Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో నైజాం విలీనం13-9-1948 నుండి 21-10-1951 వరకు
1948 సెప్టెంబర్ 13న సికింద్రాబాద్-షోలాపూర్ మార్గంలోని నల్లదుర్గం కోటను లక్ష్యంగా పెట్టుకొని భారత బలగాలు వచ్చాయి. తెల్లవారుజామున హవల్దార్ బచ్చీందర్ సింగ్ రెండు వాహనాల్లో రావటం చూశారు. అక్కడ కొంత కాల్పులు జరిగాయి. తెల్లవారేసరికి తుల్జాపూర్ కోట స్వాధీనమైంది. విజయవాడ నుండి బయల్దేరిన సైన్యం కల్నల్ అమ్రిక్ సింగ్ నాయకత్వాన కోదాడను పట్టుకున్నాయి. సెప్టెంబర్ 14 నుండి 16 వరకు సైన్యాలు పెద్దఎత్తున నైజాంలో ప్రవేశించడంతో సెప్టెంబర్ 17 తెల్లవారుజామున బీదర్‌కు చేరాయి. సెప్టెంబర్ 18 సాయంత్రం 4గం.లకు జనరల్ జే.యన్.చౌదరి నాయకత్వాన సికింద్రాబాద్‌లో అడుగు పెట్టాయి. హైదరాబాద్ సైన్యాధిపతి మేజర్ జనరల్ ఎల్.ఎడ్రూస్ లొంగిపోయాడు. చౌదరి మిలటరీ గవర్నర్‌గా పదవి స్వీకరించాడు. 19న ఖాసీం రిజ్వీ అరెస్ట్ అయ్యాడు. నవంబర్ 24న జనరల్ చౌదరి హైదరాబాద్ సంస్ధాన అధికార బాధ్యతలను సివిలియన్ గవర్నర్‌కు అందజేశాడు. ఈ పోరులో భారత సైన్యం తరుపున 66మంది మరణించగా 97 మంది గాయపడ్డారు. హైదరాబాద్ సైన్యంలో 490 మంది మరణించారు. 122 మంది గాయపడ్డారు.
భారత ప్రభుత్వం నైజాం రాజు సేవలో
సెప్టెంబర్ 17న నైజాం ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసిన తరువాత ఇక్కడి నుండి సైన్యాలను ఉపసంహరించాలి. కానీ సైన్యాలు వచ్చిన లక్ష్యం కమ్యూనిస్టులను అణిచివేయడం మాత్రమే. నైజాం తన సైన్యాలతోనూ, జమీందార్ల గూండా గ్రూపులతోనూ, కాశీంరజ్వీ నేతృత్వంలో ఏర్పడిన 60 వేల మంది రజాకార్లతోనూ కమ్యూనిస్టులను అణిచివేయడానికి సాధ్యం కాకపోవడాన్ని గుర్తించిన కేంద్రం, కమ్యూనిస్టులు ఎదగకుండా అణిచివేయడానికి సైన్యాన్ని ఇక్కడే ఉంచింది. భారతదేశంలో విలీనమైన 17వ తేదీన భారత ప్రభుత్వం ''నైజాంను రాజ్ ప్రముఖ్''గా నిర్ణయించారు. (ఇతను 1951 ఎన్నికల వరకు కొనసాగాడు. 1949 డిసెంబర్ 1న వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించారు. 1953 ఎన్నికల అనంతరం బూర్గుల రామకృష్ణారావు మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు.) యూనియన్ సైన్యాలు వచ్చి నైజాంను భారతదేశంలో విలీనం చేసిన తరువాత పార్టీ ఒక చర్చ సాగింది. భారత ప్రభుత్వం జమీందారుల భూములు పంపిణీ చేస్తుందని పోరాటం విరమించడం గురించి ఆలోచించాలన్న ప్రతిపాదన వచ్చింది. పోరాటంలో సాధించిన భూములపై హక్కులు ఏర్పడే వరకు పోరాటం కొనసాగించలని మెజార్టీ వర్గం అభిప్రాయపడింది. రెండు అభిప్రాయాలున్న కలిసి పోరాటం సాగించారు.
సాయుధ పోరాటం కొనసాగింపుకు పార్టీ నిర్ణయం
విబేధాలు ఎన్ని ఉన్నా రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి పోరాటం కొనసాగించడానికి అంగీకరించారు. ప్రజలు సాధించుకున్న విజయాలను రక్షించుకోవాలంటే పోరాటం కొనసాగించాలి. సైన్యం, నైజాం సైనికుల పైన, రజాకార్ క్యాంపుల పైన దాడులు చేస్తే భారత సైన్యంతో తలపడవద్దు. ''రజాకారు, నైజాం సైన్యంపై స్వతంత్రంగానే దాడి చేయండి. ఆయుధాలు గుంజుకొండి'' అంటూ కొంత కాలం ఒపిక పట్టండి అంటూ పోలీసు చర్య సందర్భంగా అన్ని దళాలకు సర్క్యులర్ పంపారు. భారత సైనిక బలగాలు - భూస్వామ్య గుండాలు రైతాంగంపై దాడి చేస్తే సామాన్య ప్రజలలో రేక్కెత్తిన భ్రమలు పటాపంచాలు అవుతాయి. వారు తిరిగి సన్నద్ధం అవుతారు. తమ రక్షణ కోసం ఆయుధాలు పట్టి పోరాడుతారని పార్టీ స్పష్టం చేసింది. దొడ్డ నర్సయ్య నాయకత్వాన హుజుర్నగర్లో, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కట్కూరి రాంచంద్రారెడ్డి నాయకత్వన భువనగిరలో, నల్లమల గిరిప్రసాద్ పుల్లన్న నాయకత్వాన పాల్వంచలో ఉన్న కొన్ని కమిటీలు పోరాటం ఉపసంహరించాలని చట్టబద్ధమైన ఆందోళన చేపట్టాలని స్వాగతించారు. ఆ తరువాత వీరంతా మితవాద సిపిఐ పార్టీలో చేరారు. సూర్యాపేట, ఖమ్మం, మాన్కోట కమిటీలు పోరాటాన్ని కొనసాగించడానికే మొగ్గు చూపాయి. పార్టీ నిర్ణయం తీసుకున్న తరువాత అందరూ సాయుధ పోరాటాన్ని బలపర్చారు. విభేధించిన వారు తరువాత పార్టీ విడిపోయారు. సూర్యాపేట తాలుకాలో క్యాంపుపై దాడి చేసి నైజాం సైన్యాలను, రజాకార్లను దళాలు తరిమి వేస్తుండగా సైన్యాలు వచ్చి ప్రజలను తరిమి వేశారు. సూర్యాపేట తాలూకాలో జన్నారెడ్డి ప్రతాప్‌రెడ్డి గడీని (హైదరాబాద్ జైలంతా) కూల్చివేసి దున్నారు. మొక్కజొన్నలు వేశారు. 2000 బస్తాల వడ్లు ప్రజలకు పంచారు. మాన్కోట తాలూకాలో నెల్లికుదురు రజాకారు క్యాంపుపై 300 మంది ప్రజలు దాడి చేశారు. 100 మంది రజాకార్లు ఆయుధాలతో సహా లొంగి పోయారు. వాళ్ళ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రాఘవరావు అనే భూస్వామికి చెందిన 3లక్షల విలువ గల మిల్లు ధ్వంసం చేశారు. 1500 బస్తాలు వడ్లు పంపిణీ చేశారు. ఈ విధంగా ప్రజా శుత్రువుల భవనాలు, ఆస్తులను క్రమపద్ధతి ప్రకారం నిర్మూలించారు. జనగాంలో విస్నూర్ రాంచంద్రారెడ్డి గడీలో 10 వేల మంది పోగై స్వాధీనం చేసుకోగా 120 మంది యూనియన్ సైనికులు వచ్చి చుట్టుముట్టి నిలిచారు. అతని బంగ్లాను రక్షించారు. అతని కుమారుడు జగన్మోహన్రెడ్డి 100 మందిని గతంలో కాల్చి చంపాడు. చిత్ర హింసలు చేశాడు. అక్కడి ఎస్సై ప్రజలపై అంతులేని హత్యచారాలు చేశాడు. వారిద్దరు ఎవరికి చెప్పకుండా జనగాంకు వెళ్ళారు. దళాలు కూడా జనగాం వెళ్ళాయి. హైదరాబాద్ గూడ్స్ రైల్ ఎక్కి పారిపోబోయాడు. గూడ్స్ రైల్‌ను నిలిపివేశారు. రైల్ కింద దూరిన బాబురావును పట్టుకొని చంపివేశారు. ఇన్స్పెక్టర్ తల పగిలింది. రైఫిల్ లాక్కున్నారు. ఆలేరు వద్ద గూడ్స్ దిగిపోయారు. భువనగిరిలో మోత్కూరు క్యాంపును దళాలు చూట్టుముట్టాయి. పోలీసు స్టేషన్‌ను నేలమట్టం చేశారు. నల్గొండ, నార్కెట్‌పల్లి, వరంగల్, తాటికొండ క్యాంపులను జఫర్ఘడ్ క్యాంపును ధ్వంసం చేశారు. యూనియన్ సైన్యాలు పట్టాణాలలో కొన్ని స్థానాలలో ప్రజా శత్రువులను కాపాడాయి. దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు భారత సైన్యాల ప్రవేశం తరువాత 2 వారాల్లో తిరిగి గ్రామాలకు వచ్చారు. ఆ విధంగా యూనియన్ సైన్యాలు, నైజాం సైన్యాలను, భూస్వాములను కాపాడాయి. కాశీం రజ్విని జైల్లో పెట్టి 1వ తరగతి ఖైదీగా చూశారు.
కాన్స్ట్రేషన్ క్యాంపులు (చిత్రవద కేంద్రాలు)
నైజాం సైన్యాలు, రజాకార్లు, భూస్వామ్య గూండాలు మరియు భారత సైన్యాలు కలిసి చేసిన ఆకృత్యాలు అంతా ఇంతా కాదు. ప్రతి నాలుగైదు మైళ్లకు ఒకటి చొప్పున మిలటరీ క్యాంపులు ఏర్పాటు చేశారు. రోజుకు 23సార్లు సైనికులు దరిదాపుల గ్రామాలపై దాడులు చేసి ప్రజలందర్ని ఒకచోట మంద వేసి పాశవికంగా కొట్టారు. కమ్యూనిస్టులను వెతకడం కోసం అడవులు, తోపులు, చెరువులలో వెతికారు. కాళ్లకు తాళ్లు కట్టి తల కిందికి వేలాడదీసి గిలకలపై పైకీ కిందికి లాగారు. మనుషులను గోనె సంచులలో పెట్టి సైనికులు నూతిలో అటు నుండి ఇటు, ఇటు నుండి అటు లాగారు. మహిళలపై హత్యాచారాలు, మానభంగాలు పెద్దఎత్తున జరిపారు. సూర్యాపేటలో మూడు రోజుల క్రితం ప్రసవించిన మహిళను చెరిచారు. గర్భిణులను చెరిచారు. భువనగిరిలో 10 సంవత్సరాల బాలికను సైతం వదిలిపెట్టలేదు. స్త్రీలను వివస్త్రలుగావించారు. తొడలకు తొండలను కట్టి గాయాలకు కారం రాసారు. ఇంత జరిగినా పోరాటాలు ఏ మాత్రం వెనుక్కు తగ్గలేదు. భూ సమస్య అత్యంత కీలక సమస్యగా తీసుకున్నారు. గ్రామాలలో నిర్బంధ శిబిరాలు ఏర్పాటు చేసినా, గ్రామ దహనాలు కొనసాగినా శత్రువులను మట్టుపెట్టడంలోనే ఉద్యమాలు కొనసాగాయి. సైన్యానికి ప్రజలను కాల్చి చంపడం అనేది సరదాగా మారింది. ప్రైవేట్ వడ్డీ, వెట్టి చాకిరీ, అడవి భూములపై పన్నులు తదితర నిర్బంధ వసూల్లు జరిగాయి. 1949 అక్టోబర్ చివరి నాటికి 50 మంది కమ్యూనిస్టు యోధులకు ట్రిబ్యునల్ ఉరిశిక్ష విధించింది. వీరందరూ తమ తరుపున న్యాయవాదులను పెట్టుకోలేదు. మీ ఇష్టం వచ్చిన శిక్షలు వేసుకోండని న్యాయస్థానంలో చెప్పారు. ఆ తరువాత వీరందరూ జట్లుజట్లుగా నల్లగొండ, హైదరాబాద్ జైళ్లకు పంపించ బడ్డారు. వీరిలో డిల్లీ వెంకులు (14), యర్రబోతు రాంరెడ్డి (15), పన్నాల రాంరెడ్డి (20), నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి (20) నల్లా నర్సింహులు (22) లు ఉరిశిక్ష పడిన వారిలో ఉన్నారు. దీనిపై ''టైం పత్రికలో'' వ్యాసం వచ్చింది. ప్రపంచ వ్యాపితంగా ఆందోళన సాగింది. హైకోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం కల్పించకుండానే వారిని ఉరి తీయాలని సైనిక ప్రభుత్వం పథకం పన్నింది. ఉరిశిక్షల రద్దును డిమాండ్ చేస్తూ జకోస్లోవేకియా రాజధాని ప్రేగ్ నగరంలో 10వేల మందితో పెద్ద ప్రదర్శన జరిగింది. రాంరెడ్డి ఫోటోను పెద్దగా చిత్రించి ముందు జీపుపై పెట్టి ఊరేగించారు. తరువాత హైకోర్టుకు అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. హైకోర్టులో ఉరిశిక్ష కొట్టివేయబడింది.
బీభత్సపాలన - ప్రతిఘటన
పక్షం రోజుల లోపలనే సెప్టెంబరు నెలాఖరుకల్లా జనరల్ జె.యన్ చౌదరి ఆధ్వర్యాన గల సైనిక ప్రభుత్వం తెలంగాణా ప్రజలపై తన దాడులు ప్రారంభించింది. రజాకార్లపై సాగించిన లాంఛనప్రాయమైన పోరాటాన్ని నిలిపివేసింది. నైజామంతటా జరిగిన హత్యలకు, లూటీలకు బాధ్యుడయిన కాశీంరజ్వీ వంటి పరమ కిరాతకులను జైళ్ళలో నిర్బంధించటం మాత్రమే జరిగింది. జైళ్ళలో వారికి ప్రథమ తరగతికి చెందిన సౌకర్యాలు కల్పించారు. ఇంకా అనేక మంది రజాకార్లను జైళ్ళలోనైనా పెట్టకుండా వదిలేశారు. మరోవైపున కమ్యూనిస్టులను అణచివేసే ఉద్యమాన్ని ప్రారంభించారు.
సంస్థానంలోని వివిధ ప్రాంతాలలో, వందలాది సైనికులతో పెద్ద పెద్ద మిలటరీ క్యాంపులను ఏర్పాటు జేశారు. గ్రామాల నుండి పారిపోయిన దేశముఖులను, ప్రజాశతవులను, కాంగ్రెస్ వాలంటీర్లను గ్రామాలలో తమ పెత్తనాన్ని పునఃస్థాపితం చేయటం కోసం తిరిగి తీసుకొచ్చారు. ప్రతి మిలటరీ క్యాంపు సరసనే ఒక కాంగ్రెస్ కార్యాలయం కూడా వెలిసింది. సైన్యానికి లొంగి పోవలసిందిగాను, దళసభ్యులను పట్టించవలసింది గాను ప్రజలను కోరుతూ గ్రామాలవెంట తిరగడమే వారి కార్యక్రమంగా తయారైంది. వారు ప్రతి గ్రామంలో జెప్పినది. ''మనకిప్పుడు ప్రజారాజ్యం వచ్చింది. నిజాం పోయాడు. ఆయుధాలతో సహా లొంగిపోవలసిందిగా దళాలకు చెప్పండి. మీరు మాతో ఒప్పందానికి కూడా రండి. దేశముఖుల నుండి మీరు తీసుకున్న ఆస్తులను, పశువులను, ధాన్యాన్ని, భూమున్నింటినీ తిరిగి మాకిచ్చి వేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత భూ సంస్కరణలు ప్రవేశ పెడుతుంది. మీకు భూములిస్తుంది. మనమంతా హిందువులం. కమ్యూనిస్టులు రష్యా ఏజెంట్లు, కమ్యూనిస్టు ప్రభుత్వం క్రింద ప్రతి ఒక్క వ్యక్తీ కార్మికుడే. వారు ఏ విధమైన సాంఘిక కట్టుబాట్లనూ పాటించరు. ముసలివారిని చంపివేస్తారు. అందువల్ల వాళ్ళను నమ్మవద్దు. భూమిశిస్తు, ధాన్యంలెవీ, ఎక్సైజు పన్నులు చెల్లించండి. మేమెంత చెప్పినా మా మాట విని మమ్మనుసరించకపోతే మిమ్ములను శిక్షిస్తాం. మాకున్న బలగాల ముందు నైజాం అంతటివాడు సయితం వారం రోజుల లోపలే లొంగిపోనలసి వచ్చింది. ఇక ఈ కమ్యూనిస్టులనగా ఎంత? రెండు మైళ్ళ దూరాన గల లక్ష్యం పైన దెబ్బ తీయగల అతి పెద్ద ఆయుధాలు మాకున్నాయి. గ్రామాలపై బాంబులు వేసే విమానాలున్నాయి. దారిలో అడ్డం వచ్చిన ప్రతి దానిని పిండి పిండి చేయగల టాంకులున్నాయి. మిమ్ములను కాపాడటానికే మేమొచ్చాము. మా మాట వినకపోతే మీ గోతిని మీరు తవ్వుకున్నట్లే.''
గ్రామాలలో మొట్టమొదట ఒక వరస ఈ విధమైన ప్రచారం సాగించారు. వారం రోజుల లోపల లొంగిపోవలసిందిగా కమ్యూనిస్టులను కోరుతూ, అలా లొంగి పోకపోతే వాళ్ళను నిర్మూలిస్తామని పేర్కొంటూ మిలటరీ గవర్నరు జనరల్ జెఎన్ చౌదరి కూడా, హైదరాబాద్ నుండి ఒక ప్రకటన చేశాడు.
యూనియన్ ప్రభుత్వ స్వభావాన్ని వివరించి చెప్పటం కోసం పార్టీ కార్యకర్తలు, గెరిల్లా దళాలూ ఉవ్వెత్తున ప్రచారం సాగించారు. కాంగ్రెసు కమిటీలు దేశ్‌ముఖ్ కమిటీలు తప్ప వేరేమీకాదని, వారు ప్రజలకు చెప్పారు. పోరాటం ద్వారా తాము సాధించుకున్న భూమిని, పశువులను, గ్రామ పంచాయతీ కమిటీలను కాపాడుకోవలసిందిగాను, లొంగిపోవద్దనీ వారు కోరారు. ఈ దశలో సూర్యాపేట తాలూకాలో ఒక పాట బహుళ ప్రచారంలో వుంది ''ఓ రైతా, రాజీపడాలనుకుంటున్నావా? ఎలుకకూ- పిల్లికీ మధ్య రాజీ అసంభవం'' అనేదే దాని సారాంశం. ఈ పాటను రామన్న గూడెంకు చెందిన పార్టీ సభ్యులొకరు రాశారు.
దళాల పైన, ప్రజల పైన మిలటరీ ప్రత్యక్ష దాడులు ప్రారంభించింది. పార్టీ ఆంధ్రమహాసభ కార్యకర్తలను గురించి ఎవరు ఏ దళంలో చేరారు ? ఏ దళం ముఖ్యమైనది? ఎవరు ఏ నూతి సమీపాన లేదా ఏ పొలంలో నివసించారు ? మొదలైన సమాచారాన్ని సంపాదించారు. ఆ సమాచారం ప్రాతిపదికన పై సైన్యం తన దాడులను అలాంటి తావులపై కేంద్రీకరించి సాగించింది. కాంగ్రెస్ వాలంటీర్లు, సైన్యం ప్రత్యేక గూఢచారిశాఖగా వ్యవహరించుతూ, సమాచారం సేకరించారు. సైన్యంతో పాటు వాళ్ళూ రజాకార్లు చేసినట్లే అత్యాచారాలు సాగించారు.
సైనికులు లారీలలో బయలుదేరి, ఒక్కొక్కసారి ఐదారు గ్రామాలను చుట్టు ముట్టేవారు. ఈ గ్రామాల ప్రజలందరినీ ఒక్కచోటికి పోగుజేసి, కమ్యూనిస్టులను, గెరిల్లాలను చూపించవలసిందిగా కోరుతూ వాళ్ళను కొట్టేవారు. చిత్రహింసలకు గురిచేసేవారు. ఉదయం 8-10 గంటల కల్లా ఈ పని పూర్తిజేసి, ఆ తర్వాత దాగి ఉండేవారు. గెరిల్లాల కోసం కొండల్లో, గుట్టల్లో, వాగుల్లో, వంకల్లో, పొదలలో వెదికేవారు. సాయంత్రానికల్లా క్యాంపులకు తిరిగి చేరుకునేవారు. ఆ విధంగా వారు రోజుకొక కేంద్రం మీద దృష్టి కేంద్రీకరించేవారు. ఒక్కొక్కసారి అదేరోజు రెండు, మూడు కేంద్రాలు తీసుకునేవారు. ఈ దాడుల సంఖ్య, ఉధతి, తీవ్రత అధికమైంది. ఒక తాలూకా, తర్వాత మరొక తాలూకాలో ఈ విధంగా సాగించారు. ఒక్కోసారి ఇరవై, ముప్ఫై గ్రామాలను చుట్టుముట్టేవారు.
వీటిని ''చుట్టుముట్టే దాడుల''ని పిలిచేవారు. ఈ ముట్టడిలో చిక్కుకున్న దళమేదైనా తప్పించుకోగలగటం అరుదు. ప్రతిఘటించటం అంతకంటే ప్రమాదకరం. అందువల్ల, దీన్ని దష్టిలో వుంచుకుని, దళాల నిర్మాణంలో, వాటి సంఖ్య విషయంలో, రక్షణ పద్ధతుల విషయంలో కొన్ని మార్పులు చేయబడ్డాయి. ఒక్కొక్క దళంలో వుండే సభ్యుల సంఖ్య ఐదుకు మించరాదని వారు ప్రజలు ధరించేటటువంటి దుస్తులనే ధరించాలనీ, తమ ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించుతూ తిరగరాదనీ, సైన్యం ముట్టడి చేయబోతున్నదన్న వార్త ముందుగా తెలిస్తే అలాంటి ప్రాంతాలను వదిలి వెళ్లాలని నిర్ణయించబడింది. స్థానిక ప్రజలతో కలసిపోయి మెలగవలసిందిగా గ్రామ దళాలను పార్టీ కోరింది.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, మనలను కాపాడుకోవటం ఎంతో కష్ట మైంది. ఒక పథకం ప్రకారం సాగించబడుతున్న ఈ చిత్రహింసా కాండను మన రక్షణకు ప్రధాన ఆధారమైన ప్రజలు తట్టుకోలేక పోయారు. ప్రజలను హింసల పాలు జేయటంలో మిలిటరీ వాళ్ళు, రజాకార్లను తలదన్నారు. ''గొర్రెలు తినే వాడుపోయి, బర్రెలు తినే వాడొచ్చాడు'' అని ప్రజలు చెప్పుకోనారంభించారు. ప్రజలను ఒక చోట మందవేయడం, కమ్యూనిస్టుల ఆచూకీ చెప్పవలసిందిగాను, దేశముఖుల ఆస్తులను తిరిపిుచ్చి వేయవలసిందిగాను కోరుతూ బాదటం రోజువారీ కార్యక్రమమై పోయింది. స్త్రీ పురుష విచక్షణ గాని, వయోవద్ధ భావంగాని లేకుండా ప్రజలను లాఠీలతో, తుపాకి మడమలతో, చింతబరికెలతో తీవ్రంగా కొట్టేవారు. ప్రజలను చిత్రహింసలు బెట్టటంలో సీతాపతి అనే మిలిటరీ కమాండరు అందరిని తలదన్నాడు. చింత బరికెలను సుత్తి కొడవలి ఆకారంలో వంచికట్టి, వీపుల మీద సుత్తి కొడవలి గుర్తుబడేట్లు బాదేవారు. పార్టీ సభ్యుల కుటుంబాల పైన, గెరిల్లా దళాల సభ్యుల కుటుంబాలపైన ప్రత్యేకంగా కేంద్రీకరించి దాడులు సాగించారు. చేతికిజిక్కిన ప్రతి వారినీ, ప్రజల సమక్షంలోనే అమానుషంగా కొట్టి హింసించేవారు.
- సారంపల్లి మల్లారెడ్డి, 9490098666