Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బతుకమ్మ' అంటే చాలు ఆడబిడ్డలకు అంతులేని ఆనందం. ఎందుకంటే ప్రతీ గడప తల్లిగారింటికి వచ్చే ఆడబిడ్డ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తుంది. ఇంట్లో వారి అందరి చూపులు ఆడబిడ్డ కోసం ఇంటి గుమ్మానికి తోరణాల వుతాయి. వంటగది మొత్తం ఆమె నోరు తీపి చేయడానికి ఘుమఘుమ వాసనలతో సిద్ధమయిపోతుంది. నాన్నమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, అక్క, అన్న, తమ్ముడు , చెల్లి బంధాలన్నీ మధుర స్మతులు పంచుకోవడానికి చేకోర పక్షుల్లా ఎదురుచూస్తుంటాయి. తెలంగాణా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించిన బతుకమ్మ ప్రతీ ఇంటి పేగుబంధం.
బోడ్దేమ్మను ఆడి బావిలో వేసి సాగనంపిన తర్వాత ఆశ్వ యుజ మాసంలో అమావాస్య రోజు మొదటగా బతుకమ్మ పేరుస్తారు. పెత్తరమావాస్య రోజు పేర్చే ఈ బతుకమ్మను 'ఎంగిలిపూల బతుకమ్మ' అంటారు. ఎందుకంటే ప్రతీ పండుగలో పూజ కోసం నిష్ఠగా ఉపవాసం చేస్తారు కాని ఈ బతుకమ్మ, తిన్నాక సాయంత్రం ఆడతారు కాబట్టి, అంటే ఎంగిలి పడ్డ తర్వాత ఆడతారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఆరవరోజు బతుకమ్మ 'అలిగింది' అని ఆరోజు 'అర్రేం' అని ఆడరు.
'సవతి పోరు ఇంతింత కాదయా' అన్న మాట ఎంత నిజమో కాని, ప్రతీ సద్దుల బతుకమ్మ ఆడే రోజు మాత్రం తప్పక వర్షం పడడం మాత్రం నమ్మశక్యం కాని నిజం. ఎందుకంటే గంగమ్మ, గౌరమ్మ ఇద్దరూ శివుని భార్యలే కదా! అటువంటప్పుడు ఇద్దరూ సవతులు అవుతారు. సవతులకు ఎక్కడయినా ఒకరంటే ఒకరికి పడదు. అందుకే గౌరమ్మ పండగయిన 'సద్దుల బతుకమ్మ' రోజు తప్పక గంగమ్మ తల్లి 'ఆటంకం కలిగించాలని వర్షం కురిపి స్తుంది' అంటారు. నిజానిజాలేలావున్న ఇప్పటివరకు ఇలా జరగడం మాత్రం యాదచ్చికం అనడానికి వీలులేని నిజమ్.
బతుకమ్మపై చాలా కధలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి ధరచోల దేశాన్ని పాలించే ధర్మాంగుడనే రాజు భార్య సత్యవతి దంపతులు తపస్సు ఫలితం 'బతుకమ్మ' అనే కథ ప్రచారంలో ఉంది. పాట రూపేన కూడా ప్రసారం అవుతుంది. అలాగే మరో కధలో ఇంటి ఆడబిడ్డను సవతి తల్లి చంపి పాతి పెట్టిన చోట మొలిచిన మొక్క, తనకు జరిగిన అన్యాయాన్ని అన్నయ్యకు చెప్పడం ఆమెనే బతుకమ్మ అని చెప్పడం మరో కథ.
పూర్వం మనుషులంతా నాగరికత లేక మాంసం వండ కుండా తినడం, శుచి శుబ్రత లేక అపరిశుబ్రంగా వ్యవహరిం చడం చూసి తన సృష్టిలోని మనుషులు ఇలా ప్రవర్తిస్తున్నారని శివుడికి కోపం వచ్చి వారందరినీ ఒక కొండ గుహలో బందిస్తాడట. అప్పుడు పార్వతి దేవి అంటే గౌరమ్మ తల్లి వారి పై దయతలచి, 'తమ బిడ్డలను తామే బంధించడం' పద్ధతి కాదని, వారిని కాపాడి మంచి చెడ్డలు నేర్పించే బాధ్యత తమదే అని , 'లింగం' పేరుతో ఒక కొడుకుని కనీ అతని ద్వారా, వారికి ఆచార వ్యవహారాలు, పూజలు, సంస్కృతీ , సంప్రదాయం ఇలా అన్ని నేర్పుతుందిట. అలా తమను మంచి దారిలో పెట్టిన ఆ తల్లిని వారు అలా గౌరమ్మ రూపంలో గోల్చుకుంటారని 'బతుకమ్మ' ను అందుకే 'గర్భాకారం'లో పేరుస్తారని ప్రతీతి.
బతుకమ్మను ప్రకృతి పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే ప్రకృతి లోని ఆకులు, పూలే బతుకమ్మలో పేర్చడానికి వాడతారు. బతుకమ్మ పేర్చడానికి ప్రత్యేకంగా ఈ పూలే కావాలని ఏమీ ఉండదు. తంగేడు, గునుగు పూలతో పేరుస్తారు కాని. ఆ పూలు కాకుండా ఏ పూలో అయినా బతుకమ్మ పేర్చవచ్చు. సిబ్బి లేదా పళ్ళెం, తాంబాలం లో అడుగున ఆకులు పరిచి, తంగేడు, గునుగు పూవులతో పాటు రుద్రాక్ష పూలు, గుమ్మడి, బంతి, చేమంతి, గోరంట, తామర, కలువ, మందార , కనకాంబరాలు, నెల గులాబి, లిల్ల్లీ, గన్నేరు, చుక్కమల్లె, చిట్టి చామంతి, చల్ల గుత్తి, నందివర్ధనం, కట్ల పూలు, చంద్రకాంత, కాశీ రత్నం, గడ్డిపూలు, జాజి, సీత జడ ఇలా చెప్పుకుంటూ పొతే ఇది అది కాక ఎ పువ్వయినా బతుకమ్మలో పెర్చగానే అందాన్ని సంతరించుకుంటుంది. ఇలా తీరొక్క పూలతో వరుసలు వరుసలుగా తమకిష్టమైనంత ఎత్తు పేరుస్తారు. అంత ఎత్తు ఉన్న బతుకమ్మ పడకుండా ఉండాలంటే చుట్టూ వరుసలుగా పెర్చేప్పుడు కడుపులో ఆకులు, పూల రేకులు, కాడలు అన్నీ పోస్తారు. దాని వల్ల బతుకమ్మ నిండుగా అందంగా ముస్తాబవుతుంది. దాని పైన గుమ్మడి పూవులోనో, తంగేడు పూలలోనో పసుపు గౌరమ్మను ఉంచి పసుపు కుంకుమ అక్షింతలు వేసి, తమ ముత్తయిదువ తనాన్ని నిలిపే గౌరమ్మను భక్తిగా పూజిస్తారు. ఆ తొమ్మిది రోజులు సాయంత్రం కాగానే యువతులు, మహిళలు, చిన్నారులంతా అందంగా ముస్తాబై, అందంగా తీరొక్క పూలతో తీర్చి దిద్దిన బతుకమ్మను తీసుకుని దగ్గరలోని గుడి ప్రాంగణంలోనో, విశాల మైదానం లోనో, చెరువు గట్టు దగ్గరకో వెళ్లి అందరి బతుకమ్మ లొక్క దగ్గర పెట్టి వెంపలి చెట్టును తెచ్చి అక్కడ ఉంచి దానిపై, పసుపు కుంకుమ చల్లి , వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ, కోలాటాలు ఆడతారు. ఆ పాటలన్నీ తెలంగాణా సంస్కృతీని, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా మన పురాణాలను తెలిపెవిగా రకరకాలుగా ఉంటాయి. వాటికి మకుటంగా, ఉయ్యాల అనో, 'కోల్' అనో, 'వలలో' అనో 'గౌరమ్మ' అనో ఉండటం వల్ల మంచి ప్రాసలతో ఉండి వినసొంపుగా, పాడేవాళ్ళకి ఉత్తేజాన్ని వినేవాళ్ళకి ఉల్లాసాన్ని కల్గిస్తాయి.
ఇక ఇలా బతుకమ్మ తొమ్మిది రోజులు ఆడి , తొమ్మిదో రోజు పసుపుతో గౌరమ్మను చేసి, తొమ్మిది సద్దులు చేసి నైవేద్యంగా పెట్టి , ఆడిన తర్వాత గౌరమ్మను, సద్దులను ముత్తేయిదువులు అందరూ వాయినం ఇచ్చుకుని , బతుకమ్మ పై దీపం వెలిగించి , 'పోయిరా గౌరమ్మ పోయి రావమ్మ, మల్లోచ్చే ఏడాది మళ్ళి రావమ్మా' అంటూ చెరువులో గంగమ్మ తల్లి ఒడిలో విడిచి అత్తగారింటికి సాగనంపుతారు. సద్దుల్లోని నువ్వులు, బెల్లం, రకరకాల ధాన్యాలు మారిన ఈ కాలంలో మంచి బలాన్ని ఇస్తాయి. గునుగుపూలు, తంగెడులో ఉండే ఔషధ గుణాల వల్ల నీరు శుద్ధి అవుతుందని అంటారు. ఇలా ప్రకతిలో పుట్టిన బతుకమ్మ ప్రకృతి లోనే విలీనం అవుతుంది.
- నామని సుజనాదేవి , 7799305575