Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లా, వాంకిడి మండలం, గ్రామంలో వాంకిడి గుడి చక్రివాగు ఒడ్డున వుంది. అపూర్వమైన, అరుదైన కాలాముఖశైవ సాంప్రదాయిక దేవాలయాన్ని కొత్తతెలంగాణ చరిత్ర బందానికి చెందిన యువపరిశోధకుడు సముద్రాల సునీల్ వెలుగులోనికి తెచ్చాడు.
పూర్వం చక్రివాగు గుడిని చుట్టుకొని ప్రవహిస్తుండేదిట. వాగుకు వరదలొచ్చినపుడు గుడిలో కొంతభాగం కూలి పోయిందని స్థానికులు చెప్తుంటారు. గుడి ఉత్తరాభిముఖంగా వుంది. దేవాలయగోపురాలు ఫంసానా పద్ధతిలో నిర్మించబడ్డాయి. వాంకిడి గుడిలో కొలువబడుతున్న ప్రధాన దేవత మహామాత ఎల్లమ్మ. ఈ దేవతా శిల్పాన్ని పరిశీలించినపుడు ఉమాలింగనమూర్తి శిల్పంలో ఉన్నట్టే శివుడి (శివుడున్న భాగం నడుము పైనుంచి విరిగిపోయింది.) ఎడమతొడమీద పార్వతి (మహామాయ...?) కుడితొడ చేర్చి సుఖాసనంలో కూర్చుని వుంది. ఆమెకు 20 చేతులున్నాయి. తలమీదతల ఐదుతలలున్నాయి. ఇద్దరి కింద వాహనంగా రెండుచేతులు, కాళ్ళు నేలమీద మోపి వంగివున్న రాక్షసుడు (?)న్నాడు.
ఈ గుడిలో సప్తాశ్వరథారూఢుడైన ఆదిత్యశిల్పం మనోహరం. సర్వాంగ సుందరంగా తోరణాదులతో శిల్పం హళేబీడు శిల్పశైలిలో వుంది. ఖజురహౌలోని సూర్యశిల్పాన్ని పోలివుంది.
గర్భగుడి ద్వారం చాళుక్యపూర్వ శైలిలో కవాటపద్థతిలో కడప, శేరెలమీద స్తంభోప స్తంభాలున్నాయి. ఉత్తరాశిమీద ప్రస్తరం వుంది. లలాటబింబంగా గణపతి వున్నాడు. గర్భగుడిలో క్షితిజసమాంతరంగా వున్న వర్తులాకార పానవట్టంలో సమతల శివలింగం ప్రతిష్టించబడివుంది. ఇది చాళుక్యశైలి లింగం. ఈ దేవాలయం కాలాముఖశైవులది. ఇక్కడ శాక్తేయమతం కూడా ఉందని శిల్పాలవల్ల తెలుస్తున్నది. ఇటువంటి శిల్పాలున్న దేవాలయం తెలంగాణాలోనే అరుదు. మధ్యభారత దేవాలయ వాస్తునిర్మాణశైలిలో నిర్మించిన గుడి ఇది.
వాంకిడి గుడిలోని విడిశిల్పాలు
లోహకారుల దేవత మహామాయ (శిల్పం మీద పేరు చెక్కి ఉంది), శాంకరి, చాముండ, ఉమాలింగనమూర్తి (ఈ శిల్పం మీద దేవాలయ నిర్మాత రాజు ప్రతిమ ఉంది), లక్ష్మీనారాయణస్వామి, అనంతశయనుడు, గరుత్మంతుడు, త్రైపురుషమూర్తి, విష్ణువు, పాశుపతయోగులు, భైరవులు, వీరభద్రులు, గణపతి ప్రతిమలున్నయి. ఇందులో కొన్ని చాళుక్యశైలి శిల్పాలు. గుడి బయట వీరగల్లులున్నాయి.
గుడి జగతిమీద శిల్పాలు
వాంకిడి శివాలయం ఎత్తైన జగతిమీద నిర్మితమైంది. జగతిమీద గజధార, అశ్వధారలతో పాటు కొన్ని పౌరాణిక కథాదశ్యాలు చెక్కివున్నాయి. వీటిలో అశ్వ, గజసైన్యాలు, గజాల యుద్ధదశ్యాలున్నాయి. పాశుపతయోగుల శిల్పాలున్నాయి. గోపికా వస్త్రాపహరణం, అశ్వమేధాశ్వం కొరకు వచ్చిన రామ సోదరులతో లవకుశుల యుద్ధదశ్యం, పాండవులు, పెండ్లి, మంగళస్నానాలు, చతుష్పాద నటత్రయం(రామప్ప పూర్వశిల్పం), నాట్యకత్తె, సింహవ్యాళి, ఒకచోట ఇద్దరు పరిచారికలచేత సేవింపబడుతున్న శైవగురువు సుఖాసనంలో కూర్చుని వున్నాడు. చివరలో ఇద్దరు అప్సరలు చేతులుపట్టుకుని కొనిపోతున్న వీరుడున్నాడు. ఇదొక ఆత్మాహుతి వీరగల్లు దశ్యం.
శిల్పాల వరుస
1.జగతి శిల్పాలు, 2,3.మహామాత విగ్రహాలు, 4.మహామాయ,5. కాలాముఖాచార్యుడు, 6. శాంకరి, 7. సూర్యుడు, 8,9. దేవాలయదశ్యాలు
చరిత్ర పరిశోధకుడు
సముద్రాల సునీల్, గోదావరిఖని, 9666682923, కొత్తతెలంగాణ చరిత్రబృందం పరిశోధక సభ్యుడు. విషయ రచన, చారిత్రక వ్యాఖ్య: శ్రీరామోజుహరగోపాల్, 9949498698, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్రబృందం