Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆశావాదం-నిరాశవాదానికి సంబంధించిన దృక్పథాన్ని అలవర్చుకునేందుకు మన సమాజంలోని అందరూ వ్యక్తులు ప్రయత్నించాలి. ఇది రాత్రికి రాత్రే అలవడదు. దీనిని అలవర్చుకునేందుకు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు విరివిగా చదవాలి. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవాలి.
మన శారీరానికి అనారోగ్యం వచ్చినపుడు వైద్యుని వద్దకు వెళ్తాం. ఆ డాక్టర్ రాసిన మందులు వాడతాం. వైద్యుని సలహా ప్రకారం శారీరక ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తాం. అయితే మన మనసుకు సమస్య వస్తే మనమేం చేస్తాం? మనసుకు సమస్య వచ్చినపుడు పరిష్కారానికి మానసిక వ్యాయామం చేయాలి. శారీరానికి మాంసకృత్తులు ఎంత అవసరమో మన సుకు కూడా మానసిక ప్రశాంతత అంతే అవసరం.దీనిని సాధించడానికి ఎల్లవేళలా సానుకూల దృక్పథాన్ని అలవర్చు కోవాలి. మనసుకు అవసరమైన వ్యాయామశాలకు మానసిక శాస్త్రవేత్తలు 'మైండ్ జిమ్' అని పేరు పెట్టారు.ఈ మానసిక వ్యాయామ శాలలో చేసే వ్యాయామాలు ప్రారంభంలో కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అయినా ఆగిపోకూడదు. మనం శారీరక వ్యాయామ శాలలో మొదటి రోజు ఎక్కువగా నడిచినా, జిమ్‌లో వ్యాయామం చేసినా మరుసటి రోజు ఒళ్లు నొప్పులు సహజంగా వస్తాయి. అంత మాత్రానికే బెంబేలు పడిపోవద్దు. అదే విధంగా మనసు వ్యాయామ శాలలో కూడా కొన్ని నొప్పులుంటాయి. వాటిని మనం భరించాలి. 'నో పెయిన్ నో గెయిన్' అనే విషయాన్ని మనం మరచి పోకూడదు. మిత్రమా.. ఈ ప్రపంచంలో శ్రమకు మించిన సంపద లేదు. మానసిక వ్యాయామ శాలలో ఎన్నో రకాల కసరత్తులున్నాయి. ఆ కసరత్తుల్లో మొదటిది సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకోవడమే. మనలోని నిరాశవాదాన్ని విడిచి పెట్టి ఆశావాదాన్ని పెంచుకోవాలి. ఏ ఆలోచన అయినా మన మనసులోనే జనిస్తుంది. మన ఆలోచన ప్రకారమే మన నడివడిక ఉంటుంది.మనకు మనం ఇచ్చుకునే నెగెటివ్ సజెషన్ నుంచి పాజిటివ్ దిశలో ప్రయాణించడం మనం ఈ క్షణం నుంచే ప్రారంభించాలి.అనగా మనం మన మనసుతో నిరంతరం మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి. మన మనసులో ఎల్లప్పుడు పాజిటివ్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్ ఘర్షణ పడుతుంటాయి. పాజిటివ్ థింకింగ్‌ను మనం పెంచుకోవాలి. నెగెటివ్ థింకింగ్‌తో చేసే వ్యతిరేక ఆలోచనలను విడిచి పెట్టాలి. మన మనసు నుంచి వాటిని డిలీట్ చేయాలి. సానుకూల ఆలోచనలతో అడుగు ముందుకు వేయాలి. వ్యతిరేక ఆలోచనలను ఎలా తొలగించుకోవాలో ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో హల్ చల్ చేస్తోంది. హింది, ఇంగ్లీష్ బాషలో రూపొందించిన ఈ వీడియోలో ఒక వ్యక్తి మొదట ఒక పాత్రలో నీళ్లు పోస్తాడు. అందులో కొంత మట్టి కలుపుతాడు. ఆ పాత్రలోని మట్టిని తొలగించడానికి మరొక మగ్గుతో నీరు పోస్తాడు. అయినా ఆ మట్టి బయటకు రాదు. అలా చాల ప్రయత్నం చేస్తాడు. కానీ అనుకున్నది సాధించలేడు. మగ్గుకు బదులు ఒక నీటి పైపుతో ఆ పాత్రలో నీరు ఫోర్సుగా పోసినపుడు ఆ మట్టి బయటకు వెళ్లి స్వచ్ఛమైన నీరు ఆ పాత్రలో మిగులుతుంది. మట్టిని ఇక్కడ వ్యతిరేక ఆలోచనగా తీసుకోవాలి. మన మనసులోని వ్యతిరేక మలినాన్ని బయటకు తీసివేసేందుకు మామూలు ప్రయత్నం కాదు. గట్టి ప్రయత్నమే చేయాలనేది ఆ వీడియో సారాంశం. వ్యతిరేక ఆలోచనలనేవి అన్ని వయస్సులకు సంబంధించిన వ్యక్తులకు వస్తాయి. సానుకూల ఆలోచనలను మనం పెంచుకొనేందుకు మాన సికంగా కసరత్తు చేయాలి. వ్యతిరేక ఆలోచనలను దరి చేరనీయవద్దు.
ఇదిలా ఉండగా థామస్ దేవర్ అనే మానసిక శాస్త్రవేత్త మన మనసుని విమాన ప్రమాదంలో మనలను మనం రక్షించుకునే పారాచూటుతో పోల్చాడు. విమానంలోంచి దూకే ముందు ఆ పారాచూట్ తెరుచుకుంటేనే పెద్ద బుడగ ఏర్పడు తుంది.బుడగ వలన మనిషి ప్రమాదం లేకుండా నేల మీద దిగగలడు.అదే విధంగా మన మనసు మూసుకు పోయినా, ఎవరు చెప్పినా వినకుండా ఊరికే బుర్ర ఊపినా అది తెరుచుకోదు. మీ మనసు తలుపును మీరు మాత్రమే తెరవగలరు. ఆ తాళంచెవి మీ వద్దే ఉంటుంది. 1995 సంవత్సరంలో అమెరికాకు చెందిన ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయమొకటి వెల్లడైంది. ఆసుపత్రుల్లో వివిధ జబ్బులకు చికిత్స తీసుకుంటున్న వారిని కలిసి ఆశావాదం-నిరాశ వాదానికి సంబంధించిన ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఇందులో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. నిరాశవాదులు నిర్ణీత సమయం కంటె ముందే మరణించారు. ఆశావాదులు మాత్రం సానుకూల దృక్పథంతో తమ జబ్బును నయం చేసుకుని ఇంటికి వెళ్లారు. ఆశావాదం- నిరాశవాదానికి సంబంధించిన దృక్పథాన్ని అలవర్చుకునేందుకు మన సమాజంలోని అందరూ వ్యక్తులు ప్రయత్నించాలి. ఇది రాత్రికి రాత్రే అలవడదు. దీనిని అలవర్చుకునేందుకు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు విరివిగా చదవాలి. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవాలి.
- జి గంగాధర్ సిర్ప, 8919668843