Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వసంతంలో ఏది పుట్టినా చాలా అందంగా ఉంటుంది. వెన్నెల సత్యం ఏది రాసినా బాగుంటుంది. కాలాన్ని కవిత్వంగా మార్చి తన శైలీ కలంతో సాహితీ లోకపు ముఖచిత్రంపై చెరగని సంతకం పెడుతున్న కవి వెన్నెల సత్యం. ఈయన ప్రయత్నించని కవితా లేదు. ప్రక్రియ ఏదైనా ఈయనదైన ముద్ర బలంగా వేసుకొనే కవి సత్యం.
సాహితీకారుడిగా సత్యం ప్రస్థానం మొదలైనప్పటి నుంచీ విభిన్న రూపాల కవిత్వం పుట్టుకొచ్చింది. ''నేను ఎన్నో నానీలను చూసాను, సత్యం నానీలు ప్రత్యేకమైనవి'' ఈమాట ఆన్నది నానీల నాన్న ఎన్.గోపి గారు. కవికి ఇంతకన్నా గొప్ప అవార్డు ఉంటుందని నేననుకోను. 'నానీల వెన్నెల సంపుటికి అందిన అత్యుత్తమ పురస్కారం అది. అదే దారిలో.. నానీలలో తన ప్రేమను నింపి ప్రేమ నానీలని మనకందించాడు. చదువరుల ప్రేమని కూడా పొందాడు. ఇంకొంచెం ముందుకెళ్లి, సాహితీ దారానికి మణిపూసల్ని గుచ్చి 'వెన్నెల మణిపూసలు'తో విభిన్న సాహితీ రూపాన్ని విలక్షణంగా వెలువరించి అక్షర ప్రేమికుడయ్యాడు. వెంటనే తెలుగు పద్యభారతీ పరిమళాలతో వెన్నెలమ్మ శతకాన్ని సజించాడు. ఆ తరువాత ఎక్కడెక్కడివో తూనీగలన్నీ సేకరించిన పుప్పొడిని గుప్పిళ్ళతో సాహితీ లోకానికందించి కవితా సేవకుడు, సాహితీ సేద్యకుడుగా కీర్తి పొందాడు. ఇంకోసారి కవిత్వానికి రెక్కలు తొడిగి గగనసీమల్లో వెలుగాక్షర రథాలై నడిపించి, మెప్పించి వెన్నెల తొడిగిన రెక్కల్ని సష్టించాడు. అదే వేగంతో గడ్డిపూల నుంచి గంధాన్ని తీసి, పిల్లల మేధని పుస్తకాలకెక్కించి ఉత్తమ ఉపాధ్యాయుడయ్యాడు. అమ్మమీద కవిత్వం రాయని కవి ఉండడు, ఈ కవి నానీల సంపుటాన్నే వెలువరించాడు. 'అమ్మనానీలు' పేరుతో అమ్మపాదాలకి అంకితమిచ్చారు, ''మా అమ్మ / బీడీలు చుట్టేది, ఆ చేతులే /మా భవిష్యత్తుకు శ్రీకారం చుట్టాయి'' ఇది నాకిష్టమైన నానీ. నిన్ననే కవితా వనాన బ్రతుకుచెట్టె మొలిచాడు.
గజల్కి సహజంగా ఉండే సొగసుకి సత్యం ఆయనకే సొంతమైన నవ్యశైలీ మెరుపులద్దాడు, ఇప్పుడు గజల్ మెరుస్తుంది 'వాసంతిక'మై. సత్యం జనబాహుళ్యంలో నిలబడి, నాలుగు రోడ్ల కూడళ్లలో వుండి అందరికీ అర్ధమయ్యే కవిత్వం రాసే అసలైన కవి.
ఒకచోట భావకవికుడై మెరుస్తాడు.. యదలో వలపు రాగ దీపాల్ని వెలిగించమంటాడు, చిరునవ్వుల మకరందాన్ని కురిపించ మంటాడు, జడలో పరిమళించే సుమ మధువునవుతానంటాడు, పొడిబారిన కన్నుల్లో చిరుజల్లు నవుతానంటాడు. ఇంకా తాను ఏమవుతాడో చెప్తూ.. పెదవులు విరబూసే నవ్వు అవుతాడు, ప్రభాతమై పరుచుకుంటాడు, జ్ఞాపకాల కొండమీద మునిమాపు అవుతాడు, వెన్నెలని సేవించే చకోరమవుతాడు. మనల్ని భావకవితా వినువీధుల్లో విరహరింపచేయటానికి కవితా వెన్నెలై కురుస్తాడు. వెన్నెల పేనిన ముడివీడని ప్రేమతాడుకి... బ్రతుకుతోటలో పూసిన పువ్వుల్ని, కోయిలమ్మల పాటల్ని, పుడమిలాంటి యదపైన నాటిన మొక్కల్ని, మౌనవీణ పై మ్రోగిన ప్రేమసుధా రాగాల్ని పరిచయం చేస్తాడు, మర్చిపోతే ఓపికగా గుర్తుచేస్తాడు
అమ్మరూపు నీలో చూడాలని ఉంది, కమ్మనైన నీ ఒడిలో చేరాలని ఉంది, ఆకుపచ్చ వసంతమై పండాలని ఉంది, సంసారాన్ని జంటగా ఈదాలని ఉంది అంటూ ప్రేమకవితా దారుల్లోకి మనల్ని తీసుకెళ్తాడు. మనం అక్కడే గాల్లో తేలిపోతూ పారవశ్య స్థితిలో ఉంటే చూసి నవ్వుకుంటాడు. నువ్వులేని స్వప్నాలైనా నాకువద్దు, స్వర్గాలైనా నాకొద్దు, రాజ్యాలొద్దు, రత్నాలొద్దు, సౌఖ్యాలొద్దు, నువ్వు రాయబడని కావ్యాలైనా నాకొద్దు అంటూ భావసాంద్రతతో ప్రేమకవితని చెప్తాడు.
''వెన్నెలా.. నీ ఒడిలో కొన ఊపిరిని వదలాలని ఉంది'' అనడం కన్నా ఘనకవిత, భావసాంద్రత ఏముంటుంది? గుండెని కాల్చివేసే వేదనా భరిత భావాల్ని అందమైన గజళ్ళుగా మారుస్తాడు ఈ కవి.. తప్పులు మన్నించి నీ మనసు నా మీదకు మళ్లించు, హదయం వేదనతో భారంగా మారింది, అందరాని అనుబంధం అగ్నిలాగ మండింది.. మనమధ్య దూరాన్ని భాగించవా అంటూ బాధగా పాడతాడు.
విరహాన్ని, దుఃఖాన్ని, గుండెకింది తడిని తెచ్చి రాసిన గజళ్ళు ఎన్నో ఉన్నాయి. నువ్వు వంపిన దుఃఖాన్ని ఇంకా మోయలేను, నిట్టూర్పుల బాధలు ఇంకా తాళలేను, ఈ విరహపు జ్వాలల్లో నిలవలేను, నువ్వులేనిదే ఉండలేను అంటూ సాగే విరహ గీతాలు చదువుతుంటే కన్నులు తడుస్తాయి. ప్రేమ భగమై జ్ఞాపకపు తలుపుల వెనక తలపులనుంచి బ్రతుకుతున్న వారి కన్నులు వర్షాన్ని కురుస్తాయి, సాగరాలై పొంగుతాయి ఈ గజళ్ళ సహవాసంతో.
నువ్వొస్తే భావాన్నవుతా, రాకుంటే గాయాన్నవుతా... నువ్వొస్తే గీతాన్నవుతా, రాకుంటే రక్తమోడుతున్న వలపు దేహాన్నవుతా, ఎడారిలో ఒంటరి రూపాన్నవుతా, నా ఉపిరినిచ్చి నీకు ప్రాణాన్నై పోతా... ఇలా క్లుప్తత నిండిన భావధారలు ఎన్నో ఎదురొస్తాయి. లోకం శోకాలుపెట్టినా నువ్వేనా రాధ, సష్టిలో మనదే మరుపురాని గాధ అంటాడు ఒకసారి, తెరుచుకోని తలుపులముందు ముగ్గులో నిన్ను చూసుకుంటాను, నిశి వేళ నీ ఇంటి తాళం ఎక్కిరిస్తే మధువుతో జతకడతాను అంటాడు మరోసారి. నీ కౌగిలి చెరసాలన చేరాలని ఉన్నది, నీ తలపుల ఉరికొయ్యకు ఊగాలని ఉన్నది, నీ స్పర్శకి విషమైనా సుధగానే మారుతోంది, ఎడబాటున నిజమైనా కలలాగే మారుతోంది, అంటూ ఇష్ట భావనల కవితా వాక్యాల్ని గజళ్ళ గజ్జలై మ్రోగిస్తాడు. మామూలు మాటల్ని తనదైన శైలిలో వాడి మంత్రముగ్ధుల్ని చేస్తాడు. అలసిన కనులమీద, చిరుచెమటకు మెరుస్తున్న నుదిటిమీద, సిగ్గు మొగ్గలా మెరుస్తున్న పెదవి మీద, ఇంద్రధనస్సులాంటి మెడవంపు మీద, చల్లని చేతి మీద ముద్దుల కవిత్వం చెపుతాడు, కవిత్వమే ముద్దుగా చెపుతాడు.
నా విరహాన్నే గజళ్ళుగా రచిస్తాను నీకోసం అని చాటుకున్న కవి వెన్నెల సత్యం. అందమైన తారలను అక్షరాలుగా మలచి మధురమైన ప్రేమలేఖ రాస్తాడు కవి. అది చదివి ఓసారి నవ్వి ఓసారి ఏడ్చి, ఓసారి బాధపడి, గుండె బరువవుతుంటే తట్టుకొని నిలబడి విభిన్న అనుభూతుల జల్లుల్లో తడిసి ముద్దవడమే మన పని. అదికూడా అంత సులభం కాదు. కవితో కలిసి నడవాలి. ఓసారి హిమాలయాల అంచుల్లో కూర్చో పెట్టి ప్రేమ మందు తాగమంటాడు. మరోసారి మండుటెండలో గుండెని పిండేసే విరహపు అన్నాన్ని తినమంటాడు. చెప్పినవన్నీ చేయాల్సిందే... అప్పుడే కవి హదయం జలపాతమై మన గుండెలోకి దూకుతుంది. ఇలా ఈ సంపుటి అంతా ఏకాంతం చెట్టుకింద ఓదార్పు పాటలాగా సాగుతుంది. భావుకతను నింపుకొని మరిన్ని కవితా రూపాలు వీరి కలం నుంచి జాలువారాలని కోరుకుంటూ..
(వాసంతిక (గజళ్లు), రచయిత : వెన్నెల సత్యం, పేజీలు : 64, వెల : రూ. 100/-, ప్రతులకు : వెన్నెల సత్యం, ఇ.నెం. 18-209/4/ఎం, తిరుమల మెగా టౌన్ షిప్, షాద్నగర్. సెల్ : 944003210; అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...)
- గౌతమ్ లింగా, +27 745657589