Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ నేల తొలినాళ్ళ నుంచి చరిత్రకారుల చేతుల్లో విస్మృతికి గురైంది. అటు ఆంధ్రదేశ చరిత్రలోనూ, ఇటు భారతదేశ చరిత్రలోనూ కావాల్సిన స్థాయిలో ఈ నేల చరిత్ర, సంస్కృతి నమోదు కాలేదు. ఇది కేవలం చరిత్ర, సాహిత్యం, రాజకీయం వంటి అంశాల్లోనే కాక బాల సాహిత్య రంగంలోనూ జరిగింది, జరుగుతూనే ఉంది. ఆరు దశాబ్దాల పోరాటఫలితంగా లభించిన స్వరాష్ట్రంలో తిరిగి చరిత్రను రాసుకుంటున్న క్రమంలో తెలంగాణాలోనూ, ఇటు తెలుగునేలపైనా తమ రచనలతో బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన 'మన బాల సాహితీమూర్తులు' గురించి నేటి తరానికి తెలియాలన్న సంకల్పమే ఈ వ్యాసాలు.
తెగిన గాలిపటం కాదు తెలంగాణ / తెలంగాణ తేనె సొన / తెలంగాణ దివ్య వీణ / తెలంగాణ నవ కవితల నజరానా! అంటారు డా|| దాశరథి 'తిమిరంతో సమరం' కావ్యంలో. చారిత్రక కాలాల నుంచి నేటిదాకా తెలంగాణ, దక్కన్ పీఠభూమి, ఆర్యావర్తం లేదా యావత్ భారతదేశ చరిత్రతో సువర్ణపుటగా నిలిచింది. హాలుడు, పంపకవి మొదలు డా||సి. నారాయణ రెడ్డి విశ్వంభర వరకు ఈ నేల మీద ఆవిర్భవించాయి. నన్నయకు ముందే ఈ నేల మీద తొలి కన్నడ కావ్యం 'ఆదిపురాణం' మన వేములవాడ పంపకవి చేత రచంపబడింది. మహా భారత రచనకు ముందే జినవల్లభుడు ఈ నేలమీద కంద పద్యాల్ని రచించాడు. కరీంనగర్ జిల్లా బమ్మలగుట్ట మీదున్న శాసనాలు అందుకు సాక్ష్యంగా నిలవడమే కాకా తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించేందుకు మూల భూమికగా నిలిచాయి.
విలక్షణ భాష, ప్రత్యేకమైనది కానీ సంస్కృతి, తనదైన ఆహార వ్యవహారాలు, సంప్రదాయాలు, యాసలు, ఈ నేలకు సొంతం. ఉర్దూ, తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ మొదలగు భాషల నేపథ్యం, వేలాది సంవత్సరాల చారిత్రక, సాంస్కృ తిక, ఉద్యమ చరిత్రగల ఈ నేల తొలినాళ్ళ నుంచి చరిత్రకారుల చేతుల్లో విస్మృతికి గురైంది. అటు ఆంధ్రదేశ చరిత్రలోనూ, ఇటు భారతదేశ చరిత్రలోనూ కావాల్సిన స్థాయిలో ఈ నేల చరిత్ర, సంస్కృతి నమోదు కాలేదు. ఇది కేవలం చరిత్ర, సాహిత్యం, రాజకీయం వంటి అంశాల్లోనే కాక బాల సాహిత్య రంగంలోనూ జరిగింది, జరుగుతూనే ఉంది. ఆరు దశాబ్దాల పోరాటఫలితంగా లభించిన స్వరాష్ట్రంలో తిరిగి చరిత్రను రాసుకుం టున్న క్రమంలో తెలంగాణాలోనూ, ఇటు తెలుగునేలపైనా తమ రచనలతో బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన 'మన బాల సాహితీమూర్తులు' గురించి నేటి తరానికి తెలియాలన్న సంకల్పమే ఈ వ్యాసాలు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని సాహిత్య చరిత్రల్లాగానే బాల సాహితీ వేత్తలకు సంబంధించిన పుస్తకాలు వచ్చాయి. వాటిలో రెడ్డి రాఘవయ్య 'బాల సాహిత్య నిర్మాతలు' ఒకటి. నూటా యాబైరెండుమంది బాల సాహితీవేత్తలను ఇందులో పరిచయం చేశారు. కాగా పూదూరు సీతారామశాస్త్రి, మహ్మద్ ఖాసీం ఖాన్, రాయప్రోలు వామన మూర్తిల వంటి విజ్ఞాన సర్వస్వాలు, కొన్ని పద్యాలు, బాలశిక్షలు రాసిన వాళ్ళగురించి పరిచయం చేసిన రచయిత ఇందులో కేవలం 11 మంది తెలంగాణ సాహితీ వేత్తల గురించి మాత్రమే రాశాడు. ఒకటి, అరా రచనలు చేసినవారిని కూడా తన రచనల్లో చేర్చగలిగిన ఆయన 1944 ప్రాంతంలోనే పిల్లల కోసం రాసిన పొట్లపల్లి రామారావు, ఆదిరాజు వీరభద్రరావు, గంగుల శాయిరెడ్డి, జ్వాలాముఖి, 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి తొలి బాల సాహిత్య పురస్కారం అందుకున్న గంగరాజు సుశీలాదేవి, డా.సి.నారాయణరెడ్డి, డా.దాశరథి, డా.యశోధారెడ్డి, తిగుళ్ళ వెంకటేశ్వర శర్మ, డా.సామల సదాశివ, ఆచార్య బిరుదురాజు రామరాజు, బాలబంధు ఇల్లిందల సరస్వతీదేవి, నందగిరి ఇందిరాదేవి, బి.ఎన్.శాస్త్రి, గడియారం, ఉమ్మెత్తల యజ్ఞరామయ్య, డా.బోయ జంగయ్య, శారదా అశోకవర్ధన్, డా.వేముగంటి, జి.రాములు, ఎర్రోజు సత్యం, చందమామ కథల బూర్లె నాగేశ్వరరావు, నీలా జంగయ్య, ఇరివెంటి కృష్ణమూర్తి, డా.గూడూరి రాఘవేంద్ర, డా.జె.బాపురెడ్డి, డా.వడ్డేపల్లి కృష్ణ. డా.వి.ఆర్. శర్మ వంటి వందలాది మంది లబ్దప్రతిష్టులైన బాల సాహితీవేత్తల పేర్లు అందులో నమోదుచేయలేదు. గతంలో గంగరాజు సుశీలాదేవి పేరును 1977లో బాలల మహాసభల సంచికలో రాసిన రాఘవయ్య ఎందుకనో తన 'బాల సాహితీమూర్తులు'లో రాయలేక పోయారు. 'తెలంగాణలో బాల సాహిత్య వికాసం' కోసం జరిపిన విషయ సేకరణలో లభించిన అనేక మంది బాల బంధువులైన బాల సాహితీమూర్తులను ఈ శీర్షికలో పరిచయం చేస్తున్నాను.
తెలుగులో తొలుత మనం మన బాల్యంలో చదువుకున్నవి పాల్కురికి సోమనాథుని ఆటల పాటల పద్యాలు, ద్విపదలు, పోతనామాత్యుని భాగవతం లోని శ్రీకృష్ణ బాల్య క్రీడలు. ఈ ఇద్దరు కూడా ఈ నేలమీద వర్ధిల్లడం గర్వ కారణం. తెలంగాణా బాల సాహిత్య తేజోమూర్తుల్ని, వారివారి రచనలను మన పిల్లలకు, పిల్లల కోసం రాస్తున్న పెద్దలకు పరిచయం చేయడం ఈ శీర్షిక ఉద్దేశ్యం.