Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాతలు తక్కువే రాసినా స్వాతంత్య్రోద్యమంలో ప్రజలను కూతలు పెట్టించాడు. కుటుంబానికి అప్పుడప్పుడు దూరంగా ఉన్నా స్వాతంత్య్రం కోసం సత్యాగ్రహౌద్యమాన్ని ఆరాధించాడు. పత్రికా మాధ్యమంలో పనిచేస్తూనే ఉన్నా సినిమా రంగంలోకి ఔత్సాహికుడిగా ప్రవేశించాడు. సమసమాజ నిర్మాణం కావాలని దానికి ప్రజలందరూ నడుంబిగించాలని సంఘ సంస్కరణను పూనుకున్నాడు. అదే తోవలోనే వివాహమాడి వెలివేయబడ్డ సమాజోద్ధారకుడే మాడపాటి రామచంద్రరావు.
జీవన రేఖలు
స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ వేత్త, బహుభాషా పండితుడు, పత్రికా రచయిత అయిన రామచంద్రరావు 1903 సం|| మే నెలలో 28 న తేదీన ఎర్రుపాలెం గ్రామంలో జన్మించాడు. ఈ గ్రామం ఖమ్మం జిల్లాలోని మధిర తాలుకాలో ఉంది. ఇతని తల్లిదండ్రులు వెంకట్రామమ్మ, మాడపాటి తిరుమలరావు. తిరుమలరావు వకీలుగా ప్రసిద్ధులు. ఆంధ్ర పితామహులైన మాడపాటి హనుమంతరావు రామచంద్రరావుకు స్వయానా చిన్నాన్న.
విద్య, వత్తి
రామచంద్రరావు బొంబాయిలో రెండేండ్ల పాటు ఎంబీబీఎస్ చదివి ఏవో కారణాల వలన మధ్యలోనే ఆపేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివి పట్టభద్రుడయ్యాడు. బహుభాషా పండితుడైన మాడపాటి ఆంగ్లము, తెలుగు, సంస్కృతం, ఉర్దూ, పర్షియన్ భాషలలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. పూనాలో న్యాయవాద విద్యను అభ్యసించి పట్టాను పొందిన తర్వాత మధిరలో, హైదరాబాదులలో కొంతకాలం వకీలు వృత్తిని చేపట్టాడు. కానీ అనివార్య కారణాల వలన వకీలు వృత్తికి స్వస్తి పలికాడు. సినిమా రంగంలో ప్రవేశం ఉన్న రామచంద్రరావు, గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో వచ్చిన ఇల్లాలు, రైతు బిడ్డ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.
ఉద్యమం
మాడపాటి నిత్య ఖద్దరు ధారి, జాతీయభావాలు గల దేశభక్తుడు, సంఘసంస్కరణవాది. ఆనాడు సమాజంలో పెనవేసుకుపోయిన మూఢ విశ్వాసాలు తొలగిపోవాలని తపించి వాటి నిర్మూలన కోసం పాటుపడ్డాడు. స్వయంగా వితంతు వివాహం చేసుకున్నప్పుడు అది నచ్చని సనాతనవాదులు తనను వెలివేశారు. అయినా ఆత్మస్థర్యంతో పుర్వాచార పరాణయత్వాన్ని ఎదుర్కొన్న శక్తిమంతుడిగా నిలిచాడు. .
1938 సంవత్సరంలో స్టేటు కాంగ్రెసు ఆధ్వర్యంలో సత్యాగ్రహం మొదలయినపుడు బి.ఎన్.శర్మతో కలిసి విజయవాడ నుంచి ఆంధ్రవాణి అను దినపత్రికను నూతన హంగులతో నడిపి, పాఠకులను ఆకర్షించి సత్యాగ్రహ ఉద్యమానికి మంచి స్పూర్తిని ఇచ్చాడు. 1946 సం||లో స్టేటు కాంగ్రెసు పునరుజ్జీవనం పొంది అధ్యక్షుడిగా శ్రీ రామానంద తీర్థ నియమితుడైనప్పుడు రామచంద్రరావు దానికి ప్రథమ కార్యదర్శియై రామానంద తీర్థకు చేదోడుగా ఉండి స్టేటు కాంగ్రెసు ఉద్యమాన్ని నిర్వహించాడు. ఈ విధంగా స్టేటు కాంగ్రెసు సాగించిన స్వాతంత్య్రోద్యమంలో మాడపాటి రామచంద్రరావు తనదైన పాత్రను పోషించాడు. హైద్రాబాద్ నాంపల్లిలో ఉన్న గాంధీ భవన్ నిర్మాణానికి పూనుకున్న పెద్దలలో మాడపాటి ఒకరు.
రచనలు, ఇతరాలు
ఇతను అడవి గాచిన వెన్నెల అనే కథ రాశాడు. ఇది 1923 సంవత్సరంలో కోకల సీతారామశర్మ సంపాదకత్వంలో వచ్చిన ఆంధ్రాభుద్యయంలో ప్రచురితమైంది. వీరి మరో కథ జయాపజయములు సుజాత పత్రికలో 1927 సంవత్సరంలో వచ్చింది. రాజా రామమోహనరారు రచనల స్ఫూర్తితో సంఘ సంస్కరణకు పూనుకున్నాడు. వీరికి వారసత్వంగా వచ్చిన వందల ఎకరాల భూమిని పేదలకు పంచి తన సేవానిరతిని చాటుకున్నాడు. వీరి జీవితంలో ఎదురైన పలు ప్రసిద్ధ ఘట్టాలను తన డైరీలలో రాసుకున్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టి ఉన్న దేశానికి, కన్న ప్రాంతానికి ఏదైనా చేయాలని, భూమి లేని ప్రజలకు భూమిని పంచాలని తపించి పంచిచ్చి తన యావత్తు జీవితాన్ని సమాజ సేవకు అంకితం గావించిన మాడపాటి రామచంద్రరావు 1952 సంవత్సరంలో డిసెంబర్ 5 వ తేదీన కన్నుమూశాడు.
- ఘనపురం సుదర్శన్
9000470542