Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కష్టాల సువాసననెరుగని సుఖ కుటుంబ జీవి ప్రజల కష్టాలు తొలగాలని తపించాడు. గడీలలో పాదులు వేసుకున్న వెట్టిచాకిరిని మట్టికరిపించాలని మధనపడ్డాడు. స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడుతున్న వీరుల తరపున న్యాయాన్ని వాదించిన న్యాయ దేవత బిడ్డడు. హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్య్రం కోసం విలాస జీవితానికి స్వస్తి పలికి విజయ కేతనం దిశగా అడుగిడినాడు. మొత్తంగా తెలంగాణ జాతి స్వాతంత్య్రం కోసం అహరహం విశ్రమించిన వ్యక్తి కాంచనపల్లి చిన వెంకటరామారావు.
జీవన రేఖలు
న్యాయవాదిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, కవి, రచయితగా గొప్ప కీర్తిని పొందిన ఇతను 1921వ సంవత్సరం ఏప్రిల్ 10 న నల్గొండ జిల్లా, సూర్యాపేట మండలంలోని రావిపాడు గ్రామంలో తన అమ్మమ్మ ఇంట్లో పుట్టాడు. భూస్వామి అయిన రామచంద్రరావు, శేషమ్మ కాంచనపల్లి చిన వెంకటరామారావు తల్లిదండ్రులు. వీరి స్వగ్రామం పానగల్లు. రెండేళ్ల ప్రాయంలో ఉన్నప్పుడే తల్లి కాలధర్మం చేయడంతో అమ్మమ్మ, పెద్దమ్మల వద్ద పెరిగాడు. కాంచనపల్లి బడికెళ్లే వయసు నాటికే నిజాం దౌర్జన్య పాలన అమలులో ఉంది. ఈ రాజ్యంలో తెలుగు భాషకు తగిన స్థానం లేనందున ఉర్దూలోనే విద్యాభ్యాసం చేశాడు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే పత్రికలు చదవడం అలవాటు చేసుకున్న రామారావుపై షబ్నవీసు వెంకటరామ నరసింహారావు సంపాదకత్వాన వెలువడిన 'నీలగిరి' పత్రిక ప్రభావం పడింది. ఇదిలా ఉండగా సోషలిస్టు సాహిత్యాన్ని పరిచయం చేసిన మేనమామ బోయినపల్లి విశ్వనాథరావు వలన ఆదర్శ భావాలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత హైదరాబాదుకు న్యాయవాద విద్య కొరకు రావడం, ట్యూషన్లు చెప్పుకుంటూ చదువుకోవడం జరిగింది.
ఉద్యమ జీవితం
ఈ సమయంలోనే హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్ర మహాసభ సమావేశాలు భీకరంగా సాగుతున్నాయి. అపుడు ఈ సమావేశాల గురించి, వాటి లక్ష్యం గురించి తెలుసుకొని షాదునగర్ లో జరిగిన ఐదవ(1936) ఆంధ్రమహాసభకు, నిజామాబాద్ లో జరిగిన ఆరవ(1937) ఆంధ్రమహాసభకు తోటి స్నేహితులతో సైకిల్‌పై వెళ్లి హాజరయినాడు. బ్రిటీషాంధ్రలో దేవులపల్లి రాఘవేంద్రరావుతో కలిసి పర్యటించి, బెజవాడలో ఖద్దరు దుస్తులు కొనుక్కొని నాగపూర్ లో వందేమాతర ఉద్యమంలో పాల్గొన్నాడు.
ఆ పిదప మూడవ ఆంధ్రమహాసభ అధ్యక్షుడు పులిజాల వెంకట రంగారావు దగ్గర జూనియర్ గా చేరి 1941లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించాడు. ఇలా న్యాయవాద ప్రాక్టీసులో నైపుణ్యం సాధించాక, సాయుధ పోరాటంలో పాల్గొని ఉరిశిక్షకు గురైన నల్లా నర్సింలు, బాల నేరస్తుడైన రాంరెడ్డిల తరపున వాదించాడు.
ఆంధ్రమహాసభల్లో చురుగ్గా పాల్గొన డంతో, రావినారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన పదకొండవ ఆంధ్రమహాసభ నాటికి అతివాదుల వైపు ఆకర్షితుడయ్యాడు. దాంతో సాయుధ పోరాటంలో భాగంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాడి, కష్ణా జిల్లాలోని రామాపురం గ్రామంలో అరెస్టయి కడలూరు, రాయవెల్లూరు, వరంగల్ జైళ్లలో ఏడాది పాటు శిక్షను అనుభవించాడు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలి పోయినప్పుడు అరెస్టయి మరల రాజమండ్రి, ముషీరాబాద్ లో జైలు శిక్షకు గురయ్యాడు.
పదవీ బాధ్యతలు
1952 లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో పి.డి.ఎఫ్ పార్టీ తరపున చినకొండూరు నియోజకవర్గ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత శాసన సభపక్ష ఉపనాయకునిగా కూడా పని చేశాడు.1952 లో ఆంధ్ర సారస్వాత పరిషత్తు అధ్యక్షునిగా తన బాధ్యతలను నిర్వహించాడు. నల్లగొండ జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ డైరెక్టరుగా, జిల్లా బోర్డు ఉపాధ్యక్షుడిగా కూడా ఇతడు తన సేవలను అందించాడు. నల్గొండ జిల్లాలోని డిగ్రీ కళాశాల పాలకమండలిలో సభ్యుడిగా ఉన్నాడు.
సాహిత్యం
సాహిత్యం పట్ల అపారమైన మక్కువను కల్గిన కాంచనపల్లి తన సొంత గ్రామమైన పానగల్లులో ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించాడు. ఒక లిఖిత పత్రికను నడపడమే కాకుండా ఆరోజుల్లో తెలంగాణలో ప్రసిద్ధి పొందిన పత్రికలకు వ్యాసాలు, కథలు, కవిత్వం రాశాడు. ఉత్సాహంగా సాహిత్యాన్ని సజిస్తున్న యువకులను ప్రోత్సహిస్తూ మాలిక, దర్పణం, సమర్పణ వంటి కథా సంకలనాలను, సంఘర్షణ వంటి కవితా సంకలనాలను వెలువరించాడు. 'దర్పణం' అనే త్రైమాసిక సాహితీ పత్రికకు సంపాదకుడిగా కర్తవ్య, బాధ్యతలను నిర్వర్తించాడు. కాంచనపల్లి 'మన ఊళ్ళో కూడానా?, అనే కథల సంపుటితో పాటు 'అరుణ రేఖలు' పేరుతో కవితా సంపుటిని అందించాడు. ఇంతేకాక ఆయన చిరకాల వాంఛ అయిన రష్యా పర్యటనను క్షేమంగా ముగించుకొని ఆ జ్ఞాపకాలను, అనుభవాలను 'మధుర స్మతులు' అనే పేరుతో యాత్రా రచనగా రాశాడు. ఈ విధంగా విభిన్నమైన జీవిత కోణాలను రుచి చూసిన కాంచనపల్లి చినవెంకటరామారావు తొలితరం కథకులలో రచయితగా కీర్తిని పొంది 1992 మార్చి నెలలో13 వ తేదీన తుదిశ్వాస విడిచాడు.
- ఘనపురం సుదర్శన్
9000470542