Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్‌రెడ్డి 1956 నవంబర్ 1 నుండి 1957 ఏప్రిల్ 16 వరకు పని చేశారు. పూర్వపు ఆంధ్ర రాష్ట్ర శాసనసభ్యులు 148 మంది, తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ 68 మంది సభ్యులతో మొత్తం 216 మంది బలం శాసన సభలో పెరిగింది. 301 మంది ఉన్న శాసనసభలో కమ్యూనిస్టు పార్టీకి ఆంధ్రలో 15, తెలంగాణలో 42 మంది (1952) తో 67 మంది సభ్యులున్నారు. తెలంగాణకు 1957లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులకు 42కు బదులు 22 స్థానాలు మాత్రమే గెలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1957 ఎన్నికల తరువాత శాసన సభలో 37మంది సభ్యులు ఉన్నారు. పెద్దమనుషుల ఒప్పంధం ప్రకారం ఉప ముఖ్యమంత్రి పదవి తెలంగాణకు ఇవ్వలేదు. తెలంగాణకు జరిగిన ఒప్పందాలను ఏ ఒక్కటి పాటించలేదు. తెలంగాణకు చెందిన కొండా వెంకట రంగారెడ్డికి ద్వితీయ స్థానాన్ని కల్పించి ఉప ముఖ్యమంత్రి పదవికి ఉద్వాసన చెప్పారు. పెద్ద మనుషుల ఒప్పంధంలోని ఏ ఒక్క అంశాన్ని ఆమోదించలేదు. ఉద్యోగాలు, విద్యలలో 2:1 ఉండాల్సి ఉండగా దానిని కూడా పాటించలేదు. తెలంగాణ మిగులు నిధులను తెలంగాణకు ఖర్చు చెయ్యకుండా ఆంధ్ర ప్రాంతానికి తరలించారు.
తెలంగాణలో భూములు చాలా చౌక. ఆంధ్ర ప్రాంతంలో ఒక ఎకరం అమ్ముకొని తెలంగాణ ప్రాంతంలో పెడితే ఆ డబ్బుతో 50 ఎకరాలు వచ్చేవి. అందువలన గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఉభయ గోదావరికి చెందిన అనేక మంది రైతులు తెలంగాణకు చేరి వేలది ఎకరాలు సంపాదించి భూస్వాములయ్యారు. భూములమ్ముకున్న తెలంగాణ వారు తమ భూములలో కూలీలుగా పని చేశారు. ప్రాంతీయ కమిటి అనుమతి లేకుండా భూములు కొనరాదని ఉన్న షరతును ఉల్లంఘించారు. ఉప ముఖ్యమంత్రి పదవి, తెలంగాణ మంత్రుల మధ్య నిష్పత్తి, శాఖల కేటాయింపులలో రాజకీయ ప్రాధాన్యత కలిగినవి ఆంధ్ర ప్రాంతంవారికే కేటాయించారు. ఈ విధంగా ఆంధ్ర రాజకీయ నాయకుల వైఖరి, ఆంధ్ర ఉద్యోగుల ప్రవర్తనపై అసహనం, ఉద్రేకాలు పెరిగాయి. శాసనసభలో పుచ్చలపల్లి సుందరయ్య ఈ లోపాల గురించి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి దృష్టికి తెచ్చినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఇప్పడు చేస్తున్న తప్పులకు భవిష్యత్‌లో శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఆనాడే శాసనసభలో ప్రకటించాడు. ఏ ఒక్కటీ అమలు జరగకపోవడంతో తెలంగాణలో అసంతృప్తి జ్వాల రగిలింది.
దామోదరం సంజీవయ్య పరిపాలన
నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రికి రాజీనామా పెట్టి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా వెళ్ళిపోయాడు. అతని తరువాత 1960 జనవరి 11 నుండి 1962 మార్చి 11 వరకు దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఇతను మొదటి దళిత ముఖ్యమంత్రిగా ఎలాంటి గ్రూపులు లేకుండా పని చేశాడు. న్యాయవాద శాస్త్రంలో డిగ్రీ పొందినవాడు కాబట్టి వీలైనంత వరకు పెద్దమనుషుల ఒప్పందాన్ని అమలుకు పూనుకుని కొండా వెంకట రంగారెడ్డిని ఉప ముఖ్యమంత్రిగా నియమించాడు. తన మంత్రి వర్గంలో ఉన్న ఏసి సుబ్బారెడ్డి పెత్తనం చేయబోగా సంజీవయ్య అవకాశం ఇవ్వలేదు. నీలం సంజీవరెడ్డి వారసుడిగా కాసు బ్రహ్మానందరెడ్డి ముఠా రాజకీయాలు నడిపాడు. సంజీవయ్య కాలంలో దళిత, గిరిజన ఉత్తర్వులు బయటికితీశారు. అంతకు ముందు దళిత, గిరిజనులకు కేటాయించిన ఉద్యోగాలలో తగిన అభ్యర్థులు లేరని ఓసీ వారిని నియమించే విధానం సాగింది. దానిని రద్దు చేసి అభ్యర్థుల లభ్యత లేకపోతే ఆ స్థానాలు ఖాళీగా ఉంచారు. వెనకబడిన కులాలలో రాయలసీమలోని బలిజలు, సర్కార్‌లోని తెలగలు, సెట్టి బలిజలు, తెలంగాణలోని కాపులను చేర్చారు. పెద్దమనుషుల ఒప్పందాన్ని అమలు కాకుండా ఏసి సుబ్బారెడ్డి, కాసు బ్రహ్మనందరెడ్డి ముఠా తీవ్రంగా ప్రయత్నించింది.
కమ్యూనిస్టు పార్టీలో చీలిక
ఒక వైపున తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాగిస్తుండగా కేంద్ర ప్రభుత్వం పార్టీపై నిర్భందాన్ని ప్రయోగించింది. 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధం సందర్భంగా కమ్యూనిస్టు పార్టీలోని ముఖ్య నాయకులను 1600 మందిని 16 మాసాల పాటు జైళ్ళలో పెట్టింది. జైళ్ళలో ఉన్నవారు నైజాంలోకి సైన్యాలు వచ్చిన తరువాత కూడా సాయుధ పోరాటం కొనసాగించాలని కోరారు. కాంగ్రెస్‌తో కలిసి పోవాలనుకున్న వారిని జైల్ బయటనే ఉంచారు. బయట ఉన్నవారు జైళ్ళకు వెళ్ళిన వారిని కమిటీల నుండి తగ్గించారు. ఇది నిబంధనావళి విరుద్ధం. కానీ జైళ్ళలో ఉన్నవారు 'మృతప్రాయులు' అని వారి అభిప్రాయాలను తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించారు. జైళ్ళలో ఉన్నవారు చైనాను బలపరుస్తున్నారని బహిరంగ ఆరోపణలు చేశారు. వాస్తవం ఏమిటంటే.. భారత్ - చైనా యుద్ధ్దం ముగిసిన తరువాతనే ఈ అరెస్టులు సాగాయి. 16 మాసాల తరువాత జైళ్ళ నుండి బయటికి వచ్చి పార్టీ ఆఫీసులకు వెళ్ళగా 'మిమ్ములను తొలగించామని' బయటికి పంపించారు. తప్పని పరిస్థితులలో 32 మంది కేంద్ర కమిటీ సభ్యులు తెనాలిలో సమావేశం జరిపి 'భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)'ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో జరిగిన అఖిల భారత మహాసభల కొనసాగింపుగా 7వ మహాసభను 1964లో కలకత్తాలో జరిపి పోలిట్ బ్యూరోను, కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. క్రమంగా రాష్ట్రాలలో కమిటీలను వేసి నేటికి సీపీఐ(ఎం)గా కొనసాగుతున్నారు. వీరిని బహిష్కరించిన వారు నేడు సీపీఐగా కొనసాగుతున్నారు. 15 సంవత్సరాల పాటు రివిజనిజంకు వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటాలు సాగాయి. 1967లో సీపీఐ(ఎం) నుండి మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీగా నక్సల్బరిలో సాయుధ భూ పోరాటం ప్రారంభించారు. తామే సీపీఐ(ఎం) పార్టీని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు- లెనినిస్టుగా పార్టీ పేరు పెట్టుకున్నారు ఆ తరువాత మార్క్సిస్టు- లెనినిస్టు పార్టీ అనేక పార్టీలుగా చీలిపోయింది.
ఈ కాలంలో పార్టీ నిర్మాణంపై సమయం కేటాయిస్తూనే ప్రత్యక తెలంగాణ వాదాన్ని విరమించుకోవాలని సమైఖ్య ఆంధ్రలో సమస్యలు పరిష్కరించుకోవాలని, సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పెద్దమనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నందుకు తీవ్రంగా ఉద్యమాలు వచ్చాయి. 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' అమలు జరపాలని అనేక పోరాటాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ప్రత్యేక తెలంగాణ వాదులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.
ఉద్యమం ప్రారంభం
తెలంగాణ ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి 1968 జూలై 10న ''తెలంగాణ ప్రయోజన పరిరక్షణ'' దినాన్ని పాటించి సభలు సమావేశాలు జరిపారు. హైదరాబాద్‌లో జరిగిన సభలో ప్రముఖ కార్మిక నాయకుడు మహదేవ్‌సింగ్, ప్రభుత్వం తెలంగాణ వారికి జరుగుతున్న అన్యాయాలను అరికట్టకపోతే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ చీలిపోగలదని హెచ్చరించారు. తొలి మహసభ వరంగల్‌లో జరిగింది. అందులో 'తెలంగాణ' నినాదం ఇచ్చారు. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఖమ్మం తదితర జిల్లాలు తిరిగింది. ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. 1969 జనవరి 8న ఖమ్మంలో రవీంద్ర అనే విద్యార్థి తెలంగాణ హక్కుల రక్షణ కావాలని కోరుతూ.. అమరణ నిరహార దీక్ష ప్రారంభించారు. 12వ తేది నుంచి వరంగల్‌లో దీక్షలు ప్రారంభమయ్యాయి. కమిటివారు నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు పర్యటించి ఉద్యమాన్ని విస్తరించారు.
1969 జవవరి 18,19 తేదీలలో ముఖ్య మంత్రి బ్రహ్మనంద రెడ్డి అన్ని పార్టీల కలను తెలంగాణ ప్రాంతీయ సంఘానికి, శాసన సభ్యులను అందజేయాలి.
నిరుద్యోగుల సమస్యలను నివారించి, ఉద్యోగావకాశాలు పెంచే అవకాశాలను చూస్తారు. ఈ ఒప్పందంపై ప్రతిపక్షాలవారు సంతకాలు చేశారు. తెలంగాణ విద్యార్ధులు ఒప్పందాన్ని అంగీకరించలేదు. ఖమ్మంలో రవీంద్ర చేత నిరహర దీక్షను విరమింపజేశారు. తెలంగాణ కావాలనేవారు జనవరి 20వ తేదిన ఉరేగింపు జరిపారు. వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. 19వ తేదిన ఒప్పందంపై సంతకం చేసిన వారు తమ ఆలోచనలను వదిలివేశారు. 22న ఉద్యమం ప్రచండ రూపం దాల్చింది. పిబ్రవరి 28లోగా ఆంధ్ర ఉద్యోగులను తరలిస్తామని తెలంగాణ మిగులు నిధులను తేల్చడానికి అడిటర్ జనరల్ హౌదా గల ఉద్యోగిని కేంద్ర ప్రభుత్వం పంపడానికి అంగీకరించిందని ముఖ్యమంత్రి ప్రకటించినా ఉద్యమం చల్లారలేదు.
తెలంగాణలో ఆంధ్ర ప్రాంతం వారికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ఆంధ్ర ప్రాంత విద్యార్థులు ప్రతి ఉద్యమం ప్రారంభించారు. హర్తాళ్లు, సమ్మెలు, ఆందోళనలు సాగించారు. ఒప్పందంపై సంతకాలు చేసిన నాయకులను నిలదీశారు.
తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతుండగా కమ్యూని ష్టులు రాష్ట్ర సమైఖ్యతకు నిలబడ్డారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టమని ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. ఒక వైపున తెలంగాణ కాని 37 మంది ఉపాధ్యాయులను తొలగించగా వారు హైకోర్టులో రిట్ వేశారు. హైకోర్టులో న్యాయమూర్తి చిన్నప్పరెడ్డి ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేశారు. ప్రభుత్వం అప్పీల్ చేయగా ప్రధాన న్యాయముర్తి పింగిలి జగన్మోహన్రెడ్డి, ఆవుల సాంబశివరావుకొన్ని పరిమితులలో ముల్కీ నిబంధనలు చెల్లుతాయని తీర్పు చేప్పారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్ళగా 1969 మార్చి6న సుప్రీంకోర్టు మూల్కీ నిబంధనలు చెల్లవని తీర్పు చెప్పింది. ఈ తీర్పు తెలంగాణ ఉద్యమాన్ని అజ్యం పోసింది. 1969 జనవరి 19 వరకు ఈ ఉద్యమంలో 369 మంది కాల్పుల్లో మరణించారు. తెలంగాణలో జరుగుతున్న ఉద్యమానికి ప్రతిగా ఆంధ్రలో కూడా ఉద్యమాలు సాగాయి.
ప్రధాని ఇంధిరా గాంధీ ఉద్యమాన్ని విరమింప చేయడానికి 1969 ఏప్రిల్ 12న '8 సూత్రాల పథకం'ను తెచ్చింది.
ఎనిమిది సూత్రాల పథకం
1.తెలంగాణ మిగులు నిధులు లెక్కపెట్టి నెలలో నివేదిక ఇవ్వాలి.
2. ఈ నిధులు తెలంగాణలో ఖర్చు చేయాలి.
3. ముఖ్యమంత్రి అధ్యక్షతన తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక రచించాలి.
4. ప్రణాళిక అమలుకు అధికారుల కమిటీ ఏర్పాటు
5. తెలంగాణ ప్రాంతీయ సంఘానికి అదనపు అధికారాలు ఇవ్వాలి.
6. తెలంగాణలో ఉద్యోగాలు స్థానికులకివ్వడానికి రాజ్యంగ పరమైన కట్టుదిట్టం చేయడం.
7. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధ్యక్షుని అధ్యక్షతన తెలంగాణ ఉద్యోగుల సర్వీసులను సమన్వయం చేయాలి.
8. ప్రధాని సమక్షంలో 6 మాసాలకొకసారి తెలంగాణ అభివృద్ధిని సమీక్షించాలి.
పై ఒప్పందాలు అతిక్రమించబడినాయని మరల ఆందోళనలు సాగాయి. మర్రి చెన్నారెడ్డి ప్రజా సమితిని స్థాపించి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ప్రత్యేక వాదం నినాదంపై పోటీ చేశారు. 1971లో తెలంగాణ ప్రజాసమితి నాయకత్వాన 14 పార్లమెంటు స్థానాలకు 11 పార్లమెంటు స్థానాలు గెలిచారు. కాసు బ్రహ్మనంద రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆతనిని తొలగించి 1971 సెప్టెంబర్ 30న పివి నర్సింహరావును ముఖ్య మంత్రిగా తెచ్చారు. అయినప్పటికి పెద్దమనుషుల ఒప్పదంకాని, 8 సూత్రాల పథకం అమలు జరగడంలేదని ఆందోళనలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. 1972 ఫిబ్రవరి 14న న్యాయముర్తులు 4:1 నిష్పత్తిలో హైకోర్టు ముల్కీ నిబంధనలు చెల్లవని అంతకు ముందు 1970 డిసెంబర్ 9 నాటి ముగ్గురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును రద్దు చేశారు. ఈ తీర్పు తెలంగాణ వారికి ఆశ్చర్యం కలిగించింది. వారిలో భయాం దోళనలు ప్రారంభమయ్యాయి. వారిని సముదాయించడానికి ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ చెల్లుతాయని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఆంధ్ర విద్యార్థులను రెచ్చగొట్టింది. 1972 ఆక్టోబర్ 22న ఆంధ్ర విద్యార్థులు, యువజనులు విజయవాడలో సమావేశం అయ్యి మూల్కీ రూల్స్ పూర్తిగా రద్దు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి సుప్రీీంకోర్టు తీర్పుపై అనుమానాలను నివృత్తి చేయలేక పోయారు. నిబంధనలు లేని ఆంధ్రప్రదేశ్ ఉండాలని, ఆది వీలు కాకపోతే ఆంధ్రను వేరు చేయాలని మొదటిసారి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఈ ఆందోళనలు విరమింపచేయడానికి పంచసూత్ర పథకాన్ని ప్రకటించారు. దీనిని అందరూ తిరస్కరించి డిసెంబర్ 7న రాష్ట్ర బంద్ జరిపారు. అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్రంలో ఆస్థిర పాలన ఏర్పడడంతో 18 జనవరి 1973న రాష్ట్రపతి షరీన్ పాలనను విధించారు. ఇది 1973 డిసెంబర్ 10 వరకు సాగింది. 8 సూత్రల పథకం అమలు కాకపోవడంతో తిరిగి ప్రధాని ఇంధిరాగాంధీ 6 సూత్రాల పథకాన్ని ప్రకటించింది.
క్రమంలో 21.09.1973న 6 సూత్రాల పథకం ప్రకటించారు.
6 సూత్రాల పథకం
1.రాజధాని అభివృద్ధి -వెనుకబడిన ప్రాంతాలకు రాష్ట్రస్థాయి ప్రణాళిక బోర్డు ఏర్పాటు
2. విద్యా సంస్థలలో స్థానికులకు ప్రాధాన్యత, హైదరాబాదులో కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాపన
3. జిల్లాస్థాయి, జోనల్‌స్థాయి వరకు స్థానికులకే ఉద్యోగాలు - ప్రమోషన్లు
4. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు.
5. తెలంగాణ ప్రాంతీయ కమిటీ రద్దు.
6. అవసరమైన రాజ్యాంగ సవరణకు రాష్ట్రపతికే అధికారం.
పై నిబంధనలకు 1975లో రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ రాజ్యాంగ సవరణ-32కు (1975) అనుకూలంగా 1985లో (30.12.1985) 610 జివో ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విడుదలయ్యింది. 18.10.1975న ఉత్తర్వులు వెలువడినాయి. దీని ప్రకారం తెలంగాణలో రాజ్యాంగం 371డి ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించబడ్డాయి.
1. ఆంధ్ర, తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు 80:20 నిష్పత్తిలో ఉండాలి.
2. 18.10.1975 తర్వాత 5,6 జోన్లలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు ఉన్నచో వారిని సొంత జోన్లకు పంపాలి.
3. 1.3.1986 తర్వాత జూరాల, ఎస్ఎల్బిసి, ఎస్ఆర్ఎస్పి రెండవ దశల్లో 5,6 జోన్స్‌లో వారికే ఉద్యోగాలు.
4. 1975 ప్రసిడెన్షియల్ ఉత్తర్వు ప్రకారం పెండింగ్ అప్పీల్‌ను పరిశీలించాలి.
5. ఆయా సంస్థలలో ఏర్పడే ఖాళీలను 1975 ప్రకారం స్థానికంగా ఎంపిక చేయాలి.
6. ఎంప్లాయిమెంట్ ఎక్సెంజీలలో బోగస్ రిజిస్ట్రేషన్లను తొలగించాలి.
1973 డిసెంబర్ 10 నుండి జలగం వెంగళరావు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన వెంగళరావ్ శాంతిభద్రతల విషయంలో రాజీపడలేదు. ఆ తరువాత ప్రధాని ఇంధిరాగాంధీ కొన్ని హమీలు ఇవ్వడంతో తెలంగాణ ఉద్యమం చల్లబడింది. నక్సలైట్ ఉద్యమాన్ని అణచడానికి తీవ్ర నిర్భంధం ప్రయోగించారు. ఆ తరువాత కాంగ్రెస్‌లో వచ్చిన చీలికలతో తెలంగాణ ఉద్యమం వెనకపట్టుపట్టింది.
మర్రి చెన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాడని భావించి రాష్ట్రానికి దూరంగా, వివిధ రాష్ట్రాలకు గవర్నర్‌గా పంపించారు. 1974 సెప్టెంబర్ 25 నుండి యుపి గవర్నర్‌గా, 1982లో పంజాబ్ గవర్నర్‌గా, 1992లో రాజస్థాన్ గవర్నర్‌గా, చనిపోయేవరకూ తమిళనాడు గవర్నర్‌గా ఉన్నాడు. మధ్యలో 1989-90లో ముఖ్యమంత్రిగా వచ్చినప్పటికీ అవినీతి మంత్రిగా పేరొంది రాజీనామా చెయ్యాల్సి వచ్చింది.
ఆ తర్వాత టి అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రులుగా వచ్చారు. వీరు తెలంగాణ ఉద్యమాన్ని వీలైనంత వరకూ తగ్గించే ప్రయత్నం చేశారు. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, మరలా ఎన్‌టి రామారావు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా అధికారంలోకి వచ్చారు. చంద్రబాబునాయుడు హయాంలో శాసనసభలో ఉపసభాపతిగా ఉన్న కె చంద్రశేఖర్‌రావు శాసనసభ సభ్యత్వానికి, ఆ పదవికి రాజీనామా ఇచ్చి ''తెలంగాణ రాష్ట్ర సమితి'' 2001 ఏప్రిల్ 27న ''జలదృశ్యం''లో ఏర్పాటు చేశారు. అతనితో బి.ప్రకాశ్, ఆలె నరేంద్ర, సత్యనారాయణరెడ్డి లాంటి కొందరు నాయకులు టీఆర్ఎస్లోకి వెళ్ళి కొంతకాలం తర్వాత బయటికి వెళ్ళిపోయారు. నిజాం మనవరాలు సలీమా భాషా, ఆమె కుమార్తె రఫత్‌షా తెలంగాణకు మద్దతు ప్రకటించారు. సుదర్శన్‌రావు, నాయని నర్సింహారెడ్డి, హన్మంతరావు, గాదె ఇన్నయ్య, నారాయణరెడ్డి, గొట్టె భూపతి, హరీష్‌రావు తదితరులు నాయకులుగా పనిచేశారు. 2001 మే 17న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజి గ్రౌండ్లో పెద్ద బహిరంగసభను నిర్వహించారు. దీనికి జెఎమ్ఎమ్ చీఫ్ శిబూసొరేన్ చీఫ్‌గెస్ట్‌గా వచ్చారు. 2004లో వైఎస్ఆర్ ప్రభుత్వం తెలంగాణ భవన్‌కు స్థలం కేటాయించింది. ఆ విధంగా అనేక ప్రదర్శనలు, ధర్నాలు, మిలియన్ మార్చ్ లాంటి ఆందోళనలు చేపట్టారు.
కేసీఆర్ ఆమరణ దీక్షతో తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. దీంతో దిగివచ్చిన యూపీఏ2 ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తామంటూ 2009 డిసెంబర్ 9న ప్రకటన చేసింది. దీనిపై కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబర్ 23న ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
అఖిలభారత స్థాయిలో తెలంగాణకు అనుకూలంగా 36 పార్టీలు లేఖ ఇవ్వడంలో టీఆర్ఎస్ కృషి చేసింది. ఆందోళన తీవ్రతరం కావడం గమనించి కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిషన్‌ను 2010 ఫిబ్రవరి 3న నియమించింది. ఈ కమిషన్ అదే సంవత్సరం డిసెంబర్ 30న నివేదిక ఇచ్చింది. 461 పేజీల రిపోర్టులో తెలంగాణ వివరాలు వివరంగా ఇస్తూ ఆరు సూచనలను చేసింది. ఈ కమిషన్‌లో జస్టిస్ బిఎన్ కృష్ణ, వినోద్‌కుమార్ దుగ్గల్, రణబీర్‌సింగ్, అబూసలేమ్, రవీంద్రకౌర్ సభ్యులుగా ఉన్నారు. వారు ఇచ్చిన సూచనలు ఈ విధంగా ఉన్నాయి.
1) ప్రస్తుతం ఉన్న ఆంధ్ర, తెలంగాణ పరిస్థితిని (స్టేటస్కో) కొనసాగించాలి
2) సీమాంధ్ర-తెలంగాణ విడివిడిగా రాష్ట్రాలుగా నిర్ణయిం చాలి. హైద్రాబాద్‌ను కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంచాలి. వారు విడిగా రెండు రాజధానులను ఏర్పాటు చేసుకోవాలి.
3) రాయల తెలంగాణ - కోస్తాంధ్రగా నిర్ణయించాలి. హైద్రాబాద్‌ను రాయల తెలంగాణకు నిర్ణయించాలి.
4) సీమాంధ్ర-తెలంగాణ రాష్ట్రాలుగా నిర్ణయించి హైద్రాబాద్‌ను విడిగా పెట్టాలి.
5) తెలంగాణ-సీమాంధ్రలకు హైద్రాబాద్‌ను ఉమ్మడి రాజధానికి ఉంచాలి.
6) ఐక్యంగా తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసి ఇప్పుడున్న పరిస్థితినే కొనసాగించాలి.
8వ చాప్టర్లో రాష్ట్రాన్ని విడగొడితే నక్సలైట్ల వల్ల శాంతిభద్రతల పరిస్థితి ఏర్పడుతుందని విభేంధిచిన దానిని బహిర్గతం చేయకుండా ప్రభుత్వానికి విడిగా ఇచ్చారు. ఆ విధంగా నివేదిక ఇచ్చిన తర్వాత ఈ నివేదికలోని ఏ ఒక్క అంశాన్నీ ఏ రాజకీయ పార్టీ ఆమోదించలేదు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2013
అక్టోబర్‌లో కేంద్ర కేబినెట్ తెలంగాణ బిల్లును ఆమోదించింది. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలోను, 20న రాజ్యసభలోను ఆమోదం పొందింది. ఆ విధంగా రాయల ఆంధ్ర, తెలంగాణలు విడిపోవడం జరిగింది. 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరగగా తెలంగాణలోని 119 స్థానాలకు టీిఆర్‌ఎస్‌కు 63 శాసనసభ స్థానాలలో మెజారిటీ వచ్చింది. 11 లోక్‌సభ స్థానాలు గెలుపొందింది. తెలంగాణలో జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావం, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణస్వీకారంతో తెలంగాణ మరొకసారి ప్రత్యేక రాష్ట్రంగా ఉనికిలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ జూన్ 8వ తేదీన నూతన రాష్ట్రంగా అవతరించింది.
సమీక్ష
భూమి గుండ్రంగా ఉంది. 1946లో ఉన్న నైజాం తెలంగాణ 1948 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభు త్వంలో కలిసింది. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది. ఆ తర్వాత పెద్ద మను షుల ఒప్పందం, 8 సూత్రాల పథకం, 6 సూత్రాల పథకం లాంటి ఒప్పందాలు జరిగినప్పటికీ ప్రత్యేక వాదన అంతర్గ తంగా జీవం పోసుకునే ఉంది. విశాలాంధ్రలో ప్రజా రాజ్యం ఏర్పడకుండా బూర్జువా భూస్వామ్య పెట్టు బడిదారులు తమ స్వార్ధ ఆదాయం కొరకు ప్రాంతాల మధ్య తేడాలను కొనసా గించారు. వాటిని మరింత విస్తృతపరిచారు. చివరికి 2001లో తెలంగాణలోని భూస్వామ్య, పెట్టుబడిదారులు ఆంధ్ర పెట్టుబడిదారులను వెళ్ళగొట్టడానికి టిఆర్ఎస్ను వినియోగిం చుకున్నారు. పెట్టుబడిదారుల మద్య, కాంట్రాక్టర్ల మద్య వచ్చిన వైరుద్యాలతో తిరిగి తెలంగాణ వాదం బలంగా పుంజుకుంది. కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి ప్రయోజనాలు కాపాడడానికి రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రెండూ భూస్వామ్య విధానాన్నే కొనసాగిస్తున్నాయి. వారు చెప్పిన ప్రజాతంత్ర హక్కులు కానీ, లౌకికవాదం కానీ, అందరికీ సమానత్వం కానీ ఏడు సంవత్సరాలు గడిచినా లభించలేదన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలి. ఈ ప్రభుత్వాలున్నంత కాలం భవిష్యత్తులో కూడా ఇదే విధానం కొనసాగుతుంది.
- సారంపల్లి మల్లారెడ్డి
9490098666