Authorization
Mon Jan 19, 2015 06:51 pm
15 ఆగష్టు 1947 - 13 సెప్టెంబర్ 1948 వరకు తెలంగాణ సాయుధ పోరాటం ప్రకటన తరువాత పోలీసుల బీభత్సకాండ కొనసాగింది. అరెస్టులు, గ్రామాలపై సాయుధ పోలీసులు దాడులు ప్రారంభమయ్యాయి. అదే సందర్భంలో ప్రజల ప్రతిఘటన కూడా పెరిగింది. దళాల నిర్మాణం-శిక్షణ జరపడం- తూపాకులు తక్కువ వినియోగం - కర్రలు, కత్తులు, వడిసెలు, కొడవండ్లు ఆత్మరక్షణ చేసుకోవడంతో పాటు పోలీసులపై, జమీందారి గూండాలపై, రజాకారు ముష్కరులపై ఎలా దాడులు చేయాలో నేర్పారు. ఈ దాడులలో ముఖ్యంగా గెరిల్లా పద్ధతులను నేర్పారు. సూర్యాపేట, పాత సూర్యాపేట మరికొన్ని గ్రామాలలో 144వ సెక్షన్లు పెట్టారు. నల్లా నర్సింహులు, మోహన్‌రెడ్డి, మంగలి కొండయ్య, లింగయ్యలను పట్టుకోవడానికి పోలీసులు వెతుకులాట పెట్టారు. అనతికాలంలోనే ఉద్యమం నైజాం అంతట వ్యాపించింది. ప్రతిదాడులు జరిగాయి. జనగాం, దెవరుప్పుల, హుజూర్నగర్, మల్లారెడ్డినగర్ గ్రామాలలో దాడులు జరిగాయి, ప్రతి ఇంట్లో ప్రతీ స్త్రీ పోరాటానికి ప్రతిజ్ఞ చేసింది.
సామ్రాజ్యవాదుల నుండి భారత భూర్జువా వర్గానికి స్వాతంత్య్రం సిద్ధించినా నైజాం ప్రాంతానికి మాత్రం స్వాతంత్య్రం రాలేదు. నైజాంలో వున్న కాంగ్రెస్‌వారు పటేల్, పట్వారీలు రాజీనామా ఇవ్వాలని పిలుపిచ్చారు. భారత నైజాం ప్రాంతాల మధ్య కస్టమ్స్‌కు విధి నిషేధాలు రద్దు చేయాలని తాటి, ఈత చెట్లను నరికి వేయాలని పిలుపునిచ్చారు. గీత కార్మికులు నష్టపోతారని కమ్యూనిస్టు పార్టీ చెట్ల నరికివేతలను నిలుపుదల చేసింది. పన్నులు చెల్లించవద్దంటూ పార్టీ పిలుపునిచ్చింది.
వ్యవసాయ కార్యక్రమం
- అన్ని రకాల నిర్బంధ చాకిరి నిర్బంధ వసూళ్ళకు స్వస్తి చెప్పాలి.
- నిర్బంధ లెవీ ధాన్యం చెల్లింపులు రద్దు చేయాలి.
- కౌలుదారులకు హక్కులు, కౌలు తగ్గింపు, కౌలు చెల్లించకుండా భూముల అక్రమణ చేయాలి.
- బడా భూస్వాముల ప్రభుత్వ బంజర్ల అక్రమణను బయటికి తీయాలి.
- దుర్మార్గ భూస్వాముల వద్ద గల ధాన్యాన్ని స్వాదీనం చేసుకొని పేదలకు పంచాలి.
- పటేల్, పట్వారీల రికార్డులు, వడ్డీ వ్యాపారుల రికార్డులు దగ్ధం చేయాలి.
- భూస్వాముల మిగులు భూములు ఆక్రమించాలి. 500 ఎకరాల సీలింగ్‌ను 100 ఎకరాలకు తగ్గించాలి. దీనితో గూటుపాల సంఘం మళ్ళీ కదిలిందని ఉత్సాహపడ్డారు. కాంగ్రెస్- సిపిఐ - ఆంధ్ర మహాసభకు చెందిన దళాలన్నీ ఆయుధాలు సమకూర్చుకున్నాయి. నైజాం పాలన పునాదులన్నీ కదిలాయి. నైజాం బీభత్స కాండకు పూనుకున్నారు. కాశీం రజ్వీ నాయకత్వానా దళాలు ఏర్పాటు చేసి నైజాం సైన్యానికి అండగా నిలిపాడు. లూటీలు, గృహ దహనాలు, హత్యలు, మానబంగాలు విచ్చలవిడిగా సాగాయి. ఈ నిర్బంధం వలన ధనికులు భూస్వాములు భారత భూభాగాంలోకి వెళ్ళిపోయారు. ఫ్యూడల్ వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక వర్గ పోరాటం ఉపందుకుంది. పార్టీ దళాలు చాలా వరకు కాంగ్రెస్ దళాలను నిరాయుధం చేయాల్సి వచ్చింది. నిజాయితీపరులు పార్టీలోకి వచ్చారు. భారత ప్రభుత్వం నైజాంతో గుట్టుచప్పుడు కాకుండా ఒప్పందం చేసుకొని మందుగుండు సరఫరా చేసినట్లు చాలా సాక్ష్యాలు ఉన్నాయి.
10 వేల సభ్యులతో కూడిన గ్రామ దళాలు, 2000 మందితో గెరిల్లా దళాలు ఏర్పాటు చేశారు. 10, 15 గ్రామాలకు చెందిన వేలాదిమంది జాతీయ జెండాలు, ఎర్ర జెండాలు ఎగురవేస్తు గ్రామాల యాత్రలు చేశారు. హుజూర్నగర్, సూర్యా పేట, తుంగతుర్తి, వంగపల్లి స్టేషన్లపై దాడి చేశారు. రజాకార్ దళాలు ఃఅజాద్ హైదరాబాద్ః నినాదంతో ప్రచారం చేశారు. పార్టీ 1. గ్రామ దళాలు 2. నిర్మూలన దళాలు 3 గెరిల్లా దళాలు ఏర్పాటు చేయగా వేల మంది చేరారు. రావులపెంట క్యాంపు, ఎరబాడు క్యాంపుపై దాడులు చేశారు. పోలీసులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోటపాడు, ఊదరబాంబు దాడి రజాకార్లను అడలుకొట్టింది. మామిళ్ళగూడెం కాంపు, బిక్కుమల్ల, మామిడితోట, చిన్న నెమలి, పేద్ద నెమలి, చిట కోడూరు, పులిగిల్ల, అడ్డగూడూరు, జనగాం, కొండూరు, పాత భూవనగిరి, ఎర్రబెల్లి, వరంగల్, కొత్త కోండా, బైరాన్‌పల్లి, వర్థన్నపేటలలోని పోలీస్ క్యాంపులపై దాడులు చేశారు. ఖమ్మం, మధిర, కొత్తగూడెం, పాల్వంచలలో భూమి-ధాన్యం పేదలకు పంచారు. మానుకోట, కోదాడ, కల్లూరు అడువులలోనూ దళాలు కేంద్రీకరించి దాడులు చేశాయి. కరీంనగర్ అమరజీవి ప్రభాకర్‌రావు (పోలంపల్లి గ్రామం), రేణిగుంట రాంరెడ్డి, గోపాల్‌రెడ్డి, బోగ్గుగని నాయకులు శేషగిరి రావు, యాదగిరి ఉద్యమంలో ప్రాణాలు కోల్పొయారు. నైజాం ప్రాతంలోని 3వ వంతు భూ భాగంలో 3 వేల గ్రామాలకు ఉద్యమం విస్తరించింది. దున్నేవారికే భూమి, బంజారు భూముల పంపిణీతో 10 లక్షల ఎకరాల భూమిని అక్రమించారు. ఆనాటి పార్టీ కార్యదర్శి అజరుకుమార్ గ్రామ కమిటీల నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో తాకట్టు భూముల విడుదల, పశువుల పంపిణీ, రుణ పత్రాల రద్దు, వ్యవసాయ కార్మికుల వేతనాల పెంపు, పన్ను వసూళ్ళ రద్దు సాధించారు. స్త్రీలకు సమాన హక్కులు, అంటరానితనం నిర్మూలన, సాంస్కృతిక పురోగమనం, పట్టణాలతో వర్తకం చేపట్టారు.
ఈ కాలంలో జరిగిన పోరాటాలో చారిత్రాత్మక పోరాటం బైరాన్‌పల్లి పోరాటం.
తెలంగాణ సాయుధ పోరాటంలో కలికితురాయి
భైరాన్‌పల్లి పోరాటం
(73 సంవత్సరాల క్రితం అనగా 04-09-1948 సంవత్సరంలో జరిగిన బైరాన్‌పల్లి పోరాటం భారత చరిత్రలోనే గణుతికి ఎక్కింది. ఆ పోరాట స్ఫూర్తితో నేడు జరుగుతున్న ఉద్యమాలలో రైతులు, ప్రజలు ఐక్యంగా కదలాలి).
బైరాన్‌పల్లి ప్రజాపోరాటం తెలంగాణా ప్రజాపోరాట చరిత్రలోనే అత్యున్నత స్థాయికి చెందినది. ఆ గ్రామంలో ప్రతి పురుషుడు, స్త్రీ, యువకుడు, వద్ధుడు ఈ పోరాటంలో పాల్గొన్నారు. శత్రువుపై అడుగడుగునా పోరాటం సాగించారు. ఆ గ్రామమే ఒక భయంకర యుద్ధరంగంగా మారింది. ఈ గ్రామంలో ఎత్తయిన బురుజొకటుంది. ఇది చాలా పురాతనమైనప్పటికీ కోటవలె చాలా బలంగా వుండి, దానికి మెట్లు లోపలివైపునే వున్నాయి. ఈ బురుజు పై నుండి గ్రామం నలువైపులా చాలా దూరం వరకు పరికించి చూడవచ్చు. ఆ బురుజు పైన ఒక పెద్ద రణభేరి, ఒక పెద్ద దేశవాళి తుపాకి, ఒక కరబ్బీ అమర్చబడి వున్నాయి. తుపాకి మందుతో నింపిన గోనె సంచులు, సీసపుగుండ్లు కూడా అక్కడ నిలవచేయబడి వున్నాయి. ఆ బురుజు పైన ఒక దళం ఎల్లప్పుడూ వుంటూ వుండేది. వారి వద్ద తగినన్ని తుపాకులు, ఇతర ఆయుధాలు, మందు గుండు సామగ్రి వున్నాయి. శత్రువుగనుక బురుజును సమీపించ గలిగినట్లయితే వాళ్ళు పైకెక్కకుండా కింద పడవేయడం కోసర దళం వద్ద ఈటెలు, కర్రలు, రాళ్ళు, వడిసెలలు, మరుగుతున్న నీళ్ళు సిద్ధంగా వుండేవి. వారు గ్రామానికి అన్ని వైపులా సెంట్రీలను ఏర్పాటు చేశారు. ప్రతిరోడ్డుమీద ఒక దళం ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా వుండేది. ఏ క్షణంలోనయినా శత్రువుతో పోరాడటానికి వారు సర్వసన్నద్ధంగా వుండేవారు. వాళ్ళకు సహాయపడటానికి, వాళ్ళను కట్టుదిట్టంగా నడపటానికి ఒక గెరిల్లా దళం అక్కడ వుండేది.
ఒకరోజున లద్దనూరు క్యాంపు నుండి సుమారు 60 మంది రజాకార్లు, పోలీసులు వచ్చి గ్రామంపై దాడిచేశారు. బురుజుపైనున్న వారు భేరీ మోగించారు. నాటు తుపాకిని, కరబ్బీని వుపయోగించి కాల్పులు జరిపారు. యుద్ధనినాదాలు చేశారు. శత్రువు దిమ్మరపోయి గ్రామానికి కొలది దూరంలోనే నిలిచిపోయాడు. ఈలోగా రెండు వందలమంది ప్రజలు వడిసెలలు, బర్మార్లు తీసుకొని శత్రువు మీదికి నడిచారు. కొంతసేపు ముఖాముఖి పోరాటం జరిగింది. అయితే ప్రజలధాటికాగలేక శత్రువు పారిపోయాడు. మరొకరోజున ఒక క్యాంపు నుండి సుమారు 70 మంది రజాకార్లు, పోలీసులు ఆ గ్రామంపై తిరిగి దాడిచేశారు. ప్రజలను ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో వచ్చారు. అయితే ఈసారి కూడా ప్రజలు సన్నద్ధంగా వుండి, వాళ్ళను ఎదుర్కొన్నారు. స్థానిక దళసభ్యుల్లో ఒకరు సింహంవలె శత్రువుపైకి దుమికాడు. రజాకారు చేతిలో రైఫిల్ పట్టుకొని అతని పొట్టలో తన్నాడు. అయితే ఈ పోరాటంలో రైఫిల్ ప్రేలింది. ఆ కామ్రేడ్ కు దెబ్బతగిలింది. అయినా ఆయన రైఫిల్ వదలలేదు. ఈ పాటికే ప్రజల ఆగ్రహానికి తాళజాలక శత్రువు పారిపోనారంభించాడు. ఆ రజాకారు గూడా తన రైఫిల్ ని వదిలి పెట్టి పారిపోయాడు. దళానికి రైఫిల్ చిక్కింది. చికిత్సానంతరం ఆ కామ్రేడ్ కోలుకున్నాడు. పోరాటంలో తిరిగి పాల్గొనడొచ్చాడు. ఆ గ్రామంపై దాడిచేయాలని రజాకార్లు అనేక సార్లు ప్రయత్నించారు. పోరాడటానికి ప్రజలు సన్నద్ధంగా వుండటం చూసి వెనుదిరిగిపోయారు. తమ గ్రామాన్ని కాపాడుకోవాలని ఈ గ్రామ ప్రజలు ప్రదర్శించిన దఢదీక్ష ధూళిమిట్ట, ఆకునూరు, లింగాపురం, కూటిగల్లు మొదలైన గ్రామాలకు కూడా వ్యాప్తిగాంచింది. భేరీ మోగితే చాలు ఒకచోట చేరడానికి వారు అలవాటు పడ్డారు. శత్రువు వెళ్ళిపోయిన తరువాత వారు తిరిగి వచ్చేవారు. బలమైన శత్రువును ఎలా ఎదుర్కోవాలో, భూమిపై బోర్ల పండుకొని శత్రువు కాల్పులను ఎలా తప్పించుకోవాలో మున్నగు విషయాల్లో వారు సైనిక శిక్షణ పొందారు.
ఒకరోజున గెరిల్లా దళం గ్రామంలో వుంది. వారు వేరుశనగ కాయలు తింటున్నారు. ఉదయం 8 గంటల సమయంలో రెండు వందల మంది రజాకార్లు, పోలీసులు దాడి చేయడానికి వచ్చారు. గెరిల్లాలు బురుజు పైకి ఎక్కారు. బురుజు పైనుండి నాటు తుపాకితో, కరబ్బీతో, రైఫిల్‌తో కాల్పులు జరిపారు. ఈ కాల్పులు కొంతసేపు సాగాయి. అప్పుడు గెరిల్లాలకు కామ్రేడ్ రేణిగుంట రామిరెడ్డి పోరాటా నుభవం గుర్తుకు వచ్చింది. తాము దెబ్బగాచుకొనే స్థితిలోనే వుండేట్లయితే తమ వద్దగల తూటాలు అయిపోతాయని తాము శత్రువు చక్రబంధంలో యిరుక్కుపోతామని తలంచారు. అందువల్ల వారు బురుజు పైనుండి దిగివచ్చారు. గోడలను మాటు చేసుకొని, శత్రువుపై గురిచూసి కాల్పులు జరిపారు. ఒక యింటికి నిప్పంటిస్తున్న పోలీసు చచ్చి కిందపడ్డాడు. బురుజు పైనుండి, గోడల వెనుక నుండి కాల్పులు సాగుతూనే వున్నాయి. ఐదుగురు పోలీసులు మతిచెందారు. శత్రువును ఊపిరి సలుపుకోనివ్వలేదు. దాంతో తమ వాళ్ళ మతదేహాలను తీసుకొని శత్రువులు కాలికి బుద్ధి చెప్పారు.
కొలది రోజుల తరువాత శత్రువు మరింత పెద్దఎత్తున దాడికి వస్తున్నట్లు కబురందింది. ప్రజలూ దళమూ అంతా సిద్ధం ఉన్నారు. ఒకరోజు వేకువనే 500 మంది రజాకార్లు, పోలీసులు గ్రామాన్ని ముట్టడించారు. బురుజు పైనుండి గోడల మాటున శత్రువు వెనుక భాగాన్నుండి, గ్రామం వెలుపలి నుండి శత్రువుపై కాల్పులు జరిపారు. బురుజు పైనున్న వారిని, గురిజూచి కాల్చాలని ఒక పోలీసు చెట్టెక్కాడు. ప్రజల రైఫిల్ తూటా దెబ్బ తగిలి అక్కడ నుండి కిందపడాడు. శత్రువులు అతని శవాన్నయినా తీసుకుపోలేక పోయారు. శత్రుబలగంలోని మరో 9 మంది మరణించారు. వాళ్లు 9 మంది శవాలను మోసుకెళ్ళలేక ఊరిబయట నూతిలో పడవేసి పారిపోయారు. మరొకరోజు ఉదయం రెండు వందల మంది రజాకార్లు, పోలీసులు ఆ గ్రామంపై తిరిగి ముట్టడి చేశారు. అశ్వారూఢుడైన ఒక పోలీసు రైఫిల్ చేతబట్టుకొని చుట్టూ తిరుగుతున్నాడు. బురుజు పై నుండి మామూలు ప్రకారం భేరీ మ్రోగింది. కాల్పులు ప్రారంభమైనాయి. గెరిల్లా దళం గ్రామం వెలుపల మామిడితోటలో వుంది. వాళ్ళు పోలీసులకు కనిపించకుండా నేలపైనే పాకుతూ గుర్రం మీదవున్న పోలీసు వాడికి గురిబెట్టి కాల్చారు. అతడు చచ్చిపడ్డాడు. మరికొంత మంది మరణించిన తరువాత, యింకా కొందరు గాయపడిన తరువాత ఆ శవాలను, గాయపడిన వారిని పోగు చేసుకొని శత్రువు కాలికి బుద్ధి చెప్పాడు.
బైరాన్‌పల్లి, కూటిగల్లు, గ్రామాలపై దాడి చేయడం కోసం జనగామకు పెద్ద సైనిక బలగం దిగింది. గెరిల్లాలు గ్రామం విడిచి పోవాలని, ప్రజలు గూడా గ్రామాన్ని ఖాళీ చేయాలని ఒక ముఖ్యమైన కామ్రేడ్ ద్వారా పార్టీ నాయకులు కబురు పంపిం చారు. అయితే ఈ ఆదేశాలు అమలు జరగలేదు. ఉదయం 6 గంటలకల్లా, సైన్యం గ్రామాన్ని చుట్టుముట్టి కాల్పులు సాగించనారంభించింది. సైన్యంపైకి ప్రజలు కూడా కాల్పులు సాగించారు. అయితే సైనికుల కాల్పులు పోలీసుల కాల్పుల వంటివి కాదు. సైన్యం వద్ద ఫిరంగులు, బ్రెన్ గన్లు, మంటల బాంబులు తదితర అధునాతన ఆయుధాలు అనేకం వున్నాయి. గురిచూసి నిశితంగా కాల్పులు జరుపుతున్న ప్రజలచేతుల్లో కొందరు సైనికులు కూడా మతి చెందారు. అలా మతి చెందినవారిలో ఫిరంగులు పేలుస్తున్న సైనికులూ వున్నారు. సైన్యం తన దష్టిని గెరిల్లాల పైన కేంద్రీకరించింది. మంటల బాంబులు, ఫిరంగులు, బ్రెన్ గన్లు పేల్చింది. దళం ఇక అక్కడ తట్టుకొని నిలవజాలలేకపోయింది. శత్రువుల తుపాకి దెబ్బకు అందకుండా వుండేంత దూరం వెనుకడుగు వేశారు.
గ్రామంలో, బురుజుపైనున్న వారు నాటు తుపాకితో, క్రింది అంతస్తు నుండి కరబ్బీతో, శత్రువుపై కాల్పులు సాగిస్తూనే వున్నారు. గోడలను మాటు జేసుకుని ప్రజలు పోరాడుతూనే వున్నారు. ఈ పోరాటంలో ఒక మిలటరీ కెప్టెతో సహా 13 మంది మతిజెందటమో, గాయపడటమో జరిగింది. అయితే శత్రు ఫిరంగుల ముందు ప్రతిఘటన సన్నగిల్లజొచ్చింది. బురుజుపై అంతస్తుకు పెద్ద గండి కొట్టబడింది. పై అంతస్తు మీది నుండి నాటు తుపాకితో కాల్పులు జరుపుతున్న ముగ్గురు కామ్రేడ్స్ మోటం పోశాలు, మోటం రాములు (అన్నదమ్ములు), బలిజె నాగయ్య మతిచెందారు. మిగతా వారు కిందికి దిగివచ్చారు. ప్రజలలోను, స్థానికదళ సభ్యులలోనూ మరి కొంతమంది కూడా మతిచెందారు. శత్రువు చాలా శక్తివంతంగా వున్న విషయం, ఆధునాతన ఆయుధాలన్నింటినీ కలిగివున్న విషయం గుర్తించిన మీదట అనేక మంది ప్రజలు తప్పుకున్నారు. 80 మంది ప్రజలను నిర్బంధించి
కట్టివేసి మర తుపాకి తో కాల్చి చంపారు. వీరోచితంగా పోరా డిన కొందరు యువకులను నిర్దాక్షిణ్యంగా హింసలపాలుజేసి, ఆ తరువాత కాల్చి చంపారు.
మరునాటి ఉదయం పరిసరాల నుండి గెరిల్లా దళాలు ఆ గ్రామానికి వచ్చేసరికి అక్కడ 88 మతదేహాలు పడివున్నాయి. గెరిల్లాలు ప్రజలకు ధైర్యం జెప్పి ఓదార్చారు. మతవీరులకు అంత్యక్రియలు జరిపారు. ప్రజలంతా అంత్యక్రియల్లో పాల్గొని అమరవీరులకు జోహార్లర్పించారు. పోశాలు, రాములు తండ్రి ఇద్దరు కుమారులను కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగి ఈ హంతకుల పైనా, ప్రభుత్వంపైనా పగ సాధించవలసిందిగాను, అంతిమ విజయం లభించేంత వరకు పోరాడ వలసిందిగాను ఆ ప్రాంతీయ కమాండరుకు విజ్ఞప్తి చేశాడు.
మరొక రణరంగం-కూటిగల్లు
జనగామ తాలూకా కూటిగల్లు గ్రామంపై రజకార్లు, బైరాన్‌పల్లి గ్రామంమీద జరిపినట్లే అనేక మారులు దాడులు జరిపారు. అచటి ప్రజలు వాళ్ళపై జయప్రదంగా పోరాటం సాగించారు. బురుజుపై అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రజాకార్లను పోలీసులను తిప్పికొట్టారు. గెరిల్లా దళం కూడా వాళ్ళకు తోడ్పడుతోంది. ఆ గ్రామానికి చెంది అక్కడి నుండి వెళ్ళిపోయిన రజాకార్లు, పోలీసులు తమ పశువులను తోలుకొని పోవడానికి ఒకసారి ఆ అడుగు పెట్టనివ్వలేదు. ప్రజలు రణభేరి మోగించారు. ప్రజలు వాళ్ళను గ్రామంలో అడుగు పెట్టనివ్వలేదు. రజాకార్లు భయకంపితులై పారిపోయారు. పారిపోతుండగా తమకు కనిపించిన ఒక గ్రామస్థునిపై దాడిచేశారు. ఆయనకు ఆగ్రహం వచ్చి తన చేతిలో వున్న గొడ్డలితో యిద్దరు రజాకార్లను చావకొట్టారు. మిగతా వాళ్ళంతా ఆయన పైబడి కనుగుడ్లు తోడారు. ఆ తరువాత గొడ్డలితో ఆయనను ముక్కలు ముక్కలుగా నరికారు. అప్పటినుండి కర్రగాని, గొడ్డలిగాని చేతిలోవున్న వాళ్ళను చూస్తే రజాకార్లు భయపడుతుండేవారు. వాళ్ళజోలికి పోయేవాళ్ళు కాదు. చాలా మంది పోలీసులు, రజాకార్లు వచ్చారు. గెరిల్లాదళం గ్రామంలోనే వుంది. భేరీ మోగించారు. ప్రజలు సన్నద్ధమయ్యారు. శత్రువును గ్రామానికి చేరకుండా దూరంలోనే నిలవేశారు. తాటి చెట్లమాటున, పొలాలలోని వాముల మాటున వుండి కాల్పులు సాగించారు. ఉభయపక్షాల మధ్య కాల్పులు కొన్ని గంటల పాటు సాగాయి. ప్రజలు, గెరిల్లాలు శత్రువును మూడువైపుల నుండి ఎదుర్కొన్నారు. ప్రజల ధాటికి ఆగలేక రజాకార్లు, పోలీసులు పారిపోయారు. ప్రజలు, గెరిల్లాలు వాళ్ళను మద్దూరు క్యాంపుకు అరమైలు దూరానగల గుగ్గిల్లాపురం దాకా వెంటబడి తరిమి వచ్చారు.
బైరాన్‌పల్లిలో పోరాటం జరిగిన రోజునే సుమారు 200 మంది సైనికులు ఈ గ్రామంపైన కూడా దాడిచేశారు. ఇక్కడ కూడా కొంతమంది ప్రజలు దేశ్‌ముఖ్ మాటలు నమ్మారు. తప్పుకుపోవడానికి మారుగా గ్రామంలోనే వుండిపోయారు. పోరాడేదళం బురుజు పైనుండి క్రిందికి దిగి వచ్చింది. కొంతమంది ప్రజలు గ్రామంలోనే చంపబడ్డారు. మరికొంత మందిని వూరి బయట మర్రిచెట్టు కిందకి తీసుకెళ్ళి కాల్చి చంపారు. చేతుల్లో తుపాకులు బట్టి పోరాడుతుండగాని, సైనికులచే నిర్బంధించబడిన తర్వాతగాని ఈ పోరాటంలో మొత్తం యిరవైమంది ప్రజలు మతిచెందారు. బురుజు మీద మతి చెందిన వారిలో సిద్ధిపేట తాలూకా ఘణపురానికి చెందిన కామ్రేడ్ యెంబయ్య ఒకరు. ఆయన తన గ్రామంలో దేశముఖులకు వ్యతిరేకంగా పోరాడాడు. ఈ దేశముఖుకు చెందిన ముప్పై పశువులను కూటిగల్లుకు తోలాడు. ఆ పనిజేస్తుండగా, ఆయన వీరోచితంగా పోరాడి మతిజెందాడు. గెరిల్లాదళం అక్కడికి వెళ్ళేసరికి, ఆ ప్రాంతమంతటా మతదేహాలు చిందరవందరగా పడివున్నాయి. కాస్త శ్వాస ఆడుతున్న కామ్రేడ్‌ను గెరిల్లాలు చేతుల్లోకి తీసుకున్నారు. ఆ కామ్రేడ్ వారిచేతుల్లోనే అసువులు బాశాడు. ఈ రెండు గ్రామాలపై మిలిటరీదాడుల అనంతరం రజాకార్లు, పోలీసులు ఆ గ్రామాలను లూటీ చేయడానికి మరలావచ్చారు. తమను ప్రతిఘటించే వాళ్ళెవరూ బ్రతికివుండరని వాళ్ళనుకున్నారు. నాలుగువందల మంది రజాకార్లు, పోలీసులు బైరాన్‌పల్లిలో ప్రవేశించి ఇళ్ళను లూటీ చేసి, ఇళ్ళకు నిప్పంటించటం ప్రారంభించారు. వాళ్ళు బురుజు పై కెక్కారు. గడ్డపలుగులతో దాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడికి కొలది దూరంలోనే సమావేశం జరుపుకుంటున్న దళం ఈ వార్త విని వెంటనే అక్కడికొచ్చి దాడి చేసింది. బురుజు పైనున్న వాళ్ళిద్దరూ కిందపడి మరణించారు. శత్రువులు తమవాళ్ళ మతదేహాలను మాత్రమే తీసుకోగలిగారు. తమ బండ్లను, తాము కొల్లగొట్టిన వాటిని అక్కడే వదిలేసి ప్రజలమీద కాల్పులు జరుపుకొంటూ పారిపోయారు.
300 మంది రజాకార్లు, పోలీసులు కూటిగల్లు గ్రామాన్ని కూడా చుట్టుముట్టారు. ఇళ్ళకు, గడ్డి వాములకు నిప్పుపెట్టారు. గ్రామానికి వెలుపల వున్న గెరిల్లాలు చెట్లను మాటుచేసుకుని శత్రువుపై కాల్పులు జరిపారు. శత్రుబలగంలోనూ ముగ్గురు మరణించారు. సరిగ్గా అదే సమయంలో అంతకు ముందొక దాడి సందర్భంగా గడ్డివామిలో పెట్టబడిన తూటా పెద్ద శబ్దంతో పేలింది. ఈ సంఘటన అనంతరం ''పోలీసుచర్య'' జరిగేంతవరకూ రజాకార్లుగాని పోలీసులుగాని ఆ గ్రామంపై దాడి చేయలేదు.
ఈ విధంగా 1948 సెప్టెంబర్ 13 నాటికి ప్రజలు గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసుకొని తమ పాలనను తామే కొనసాగించారు. ఎవరికి పన్నులు చెల్లించలేదు. ఈ పరిస్థితిని గమనించిన భారత ప్రభుత్వం, నైజాంలోని కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణచలేదని ఈ నిర్ణయానికి వచ్చి తన సైన్యాలను నైజాంలోకి దించింది.
సైన్యాలు వచ్చిన అనంతరం పోరాట పరిస్థితిలో మార్పులు వచ్చాయి.
- సారంపల్లి మల్లారెడ్డి, 9490098666