. పోరాటంలో అంటరానితనం మహిళలు, పురుషులూ అన్న బేధభావం లేదు. అన్ని వర్గాల నుంచీ బాలురు, బాలికలు పాల్గొన్నారు. దానితో గెరిల్లా దళాలు ఏర్పడ్డాయి. సంఘం నాయకత్వాన గ్రామాలలో కమిటీలు, శాఖలు ఏర్పడ్డాయి. ఎక్కడికక్కడ తిరుగుబాట్లు ప్రారంభమయినాయి. దీంతో దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు పట్టణాలకు పారిపోయినారు. కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లా పోరాటానికి కీలక కేంద్రంగా తయారైంది. కరీంనగర్‌లోని భూస్వాములంతా ప్రాణభయంతో హైదరాబాదు బాట పట్టారు. భూస్వాముల భూములను పేదలు ఆక్రమించారు.
కొమరయ్య మరణం, అమరత్వం తెలంగాణా రైతాంగంలో నిద్రాణమై వున్న అగ్రహాన్ని ప్రజ్వరిల్లజేసింది. నల్గొండ జిల్లాలోని అన్ని తాలూకాలలో ప్రజలు ఒక్కుమ్మడిగా విజంభించారు. జిల్లా అంతటా జరిగే అన్ని సభలలోనూ, ప్రదర్శనలలోనూ, ఈ అమరవీరునికి జోహార్లర్పించే పాటలు పాడారు. కర్రలు, వొడిసెలను దరించి ప్రజలు ఒక గ్రామానికి జెందినవారు మరొక గ్రామానికి వెళ్ళి వస్తూ వుత్తేజం కలుగజేసేవారు. వారు ఉమ్మడిగా భూస్వామి గడిముందు బహిరంగ సభలు చేసేవారు. ఎర్రజెండాను ఆవిష్కరించేవారు. ''ఇక్కడ సంఘం ఏర్పాటు చేయబడింది. వెట్టి, అక్రమ నిర్బంధ వసూళ్ళు, బేదకళ్ళు ఇంకెంతమాత్రం సాగవు'' అని ప్రకటించారు. భూస్వామి గాని, దేశ్‌ముఖ్ గానీ సంఘం ఈ ఉత్తర్వులను అమలు జరపకపోతే అతనిని సాంఘీక బహిష్కారానికి గురిచేసేవారు. అతని పొలాలలో ఎవరూ పనిచేయటానికి వీలులేదు. క్షుర కర్మకారులుగానీ, రజకులుగాని ఇంటిపని వాళ్ళు గాని, ఇతర పనివాళ్ళుగాని ఎవరూ వారికి ఏ పని చేయటానికి వీలులేదు.
ఈ వూరేగింపులు, జమీందార్ల ఇండ్ల ముందు నిలిపి, ''జమీందారీ విధానం రద్దుకావాలి,'' ''భూస్వాముల పీడనకు, పోలీసు జులుముకు స్వస్తిజెప్పాలి,'' ''నిర్బంధ ధాన్య సేకరణను, వెట్టిని, అవినీతిని అంతంజేయాలి'', ''అమరజీవి దొడ్డి కొమరయ్య జిందాబాద్'' మొదలగు నినాదాలు చేసేవారు. తమ చేతుల్లోని గుత్ప కర్రలన్నింటిని ఒక్కుమ్మడిగా నేలపై కొట్టి పెద్ద శబ్దం చేసేవారు. ఆ శబ్దం యావత్తు గ్రామాన్ని దద్దరిల్ల జేసేవి. ప్రజాద్రోహుల గుండెల్లో కంపరమొత్తించింది. ''గూటు పాల సంఘం'' అని వాళ్ళు పిలుస్తుండే సంఘ వివాదాలు వినపడగానే, ఈ ప్రజా ద్రోహులు తలుపులు మూసుకొని, లోపల కూర్చొని తాళాలు పెట్టుకునేవారు. ఈ వూరేగింపులలో గల ప్రత్యేక లక్షణాలలో వొకటి ఏమిటంటే, ''పురుషులతో పాటు స్త్రీలు కూడా తమ గ్రామాలలోనే గాక, ఇతర గ్రామాలో పాల్గొనటం'' జరిగింది. చాకలి ఐలమ్మ భూమి పోరాటంపై రాసిన పాటలు మహిళలను అత్యంతంగా ఆకర్షించాయి. మొట్ట మొదటిసారి భూమి, బేదఖళ్ళు, వెట్టి, నిర్బంధ ధాన్య సేకరణవంటి జీవిత సమస్యలను జమీందారీ రద్దు నినాదాన్ని జోడించటం జరిగింది. ఈ దశలో ప్రధానమైన అంశమిది.
ఈ గ్రామోద్యమ వెల్లువలో ప్రభుత్వం లెవీ ధాన్యం సేకరించలేక పోయింది. లెవీ ధాన్యం వసూలు చేస్తుండే అధికారులను గ్రామంలో అడుగయినా పెట్టనివ్వటం లేదు. అదేవిధంగా వెెట్టికూడా దానంతటదే అంతమయింది. వెట్టి చేయించుకుంటూ వచ్చిన దేశముఖ్‌లు, గ్రామాధికారులు, గ్రామాలు వదలి వెళ్ళిపోవలసి వచ్చింది. వాళ్ళు ఊళ్ళోనే వున్నా తలెత్తుకు తిరగలేకపోయేవాళ్ళు. కొలది వారాలలోనే ఈ ఉద్యమం నల్గొండ జిల్లాలోను, పొరుగునే వున్న వరంగల్లు (ఖమ్మం) జిల్లాలో మూడు నాలుగు వందల గ్రామాలకు వ్యాప్తి గాంచింది.
- సారంపల్లి మల్లారెడ్డి, 9490098666