Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కనుబొమ్మల మధ్య ధనస్సు ఊగుతుంది. కన్నుల మధ్య రాలే చూపులను ధనస్సు తూకం వేస్తూనే ఉంటుంది. చీకటిని నింపుకున్న నేత్రధనస్సు 'విల్లును వదిలి బతుకులను ఎండబెడుతుంది.' నేత్రాలను మదించినప్పుడు చూపుల్లో కంటకములు, బూజుపట్టిన ఇసుక, రాళ్ళను నింపుకున్న తడి మేఘాలు రాలిపడతాయి. ఇప్పడు నేత్రధనస్సులో సీతాకోక చిలుకలు, పాడి ఆవు నోట్లో నుండి జాలువారే లాలాజలం, యనుముల పొదుగులో వేలాడే వెన్నెల ఎందుకో రాలిపడటం లేదు. ఎందుకంటే నేత్రధనస్సుకు స్వార్థం, మోహం, మూర్ఖత్వం, అసూయ, కామం, ఎన్నో ఎనెన్నో చుట్టుముట్టి బంధిచేశాయి. అందుకే నేత్రధనస్సులో ఇంద్రధనస్సు చిగురించదు. అరచేతిలో గుడ్డితక్కెడ కాలిపోతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో అతిమంచి భాష, అతి క్రూరమైన భాష కూడా కన్నులు పలికించే భాషే. అది ఒక్కోసారి నదిలా ప్రవహించి గుండె లోతుల్లో ఇంకిపోతుంది, ఇంకొన్నిసార్లు చూపుల్లో మంటలు, మంటలు దహించే మంటలు, దరిద్రాన్ని మోసుకొచ్చే మంటలు నిప్పు రవ్వలై చెలరేగి గాయాలను కోస్తూనే ఉంటాయి.
ధ్వంసం చేయకూడదనుకుంటే ఎలా? అసలు ధ్వంసం చేయకుండా నీవు ఏదైనా నిర్మించావా? లేదంటే రాబోయే రోజుల్లోనైనా ధ్వంసం చేయకుండా నిర్మించగలవా? ధ్వంసం చేయాల్సిందే అప్పుడే నీ ఉనికి నిర్మింపబడుతుంది లేదంటే నువ్వు ఖాళీ ప్రదేశంలోనో, నీరులేని నది వదిలిన ఛాయాలోనో, ప్రసవించిన తర్వాత ఒట్టిపోయిన మేఘంలోనో, ఒడ్డునపడ్డ చేపకంట్లో నర్తించే మత్యువులోనో, దూడ మరణించినప్పుడు తల్లి ఆవు పెట్టె ఆర్తనాదంలోనే దశ్యంలా నువ్వు మరణిస్తావు. ధ్వంసం ఎంతో పవిత్రమైనది నిన్నటిని ధ్వంసం చేస్తేనే కదా నేడు సూర్యుడిని తూర్పుకొండలు నెట్టేది. నేటిని ధ్వంసం చేస్తేనే రేపు వేకువరేఖ కళ్ళల్లో వెలుగుతుంది. అందుకే ధ్వంసం చెయ్యి మంచి కోసం, సరికొత్త నిర్మాణం కోసం. ధ్వంసం చేయకపోతే ధ్వంసమే నిన్ను ధ్వంసం చేస్తుంది. నువ్వు కూడా ఎప్పుడైనా ధ్వంసం అవ్వాల్సిందే లేదంటే నిమిషం మరణిస్తుంది. ధ్వంసం అయ్యిందని బాధపడకండి మరో కొత్త నిర్మాణం జరుగుతుంది ఆశ. అదే మనల్ని రేపటి తీరంవైపు వడివడిగా నడిపిస్తుంది. ధ్వంసం మంచికే.
బతకడమంటే ఎర్రటి గూటిలో ఎప్పుడో మరణించిన ప్రాణంలా ఉండటమేనా? కాదుకాదు బతకడమంటే మట్టి పూసుకున్న శరీరం నుండి చెమట చుక్కలను రాల్చడమే. బతుకులో వెలుగు కాదు వెలుగే ఒక బతుకులాగా బతకాలి. అప్పుడే నిజమైన బతకడమంటే. ఈరోజు బతికాను అనుకుంటున్నావు కానీ నిన్న నువ్వు మరణించిన సంగతి మరిచి పోయావు. నిన్నటి మరణంలో నీలోని సకల చెడుగుణాలను కూడా చంపేసి సాదుజంతువులాగా మారిపోయుంటే బాగుండేది కానీ నువ్వు ఎప్పుడు వేటాడే మగానివే.
శరీరం కొన్ని కేజీల మాంసం మాత్రమే. అది నీదే అనుకుంటే ఎంత పొరపాటు లేదా ఎంత అమాయకత్వం లేదా ఎంత మూర్ఖత్వం.? మాంసం కుళ్ళిపోతుందని తెలియనివాడు ఉంటాడా? మాంసం కుళ్ళిపోకముందే వెలిగించు లేదంటే కంపుకొడుతుంది. నువ్వు ఎడారిలో నీటిని, ఆకాశంలో రక్తపు ఛాయలను, కాలం వదిలిన పాద ముద్రలలో పచ్చని మొక్కలు చూడకపోతే నీవు బ్రతికి ఉన్నావని ఎవరైనా ఎలా గుర్తిస్తారు?. అందుకే భౌతికంగా కాదు దశ్యాలలో, మనసును హత్తుకునే దశ్యాలలో బతికుంటే నీవు బతికున్నట్టే.
''నరికి ఎండలో పారేసిన /చెట్టు మొదలు ఏ సంగీతమూ వినిపించదు /తగలబడేటప్పుడు మాత్రమే/ అగ్ని సంగీతాన్నాలాపిస్తుంది.''
ఏది నీ ఉనికి? నువ్వు ఉన్నంతవరకు సరే, నీవు పోయిన తర్వాత నీ ఉనికి ఎలా నిలబడుతుంది? ఊరికే శబ్దం చేస్తే సరిపోతుందా శబ్దంలో సంగీతాన్ని నిర్మించు లేదా సంగీతాన్ని శబ్దించు అప్పుడే నీ జీవితానికి ఒక ఉనికి ఏర్పడుతుంది. నీవు మరణంలో కూడా లయించాలి అప్పుడే నీ ఉనికి చాటబడుతుంది. ఒక్కో జ్ఞాపకం ఒక్కో అక్షరాన్ని బహుకరిస్తుంది. ప్రతిక్షణం కొమ్మకు బరువెక్కిన పువ్వులాగా మోగుతూనే ఉండు. వీలైతే పరిమళాన్ని కూడా పెద్దశబ్దం చేసి నాసిక పుటల్లోనే కాదు చెవులలో కూడా ఒక సన్నని తీగ సహాయంతో వదిలితే నీ ఉనికి జీవిస్తుంది. బతికున్న చావులా కాదు నువ్వు చావును ధ్వంసం చేసిన మనిషిలా ఉండాలి. ఉనికి అంటే నీ ప్రతాపం లేదా నీ శౌర్యం కాదు 'ఒక వెచ్చని అక్షరం' అందులో పొదిగిన భావాలు.
వేలాడితే తప్పేముంది? నువ్వు కూడా తల్లిగర్భంలో వేలాడిన వాడివే కదా! అయినా నీ జీవితం ఇంకా ఆమె పొత్తికడుపులో వేలాడుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఆమెను లేదా ఆమె అంగాలను వేలాడుతున్నాయని ఎలా అంటావు? ఎండిపోయిన భూమిలో నీరులా ఆమె పొంగినప్పుడు, వెడలిపోయిన ఆకాశంలో చందమామలా వెలిగినప్పుడు కావాలి. నీ వంశాన్ని విసిరేసిన మరుక్షణమే ఆమెను చీకటి కత్తిలో వేలాడతీస్తావు. ఆమెను క్షణక్షణం కంగతీస్తావు, ఆమె శరీరానికి వేలాడే బాధను ఎప్పుడైనా గమనించావా? ఆమె శరీర భాగాలు వేలాడుతున్నాయి అనుకుంటాను. ఒకసారి పరిశీలనగా చూడు! ఆమె అంగాలు చిన్నపిల్లవాడి నోటి నుండి జారే జొల్లులాగా ఉన్నాయి. మరి అది అందమే కదా!. ఆమెననే ముందు నీవు ఎంతసేపు నిలబడగలవు? మహా అయితే అరగంట తర్వాత సమయమంతా వేలాడుతూనో, వేలాడుతీసుకుంటునో ఉంటావు కదా! మరి ఎందుకంత పొగరు? ఎందుకంత పెత్తనం. నీ వేలాడే బతుకు ఎవరికీ తెలియదు అనుకోకు. అన్నీ వేలాడుతూనే ఉన్నాయి ఆకాశానికి భూమి, భూమికి ఆకాశం వేలాడటం నేరం కాదు.
జీవితాన్ని తరగతి గది ఎప్పుడూ నిర్మించలేదు కేవలం నిర్మాణం చెందటానికి అదొక పాత్ర మాత్రమే. మనం నిర్మాణం కావాలంటే తరగతి గదిలో రాసే పరీక్ష మాత్రమే కాదు జీవిత పరీక్ష కూడా జయించాలి. ఇది ఒక్కసారి కాదు ప్రతిరోజు, ప్రతి నిమిషం జయించాలి. నువ్వొక పచ్చని పాదమై సాగుతూనే ఉండు. నీ పాదముద్రలలో ఎన్నో మొక్కలు పెరిగి వక్షాలుగా విస్తరిస్తాయి. అప్పుడు నీ జీవిత నిర్మాణమే కాదు ఎన్నో జీవితాలపై నీడలు కురుస్తాయి.
''నా దుఃఖాన్ని మంచం మీదేసి పొర్లించి పొర్లించి తంతా''
మనం పోరాడేది దుఃఖంతోనే దాన్ని ఎప్పుడు కంట్లో నుండి ఊడిపడనీయకు, కాళ్ళ కింద వేసి తొక్కిపడేయాలి. అరుణోదయం జరిగే ఆ కళ్ళలో దుఃఖం ప్రవహించకూడదు. అందుకే దుఃఖాన్ని మడతపెట్టి అటక మీద పడేయాలి. దుఃఖాలు ముఖాలపై మొలకెత్తనివ్వకు. దుఃఖాన్ని కళ్ళలో నింపుకుంటే కన్నీరు ఊరుతుంది. ఊరే కన్నీటిలో పొరలు అడ్డుపడతాయి, పొరలు అడ్డుపడుతే చూపులు ఇంకిపోతాయి. చూపులు ఇంకిపోతే ముందుచూపులు తేలిపోతాయి. అప్పుడు బతుకు మసక మసకగా.
''తొమ్మిది నెలలు నిండి చచ్చి పుట్టిన బిడ్డలా సూర్యుడు నాలో ఉదయిస్తాడు'' మనలో ఎన్నో ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి మనం మాత్రం ఆత్మహత్య చేసుకో కూడదు. ఎందుకు చేసుకోవాలి? రోజు ఇటువైపు మరణించిన సూర్యుడు అటువైపు జీవం పోసుకుంటున్నాడు. మరి మనమెందుకు ఆత్మహత్య చేసుకోవాలి? అవసరమైతే ఆత్మహత్యను హత్య చేసి మరో సూర్యుడిలా కొనసాగండి. ఇక్కడ కాకపొతే మరెక్కడో లేదా ఈ పాత్రలో కాకపొతే మరేదో పాత్రలో ఎప్పుడూ జయించడమే మన లక్షణమై ఉండాలి.
ఆమె ఎవరైతేనేమి? ఆమె నేత్రద్వయంలో ఊగే కన్నీరుకు కారణం మాత్రం వాడే, ఆమె ఎవరైతేనేమి? ఆమె చేతులలో మరణించిన సూర్యుడి మరణానికి కారణం వాడే, సమస్తం వాడేబీ జీవితాన్ని బొట్లు బొట్లుగా వర్షించడమంటే గాలిపటాన్ని సముద్రంలో ముంచడం కాదు, ఆకాశంలో గాలిపటాన్ని ముంచాలి. అప్పుడే ఆమె నవ్వుతూ ఏడుస్తుంది. ఆమె నవ్వులో ఆనందమైన ఏడ్పు ధ్వనిస్తుంది.
వాడికి కోపం ముక్కుమీద నర్తిస్తుంది, మా వాడికి కోపం కన్నుల్లో వర్షిస్తుంది, ఇంకొకడికి కోపం పెదవుల కంచె దాటి సముద్రాన్ని చీలుస్తుంది. అదేమో ఆమెకు ఆనందం, ఆయన శరీరంలో పొగరు, చేసేది చారిత్రక తప్పు. మా వాడికి అవి ఉండాల్సిందే లేదంటే ఎలా నడుస్తాడు? అదెలా జరుగుతుంది? వాడి చేతుల్లో నక్షత్రాలు లేకపోతే వాడెలా వెలుగుతాడు?. అది చెడు అయినా కూడా మా కళ్ళకు వెలుగులానే కనపడుతుంది. నిజానికి వాడేమి నేరం చేయలేదు మీరే వాడి చేతిలో రక్తాన్ని పలికిస్తున్నారు. తప్పు వాడు చేశాడని చెప్పడం దగాకోరు తనమే. చివరికి మీరు ఒంటరిగా మిగిలిపోవాల్సిందే. తలుపులు తెరుచుకొని, ముడతలు విప్పుకొని పిలుపు కోసం చెవు లను, చెవులతో పాటు కన్ను లను కూడా గుమ్మంపై వేసుకొని ఎదురుచూడాల్సిందే. ఆ చూపులో ఎండిపోయిన సెలయేరు ఎగిరిపోతుంది.
''నా మౌనాన్ని అర్థం చేసుకోవాలంటే నీ కళ్ళలో అక్షరం కదలాలి'' అక్షరం కదలనిచోటు ఎక్కడైనా ఉంటుందా!? ఒకవేళ ఉంటే అక్కడ శ్మశాన నిర్మాణం జరుగుతున్నట్టే. లేదా అక్కడ గాలి ఆత్మహత్య చేసుకున్నట్టే అదీ కాదా పచ్చదనం నిలువులా దహించుకుపోయినట్టే. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు మౌనంగా ఉన్నామంటే అక్కడ అక్షరం మాట్లాడుతోందని అర్థం. ఏదైనా నేను చేసినదే లేదా అది నా సొంతం అనుకోకపోతే లేదా ఏదైనా నిర్మొహమాటంగా ప్రకటించకపొతే నీ లోలోపల నువ్వు మరణించినట్టే. అందుకే నీకేది కావాలంటే అది చేయాలి పక్కన ఉన్న శరీరాలకు గాయం కాదు కదా చిన్న గీత కూడా పడకుండా. స్వేచ్ఛగా జీవించడం కాదు స్వేఛ్చగా
జీవించేలా చేయాలి దేనిని పంజరం లో బంధించకు. నేడు పంజరాలు బద్దలవ్వాలి, కనీసం కాలమనే జాలంలో కూడా దిగబడి పోకు... పైపైనే ఎగరాలి, గాలి కూడా నిన్ను చూసే ఎగరడం నేర్చు కోవాలి. అప్పుడే నేత్ర ధనస్సులో సూర్య చంద్రులు జన్మిస్తారు. నేత్ర ధనస్సు గ్రంధం ఆధునిక సమాజానికి ఒక వెలుగు అందులో ఎలా వెలగాలో నేర్చుకోవచ్చు.
- అఖిలాశ, 7259511956