Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు, తాము అనుభవించిన సమస్యలను, పరిశీలించిన సంఘటనలను, తమ దష్టికి వచ్చిన విపత్కర పరిస్థితులను తమదైన దక్కోణంలోనుంచి సాహిత్యంగా మలుస్తారు. మరి కొందరు సమకాలంలో సాగుతున్న ఉద్యమంలో పాల్గొని నూతన పంథాను అనుసరించి ఉద్యమ ఆశయాలను సాధిస్తారు. ఇంకొందరు అజ్ఞానాంధకారంలో నివసిస్తున్న సమాజాన్ని మేల్కొల్పెందుకు తమ అభిరుచిలోంచి గ్రంథాలయాలను, సాహిత్య సంస్థలను స్థాపించి ప్రజల సర్వతోముఖాభివద్ధికి పాటు పడతారు. కానీ వీరికి భిన్నంగా వీటన్నిటిని మేళవిస్తూ సాహిత్యం సజించిన, రాష్ట్ర, దేశ స్వాతంత్య్రోద్యమంలో భాగస్వామి అయిన, ప్రజల విజ్ఞాన శ్రేయస్సును కాంక్షించిన సాహితీవేత్త, స్వాతంత్య్రోద్యమకారుడు, సాహిత్య ప్రచార సేవకుడు బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి.
జీవన రేఖ:
కథా రచయిత, అనువాదకుడు, నాటక కర్త, స్వాతంత్య్ర సమరయోధుడైన బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి ఖమ్మం జిల్లా వేంసూరు వాసి. ఈయన 1918 సం.లో మాఘమాసంలో జన్మించారు.
సాహిత్యం:
1962లో 'సశేషం', 1967లో 'కథాకళి' అనే కథా సంపుటాలు రాశారు. ఇందులో 'సశేషం' అనే కథా సంపుటిని తాళ్లూరి జోగారావుకి అంకితం ఇచ్చారు. 1946-61 సంవత్సరాల మధ్యకాలంలో రాసిన 'కథాకళి' సంపుటంలో 11 కథలు చోటుచేసు కున్నాయి. 'ప్రతీకారం', 'పంచకళ్యాణి', 'ఉషశ్రీ', 'సకద్దాత' అనే నాటికలను రాశారు. 'గ్రంథరాజం నవోదయం' అనే పేరిట ఆంధ్రవ్మాయ చరిత్రను రాశారు. ఇది 19వ శతాబ్ది 'ఆంధ్ర వాజ్మయ చరిత్ర'ను తెల్పుతుంది. 'నమోవాకం', 'రత్నావలి', 'జహంగీరు', 'కష్ణవేణి', 'తరంగిణి' అనే ఖండికలను, 'ప్రబోధం', 'వనప్రియ' అనే గేయాలను రచించారు. 'పరమేశ్వరి' (పద్యాలు), 'తరంగాలు', 'చిరుగంటలు' (బాలగేయాలు), ఉర్దూలో కథానికలతో పాటు వ్యాసాలూ రాశారు. 'శంగారం-పోతన' అనే విమర్శ వ్యాసాలు రచించారు. 'ఋతుపవనం' అనే కావ్యానికి 1973వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.1930 నుంచి భారతి పత్రికలో రచనలు రాస్తూ ఉండేవారు. ఇతను 'రసహౌళి', 'కలగాదు నిజం' అనే జాతీయోద్యమ కథలతో పాటు 'పాపిడ'ి, 'పరివర్తనం' అనే కథలు నాటి ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. కేంద్ర సాహిత్య అకాడెమీ సూచన మేరకు ఉర్దూలో ఉన్న కథలను తెలుగులోకి అనువాదం చేశారు. నాడు ప్రాచుర్యంలో ఉన్న పత్రికలైన 'ప్రజామత', 'ప్రగతి', 'స్వతంత్ర', 'సారథి', 'ప్రజాబంధు', 'సుజాత' వంటి పత్రికలలో తన రచనలు ప్రచురితమయ్యాయి.
బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి తన స్వగ్రామమైన వేంసూరులో 'వేణి సాహిత్య మాల'ను స్థాపించి ఆ సంస్థ తరపున అనేక పుస్తకాలు ప్రచురించేవాడు.
ఉద్యమ జీవితం:
ఆయన సాహితీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ప్రవేశించారు. హైదరాబాద్ రాష్ట్ర నిరంకుశ ప్రభుత్వం నుంచి స్వాతంత్య్రం పొందాలని తెలంగాణ స్వాతంత్య్రోద్యమంలో ప్రధాన ఘట్టాలైన గ్రంథాలయోద్యమంలోనూ, ఆంధ్రమహాసభ ఉద్యమంలోనూ పాల్గొని నిజాం ప్రభుత్వాన్ని ఎదురించారు. బలమైన జాతీయ స్వాతంత్య్రాన్ని విశ్వసించిన శాస్త్రి స్టేట్ కాంగ్రెసు తరపున ఉద్యమంలో పాల్గొన్నారు. తన స్వగ్రామంలో దళిత విద్యార్థుల కోసం పాఠశాలను నిర్వహించారు. గ్రంథాలయాలను నడిపారు. వారు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న కాలానికి నాడు సామాజికంగా ఉన్న సమస్యలను, అనైక్యతను గమనించి ప్రజలలో జాతి చైతన్యం పట్ల అవగాహన కల్పించి వారిని జాతీయోద్యమంలో భాగం చేయాలని అందుకు మాధ్యమంగా కథా సారస్వతాన్ని సజించారు. ఈయన చివరి రచన 'నిద్రకన్యలు'. ఈ రచన 1972 సంవత్సరంలో భారతిలో ప్రచురితమైంది.
ఈ విధంగా పలు రంగాలలో సేవ చేస్తూ, స్వాతంత్య్రోద్యమంలో పాల్గొంటూ, సాహిత్యాన్ని రచించిన బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి 1973వ సంవత్సరంలో కన్ను మూశారు.
- ఘనపురం సుదర్శన్