Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలాలేవైనా పుట్టి పెరిగిన ప్రాంతం పట్ల మమకారం ఉండటం, కాలాలేవైనా కట్టు బానిస సంకెళ్లను తెంచడం కోసం అహరహం పరితపించడం, నిబంధనలెన్ని ఉన్నా స్వాతంత్య్రం కోసం జీవితాన్ని ధారపోయడం కొందరికే సాధ్యం. అటువంటి వారిని అందరూ స్మరించడం ముదావహం. ఇలా సాహిత్య స్మరణలో తన స్థానాన్ని సొంతం చేసుకున్న వ్యక్తే హీరాలాల్ రారు మోరియా.
జీవన రేఖలు...
స్వాతంత్య్ర సమరయోధుడు, పాత్రికేయుడు, కవి, రచయిత అయిన మోరియా తొలితరం ఖమ్మం జిల్లా కథా రచయిత. 13-07-1924లో ఖమ్మం పట్టణంలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నప్పుడు తరగతి గోడ మీద వందేమాతరం గీతం రాసి ప్రిన్సిపాల్ ఆజీమ్ ఆగ్రహానికి గురైయ్యాడు. ప్రిన్సిపాల్ బెత్తంతో కొడుతుండగా ఆవేశాన్ని ఆపుకోలేక ఎదురు తిరిగాడు. దాంతో పాఠశాల నుండి డీబార్ కాబడ్డాడు. అనంతరం ఆర్య సమాజ్ వారి కేశవ మెమోరియల్ స్కూలులో మెట్రిక్ చదివాడు. చిన్నప్పటి నుండే ఉర్దూలో చక్కటి ప్రావీణ్యాన్ని స్వంతం చేసుకొని కవిత్వం రాయసాగాడు.
ఉద్యమకారుడిగా...
హైస్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడు హైదరాబాదులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూసి, ప్రేరేపితుడై తర్వాత హైదరాబాద్ సంస్థాన స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాడు. ఈ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మోరియా అజ్ఞాతవాసిగా ఉండి ఉద్యమానికి చేయూతనిచ్చాడు. మధిర తాలుకాలో 1938లో నైజాం ప్రభుత్వానికి అననుకూలంగా సత్యాగ్రహం చేస్తున్నప్పుడు తన రాజకీయ గురువైన జమలాపురం కేశవరావుతో అరెస్టయి నిర్బంధానికి లోనయ్యాడు. ఈ సత్యాగ్రహంలో నాడు వరంగల్లు జిల్లా నుండి సత్యాగ్రహంలో పాల్గొన్న అత్యంత చిన్న వయసు గల వ్యక్తి హీరాలాల్ మోరియా. చిన్నతనంలో ప్రభుత్వం పట్ల ఇంత సంకల్ప వ్యతిరేకతను చాటుకున్న సందర్భంగా అక్కడే మాడపాటి రామచంద్రరావు తన మెడలో పూలమాలతో సత్కరించాడు. నాటి సమకాలికులైన దాశరథి, కాళోజీ, జమలాపురం కేశవరావు వంటి వాళ్ళతో సాన్నిహిత్యంగా మెలిగేవాడు. జాతీయోద్యమం జరుగుతున్న రోజుల్లో వరంగల్ జిల్లా మొదలుకొని తెలంగాణ అంతటా ప్రజల్ని చైతన్యం చేసేందుకు పర్యటించి భారీ బహిరంగ సభల్లో ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈ విధంగా ప్రజల్లో జాగతం తీసుకొస్తున్నందున ప్రభుత్వం ప్రమాదకర వ్యక్తిగా ముద్రవేసింది. నైజాం ప్రభుత్వాన్ని ప్రతిఫటిస్తూ ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నందుకు మోరియాపై 13 కేసులు పెట్టింది. ఈ కేసుల మూలంగా తన జీవిత కాలంలో మొత్తం పదిహేడు సంవత్సరాల జైలు జీవితాన్ని గడిపాడు. అందులో నిజామాబాద్ కేంద్ర కారాగారం ఒకటి. ఈ జైల్లో ఖైదీలకు కల్పించవలసిన కనీస సౌకర్యాల కోసం, వాళ్ళ హక్కుల కోసం జైలులోనే సత్యాగ్రహం చేశాడు. ఆర్య సమాజం, మత సంస్కరణ ఉద్యమాలను సమీపంగా దర్శించాడు.
సాహిత్య కషి, పదవులు...
మోరియా పూర్వీకులు అంతా ఉత్తర భారతీయులు కావడంతో మాతభాష అయిన హిందీలోనూ, ఉర్దూలోనూ కథల్ని రాసి ఉత్తర హిందూస్థానపు పత్రికలలో ప్రకటించాడు. ఇతని కథలు ఒక్క తెలుగు భాషలోనే వందకు పైగా వచ్చాయి. హిందీ, తెలుగు, ఉర్దూ భాషల్లో కలిపి మొత్తం రెండు వందలకు పైగా కథలు రాశాడు.
హీరాలాల్ 1942 నుండి కథలు రాయడం ప్రారంభించాడు. హీరాలాల్ మహా ఉదాత్తమైన కథలు రావాలని తపన పడే వ్యక్తి. కథలో ఏ వస్తువున్నా దానికంటూ ఒక సాఫల్యత, ఒక ప్రయోజనం అనేది ఉండాలని కోరుకుంటాడు. మోరియా రాసిన కథలు నాటి తెలుగు స్వతంత్ర, ప్రతిభ, గోలకొండ, శోభ, నేత, కాకతీయ మొదలగు పత్రికలలో ప్రచురితమై ఆనాడు ఒక ప్రభంజనాన్ని సష్టించాయి. వెలువడేది ఏ పత్రిక అయిన దానిలో తప్పకుండా ఏదో ఒకటి మోరియాది ప్రచురితమై ఉంటుంది. సాహిత్యం తాలూకు ప్రభావాన్ని, దాని విలువను, సాహిత్య కషిని గురించి తోడ్పడేందుకు ఖమ్మం జిల్లా రచయితల సంఘం స్థాపించి ఈ సంఘం పక్షాన 50 పుస్తకాలను ప్రచురించాడు. 1962లో మహాకవి గురజాడ అప్పారావు శత జయంతి సందర్భంగా ఆ ఉత్సవాలను ఖమ్మంలో మహా ఘనంగా జరిపాడు. 'బ్రతుకు బాటలు, పరిష్కారం' పేర కథల సంపుటాలు రాశాడు. ఈయన ఇది కదనం- కదలండి, రండి స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుందాం, మిన్నేటి పొంగులు, నా భూదేవి బిడ్డను మొదలగు కవితా సంపుటాలు రాశాడు. అలాగే మ్రోగని కంఠాలు, మాయని గాయాలు మొదలగు కథా సంపుటాలు. గుడిమెట్లు, తెగని గొలుసులు, విరగని విగ్రహాలు, జీవనది, ఎవరి కోసం అనే నవలలు రచించాడు. ఇంకా స్వాతంత్ర వీరుడైన జమలాపురం కేశవరావు జీవిత చరిత్రను మహారథం పేరుతో రాశాడు. వీరి సాహితీ సేవకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు ఉత్తరప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది.
కేవలం సాహిత్య సేవనే కాక మోరియా పలు పదవులను కూడా చేపట్టాడు. ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థకు సభ్యులుగా పదేళ్లు కొనసాగాడు. ఖమ్మం జిల్లా కాంగ్రెసు కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు. 1964లో విధాన సభకు నామినేట్ అయ్యాడు. అపారమైన సాహిత్య సేవకుడు, దేశభక్తుడు, నిష్కళంక జీవియైన హీరాలాల్ రారు మోరియా అక్టోబర్ 13 2006 లో కాలధర్మం చెందారు.
- ఘనపురం సుదర్శన్