Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆఫీసు నుంచి టంచన్‌గా ఆరింటింకి రావాల్సిన భర్త యింకా రాలేదేమిటి అని మెయిన్ గేటు వైపు చూస్తూనే తన పనులు చేసుకుంటున్నది. చీకటి పడుతూ వుండగానే గూళ్ళకు చేరే పక్షుల్లా ఇక ఇంట్లో వాళ్లంతా వచ్చేస్తారు. రాత్రికి ఏం వండాలా అని కూడా ఆలోచిస్తున్నది సునంద.
మిగతా వాళ్ళంతా వచ్చేశారు. గడియారం ఎనిమిది గంటలు కొట్టి ఊరుకుండి. ఏమిటీయన. యింకా రాలేదు అనుకుంటూ మెట్ట దాకా వచ్చి నిలబడ్డది. ఎంతో మంచిదీ, అమాయకపుదీ అయిన ఓ భార్య. ఎనిమిది దాటాక కారు లోపలికి దూసుకు వచ్చింది గేటులో నుంచి.
హమ్మయ్య వచ్చేశారు అనుకుంటూ కళ్లు వెడల్పు చేసుకుంది సునంద. కారు దిగాడు నందకిషోర్. వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళబోయిన ఆమె వెడల్పాటి కళ్ళకి కనపడ్డది మరో మనిషి. ఎవరా మనిషి! ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయింది. కారు దిగిన ఆమెను చేయిపట్టుకు నడిపిస్తూ తీసుకువచ్చాడు నందు. ఎవరీమె? అంది సునంద ఇక ఆపుకోకుండా.
'చెప్తాను కదా ముందు లోపలికి రానీ' అంటూ ఆమెను తోసుకుంటూ లోపలికి నడిచాడు నందు. హాల్లో ఆ వెంట వచ్చిన ఆమెతో నిలబడి అందర్నీ కేకేశాడు.
ఇద్దరు కొడుకులూ, కోడలూ, తల్లీతండ్రీ హాల్లోకి వచ్చి విస్తుపోతూ నిలబడ్డారు కొత్త ఆవిడని చూస్తూ. సునందని కూడా రానిచ్చి అప్పుడు చెప్పాడు నందు.
'ఈవిడ పేరు శిరీష. కంపనీలో నా కొలీగ్. మేం ఇద్దరం ప్రేమించుకున్నాం. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం' అన్నాడు నందు.
అగ్పిపర్వతాలు బద్దలవలేదు. భూమి కంపించలేదు. సముద్రం ఎగిరెగిరి పడలేదు. ఇంటి గోడలు బీటలు వారలేదు.
'అవునా ఈవిడేనా మీరు చెప్పిన ఆవిడ' అన్నది సునంద, శిరీష వైపు ఆసక్తిగా చూస్తూ.
'అవును' అన్నాడు నందు.
'మీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా! ఆల్ దిబెస్ట్ అండీ!' అన్నది సునంద.
మంచి పని చేశావురా నందు. నీకిష్టమైన మనిషిని తెచ్చుకున్నావ్ అంటూ శిరీష చేయి పట్టుకుంది తల్లి ఆప్యాయత ఒలకబోస్తూ.
'డాడీ! మీకేది నచ్చితే అదే చేయండి. ఒకరికోసం ఆలోచించవద్దు. మీకు పూర్తి స్వేచ్ఛ హక్కు ఉన్నాయి' అన్నాడు పెద్ద కొడుకు.
'అవును మామయ్యా! యు ఆర్ గ్రేట్' అన్నది కోడలు మందంగా హాసం చేస్తూ. మరో కొడుకు 'సర్ప్రైజ్లివ్వడం డాడీకి అలవాటే' అని మెచ్చుకున్నాడు.
నందు తండ్రి మాత్రం 'సునందకు విడాకులివ్వాలి కదరా' అన్నాడు సాలోచనగా.
'వచ్చేస్తయి నాన్నా! ఆలోపు శిరీష మన ఇంటి పరిస్థితులు అర్థం చేసుకుంటుందని తీసుకొచ్చేశా' అన్నాడు నందు.
'మంచి పని చేశావురా' అంది తల్లి కొడుకు చేసిన ఘనకార్యాన్ని మెచ్చుకుంటూ.
'ఏమండీ విడాకులు త్వరగా వచ్చేట్టు చూడండి. మీ ఇద్దరి పెళ్ళీ చూసి అడ్డు తప్పుకుంటాను' అంది సునంద చెరగని చిరునవ్వుతో.
'వచ్చేస్తయిలే' అన్నాడు నందు శిరీష వైపు కొంటెగా చూస్తూ.
ఇన్నాళ్ళకు మీకు తగిన భార్యని తెచ్చుకున్నారు. మీ సేవ చేసే భాగ్యం నాకు లేకుండా పోయింది. ఏం చేస్తాం. బయటే విషయం చెప్పి వుంటే హారతి తిప్పి దిష్టి తీసి ఉండే దాన్ని . పోనీలెండి. మీ పెళ్ళయ్యాక ఆ పని చేస్తాను. మీరు వెళ్ళి గదిలో కబుర్లు చెప్పుకుంటూ ఉండండి. నేను మీ కోసం పాయసం చేసి తీసుకు వస్తా' అంది సునంద.
ఇంట్లో వాళ్ళంతా చప్పట్లు చరిచారు. ఇక నుంచి ఈ ఇల్లు నాది అంది శిరీష. ఇంటిని కలయచూస్తూ.
'ఇప్పటికి వీళ్ళంతా నాన వాళ్లు. ఒక్క సునంద తప్ప. ఇప్పట్నించీ వీళ్ళంతా నీ వాళ్ళు' అన్నాడు నందు.
'కాదు మనవాళ్ళు అనండి' అని సునంద నందూ కోసం ఏమైనా చెయ్యడానికి ఎప్పుడైనా రడీగా ఉండే సునంద. నందూ సుఖం మాత్రమే కోరుకునే మంచిదీ అమాయకపుదీ అయిన సునంద. సునందే కాదు, ఆ ఇంట్లో వాళ్ళంతా ఎంతో మంచోళ్ళు. నందూ సుఖమే కోరుకునే వాళ్ళు.
భార్య ఉండగానే మరొక మహిళను ఇంట్లోకి తెచ్చుకోవడం ఏమిటి? విడాకులివ్వకుండానే మళ్ళీ పెళ్ళిళ్ళేమిటీ? ఈ ట్రయాంగిల్ ఫిట్టింగులేమిటి? చట్టం అనేది ఓటి ఉందని తెలీదా అని వాపోతున్నారా?
అయితే టీవీ ఛానళ్ళలో తెలుగు సీరియళ్ళు సీరియస్‌గా చూసి మీరు పరవశించడం లేదన్నమాట?!
- చింతపట్ల సుదర్శన్, 9299809212