Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాళోజి అనువాదకులు, కథా రచయిత, వేదనా భరితమైన కవి. స్వాతంత్య్ర సమరయోధుడైన కాళోజి, స్వాతంత్య్ర సాధనకు ఉపకరించిన ఉద్యమ నిర్మాణ కార్యక్రమాలను వస్తువుగా పట్టుకొని కథలు నిర్మించారు. తద్వారా నాటి ప్రజలను ఉద్యమంలోకి దూకేలా తన రచనలతో ఉత్తేజ పరిచారు. సమాజ గొడవనే తన గొడవగా మార్చుకొని 'నా గొడవ' రచించారు. తెలియక ప్రేమ తెలిసి ద్వేషం, మనమే నయం, వంటి వాటిని ఉద్యమ నేపథ్యంలో నుంచి కథలుగా రాశారు.
భీకర ఉద్యమ రోజులలో పోరాటానికి ధీరుడయ్యారు. పేదల బాధల సంక్షేమానికి, దీనుల గాథల సంక్షోభానికి పెన్నిధియై ముందున్నారు. అందాల బంధాల హైదరాబాదు సంస్థానోద్యమంలో బీదల బంధువయ్యారు. అన్నపు రాశులకు అలమటించే వారికి అక్షరాల ఆకలి అయ్యారు. పరభాషను పారద్రోలి మన భాషను అందలమెక్కించారు. ఎండిన గుండెల, పక్కకు ఒరిగిన డొక్కల పేదల కొరకు ప్రజాకవి అయ్యారు. తెలంగాణ ప్రజల గుండెల్లో నిలువెత్తు పటమయ్యారు.
జీవన రేఖలు: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, కథా రచయిత, ప్రజాకవి, తెలంగాణ ఉద్యమకారుడైన కాళోజి నారాయణరావు, రంగారావు, రమాబాయమ్మ దంపతులకు సెప్టెంబర్ 9 ,1914 సంవత్సరంలో ప్రస్తుత కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని రట్ఠేహళ్లిలో జన్మించారు. కాళోజిగా, కాళన్నగా ప్రసిద్ధి చెందిన వీరి పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజి. కొంతకాలంగా కర్నాటకలో ఉన్న ఈ కుటుంబం హైదరాబాద్ రాష్ట్రం, వరంగల్ జిల్లాలోని మడికొండకు తరలివచ్చి అక్కడే స్థిరపడింది.
విద్యాభ్యాసం : కాళోజి నారాయణరావు విద్యాభ్యాసం హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలలో కొంత జరిగింది. ఆ తర్వాత 1930లో హనుమకొండ హైస్కూలులో ఇంగ్లీషు మీడియం నాలుగవ ఫారంలో చేరారు. మెట్రిక్యులేషన్ పూర్తయ్యాక హైదరాబాదు లోనే న్యాయశాస్త్రాన్ని అభ్యసించి పట్టా పొందారు.
స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రోద్యమం, ఆర్య సమాజంలో కొంతకాలం ముఖ్య కార్యకర్తగా పని చేసి యువ నాయకుడిగా పేరు పొందారు. ఇతను యువకుడిగా ఉన్నప్పుడే హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్య్ర సాధన కొరకు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆనాడు జాతీయోద్యమ నిర్మాణ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ గ్రంథాలయ మహాసభలిచ్చిన ఉత్సాహంతో కవిగా అవతరించి ప్రజలను స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనేలా స్ఫూర్తినిస్తూ కవిత్వం రాశారు. నైజాం ప్రభుత్వాన్ని ఉద్యమాలతో ఎదురిస్తూ, తన సాహిత్యంతో ప్రశ్నిస్తున్నందుకు పలుమార్లు జైలు శిక్షకు కూడా గురయ్యారు. అడ్లూరి అయోధ్య రామకవి, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకష్ణారావు, పీ.వి. నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. బాలగంగాధర తిలక్ బొంబాయిలో సాంస్కతికంగా గణేష్ ఉత్సవాలను ప్రారంభించి ప్రజలను స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వాముల్ని చేసినట్టు, కాళోజి కూడా వరంగల్లులో గణేష్ ఉత్సవాలను నిర్వహించారు.
1938లో హైదరాబాదులో జరిగిన వందేమాతర ఉద్యమంలో పాల్గొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వ విద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజి ప్రముఖ పాత్ర పోషించారు. 1946-48 ప్రాంతంలో హైదరాబాదులో రజాకార్ మూకలు విశంఖలంగా చెలరేగినపుడు నల్గొండలో ''నాజీ శక్తుల నగ నత్యమింకెన్నాళ్ళు? అని ప్రశ్నించారు. వరంగల్లులో రజాకార్లు మొగులయ్య అనే కాంగ్రెసు కార్యకర్తను దారుణ హత్య చేసినపుడు, ప్రజలను తన కవిత్వంతో మేల్కొల్పుతున్నాడని కాళోజిని కొన్నాళ్ళు వరంగల్లులో ప్రవేశించరాదని ప్రభుత్వం నిషేధాజ్ఞ జారీ చేసింది.
వరించిన పదవులు : ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన వారిలో ఒకరైన కాళోజి తెలంగాణ రచయితల సంఘానికి ఉపాధ్యక్షుడిగా 1953లో తన బాధ్యతలను చేపట్టారు. జాతీయోద్యమకారుడైన కాళోజి 1958-60 వరకు చట్టసభల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు.
పురస్కారాలు, గౌరవాలు : ఖలీల్ గిబ్రాన్ రాసిన The prophetµ అనే పుస్తకాన్ని కాళోజి 'జీవన గీత' పేరుతో అనువాదం చేసిన గ్రంథానికి 1968లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనువాద పురస్కారం లభించింది. 1972లో తామ్రపత్రం, 1992లో భారత ద్వితీయ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ లభించింది. ఇదే సంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేశారు. 1996లో గురజాడ అవార్డు, కళాసాగర్ మద్రాస్ వారి విశిష్ట పురస్కారాలు వరించాయి.
సాహిత్యం: కాళోజి అనువాదకులు, కథా రచయిత, వేదనా భరితమైన కవి. స్వాతంత్య్ర సమరయోధుడైన కాళోజి, స్వాతంత్య్ర సాధనకు ఉపకరించిన ఉద్యమ నిర్మాణ కార్యక్రమాలను వస్తువుగా పట్టుకొని కథలు నిర్మించారు. తద్వారా నాటి ప్రజలను ఉద్యమంలోకి దూకేలా తన రచనలతో ఉత్తేజ పరిచారు. సమాజ గొడవనే తన గొడవగా మార్చుకొని 'నా గొడవ' రచించారు. తెలియక ప్రేమ తెలిసి ద్వేషం, మనమే నయం, వంటి వాటిని ఉద్యమ నేపథ్యంలో నుంచి కథలుగా రాశారు. వెల్దుర్తి మాణిక్యరావు, అవధాని, కాళోజి ఈ ముగ్గురు కలిసి 'భూతదయ' అనే చిన్న కథను రాశారు. పిళ్ళా వెంకటరత్నం, పొట్లపల్లి, దాశరథి, వానమామలై, మునిమాణిక్యం, చలం, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆళ్వారుస్వామి, సినారె, పల్లా దుర్గయ్య, బి.రామరాజు ఇతని అభిమాన రచయితలు. ఇలా కాళోజి తన సమస్త జీవితాన్ని ఒకవైపు ఉద్యమానికి, మరోవైపు సమాజానికి అంకితం చేశారు. ఈ తరుణంలో తన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం, దేశంలో అత్యున్నత రెండవ పురస్కారమైన పద్మవిభూషణ్ని అందించింది. ఇలా అనేక పురస్కారాలను అందుకొన్న కాళోజి నవంబర్ 13, 2002 సంవత్సరంలో తుదిశ్వాస విడిచారు.
- ఘనపురం సుదర్శన్,
9000470542