Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తడకమళ్ళ రుక్మిణమ్మ, వేదాంతరావు గారలకు యీ వ్యాస సంపుటి అంకితం చేశారు రచయిత. న్యాయం - చట్టం - కోర్టులు - వ్యాజ్యాలు మొదలైన అంశాలపై రచయిత రాసిన వ్యాసాలతో ఈ సంపుటి పాలపిట్టబుక్స్ వారు ప్రచురించారు. వివిధ దినపత్రికల్లో ప్రచురణైన వ్యాసాలే ఇవి. ఎన్నో సెక్షన్లు, కేసుల స్థితిగతులపై యీ వ్యాసాలున్నాయి. 'లా' పుస్తకాలు ఆంగ్లంలో ఎన్నో ఉన్నాయి. కానీ సులభశైలిలో కేసులు - తీర్పులు మొదలైన అంశాలు తెలియజేస్తూ యీ వ్యాసాలు పాఠకుల్ని ఏకబిగువున ఉత్కంఠంగా చదివింప జేస్తాయి.
ఉదాహరణకు ఏదైనా ఒక క్రిమినల్ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా చార్జి షీటు దాఖలు చేసినట్లయితే అటువంటి నిందితులు కేసు నుంచి విముక్తి కోసం దిగువ న్యాయస్థానాల్లో సెక్షన్ 239 సీ.ఆర్.పీ.సీ. ప్రకారం లబ్ధిపొందే అవకాశం వున్నది (పేజీ 79) అంటారు. కుటుంబ న్యాయస్థానాల చట్టం 1984, ప్రకారం అంతర్గతంగా మాత్రమే భార్యాభర్తల వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు పరిష్కరింపబడతాయి. అలాగే గృహహింస నిరోధక చట్టం - 2006 ప్రకారం కూడా రహస్య విచారణ మాత్రమే చేయాలి (పేజీ 69)- కానీ టీవీ చానళ్లు బహిర్గతం చేస్తూ సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు కరెక్టు కాదు అనే అభిప్రాయాన్ని రచయిత తెర మీద తెరమీద తీర్పులేల? అనే వ్యాసంలో చక్కగా చెప్పారు. న్యాయదేవత ఎందుకలా! వ్యాసం బాగుంది. 2019 సర్వే ప్రకారం అవినీతిలో తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. భారతదేశం 180 దేశాలతో పోలిస్తే 78వ స్థానంలో ఉంది. (పేజీ 100).
దత్తత గ్రామాల పరిస్థితేంటి? (పేజీ 93) 'సుప్రీం' తీర్పుల్లో భిన్న కోణాలు (పేజీ 73) న్యాయం కోసం పోరాటం (పేజీ 55), కక్షిదారులకు సుప్రీం ఊరట (పేజీ 41), బ్యాంకుల నిర్వాకం (పేజీ 37), వాహన చట్టం - చర్యలు (పేజీ 33), న్యాయ పోరాటంలో గెలిచి ప్రజా క్షేత్రంలో ఓడిన ఇందిరమ్మ (పేజీ 20) వ్యాసాలు చాలా విలువైనవి. ప్రామాణికమైనవి. డిస్ట్రిక్ట్ - సెషన్స్ జడ్జిగా లోక్ అదాలత్ చైర్మన్గా విశేష కృషి చేసిన అనుభవంతో మంచి పుస్తకం మురళీధర్ పాఠకులకు అందించారు. అభినందనీయులు.
(న్యాయం గెలుస్తుంది (వ్యాసాలు), రచన : తడకమళ్ళ మురళీధర్, పేజీలు : 100, వెల : రూ.100/-, ప్రతులకు : పాలపిట్ట బుక్స్, ఇ.నెం. 16 -11 - 20/6/1/11, ఫ్లాట్ నెం. 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్పేట, హైదరాబాద్ - 500036. సెల్ : 9848787284)
- తంగిరాల చక్రవర్తి, 9393804472