Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి సమాజంలో మనిషి అభివద్ధితోపాటే ఆలోచనల్లో కూడా మార్పు తెచ్చుకుంటూ శరవేగంగా దూసుకెళ్తున్నాడు. పరిస్థితుల ప్రభావం కావచ్చు. సాంకేతికత కూడా కావచ్చు. హైటెక్ యుగంలో తనను తానే మరిచిపోతున్నాడు కానీ మెట్టా నాగేశ్వరరావు పద్యాలు మాత్రం మనిషిని ఒక్కసారి తన మూలాలను వెతికించే పని చేస్తాయనటంలో సందేహమక్కర్లేదు. బోడిమేక, ఇస్త్రీపెట్టె, మేకు మొదలైన కవితా వస్తువులను తీసుకొని మనిషి జీవితంతో ముడిపడిన ప్రతీది విలువైనదే అని కవితలరూపకంగా చాటిచెప్పాడు.
వత్తుల పట్ల దార్శనికత
''బట్టల్లోంచి
నాలుగు మెతుకులు రాలుతాయని
నాన్న అన్నప్పుడు నాకర్థం కాలేదు''అని ఇస్త్రీపెట్టె కవితలో తనకు ఇంత అన్నం పెట్టిన కులవత్తి పట్ల ఉన్న గౌరవాన్ని కవి ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పుకున్నాడు. ఇలా తన వత్తిని, తన సంస్కతిని, తన మూలాలను గౌరవించే వాడు ఎప్పుడూ కూడా ఏ రంగం నుండి వెనుకడుగు వేయడు.
ఇదే కవితలో ''మా ఇంట్లోనూ దైవమున్నాడు
ఆయన ఇస్త్రీపెట్టె అవతారమెత్తాడు'' అనే కవితా పాదాలను పరిశీలిస్తే కవి పూర్తిగా సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంత గాఢమైన వాక్యాలను రాయగలిగాడంటే ఎన్నో కష్టాలను బాధలను అనుభవించినట్లుగా తెలుస్తుంది. శ్రమజీవులకు దేవుడంటూ వేరే ఉండడు. చేసే పనిలోనే దేవున్ని వెతుక్కుంటారు కాబట్టి కవి నాలుగురాళ్ళు సంపాదించిపెట్టే ఇస్ర్రీపెట్టెను దేవుడి అవతారంగా ఈ కవితలో ప్రకటించుకున్నాడు.
''పల్లెమంగలి'' అనే కవితలో
''వాడి కత్తెరచప్పుడుకు మహిమోదో ఉంది
దేవలోకం అందమంతా భూమిమీదకు దిగుతుంది'' అని క్షురకుని నైపుణ్యాన్ని అందమే అసూయపడేలా చెప్పాడు. ఈ కవితా పాదాలలో శ్లేష అలంకారాన్ని ప్రదర్శించడం విశేషం. వాడి అనే పదాన్ని నానార్థాల్లో చూడవచ్చు. చివరకు ఇదే కవితలో పల్లెల్లో మంగలులు లేరంటూ పాలకులపై అసహనాన్ని వ్యక్తం చేశాడు. పల్లెల్లో అంతరించిపోతున్న కులవత్తులకు ప్రతీకగా ఈ కవితను కవి ఉదహరించినట్టుగా చెప్పుకోవచ్చు.
మానవీయకోణం-జీవనవిలువలు అనే కవితా సంపుటిని మానవీయ కోణంలో పరిశీలిస్తే, పుస్తకమంతా మానవీయ విలువలు పోతపోసినట్టుగా కనిపిస్తాయి. ''సర్కస్ పిల్ల'' అనే కవితలో
''ఆస్తులిచ్చిన ఆశ్రమాలకు తోలే
కరుణలేని కొడుకుల్లారా!పాపను చూడండి
పైన తాడుపై నడుస్తూ నడస్తూనే
నాన్నని ఓ కంట కనిపెడుతూనే ఉన్నది'' అంటూ వర్తమానంలో జరిగే సంఘటనలను ప్రతిబింబించే విధంగా వద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులను వదిలిపెట్టే కొడుకుల మూర్ఖత్వాన్ని ఎండగడుతూనే, కాళ్ళు లేని నాన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ సర్కస్ పిల్ల ఎలా బ్రతుకు భారాన్ని మోస్తుందో వివరించాడు.
పొద్దున్నే ప్రపంచంకంటే ముందే నిద్దురలేచి సైకిలెక్కి అందరికి వార్తలను పంచుతూ, తల్లిదండ్రులకు భారం కాకుండా ఎంతో కొంత చేతి ఖర్చుల మందం పోగేసుకుంటూ, జీవితరణాన్ని ఛేదించుకుంటూ సోమరిపోతులుగా మారి ఏంపనిచేయని యువకులకు ఆదర్శంగా పేపర్ వేసే అబ్బాయి నిలుస్తాడని కవి ''పేపర్ బచ్చా'' కవితలో
''సూర్యుని కన్నా ముందే
విశ్వాన్ని సైకిలెక్కించుకొని తిప్పుతాడు
రోజువారీ పాఠంలోని తొలివాక్యం
వేకువజామునుంచే జీవించడం నేర్పించే యోగి''అని పేపర్ వేసే బాలునిలోని శ్రమజీవన విలువలను వివరిస్తాడు. ఆ పిల్లవాడిలోని ఆత్మవిశ్వాసాన్ని కవి ప్రకటించిన తీరు ప్రత్యేకం.
వాస్తవిక జీవితం-కవితా వస్తువులు లో తన చుట్టూ జరిగిన వాస్తవజీవిత సంఘటలను తీసుకుని కవి కవిత్వం చేశాడు. వాస్తవంగా ఇది ఒక కోణంలో మెట్టా స్వీయచరిత్రనే. బతుకును కవిత్వం చేశాడు. ''మేకు''ను కూడా కవిత్వం చేశాడంటే ప్రతీ వస్తువును ఎంత దగ్గరగా గమనిస్తాడో అర్థం చేసుకోవచ్చు. కవితను నడిపించే తీరులో గాని, ముగింపులలో గాని తనదైన ముద్ర వేసుకున్నాడు.
కొన్ని కవితా పాదాలు చూద్దాం..
''ఇక నా కలం నుంచి
అక్షరాలు కాక మేకులు కురిపిస్తాను
వాటితో
దురాగతాలు చేసేటోళ్ళకి శవపేటికలు దిగ్గొట్టిస్తాను''
(మేకు కవిత నుండి)
''ఆ మూగజీవం చూపే
విశ్వాసం ముందు
ఎవ్వరమైనా మోకరిల్లాల్సిందే'' (బోడిమేక కవిత నుండి)
ఎద్దు
నన్ను మన్నించు
నిన్ను మోసగించిన మనుషుల్లో
మనిషినైనందుకు.. (ఎద్దు కవిత నుండి)
తాత్వికత
కొన్ని కవితల్లో తత్వాన్ని కూడా జోడించాడు ఈ కవి. ఎంతో పరిశీలనా శక్తి ఉంటే గాని ఈ కవితలు కవి రాయలేడు. తత్వం ఏం చెబుతుంది నిన్ను నీవు పరిశీలించుకోమంటుంది. ఆ వైపుగా పాఠకుల ఆలోచనలను కూడా మళ్ళించే బోధ ఈ కవితలలో కనిపిస్తుంది. ''తగలేత'' అనే కవితలో
''బతుకుతోవలో అంటుకున్న మలినాలను
ఎప్పటికప్పుడు తగలేసుకున్నవాడే
ఆఖరిమంటల్లో తేలికగా తగలడుతాడు'' అని అంటాడు
ఇందులో గొప్పపరమార్థం దాగియున్నది. చివరికి మనిషిని సాగనంపటానికి ఓ నాలుగు హదయాలు అక్కడికి రావాలంటే మనిషి అప్పుడప్పుడు తనలో ఉన్న చెడు గుణాలను తగలేసుకోవాలని కవి అంటాడు. తగలేసుకోవటమనేది బూడిదకావడానికి కాదట కాల్చిన మొక్కజొన్న పొత్తుల్లా రుచికరంగా మారటానికట .ఎంత గొప్ప తత్వం..
ఇంకా కవి తన బాల్యస్మతులను,శ్రమజీవితాలను, పచ్చని ప్రకతి దశ్యాలను తన పక్క నుండి నడిచెళ్లిన ప్రతి సంగతిని కవిత్వం చేశాడు. పల్లె పరిమళాలు గుప్పుమంటున్న ఈ మనిషోక పద్యం చదివి మూలాలను మరిచిన మనుషులంతా చక్కటి పద్యాలుగా తయారవ్వాలసిన అవసరం ఉంది.
- తండ హరీష్ గౌడ్
8978439551