Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20.10.1951 నుండి 01.11.1956 వరకు
1947లో పార్టీ కార్యదర్శిగా దేవులపల్లి వెంకటేశ్వరరావు పని చేశారు. కొంతకాలం తర్వాత బద్దం ఎల్లారెడ్డిని కార్యదర్శిగా మార్చారు. వీరు పోరాటం కొనసాగించాలని వాదించారు. పోరాట విరమణ తర్వాత రహస్యంగా ఉన్న పార్టీ నాయకత్వం 25 మంది సభ్యులతో నూతన తెలంగాణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో అజ్ఞాతవాసంలో ఉన్న కేడర్, జైళ్ళ నుండి విడుదలైన వారు, ఇంకా జైళ్ళలో ఉన్నవారు ఉన్నారు. ఎన్నికల గురించి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేందుకు, ఉద్యమాన్ని సంరక్షించుకునేందుకు కార్యవర్గంగా ఒక చిన్న కమిటీని కూడా వేశారు. ఈ కమిటీతో సహకరించడానికి లీగల్‌గా పని చేస్తున్న కామ్రేడ్స్ నిరాకరించారు. కామ్రేడ్ సుందరయ్య ఐక్య తెలంగాణ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కామ్రేడ్ బసవపున్నయ్య, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముగ్దుం మొహియిద్దీన్, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డిలతో సెక్రటేరియట్ ఏర్పడింది. విభేదాల పరిష్కారానికి రెండువంతుల మెజార్టీతో నిర్ణయం తీసుకోవాలని అంగీకరించారు. ఆయుధాలను అప్పగించాలన్న నిర్ణయంలో దేవుల పల్లి వెంకటేశ్వరరావు కూడా భాగస్వామే. అయినా విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. 1956 తర్వాత నీలం రాజశేఖరరెడ్డి కార్యదర్శిగా ఉన్నారు.
తెలంగాణా సాయుధ పోరాట విరమణ అనంతరం యూనియన్ పోలీసుల సహాయంతో తమ ప్రాంతాలలోకి వచ్చిన భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు తిరిగి తమ భూములను లాక్కోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1951 రక్షిత కౌలుదారీ చట్టంలో ఉన్న లోపాన్ని ఆసరా చేసుకుని రైతులచే రాజీనామాలు పెట్టించి తిరిగి కొంతమంది భూములను స్వాధీనం చేసుకున్నారు. ''రైతు స్వచ్ఛందంగా తన రక్షిత కౌల్దారీ హక్కును వదులుకుంటే భూమి తిరిగి భూస్వామి చేతికి వెళ్తుంది'' అని చట్టంలో ఒక రంధ్రాన్ని పెట్టారు. ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతాలలో రాజీనామాల కుట్రలు సాగలేదు. ప్రజలు ఆక్రమించుకున్న 10 లక్షల ఎకరాలలో దాదాపుగా 2.5 లక్షల ఎకరాలు తిరిగి భూస్వాములు స్వాధీనం చేసుకున్నట్టు ఒక సర్వే చెపుతున్నది. ఆ తర్వాత కూడా ప్రజలపై పోలీసులు దాడులు, దౌర్జన్యాలు కొనసాగించారు. రాజ్ ప్రముఖ్‌గా ఉన్న నైజాం నవాబుకు కాంగ్రెస్ వారు ఇచ్చిన తోడ్పాటుతో ప్రజలపై దౌర్జన్యాలు, హింస పెద్దఎత్తున సాగాయి. 1952 ఎన్నికల వరకూ ఈ నిర్భంధం కొనసాగుతూ వచ్చింది.
రహస్య శిబిరం నుండి వెళ్ళిపోయిన రావి నారాయణరెడ్డిని పార్టీ నుండి బహిష్కరించారు. ఈ బహిష్కరణను మే 1951న ఉపసంహరించుకుని తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. 1951లో కేంద్ర కమిటీ చేసిన ఈ క్రింది తీర్మానాలలో భూములను దక్కించుకోవడానికి పోరాటాలు చెయ్యాలని పిలుపిచ్చారు.
1) తిరిగి భూస్వాములకు భూములు అప్పగించరాదు.
2) స్వాధీనం చేసుకున్న ప్రజల చేతుల్లోనే ఉంచుకోవాలి.
3) పాలేర్ల జీతాలు, కూలి వారి కమిటీ నిర్ణయించిన విధంగా పెంచాలి.
4) రైతులపై పెట్టబడిన కేసులను ఎత్తివేసి వారిని జైళ్ళ నుండి విముక్తి చేయాలి.
5) కౌలుకు తీసుకున్న భూమిలో అత్యధిక భాగాన్ని తమ స్వాధీనంలోనే ఉంచుకోవాలి.
6) భూస్వాములకు వెట్టిచాకిరీ మానేయాలి
ఉద్యమంలో జరిగిన లోపాలను కూడా చర్చించారు. ''ఇది శాశ్వత విముక్తి ఉద్యమం'' అనే ప్రచారం తప్పని, స్థానికంగా ఒక ప్రాంతంలో వచ్చిన గెరిల్లా పోరాటం కొన్ని సమస్యల పరిష్కారంతో పాటు భూ సమస్యను పరిష్కరించిందని కేంద్రకమిటీ తీర్మానించింది. పోరాటం జరుగుతున్న సందర్భంగా కొంతమంది దీనిని 'విముక్తి పోరాటం'గా వర్ణించిన ఘటనలు కూడా ఉన్నాయి.
కేడర్ విధానం
5 సం||ల పాటు జరిగిన తెలంగాణ గెరిల్లా పోరాటంలో అగ్ని పరీక్షలో ఆరితేరిన అనుభవం గల 650 మంది కేడర్ ఉన్నారు. అందులో తెలంగాణ ప్రాంతానికి చెందినవారు 233 మంది ఉన్నారు. వీరంతా ఉద్యమానికి అమూల్యమైన పెట్టుబడి లాంటివారు. గెరిల్లా దళాలను రద్దు చేసి వారిని రాజకీయ దళాలుగా పున:నిర్మించుకుని వారితో పనిచేయించుకోవాలి. ప్రభుత్వం మన సంఘం మీద, పార్టీ మీద నిషేధం కొనసాగిస్తున్నందున కేడర్‌ను, దళాలను తుడిచి పెట్టాలనే పన్నాగంతో ఉన్నందున వారిని కాపాడు కోవాల్సిన అవసరం ఏర్పడింది. అందువలన కొందరు ఆత్మరక్షణ కోసం ఆయుధాలు అట్టిపెట్టుకోవాలని పార్టీ నిర్ణయించింది. కేడర్ తీవ్రమైన ఆహార సమస్యను కూడా ఎదుర్కొన్నారు. ఇందుకోసం వారు ప్రజలపై ఆధారపడాల్సి వచ్చింది.
ఎన్నికలు
ఎన్నికలకు ముందు వెల్లోడిని ముఖ్యమంత్రిగా 26.1.1950న నిర్ణయించారు. అతని నేతృత్వంలోనే 1952 తెలంగాణ ఎన్నికలు జరిగాయి. 1952లో జరిగిన ఎన్నికల్లో కమ్యునిస్టులు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) పేరుతో 77 స్థానాలలో పోటీచేసి 42 స్థానాలలో గెలిచారు. మొత్తం 175 స్థానాలలో మహారాష్ట్ర, కర్నాటక స్థానాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాలలో కూడా కమ్యునిస్టులు 6 స్థానాలలో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలిచి పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ తరపున బూర్గుల రామకృష్ణారావు మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. 1957లో జరిగిన ఎన్నికల్లో 64 స్థానాలకు పోటీ చేసి 22 స్థానాలలో మాత్రమే గెలుపొందారు. 1952లో 10.80 లక్షల ఓట్లు రాగా, 1957లో 9.27 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి.
1955లో ఆంధ్ర ప్రాంతంలో 169 స్థానాలకు పోటీ చేసి కమ్యునిస్టులు 15 స్థానాలు మాత్రమే గెలిచినప్పటికీ 26.85 (31.13%) లక్షల ఓట్లు సాధించారు. 1955లో గెలిచినవారు 7 సం||ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు వచ్చేవరకు, అనగా 1962 వరకు పదవులలో కొనసాగారు.
అప్పటికే ''విశాలాంధ్రలో ప్రజారాజ్యం'' పేరుతో ఆంధ్ర, తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చెయ్యాలన్న నినాదాన్ని కమ్యునిస్టు, కాంగ్రెస్ పార్టీలు ముందుకుతెచ్చాయి. తెలంగాణలో చాలామంది ప్రత్యేక తెలంగాణ ఉండాలని వాదించగా, శాసన సభ్యులుగా గెలిచినవారు విశాలాంధ్ర కొరకు రాజీనామాలు చేస్తామని ఆందోళన చేశారు. ఇదిలా ఉండగా, ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ పరిస్థితుల్లో అనేక మార్పులు వచ్చాయి.
ఆంధ్ర ప్రాంత పరిస్థితులు
కోస్తా ఆంధ్ర మద్రాస్ రాష్ట్రంలో కలిసి ఉంది. రాయలసీమ ప్రాంతాలు కొన్ని మైసూరు, కొన్ని కర్నాటక ప్రాంతంలో కలిసి ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడాలని కోస్తా ఆంధ్ర నాయకత్వం తీర్మానం పెట్టింది. కానీ రాయలసీమ జిల్లాలు వ్యతిరేకించాయి. కోస్తాంధ్రలో కలిస్తే తమ సమస్యలు పరిష్కారం కావని వ్యతిరేకించారు. రాయలసీమ వారికి నచ్చజెప్పటానికి 1937లో విజయవాడలో ఆంధ్ర మహాసభను జరిపి రాయలసీమ ప్రజలను ఆహ్వానించారు. వారి భయాందోళనలను పోగొట్టవలసిన బాధ్యత ఆంధ్ర నాయకత్వం ఉందని కడప కోటిరెడ్డి అన్నారు. 1937 నవంబర్ 16న రాయలసీమ నాయకులతో ఏర్పాటు చేసిన సంఘం మద్రాసులో కాశీనాధుని నాగేశ్వరరావు ఇంట్లో సమావేశం జరిపారు. కాశీనాధుని ఇంటికి ''శ్రీబాగ్'' అని పేరు పెట్టుకున్నారు.
శ్రీబాగ్ ఒప్పంద వివరాలు
1) ఆంధ్ర విశ్వవిద్యాలయ కేంద్రాలు ఎ) వాల్తేరు బి) అనంతపురంలో నెలకొల్పాలి
2) రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల ఆర్థిక స్థాయిని సర్కారు సెక్రటేరియట్ల ఏర్పాటుకు అవకాశంలేదు. రాజధానికి కావలసిన అన్ని అనుకూలతలు హైద్రాబాద్‌లో ఉన్నాయి.
అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే రాజధాని సమస్య పరిష్కారం అవుతుందని భావించారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉంది. ఆ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలోని శాసన సభ్యులు రాజీనామాలు చేసి ఆంధ్రప్రదేశ్ పేరుతో తిరిగి పోటీ చేస్తామని ప్రకటించారు. ఆ పరిస్థితుల్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు అంగీకరించింది. రెండు ప్రాంతాలు కలపడానికి ''పెద్ద మనుషుల ఒప్పందం'' చేసుకుంది.జిల్లాలతో సమానంగా పెంచడానికి 10 సం||ల ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలి. తుంగభద్ర, కృష్ణా జలాలను, హగరి జలాలను రాయలసీమకు ఉపయోగపడేటట్లు ప్రణాళిక చేపట్టటం.
3) శాసనసభలో అన్ని జిల్లాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడం
4) ఆంధ్ర రాష్ట్ర రాజధాని, హైకోర్టులలో దేనిని కోరితే దానిని రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చెయ్యాలి.
ఈ ఒప్పందంపై ఉభయ ప్రాంతాల నాయకులు సంతకాలు చేశారు. వారందరూ కలిసి నాటి ముఖ్యమంత్రి సి.రాజగోపాల చారిని కలిసి ఒప్పందాన్ని వివరించారు. దీని ఆధారంగా కొండా వెంకటప్పయ్యగారు 1938లో మద్రాసు శాసనసభలో ''ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర'' తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానిని శాసనసభ ఆమోదించింది. 1938లో సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన ఆంధ్రమహాసభ మద్రాసులో సమావేశమై ఆంధ్ర రాష్ట్రం కొరకు తీర్మానం చేసింది.
కోస్తా 9 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు కలిపి ఆంద్ర రాష్ట్రంగా ఏర్పర్చాలని పెద్దఎత్తున ఆందోళనలు సాగాయి. కేంద్రం అంగీకరించకపోవడంతో థార్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ భాషాప్రయుక్త రాష్ట్రాలు పనికిరావని తీర్మానం చేసింది. ఆ తర్వాత 1948 డిసెంబర్లో ''జెవిపి'' కమిటీ వేశారు. ఈ కమిటీలో నెహ్రూ, వల్లభాయి పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులు. అందువల్ల ఈ కమిటీకి జెవిపి అని పేరు వచ్చింది. ఆస్తుల పంపకానికి పార్టిషన్ కమిటీ కూడా వేశారు. 1952లో మద్రాస్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆంధ్రలో 140 సీట్లుండగా 43 మాత్రమే గెలిచారు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1951 ఆగస్ట్ 15న గొల్లపూడి సీతారామశాస్త్రి 35 రోజులు నిరవధిక నిరాహారదీక్ష చేశాడు. ఆచార్య వినోబభావే వచ్చి విరమింపజేశాడు. ఆ తర్వాత 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష ప్రారంభించి 1952 డిసెంబర్ 15న మరణించారు. దీంతో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ డిసెంబర్ 19న లోక్‌సభలో ఆంధ్ర ప్రాంత ప్రకటన చేశాడు. దీనిపై కైలాస్నాథ్ వాంఛును జడ్జిగా నియమించి రిపోర్టు అడిగారు. 1953 మార్చి 25న కమిటీ రిపోర్టు ఇచ్చింది.
1953 ఆగస్ట్ 10న పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్ర బిల్లును ప్రవేశపెట్టారు. కోస్తాంధ్ర 7 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, మొత్తం 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. కర్నూలు రాజధానిగా టంగుటూరు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా, బెజవాడ గోపాలరెడ్డి ఉపముఖ్యమంత్రిగా, చందులాల్ మాధవ్ త్రివేది గవర్నర్‌గా ప్రభుత్వం ఏర్పడింది. కోకా సుబ్బారావు ప్రధాన న్యాయమూర్తిగా 1954లో గుంటూరులో హైకోర్టు నెలకొల్పారు. ఆ విధంగా ''ఆంధ్ర రాష్ట్రం'' ఏర్పడింది.
భారత స్వాతంత్య్రం తర్వాత 14 నెలల పోరాట అనంతరం 1948 సెప్టెంబర్ 15న తెలంగాణ ప్రజలు 224 సంవత్సరాల నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందారు. అలాగే 50 సం||ల పోరాట అనంతరం 1953 అక్టోబర్ 1న ఆంధ్రులు మద్రాస్ రాష్ట్రం నుండి వేరుపడి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర్రం సాధించుకున్నారు. ఈ విధంగా ఉభయ ప్రాంతాల తెలుగు ప్రజలకు స్వేచ్ఛ లభించినా 1956 వరకు వేరువేరుగానే ఉండిపోయారు. భాషాప్రయుక్త రాష్ట్రాల వాదన ముందుకు తెచ్చిన కమ్యునిస్టులు పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వాన విశాలాంధ్ర భావాలను ఉభయ ప్రాంతాలలో వ్యాపింపజేశారు.
1949 నవంబర్ 26న విజయవాడలో అయ్యదేవర కాళేశ్వరరావు నాయకత్వంలో విశాలాంధ్ర మహాసభ ఏర్పడింది. ఈ మహాసభకు తెలంగాణ నుండి కోదాటి రాజమల్లు, రాజలింగం, హయగ్రీవాచారి, డా||టిఎస్ మూర్తి, ప్రకాశం పంతులు హాజరై హైద్రాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడాలని తీర్మానించారు. విశాలాంధ్ర నిర్మాణానికి పునాది పడింది. 1951 ఎన్నికలలో కమ్యునిస్టులు హైద్రాబాద్, మద్రాస్ శాసనసభలలో మంచి బలాన్ని సాధించారు. సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో కమ్యునిస్టులు తిరుగులేని ఆధిక్యతను సంపాదించగలరని కాంగ్రెస్‌వారు భయపడ్డారు. తర్వాత కాంగ్రెస్ తన విధానాన్ని మార్చుకుని విశాలాంధ్రను బలపర్చింది. 1950లో నిజామాబాద్‌లో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ మహాసభలో హైద్రాబాద్ సంస్థానాన్ని తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాలుగా విభజించి ఆయా రాష్ట్రాలలో కలపాలని తీర్మానించారు. విశాలాంధ్ర తీర్మానాన్ని కాంగ్రెస్ పూర్తిగా బలపర్చింది. రెండవ విశాలాంధ్ర మహాసభ 1954 జూన్ 13, 14 తేదీలలో శ్రీశ్రీ అధ్యక్షతన జరిగింది. ఆ సమావేశంలో కొందరు ప్రత్యేక తెలంగాణ వాదాన్ని లేవనెత్తారు. అందుకు కారణం సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో అన్నివిధాలా అభివృద్ధి చెంది ఆంధ్ర ప్రాంతీయులు ఆధిక్యత చెలాయిస్తారని భయపడ్డారు. విశాలాంధ్ర ప్రతిపాదనను ముస్లింలు కూడా సమర్ధించారు. ఆ విధంగా విశాలాంధ్ర సమస్య చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్ కోరికకు కారణాలు
- ఆంధ్ర రాజధానికి ఏ ముఖ్య పట్టణం అనుకూలంగా లేదు.
- ఆంధ్ర రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో పట్టణాలను గుర్తించలేదు
- బొగ్గు, విద్యుదుత్పత్తికి అవకాశాలు లేవు
- రవాణాకు చిన్న ఓడరేవు విశాఖ మినహా పరిశ్రమలు లేవు
- చిన్న పరిశ్రమలు బట్టలు, ఉన్ని మిల్లులు మాత్రమే ఉన్నాయి
- ఏ జిల్లా హెడ్‌క్వార్టర్ కూడా రాజధానికి అనుకూలంగా లేదు
- విశాఖ రోడ్డుపై రెండు వాహనాలు ఒకేసారి వెళ్లలేవు
- రాష్ట్ర ఆదాయం 22 కోట్లు కాగా, 20 కోట్లు ఉద్యోగాలకే పోతాయి.
- నీటి పారుదల, వ్యవసాయం, రోడ్లు, విద్యుత్తు, రైతులకు రుణాలు లేవు
- ప్రభుత్వ ఉద్యోగులకు వసతి సౌకర్యాలు లేవు
- కర్నూలులో పెద్ద భవనాలు లేవు. హైకోర్టు,
తెలంగాణలో రాజకీయ పరిణామాలు
1953లో భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనకు కేంద్రం ఫజుల్ అలీ కమిషన్ వేసింది. మాధవ ఫణిక్కర్, హెచ్ఎన్ కుంజ్రుతో కమిటీ వేశారు. ఈ కమిషన్ 1955 సెప్టెంబర్ 30న నివేదికను కేంద్రానికి ఇచ్చింది. కమిషన్ నివేదిక ప్రకారం, 5 సంవత్సరాల వరకూ తెలంగాణ విడిగా ఉండాలని, ఆ తర్వాత తెలంగాణ శాసనసభ ఆంధ్రప్రాంతంలో కలవాలని నిర్ణయిస్తే కలపాలని నివేదిక ఇచ్చింది. 1961లో ఏర్పడబోయే తెలంగాణ శాసనసభలో మూడింటి రెండు వంతులు విశాలాంధ్ర కోరితే తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో కలపవచ్చని నివేదికలో చెప్పారు. తెలంగాణ వెనక బడిన ప్రాంతంగా ఉన్నందున ఆంధ్రలో కలిస్తే తెలంగాణ అభివృద్ధి కాదని జవ హర్లాల్నెహ్రూ అభిప్రాయం వెలిబు చ్చారు. దీనిపై ఆంధ్ర నాయకులు ఢిల్లీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారు. తెలంగాణ శాసనసభలో ఒటింగ్ పెట్టగా 191 మందిలో 147 మంది విశాలాంధ్రకు అను కూలంగా, 29మంది ప్రత్యేక తెలంగాణకు అనుకూలం గా, 15మంది తటస్థంగా నిలిచారు. కాంగ్రెస్ హై కమాండ్ విశాలాంధ్రనే బలపరిచింది. కాంగ్రెస్ హైకమాండ్ కోరిక మేరకు 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలోని హైద్రాబాద్ అతిథి గృహంలో ''పెద్ద మనుషుల ఒప్పంద సమావేశం'' జరిగింది.
20.02.1956న జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం
సర్కారు ప్రాంతం నుండి 1) బెజవాడ గోపాలరెడ్డి 2)నీలం సంజీవరెడ్డి 3)గౌతు లచ్చన్న 4)అల్లూరు సత్యనారాయణరాజు మరియు తెలంగాణ ప్రాంతం నుండి 1)బూర్గుల రామకృష్ణారావు 2)కెవి రంగారెడ్డి 3) మర్రి చెన్నారెడ్డి 4)జెవి నర్సింగరావు సభ్యులుగా ఉన్నారు. వీరు 14 నిబంధనలతో ఒప్పందం చేసుకున్నారు.
1) రాష్ట్రానికి చెందిన కేంద్ర పరిపాలనా వ్యయం ఆంధ్ర, తెలంగాణాలు జనాభా ప్రాతిపదికపై 2:1గా భరించాలి. తెలంగాణ ఆదాయంలోని మిగులు నిధులు తెలంగాణ ప్రాంతానికి ఖర్చు చేయాలి. 5 సం||ల తర్వాత సమీక్షించి తెలంగాణ శాసనసభ్యులు కోరితే మరో ఐదేండ్లు పొడిగించాలి.
2) తెలంగాణలో మద్య నిషేధం ఆ ప్రాంత శాసనసభ్యుల నిర్ణయం ప్రకారం జరగాలి. ఆ సమయంలో సర్కారు జిల్లాలలో మద్య నిషేధం అమలులో ఉంది.
3) తెలంగాణలోని విద్యా సౌకర్యాలు తెలంగాణా వారికే కల్పించాలి. వాటిని అభివృద్ధిపర్చాలి. తెలంగాణలో సాంకేతిక విద్యా సంస్థల్లో తెలంగాణా వారికే అవకాశం కల్పించాలి. లేదా రాష్ట్రంలో 3వ వంతు సీట్లు తెలంగాణకు కేటాయించాలి. ఇందులో ఏది తెలంగాణవారు కోరుకుంటే దానినే అమలుపర్చాలి.
4) విలీనీకరణ వల్ల ఉద్యోగాలు రద్దు చేయాల్సి వస్తే 2:1 (ఆంధ్ర : తెలంగాణ) నిష్పత్తిని పాటించాలి.
5) తెలంగాణాలో ఐదేండ్లు పరిపాలన, న్యాయ వ్యవస్థలో ఉర్దూ భాషను కొనసాగించాలి. తర్వాత ప్రాంతీయ మండలిని ఏర్పరచి సమీక్షించాలి. ఉద్యోగాలలో చేర్చుకునేముందు తెలుగు నేర్చుకోవడం తప్పనిసరి చేయరాదు. ఉద్యోగం తర్వాత రెండేళ్ళలో తెలుగు నేర్చుకోవాలనే నిబంధన పెట్టవచ్చు.
6) తెలంగాణాలో ఉద్యోగాలు పొందడానికి నివాస నిబంధనలు ఉండాలి. తెలంగాణలో 12 సం||లు నివాసం ఉండాలి.
7) తెలంగాణ ప్రాంతంలో భూముల అమలు ప్రాంతీయ మండలి అధీనంలో ఉండాలి.
8) తెలంగాణకు ఒక ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలి.
9) తెలంగాణ ప్రణాళికలు, నీటిపారుదల, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగాలు ప్రాంతీయ మండలి చూడాలి. ప్రాంతీయ మండలికి - రాష్ట్ర ప్రభుత్వానికి బేధం వచ్చినట్టయితే కేంద్రం పరిష్కరించాలి. ప్రాంతీయ మండలిలో 26 మంది సభ్యులు ఉండాలి. 9 మంది శాసనసభ్యులు, 6గురు పార్లమెంటు సభ్యులు, 5గురు అనధికార సభ్యులు ఉండాలి. వీరంతా తెలంగాణకే చెందాలి.
10) ప్రాంతీయ మండలి చట్టబద్ధమైన అధికారం కలిగి ఉంటుంది. తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి.
11) ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రెండు పదవులు ఉండాలి. అందులో ఒకరు తెలంగాణ వారై ఉండాలి.
12) మంత్రి వర్గంలో ఆంధ్రకు 60 శాతం, తెలంగాణకు 40 శాతం ప్రాతినిధ్యం ఉండాలి. అందులో ఒకరు తెలంగాణ ముస్లిం అయి ఉండాలి.
13) ప్రాంతీయ మండలికి తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉంటారు. మిగిలిన కేబినెట్లో తెలంగాణవారిని ఆహ్వానించాలి.
14) 1962 నాటికి విడివిడిగా ఉద్యోగ సంఘాలు ఉండాలి.
పై నిబంధనలను పాటించాలని ఒడంబడిక కుదిరింది. ఈ ఒడంబడిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ది.01.11.1956న ఆంధ్రా తెలంగాణలను విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ప్రకటించడం జరిగింది. ఫిబ్రవరిలో జరిగిన ఒప్పందం నవంబర్ 1 నుండి అమలు చేయాలని అంగీకారం కుదిరింది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు
తెలంగాణ మొత్తం వైశాల్యం 82,698 చ.మైళ్ళు లేదా 5.30 కోట్ల ఎకరాలు. తెలంగాణ ప్రాంతం 50.4%, మరట్వాడా ప్రాంతం 28%, కన్నడ ప్రాంతం 21.4%గా ఉన్నారు. జనాభా వరుస వారీగా 54%, 26%, 20% ఉన్నారు.
తెలంగాణ మొత్తం గ్రామాల సంఖ్య 10,167, మరట్వాడా, కన్నడా ప్రాంతాల మొత్తం గ్రామాల సంఖ్య 12,290 ఉన్నాయి.
తెలంగాణా ప్రాంతంలో మొత్తం 10,167కు దివానీ ప్రాంతం గ్రామాలు 6,891 కాగా జాగీరు, సర్ఫేఖాస్ గ్రామాలు 3,276 ఉన్నాయి.
మరట్వాడా, కన్నడ ప్రాంతాలలో మొత్తం 12,290 గ్రామాలకు ఖాల్సా గ్రామాలు 7,070 కాగా సర్ఫేఖాస్, జాగీరు గ్రామాలు 5,120 వరకు ఉన్నాయి.
1948 జూన్ 20న సర్పేఖాస్, జాగీరు ప్రాంతాలను రద్దు చేసి దివానీ ప్రాంతాలలో కలిపారు. సర్ఫేఖాస్ ప్రాంతం దాదాపు 8,000 చ.మైళ్ళ వైశాల్యం కలిగి 18 తాలూకాలు ఉన్నాయి. దీంతోపాటు 7 తాలూకాలు గల ఆత్రాప్బల్దా-హైదరాబాద్ జిల్లా నైజాం ఆస్థిగా ఉంది.
నిజాం సంస్థానాన్ని 4 సుభాలుగాను, 16 జిల్లాలుగాను విభజించి పాలించారు.
1) మెదక్ సుభా : మెదక్, ఆత్రాప్ బల్దా-హైద్రాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు
2) వరంగల్ సుభా : వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు
3) ఔరంగాబాద్ సుభా : ఔరంగాబాద్, భీర్, నాందేడ్, పర్బిణి, ఉస్మానాబాద్ జిల్లాలు
4) గుల్బర్గా సుభా : గుల్బర్గా, బీదర్, రాయచూర్ జిల్లాలు
భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఔరంగాబాద్ సుభా మహారాష్ట్రలోకి, గుల్బర్గా సుభా కర్నాటకలోకి చేరిపోయాయి. మెదక్, వరంగల్ సుభాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిసాయి. ఆ విధంగా భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది.
- సారంపల్లి మల్లారెడ్డి
9490098666