Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిలక్ అభ్యుదయ కవితా రచనలు చేసిన వారిలో చెప్పుకోదగ్గ కవి. వచన కవిత్వాన్ని పరిపుష్టం చేసిన గొప్ప కవి. వచన గేయపు శైలితో సర్వ పాఠకుల హదయాలను చూరగొన్నవాడు. వచన కవితను తనదైన విధానంలో రాసి అలరించినాడు. తిలక్ అనుభూతి వాద కవి కూడా. ''నాకేదైతే అనుభూతి కలుగుతుందో అలానే కవిత్వం రాస్తానని'' నొక్కి వక్కాణించారు. వారి కవిత్వాన్ని పరికించి చూస్తే మొత్తంగా అభ్యుదయ భావాలు, భావ కవిత్వ భావాల మేళవింపుగా చెప్పవచ్చు. మానవతావిలువలను కూడా ఏర్చి కూర్చిన కవిత్వం వారిది.
''అమతం కురిసిన రాత్రి'' మొదటి కవితలోనే ''నా కవిత్వం కాదొక తత్వం మరికాదు మీరనే మనస్తత్వం'' అని తన కవితా రచనా విధానాన్ని బయట పెట్టారు. ఆయన కవితాక్షరాల మహత్తు తెలియపరిచే పంక్తులు ఈ కవితలోనే సంధించారు.
వెంటాడే వాక్యాల్లోకి...
''పైన ఎరో ప్లేను, చేతిలో స్టెన్ గన్
కీ యిస్తే తిరిగే అట్టముక్క సైనికులం
మార్చ్
వన్ టూ త్రీ ఘాట్ డెడ్ ఎవడ్''
సైనికుడి సాదకబాధకాలను తెలియజేసే చక్కటి కవిత ''సైనికుడి ఉత్తరం''. వణికించే చలిలో, అరణ్యాలలో, మంచులో ఏ విధంగా నరక యాతన పడతారో, ఇంటి దగ్గర ఉన్న ఆత్మీయులు దూరమై ఎంతగా తల్లడిల్లిపోతారో ఆ ఆవేదననంతా ఈ కవితలో తెలియజేశారు.
''ధాత్రి జనని గుండె మీది
యుద్ధపు కొరకంచుల ఎర్రని రవ్వలు
మీరెవరైన చూశారా''
''కాలం విరిగిన బండిచక్రంలా కదలలేక పడిపోతే
మొండి చేతుల మానవత్వం తెల్లబోయిన దశ్యం''
తిలక్ పిలుపు కవిత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సైనికుల త్యాగాలను, దరిద్రుని ఆర్తనాదాలను మానవత్వపు విలువలను గురించి, చెప్తూ మీరంతా మేల్కోవాలి. చీకటి తెరలను చీల్చడానికై నడుం బిగించాలని పిలుపు నిస్తారు.
''నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి,
మర్రిచెట్టు కింద మరణించిన ముసలి వాణ్ణి''
''నేను చూశాను నిజంగా
తల్లి లేక తండ్రి లేక తిండి లేక
ఏడుస్తూ ఏడుస్తూ
మురికి కాల్వ పక్కనే నిద్రించిన
మూడేళ్ళ పసి బాలుణ్ణి''
'ఆర్త గీతం' అనే పేరుతో వారు ఆవిష్కరించిన కవిత ఇది. పేదల పక్షాన, అనాథల పక్షాన, ఒక్కపూట తిండికి నోచుకోని మనుషుల పక్షాన ఈ కవిత రాసి ఆ బాధలను తీర్చే నాథులెవరున్నారని ప్రశ్నించారు. అనాథలు, అభాగ్యులు, ఆకలి కేకలు పెట్టని రోజే నాకు శాంతి అని అప్పటిదాకా, నా ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేనన్న మానవతావాది తిలక్.
''ఎగుడూ దిగుడూ
పెళ్ళాం మొగుడూ
వీరికి ప్రణయం
మనకే ప్రళయం''
''రోడ్లు'' అనే మినీ కవితలో ఒకరిని మెచ్చుకునేలా చేసేది, ఇంకొకరిని నొప్పించొచ్చు అనేలా ఇటు ప్రణయాన్ని, అటు ప్రళయాన్ని ముడిపెట్టి ఉదహరించిన తీరు అమోఘం. అసలు చెప్పాలంటే ఆయన ఊహకందని కవితా వస్తువే లేదనిపిస్తుంది.
''దేవుడా
రక్షించు నాదేశాన్ని
పవిత్రుల నుండి పతివ్రతలనుండి
పెద్ద మనుషుల నుండి, పెద్ద పులుల నుండి
నీతుల రెండు నాల్కలు సాచి బుసలు కొట్టే నిర్హేతుక సర్పాల నుండి''
ఆకలిభాదలు, కన్నీటిబాధలతోగుండె బరువెక్కి ఈ అంధకారపు జీవితాలలో వెలుగు నింపే రోజుల కోసం వేచి చూస్తూ, ఈ దేశాన్ని పెద్దమనుషులుగా చెలామణి అయ్యే పెద్దపులి లాంటి మగాల నుండి రక్షించమని ఈ కవితలో మొరపెట్టుకుంటాడు
తిలక్ తీసుకున్న కవితా వస్తువులలో ఎక్కువపాళ్ళు రాత్రిని, వర్షాన్ని తీసుకొని గొప్ప భావుకతను చూపించారు. రాత్రి,వెన్నెల, వర్షం మమ్మల్ని కవితా వస్తువులుగా మలుచు కొమ్మని ప్రతి కవిని వెంటాడి వేదిస్తాయి. అది సహజమే కానీ ఇవి తిలక్ కవితా పంక్తులలో సులువుగా అల్లుకు పోతాయి. తిలక్ కవిత్వంలో ప్రేమను, ఆర్తిని, ఆవేశాన్ని, స్పష్టంగా గమనించవచ్చు.
- తండ హరీష్ గౌడ్, 8978439551