Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇవ్వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా తెలంగాణలో బాల రచయితల రచనల 'కొత్త విప్లవం' మనం చూసి ఆనందిస్తున్నాం. ఆశ్చర్య పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే హైదరాబాద్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థిగా రచనలు చేసారు గూడూరి రాఘవేంద్ర. 1957-60ల మధ్య కథానికలు రాసిన వీరు 1955 -1957 ప్రాంతంలో ప్రధానంగా పిల్లల కోసం రాసారు.
తెలుగువారి సాహిత్య చరిత్రలో శాశ్వతంగా నిలిచిన పేరు 'హనుమాజీ పేట'. అందుకు కారణం మనకు తెలిసిందే, 'సినారె' అనే ఫెనామినాకు జన్మనిచ్చిన ఊరు. ప్రసిద్ధ తెలంగాణా కథకులు గూడూరి సీతారాం, గేయ కవితా విశారదులు కనపర్తి (లక్ష్మీనర్సయ్య), ఒగ్గుకథకు అంతర్జాతీయ ఖ్యాతి కల్పించిన మిద్దె రాములు హనుమాజీపేట వారే కాక సినారె సమకాలీకులు కూడా. 1955-56 ప్రాంతంలో బాలల కోసం రచనలు చేసిన సాహితీవేత్త డా. గూడూరి రాఘవేంద్ర ఈ హనుమాజీపేటలోనే, సినారె పక్కింట్లో 15 మార్చి, 1943న పుట్టారు. పాఠశాల దశలో రచనలు చేసిన రచయిత రాఘవేంద్ర. అందుకు ఆనాటి తెలంగాణా వాతావరణం ఒక కారణం. మరో కారణం అప్పటికే కథకులుగా ప్రసిద్దులైన అన్న గూడూరి సీతారాం, సినారెల రచనలతో పాటు, జి. సురమౌళి వంటి వారి స్ఫూర్తి రాఘవేంద్రపై ఉంది. తొలి రచనలు ఆనాటి సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాల సంచిక 'తరంగిణి', వేములవాడ కేంద్రంగా వచ్చిన రాత పత్రిక 'విద్యుల్లత'లో అచ్చయ్యాయి.
ఇవ్వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా తెలంగాణలో బాల రచయితల రచనల 'కొత్త విప్లవం' మనం చూసి ఆనందిస్తున్నాం. ఆశ్చర్య పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే హైదరాబాద్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థిగా రచనలు చేసారు గూడూరి రాఘవేంద్ర. 1957-60ల మధ్య కథానికలు రాసిన వీరు 1955 -1957 ప్రాంతంలో ప్రధానంగా పిల్లల కోసం రాసారు.
డా. గూడూరి రాఘవేంద్ర ప్రభుత్వ దంత వైద్యులుగా ఉద్యోగం చేసారు. పదవీ విరమణ చేసాక కూడా సేవలు అందిస్తూనే జగిత్యాలలో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. సూర్యదేవర రాజ్యలక్ష్మి సంపాదకత్వంలో వచ్చిన ఆనాటి 'తెలుగుదేశం' పత్రికలో రాఘవేంద్ర రాసిన కొన్ని పిల్లల కథలు అచ్చయ్యాయి. పిల్లల కథలే కాక వీరి కథలు తెలుగుదేశంలో 3-5-1956లో అచ్చయిన 'ఇంటాయిన-ఇంటావిడ' కథానిక, 6-12-1956న అచ్చయిన 'డిటెక్టివ్ సాహిత్యం వ్యర్థం, రచయితలు వ్రాయడం మానాలి'వ్యాసం, 'గోల్కోండ పత్రిక'లో 22-4-1956న వచ్చిన 'చీకటి బాట', 'మొండి ఘటాలు' 8-7-1956, 'దూరపు కొండలు' 18-11-1956, 'మేడిపళ్లు' 20-1-1957, 'గౌరవం' 16-3-1957, 'ఆత్మ-అభిమాని' 18-5-1958 ఉన్నాయి.
తెలుగు దేశంలో 'బాలల కొలువు' పేర వీరి కథలు అచ్చయ్యేవి. వీరి కథలను ఇటీవల మానేరు రచయితల సంఘం 'సహన పరీక్ష' పేరుతో ప్రచురించింది. ఇందులోని 'ధైర్యే సాహసే లక్ష్మి' కథ సాదాసీదాగా సాగే కథ. కానీ చదువరులకు మిక్కిలి ఆసక్తి కలిగించడమే కాక ఉత్కంఠను రేకెత్తిస్తుంది. కట్టెలు కొట్టే రంగడు అడవిలో దొంగలను చూసి భయపడి పారిపోతూ చివరకు ఆ దొంగలు దొంగతనం చేసి తెచ్చిన ధనం దాచుకునే గుహలోకి వెళ్ళి దాక్కుంటాడు. తమ తావును చూసిన రంగడిని ఎలాగైనా మట్టుపెట్టాలని దొంగలు మాట్లాడుకునే మాటలు విని భయపడి పోతాడు. ఆ గుహలోని తమ ఇష్టదైవమైన నరసింహస్వామికి దొంగలు పూజచేసి వరమీయమని వేడుకుంటారు. ఎలాగైనా వాళ్ళను పోలీసులకు పట్టించాలని నిశ్చయించుకున్న రంగడు ఆకాశవాణి రూపంలో మాట్లాడుతూ ''ఏమి కావాలో కోరుకొండి'' అంటూ దొంగలకు అభయమిస్తాడు. తమకు నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడని భావించిన దొంగలు ''మేం దొంగతనం చేస్తున్నప్పుడు ఎవరికి పట్టుబడకుండా వరం ఇవ్వ''మని వేడకుంటారు.
ఈ దొంగల రోగం కుదుర్చాలని భావించిన రంగడు ''సరే! మీరు 'సర్ధూం' అని అనగానే ఎవరి కంటికి కనబడరు'' అంటూ ఆకాశవాణి రూపంలో వరమిస్తాడు. దానిని నమ్మి దొంగతనానికి వెళ్ళిన దొంగలు ఒకరింట్లో దొంగతనంచేస్తూ తమకేమీ కాదని నవ్వుకుంటూ, పారిపోయే ప్రయత్నం చేయకపోగా అదృశ్యం అవుతామని ''సర్ధూం'' అంటూ గట్టిగా అరుస్తారు. వాళ్ళు అదృశ్యం కాకపోగా అప్పటికే ఇంటివారి ఫిర్యాదుతో వచ్చిన పోలీసులు దొంగలను పట్టుకుపోతారు. ధైర్యం, సమయస్ఫూర్తి వల్ల ఆపదల నుండి ఎలా గట్టెక్కవచ్చన్నది ఈ కథ తెలియ జేస్తుంది.
మరోకథ 'సహన పరీక్ష', ఇది పిల్లల మానసిక స్థితుల్ని చక్కగా వ్యాఖ్యానించే కథ. మూడవ కథ, 'బాల కథ' శీర్షికతో అచ్చయిన 'నిజం నిలకడ మీద తెలుస్తుంది' కథ. పైన పేర్కొన్నట్టు ఇవి అచ్చంగా అరవై క్రితం రాయబడిన కథలు. రాఘవేంద్రవి ఇప్పటికి కేవలం నాలుగు పిల్లల కథలు, ఆరు కథానికలు, రెండు వ్యాసాలు దొరికాయి. దొరకాల్సినవి చాలా ఉన్నాయి. ఇవి నాలుగు కథలే కావచ్చు, కానీ ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన పటిష్టమైన వచన సాహిత్య వికాసాన్ని, నిఖార్సయిన తెలంగాణ భాషని, బాలసాహిత్యం పట్ల ఆనాటి పత్రికలు, రచయితల శ్రద్ధను తెలియజేస్తున్నాయి. రాశిలోనూ, వాసిలోనూమిక్కిలి విలువైన మేలిమి బంగారు కథలను అందించిన డా. గూడూరి రాఘవేంద్ర రచనా వ్యాసంగాన్ని ఆపకపోయుంటే తెలంగాణ బాల సాహిత్యంలో గొప్ప కథలు వచ్చేవి. స్వాతంత్య్రానంతర తెలంగాణా సాహితీవేత్తల్లో కథా రచనా పరుసవేది తెలిసిన రసవేది.
- డా|| పత్తిపాక మోహన్ 9966229548