Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెప్టెంబర్ 10 అంతర్జాతీయ అత్మహత్యల నివారణ దినోత్సవం. గత దశాబ్దంలో ఆత్మహత్యలు చేసుకునేవారు, ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగి పోయింది. పది సంవత్సరాల పిల్లల నుండి తొంభై సంవత్సరాల వద్ధుల దాకా మరణాన్ని ఆహ్వనిస్తున్న వారు ఎక్కువవుతున్నారు. దీనికి కారణాలు వెతికి, వ్యక్తులుగా, సమాజంగా మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో, ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో తెలుసుకోవలసిన అవసరం ఇప్పుడు మనందరిది. లేదంటే పరిస్థితి ఇంకా భయానకంగా తయారయేలా స్టాటిస్టిక్స్ కనిపిస్తున్నాయి. మానసిక నిపుణులు, శాస్తవేత్తలు అందరూ కూడా ఈ విషయంపై చర్చ అవసరం అని చెబుతూనే ఉన్నారు. మన దేశంలో మానసిక సమస్యలపై అవగాహన చాలా తక్కువ. కౌన్సిలింగ్ సెంటర్ల అవసరం ఇంకా మనకు అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితులలో ఆత్మహత్యలను నివారించడానికి జీవితం పట్ల నమ్మకం కలిగించడానికి సాహిత్యకారుల పాత్ర కూడా చాలా అవసరం. ఎన్నో సామాజిక సమస్యలకు పరిష్కారానికి ''కలం'' దారి చూపింది. అలాగే కళాకారులు కూడా ఈ దిశగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించవలసిన సమయం ఆసన్నమయింది.
సినిమా ప్రస్తుతం ప్రజలను ఆకట్టుగోగల గొప్ప మాధ్యమం, కాబట్టే మార్పు దిశగా, చర్చకు సమాజాన్ని తయారు చేయగల శక్తి సినిమా కుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని కమర్షియల్ సినిమా ప్రక్రియకు భిన్నంగా మన దక్షిణ భారత దేశంలో జరుగుతున్న విధార్ది ఆత్మహత్యల నేపథ్యంలో వచ్చిన చక్కని సినిమా ''హౌప్''
''హౌప్'' సినిమాను 2006లో మనకు అందించిన వారు సతీష్ కాశేట్టి. హౌప్ సినిమాకు జాతీయ బహుమతి అందుకున్నారాయన. సామాజిక సమస్యలపై వచ్చిన సినిమా కేటగిరిలో వీరికి హౌప్ సినిమా దర్శకునిగా అవార్డు లభించింది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించింది కళ్యాణి, డీ రామానాయుడు. ఒక అపార్ట్మెంట్లో పై అంతస్తులో ఒక పెద్దాయన ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. ఇంట్లోంచి బైటకు దేనికీ రాడాయన. ఆ ఇంట్లో పని చేసే పనిమనిషి ఆయన బాగోగులు చూస్తూ ఉంటుంది. బైనాకులర్స్ ో కిటికీ బైట టాంక్ బండ్, దాని దగ్గర ఒక బెంచ్, అ బెంచ్‌పై కూర్చునే వారిని గమనించడం ఇదే ఆయన కాలక్షేపం. క్రింది ఫ్లాట్ ో ఒక తండ్రి ఇద్దరు కూతుర్లు ఉంటున్నారు. పెద్ద అమ్మాయి పూజ. చిన్న అమ్మాయి ఇంటర్ చదువుతూ ఉంటుంది. కెమిస్ట్రీ ో తక్కువ మార్కులు వచ్చాయని టాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె శవాన్ని జనం బైటకి తీస్తున్నప్పుడు ఈ పెద్దాయన ప్లాట్‌లో నుంచి చూస్తూ ఉంటాడు. చిన్న కూతురు ఆత్మహత్యతో షాక్‌లోకి వెళ్ళిన పూజ తండ్రి ఆరోగ్యం పాడవుతుంది. ప్రతిరోజు పెద్ద కూతురుతో ఆ బెంచి మీద కాసేపు కూర్చోవడం ఆయన అలవాటు చేసుకుంటాడు. కొన్ని రోజులకు అక్కడే గుండెపోటుతో మరణిస్తాడు ఆయన.
పూజ షాక్‌తో కళ్ళు తిరిగి పడిపోతుంది. ప్లాట్లోని పెద్దాయన తన పనిమనిషిని పంపి పూజను ఇంటికి తీసుకొచ్చుకుంటాడు. పూజ మానసిక స్థితి సరిగ్గా ఉండదు. తండ్రి అంతక్రియలు సొసైటి వారు కలిసి చేస్తారు. ఆ దు:ఖంలో ఒక సారి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేస్తుంది. ఆ పెద్దాయన ఆమెను కాపాడుతూ ఉంటాడు. తన చెల్లి లా చిన్న పిల్లలు చదువు ఒత్తిడికి ఎందుకు మరణిస్తున్నారో కనుక్కొమ్మని, రీసెర్చ్ చేసి ఎక్కడ లోపాలున్నాయో తెలుసుకొమ్మని ఆ రకంగా కొందరు పిల్లల్ని అయినా మరణం నించి కాపాడుకోవచ్చని, అదే తన లక్ష్యంగా మార్చుకొమ్మని పూజకు చెబుతాడు ఆ పెద్దాయన.
ఈ రీసెర్చ్ కోసం పూజ తన సమయం అంతా కేటాయిస్తుంది. ఎన్నో మరణాల గురించి తెలుసుకుంటుంది. ఆ పిల్లల తల్లితండ్రులను కలుసుకుంటుంది. తమ పిల్లలు అలా ఎందుకు చేశారో అర్ధం కాని అయోమయంలో, షాక్‌లో ఉన్న కుటుంబాలను చూస్తుంది. తల్లి తండ్రులు ఒత్తిడి ఇవ్వకపోయినా చనిపోయిన పిల్లల గురించి టీచర్లను అడిగి తెలుసుకుంటుంది. కాని ఆ పిల్లలు అలాంటి స్థితిలో ఉన్నారని ఆత్మహత్య చేసుకుంటారని తమకు ఎటువంటి సూచన కూడా లేదని అందరూ పూజ దగ్గర చెప్పి బాధపడతారు. ఈ క్రమంలో ప్రొఫెసర్ ఆర్.బీ.వీ.ఆర్ మూర్తి అనే ఒక కొలంబియా యూనివర్సిటి అధ్యాపకుడు రాసిన వ్యాసాలను సేకరిస్తుంది పూజ. మన విద్యా వ్యవస్త ఒకప్పటి బ్రిటీషర్లు తమకోసం క్లర్కులను తయారు చేసుకోవడానికి మొదలెట్టిన పద్ధతిలోనే సాగుతుంది అని, ఈ వ్యవస్థలో నలిగి గ్రాడ్యుయేట్లు అయి బైటకు వచ్చిన వారిలో ఐదు శాతం మంది మాత్రమే ఉద్యోగాలకు పనికి వస్తున్నారని, మరి ఎవరికీ పని రాని ఈ విద్యార్ధులకు ఇంత ఒత్తడికి గురి చేసి మనం సాధిస్తుంది ఏంటి అన్న ప్రశ్న అందరిలో మొదలవుతుంది.
రాజేశ్ అనే మరో యువకుడు యు.ఎస్. నుండి సెలవు తీసుకుని ఒక డాక్యుమెంటరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ తన పాత స్నేహితులు షకీల్, ప్రియాంకలను కలుసుకుంటాడు. తమ క్లాస్ టాపర్ చైతన్య ఎక్కడున్నాడో తెలుసుకోవాలని అతని ఆశ. చదువులో ఎప్పుడు టాప్‌గా నిలిచే చైతన్య తప్పకుండా పెద్ద పదవిలోకి వచ్చి ఉంటాడని అందరూ అనుకుంటారు. ఒక రోజు రాజేష్ పూజలు ఒక ఆఫీసులో మెట్లపై కలుసుకుంటారు. పూజ చేతిలోని ఫైలు జారి అందులో పేపర్ కటింగులన్నీ నేలపై పడిపోతాయి. అందులో చైతన్య ఫోటో కనిపిస్తుంది రాజేశ్‌కి. ఆ ఫైలు కోసం మళ్ళీ పూజని కలిసినప్పుడు చైతన్య కొన్ని సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని రాజేశ్‌కి తెలుస్తుంది. ట్యుటోరియల్ కాలేజ్‌లో టాప్ టెన్ రాంకర్గా ఉన్న చైతన్య ఎంట్రెన్స్‌లో పన్నెండొందల ర్యాంకు వచ్చిందని తెలిసి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి ఆ స్నేహితులందరూ బాధ పడతారు.
పూజకు తన ప్లాట్‌లో ఉన్న అంకులే తాను ఇన్నాళ్ళు వెతుకుతున్న ప్రొఫెసర్ మూర్తి అని తెలుస్తుంది. ఆయన మరణించాడని అందరు అనుకోవడం ఆమెను కలవర పెడుతుంది. ఒంటరిగా విద్యా వ్యవస్థ మార్పు కోసం కషి చేసిన ఆయన భార్యా పిల్లల మరణంతో తోడు రాని వ్యవస్థలో పోరాడలేక అలసి పోయాడని అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు కాన్సర్‌తో చావుకు దగ్గరవుతున్న తాను పెద్దగా ఏం చేయలేనని, మానసికంగా వారికి ధైర్యం మాత్రం ఇవ్వగలనని చెబుతారు మూర్తి. హర్‌నాధ్ అనే మరో పారిశ్రామిక వేత్త, తన ఆస్థిలో ఎక్కువ భాగం ఖర్చు పెట్టి ఎటువంటి ప్రెషర్ లేని స్కూల్‌ని మొదలుపెడతాడు. పూజ అతనితో కలిసి పని చేస్తూ ఉంటుంది. విద్యా వ్యవస్థ మార్పు కోసం ఒక లైవ్ డిబేట్ నిర్వహిస్తుంది. అక్కడకు వచ్చిన విద్యా సంస్థల అధినేత పూజ కేవలం చెల్లెలి మరణంతో ఎమోషనెల్గా ఆలోచిస్తుందని, భారతీయ విద్యా వ్యవస్థ ఎందరో మేధావులను తయారు చేసిందని, పటిష్టమైన వ్యవస్థను ధ్వంసం చేయాలనే పిచ్చి ఆలోచనతో యువత చేస్తున్న ఈ పని మంచిది కాదని వాదిస్తాడు. అతని నైజం తెలిసిన మూర్తి, ఆ డిబేట్లో స్వయంగా పాల్గొని పాతబడిన తమ భావాలతో ఇంత నష్టం జరుగుతున్నా ఇన్ని ప్రాణాలు పోతున్నా పాతుకుపోయిన తమ సామ్రాజ్యాల కోసం మార్పు కోసం ప్రయత్నిస్తున్న యువతను భయపెట్టి వారి ప్రయత్నాలను ఆపాలనుకోవడం స్వార్ధం అని, ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలని, మార్పు దిశగా వ్యవ్యస్థ ప్రయాణించ వలసిన అవసరాన్ని పెద్ద మనసుతో గుర్తించి భావి తరాలను కాపాడమని విజ్ఞప్తి చేస్తారు. తరువాత రాజేశ్ తీసిన డాక్యుమెంటరీ ప్రివ్యూ చూస్తూ మూర్తి గారు మరణిస్తారు. అతనిచ్చిన ధైర్యంతో లక్ష్యంతో పూజ ఆయనకు అంతక్రియలు తానే నిర్వహిస్తుంది. ఆయన వదిలి వెళ్ళిన ఆస్థిని తన కౌన్సిలింగ్ సెంటర్ల నిర్వహణకు వాడుకో వాలని నిర్ణయించు కుంటుంది.
ఒక సీ.బీ.ఎస్.సీ లోనే ప్రతి సంవత్సరం నాలుగు వేల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవి కాక డిప్రెషన్‌తో మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విద్యార్ధుల సంఖ్య గత పది సంవత్సరాలలో నాలుగు రెట్లు పెరిగింది. ఆ పాత తరంలో విద్యార్ధులకు సైక్రియాట్రిస్ట్ అవసరం చాలా తక్కువ. ఇప్పుడు ప్రతి పది మందిలో ఇద్దరికి మెడికల్ హెల్ప్ అవసరం అయే స్థితి. మన దేశంలో అక్షరాస్యత 64 శాతం అయితే, పదో తరగతి కన్నా ఎక్కువ చదువుకుంటున్నది ఆరు శాతం, ఐటీ డెవెలప్మెంట్ దిశగా పరుగెడుతున్న విద్యా వ్యవస్థకు అర్థం చేదుకోవాల్సింది, గ్లోబల్ ఐటీ బిజినెస్‌లో మన షేర్ కేవలం ఒక్క శాతం, మరి ఏం సాధిస్తున్నాం ఈ విద్యా వ్యవస్థతో ఈ అకాల మరణాలు తప్ప అని పూజ అడిగే ప్రశ్నలు కేవలం సినిమాకు సంబంధించినవి కావు.
చివరకు కొన్ని ఆసక్తికరమైన మాటలతో రాజేశ్ నిర్మించిన డాక్యుమెంటరీని చూస్తాం. కుంభకోణంలో ఎనభై మంది పిల్లలు మాడి మసి అయిపోతే ప్రభుత్వం రియాక్ట్ అయి స్కూళ్ళలో తాటాకు కప్పుల్ని నిషేధించింది. ఆంద్రప్రదేశ్‌లో 300 మంది రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే ప్రజలు ప్రభుత్వాన్ని మార్చేసారు. 9/11 బ్లాస్టులలో 3000 మంది చనిపోతే ప్రపంచం రియాక్టయి ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించింది. మరెందుకు ఇంతమంది విద్యార్ధులు చనిపోతే ఎవరూ రియాక్ట్ అవరూ? ఏ ప్రభుత్వము పట్టించుకోదు, పౌరులుగా మనకు భాద్యత లేదా? ఒత్తడిని భరించలేక చనిపోయారులే అని మనం సమర్థించుకుంటాం, మన పిల్లలు ఎప్పటికి అలా చేయరని మురిసి పోతాం, కాని ఆత్మహత్య చేసుకున్న పిల్లల తల్లితండ్రులను అడగండి, వాళ్ళ పిల్లలు అలా చేస్తారని వారెప్పుడు అనుకోలేదనే చెబుతారు వారు. తన పిల్లల మనసులో ఏముందో ఏ కుటుంబానికి తెలియదు. ఏ పిల్లవాడు ఎప్పుడు ఎలా ఆలోచిస్తున్నాడో ఎవరూ చెప్పలేరు. ఆలోచించే వారిని కాకుండా క్లర్క్ల్స్ రోబోస్ని తయారు చేసే ఈ సిస్టం మనకి అవసరమా? నిరుద్యోగ సమస్యకు, అండర్ ఎంప్లాయిమెంట్ కి చివరకు చావులకు దారి తీసే ఈ సిస్టం వద్దు అంటూ పూజ పలికే మాటలు కొందరికయినా చేరవలసిన అవసరం ఉంది.
మనిషికి వ్యవస్థకీ మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో సిస్టం ప్రకారం రైట్ అయేది చాలా సార్లు మనిషికి హాని కలిగించవచ్చు, కాని వ్యవ్యస్థ అనేది మనలను ఎంత మాత్రం శాసించ కూడదు. అవసరమైతే అలాంటి వ్యవస్థను మనం ప్రశ్నించి ఎదిరించాలి. మనం ఎప్పుడు చర్చించే ఈ పరిక్షలు, మార్కులు, ర్యాంకులు, డిసిప్లిన్ కరిక్యులం అనేవి కేవలం సిస్టంలోని మూల సమస్యకి పైకి కనిపించే లక్షణాలు మాత్రమే. వీటిమీద చర్చించడం వధా. ఈ సిస్టంలో ఎన్నో వేల మంది విద్యావేత్తలు, ఎన్నో లక్షల మంది ఉపాద్యాయులు, తల్లి దండ్రులు, ఎన్నో కోట్ల మంది విద్యార్ధులు వేళ్ళలాగా బలంగా పాతుకు పోయారు. ఈ సిస్టంని కూకటి వేళ్లతో పెకిలించి పారేయాలి. ఈ పని చేయడం నీకు సాధ్యం కాదు, నాకూ సాధ్యం కాదు, కాని మనకు సాధ్యం అవుతుంది, మనం అంటే ప్రభుత్వం... ఇది కేవలం మన వల్లే అవుతుంది అంటే మన ప్రభుత్వాల వల్లే అవుతుంది... ప్రభుత్వం స్పందించి ఈ సిస్టం లో మార్పు తేవాలంటే మనలో ప్రతి ఒక్కరం స్పందించాలి, ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలి. వేయి అడుగుల ప్రయాణమయినా ఒక్క అడుగుతో మొదలవుతుంది. ఈ క్షణం నుండి మనం అందరం మార్పు వైపుకు అడుగులేయడం మొదలుపెడదాం. వచ్చే తరాల వారికి మన వంతు భాద్యతగా ఒక అధ్బుతమైన విద్యావిద్యానాన్ని అందిద్దాం. అంటూ మూర్తి గారు కళ్యాణీతో మాట్లాడే మాటలు మన భాద్యతను గుర్తు చేస్తాయి.
ఇంత అద్భుతమైన విశ్లేషణను ఇచ్చిన సతీశ్ కాసెట్టి గారికి విద్యా విధానాన్ని పరిశిలీంచి బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కతజ్ఞత చూపించాలి. మనందరి గొంతుకై ఈ సినిమాలో ఈ మాటలను పలికించినందుకు. ఈ చిత్రంలో పూజ పాత్రలో కళ్యాణీ చాలా బాగా నటించారు. చాలా బాలెన్స్డ్గా కంపోజ్డ్గా ఆ పాత్రకు జీవం పోసారు. ఇలాంటి సినిమాలను జనం దగ్గరకు తీసుకువెళ్లవలసిన భాద్యత కూడా మనదే. మార్పు దిశగా, మానవత్వం దిశగా సమాజం ప్రయాణించాలనే సదుద్దేశంతో ''హౌప్'' సినిమా తీసిన ఆ టీం, ఇంకా ఆలోచించేవారున్నారని, సమాజంలో ఆ దిశగా పని చేసుకుంటూ వెళ్తున్న కార్యశూరులు ఇప్పుడు కూడా మనతో ఉన్నారని ఈ సినిమా చూస్తున్న వారందికీ ''హౌప్'' ని అందించారు. భారతీయ సినిమాలలో గొప్ప స్త్రీ పాత్రలను పరిచయం చేస్తున్న క్రమంలో తెలుగులో వచ్చిన ''హౌప్'' సినిమాను ఇంతద్భుతంగా నడిపించిన కళ్యాణి గారిని పరిచయం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ అంతర్జాతీయ ఆత్మహత్యా నివారణ దినోత్సవం నాడు ఆమెకు, ఈ సినిమా టీం కి కతజ్ఞతనలు చెప్పుకోవాలి.
ఆత్మహత్య నివారణ కోసం విద్యార్ధుల కౌన్సిలింగ్ కోసం పని చేసే వాలంటరీ సంస్థలు మన మధ్య ఉన్నాయి. రోష్నీ హెల్ప్‌లైన్ ఈ దిశగా గత ఇరవై సంవత్సరాలుగా పని చేస్తుంది. హైద్రాబాద్‌లో రోష్నీ హెల్ప్‌లైన్ నంబర్లు 040-66202000, 040 -662020001. ఈ హెల్ప్‌లైన్ సేవలు ఎవరైనా వినియోగించుకోవచ్చు. మన పిల్లల్ని రక్షించుకుందాం, ఆత్మహత్యలను నివారిద్దాం...!!
- పి.జ్యోతి, 9885384740