Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంధకారంలో అడుగంటిపోయే మానవ జీవులు ఒకవైపు. బానిస ప్రపంచాన్ని పాతరేసి పెత్తనాన్ని పెకిలించే ఉద్యమ సహాయకారులు ఒకవైపు. ఊసుపోక ఉద్యమాన్ని వక్ర మార్గంలో నడిపించే సమూహం
ఒకవైపు. ఉవ్వెత్తున ఎగిసే పోరాట నినాదాలతో అదే ఉద్యమాన్ని నడిపించే నాయకత్వం మరోవైపు. వీరికి భిన్నంగా ఇద్దరితో కూడి నలుగురితో
నడిచి పదుగురితో ఉద్యమ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రజలను తన
రచనలతో నిద్రావస్థలో నుంచి స్వాతంత్య్ర వెలుగులోకి పయనించేలా
చేసిన పలు భాషల ప్రావీణ్యుడు, సాహితీవేత్త, పోరాట యోధుడు
ముకురాల రామారెడ్డి.
అంధకారంలో అడుగంటిపోయే మానవ జీవులు ఒకవైపు. బానిస ప్రపంచాన్ని పాతరేసి పెత్తనాన్ని పెకిలించే ఉద్యమ సహాయకారులు ఒకవైపు. ఊసుపోక ఉద్యమాన్ని వక్ర మార్గంలో నడిపించే సమూహం ఒకవైపు. ఉవ్వెత్తున ఎగిసే పోరాట నినాదాలతో అదే ఉద్యమాన్ని నడిపించే నాయకత్వం మరోవైపు. వీరికి భిన్నంగా ఇద్దరితో కూడి నలుగురితో నడిచి పదుగురితో ఉద్యమ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రజలను తన రచనలతో నిద్రావస్థలో నుంచి స్వాతంత్య్ర వెలుగులోకి పయనించేలా చేసిన పలు భాషల ప్రావీణ్యుడు, సాహితీవేత్త, పోరాట యోధుడు ముకురాల రామారెడ్డి.
జీవన రేఖలు
మంద రామారెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు. ఇతను కల్వకుర్తి తాలూకాలోని మొకురాల గ్రామంలో జనవరి 3వ తేదీ, 1929 సం.లో రామలక్ష్మమ్మ, బాలకిష్టారెడ్డి దంపతులకు జన్మించాడు. కవి, రచయిత బహు భాషావేత్త అయిన వీరు ముకురాల రామారెడ్డిగా ప్రసిద్ధి.
విద్యార్హతలు
1951లో హైదరాబాద్లోని ఆంధ్ర సారస్వత పరిషత్తులో తెలుగు విశారదలో ఉత్తీర్ణత సాధించారు. మూడేండ్ల తర్వాత మహబూబ్నగర్లో సాధారణ శిక్షణను పూర్తి చేశారు. 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్, 1958లో బీ.ఏ విద్యను అభ్యసించారు. ఆ తరువాత1967 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో ఎం.ఏ పట్టా పొంది 1973లో సింగిరెడ్డి నారాయణ రెడ్డి పర్యవేక్షణలో ''తెలుగులో కవిత్వాదర్శాలు-పరిణామాలు'' అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించి పి.హెచ్ డి పొందారు.
ఉద్యమం
భారత స్వాతంత్య్రోద్యమం ముగిసి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పొందిన సంవత్సరం తరువాత హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్య్రోద్యమంలో 1948లో జరిగిన పోలీసు చర్యకు ముందు నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు.
సాహిత్యం
మంద రామారెడ్డి పలు రచనలు చేశారు. కొన్ని గ్రంథాలకు సంపాదకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు.
తెలుగు ఉన్నత వాచకం (సంపాదకత్వం),
దేవరకొండ దుర్గము,
నవ్వేకత్తులు (దీర్ఘ కవిత),
హదయశైలి (గేయ సంపుటి),
మేఘదూత (అనువాద కవిత్వం),
రాక్షస జాతర (దీర్ఘ కవిత),
ఉపరిశోధన (పరిశోధనా పత్రాల సంకలనం),
తెలుగు సాహిత్య పదకోశం (సంపాదకత్వం),
పరిపాలన న్యాయపదకోశం (సంపాదకత్వం),
ప్రాచీనాంధ్ర కవిత - ఆదర్శాలు - పరిణామాలు (సిద్ధాంత గ్రంథం),
సూతపురాణం,
సాహిత్య సులోచనాలు,
పుట్టగోచిలింగ పూలరంగ (శతకము)
రేడియో ప్రసంగాలు - కవితాప్రతిభ
'విడిజోళ్ళు' అను కథల సంపుటి రాశారు. ఇందులో 'విడిజోడు' కథకు 1958లో కష్ణా పత్రిక రెండవ బహుమతి లభించింది. 'సర్కారు కిస్తు' అనే కథలో సాయుధ పోరాట నేపథ్యాన్ని ఇతివత్తంగా రాశారు. దుందుభి అనే మాసపత్రికకు సంపాదకత్వం వహించారు.
గౌరవ సన్మానాలు
1976లో ఆకాశవాణి ఢిల్లీ వారిచే 'జాతీయకవి'గా గుర్తించబడి, సన్మాన గౌరవాన్ని అందుకున్నారు. 1988లో తెలుగు విశ్వవిద్యాలయం వారి చేత ఆధునిక పరిశోధక రచయితగా, 1996లో హేతువాద రచయితగా అప్పటి ఉపరాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ చేతుల మీదుగా, తన కవితా ప్రతిభను ప్రత్యేకంగా గుర్తించిన తెలుగు విశ్వవిద్యాలయం చేత 1998లో ఇలా పలు ప్రత్యేకతల కారణంగా, పలు సందర్భాలలో సన్మానంతో గౌరవించబడ్డారు.
పదవులు
ముకురాల రామారెడ్డి పాఠశాలలో ఉపాధ్యాయ స్థాయి నుండి డిగ్రీ కళాశాల లెక్చరర్ గా చేసి తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి ఎదిగి 17 సంవత్సరాల పాటు తన బాధ్యతలను నిర్వర్తించాడు. మహబూబ్ నగర్ జిల్లాకు తెలంగాణ రచయితల సంఘం కార్యదర్శిగా ఉన్నాడు. ఇలా పలు భాషలను నేర్చుకొని, ప్రముఖుల చేత సన్మానాలు పొంది, పలు రచనలు చేసి ప్రజా సాహితీక్షేత్రంలో ఉన్నత పేరును పొందిన మంద రామారెడ్డి 2003 మార్చి 24 న కీర్తిశేషులు అయ్యారు.
- ఘనపురం సుదర్శన్