Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంజనీరింగ్ అంటే యంత్రముతో నడిపే శాస్త్రం. ఈ విద్యలో భారతదేశం స్వాతంత్య్రం వచ్చే నాటికి బాగా వెనుకబడి ఉంది. 1947 నాటికి భారతదేశంలో కేవలం 36 ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే ఉన్నవి. వాటిలో 2500 మంది విద్యార్థులు చదువుతుండేవారు. కాలేజీలన్నీ ప్రభుత్వ అధీనంలోనివే. 2020 - 21 నాటికి ఇంజనీరింగ్ కళాశాలలు దేశం మొత్తం మీద 6052 ఉన్నాయి. వీటిలో దాదాపు 25లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విశేషమేమిటంటే, ఈ కళాశాలల్లో 4000 పై చిలుకు కళాశాలలు ప్రైవేటు యాజమాన్యంలో ఉండగా, ప్రభుత్వ ఆధ్వర్యంలో వెయ్యిలోపు కళాశాలలు ఉన్నాయి. మిగిలినని ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలు. బాధాకరమైన విషయమేమిటంటే, విద్యపై ప్రభుత్వ ఖర్చు క్రమంగా తగ్గిపోతున్నది. ఉదాహరణకు 2014 - 15లో విద్యపై ప్రభుత్వ ఖర్చు మొత్తం బడ్జెట్లో 4.1 శాతం కాగా, 2019 - 20 నాటికి ఆ ఖర్చు 3.4 శాతానికి పడిపోయింది. సాంకేతిక విద్యార్థులకు స్కాలర్షిప్పులు 2018 - 19లో అప్లై చేసిన విద్యార్థులలో 36 శాతం మందికి మాత్రమే ప్రభుత్వం అందజేసింది.
ఇంజనీరింగ్ విద్య, విద్యార్థుల పరిస్థితి ఇలా ఉంటే, ఇటీవల మన రాజకీయ పార్టీలు సోషల్ ఇంజనీరింగ్ అనే విద్యను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాయి. సోషల్ ఇంజనీరింగ్ అనేది ఒక రాజకీయ ప్రక్రియ. దాని అర్థం కులాల కూర్పు అని. ఎన్నికలలో గెలవడానికి ఏఏ కులాల కూర్పును ఏర్పాటు చేయాలి? ప్రత్యర్థిపార్టీ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్‌కు అంటే కులాల కూర్పుకు ప్రతిగా మనం ఏ విధమైన సోషల్ ఇంజనీరింగ్‌ను అనుసరించాలి? అనేది ఇప్పుడు రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న పంథా. ఏ పార్టీ వారు తాము కులాల కూర్పు, చేర్పు చేస్తున్నామని అంగీకరించరు. సోషల్ ఇంజనీరింగ్‌ను అనుసరిస్తున్నామని ప్రకటిస్తారు. ఉదాహరణకు సమాజ్‌వాది పార్టీ నాయకుడు ములాయంసింగ్ యాదవÊ తనకు మై (ఎమ్.వై) ఓట్లు వస్తే చాలు అనేవాడు. ఎమ్ అంటే ముస్లిములు, వై అంటే యాదవులు అని అర్థం. బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి దళిత, బ్రాహ్మణ ఏకీకరణ సాధించడానికి 50 మందికి పైగా బ్రాహ్మణులకు అసెంబ్లీ టికెట్లు కేటాయించి, విజయం సాధించింది. ఇక బిజేపీకి సోషల్ ఇంజనీరింగ్ అంతా దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ చేస్తుంది. ఆ సంస్థ కార్యకర్తలు, ఓటు బ్యాంకు అంతా జందెం వేసుకున్న కులాల వారే. పైకి హిందూత్వ జపం చేస్తున్నా, 'మనమంతా హిందు వులం, మనమంతా బంధువులం' అని నినాదాన్నిస్తున్నా, ఆచరణలో జందెం వేసుకున్న కులాల సమీకరణే ఆర్ఎస్ఎస్ చేస్తున్నది. ఉదాహరణకు సుధీష్ మిన్నీ అనే కేరళ రాష్ట్ర కార్యకర్త ఆర్ఎస్ఎస్లో కొంతకాలం పనిచేసి, దాని సిద్ధాంతం, ఆచరణలలోని ప్రమాదాన్ని గుర్తించి, ఆ సంస్థ నుండి బైటికి వచ్చి, 'రాకాసి కోరలు' అనే పుస్తకాన్ని రాశాడు. దానిలోని ఒక సంఘటనను వివరిస్తాను.
సుధీష్ మిన్నీ ఆర్ఎస్ఎస్ పని మీద కేరళ నుండి భోపాల్ వెళ్ళాడు. అక్కడ గణేశన్ అనే మళయాళి టీకొట్టు పెట్టుకొని జీవిస్తున్నాడు. అతనితో మిన్నీకి పరిచయమైంది. అతడు మిన్నీని ''జంధ్యాన్ని విడువవద్దు. అది లేకుండా ఎవరి జీవితమైనా ప్రమాదంలో పడుతుంది'' అని సలహా ఇచ్చాడు. (రాకాసి కోరలు, పేజీ 83), ఉత్తర భారతదేశంలో అనేక చోట్ల మిన్నీకి ఆర్ఎస్ఎస్ వారి ఈ సోషల్ ఇంజనీరింగ్ రుజువయింది. బొంబాయిలో ఒక ఉదయం జరిగిన శాఖకు (రోజు వారీ కార్యక్రమానికి) మిన్నీ హాజరయ్యాడు. అక్కడి స్వయం సేవకుల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, పోలీసు అధికారుల వంటి వారున్నారు. వారందరూ జంధ్యం ధరించి ఉన్నారు. అలాగే భోపాల్‌లో కూడా శాఖకు హాజరైన వారందరికీ జంధ్యం ఉండటం మిన్నీ గమనించాడు. ఇదీ బీజేపీ వారి సోషల్ ఇంజనీరింగ్!
ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలలో, పైకి ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా, ప్రధానమైన తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఒక్కొక్కరూ ఒక్కో కులాన్ని ఓటు బ్యాంకుగా కలిగి ఉన్నారనేది బహిరంగ రహస్యం. ఇదీ ఈ రాష్ట్రాలలోని సోషల్ ఇంజనీరింగ్!
ఐతే, ఇటీవల కొన్ని నెలల నుండి జరుగుతున్న రైతు ఉద్యమం సోషల్ ఇంజనీరింగ్ వలయాలను బద్దలు కొట్టిందనీ, ప్రజలు కులాలు, మతాలకతీతంగా ఐక్యమైనారనీ ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ విశ్లేషించి చెప్పారు. ఇది ప్రధానంగా ప్రజలకు వారి సమస్యలపై సమీకరించే వ్యూహం గల వామపక్షాలకు మార్గనిర్దేశనం కావాలి. అప్పుడే దేశం కుల మతాల సంకెళ్ళను ఛేదించుకొని ప్రగతి మార్గాన ముందుకు సాగుతుంది.
(ఇంజనీర్స్ డే సందర్భంగా...)
-- కె.ఎల్.కాంతారావు