Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అభినందన లేఖతో, భువనచంద్ర, అత్తలూరి విజయలక్ష్మి గార్ల ముందుమాటలు ఈ పుస్తకానికి నిండుతనం తెచ్చాయి. 51 మంది రచయితల, రచయిత్రుల కథల్ని ఈ సంకలనంలో చదవగలం. 110 ఏండ్లు 'తెలుగు కథ' అంతర్జాతీయ సాహిత్య చరిత్రలో తన 'ముద్ర'ను ఏనాడో చూపింది. ఈ కథాసంకలనంలో ఎక్కువగా మానవ సంబంధాలు- కుటుంబం విలువలు... సామాన్యుల బ్రతుకు చిత్రాలు కథీకరించిన కథకులు విభిన్న వస్తు శిల్పాలతో- తాత్త్వికత జోడిస్తూ పాఠకుల్ని ఆలోచింపజేసారు.
సింహప్రసాద్, తమిరిశ జానకి, సలీం, పుప్పాల సూర్యకుమారి, డా|| పెళ్ళకూరి జయప్రద సోమిరెడ్డి, డా|| పాతూరి అన్నపూర్ణ, జలంధర, ఇంద్రగంటి జానకీ బాల, వడలి రాధాకృష్ణ లాంటి సీనియర్ కథకుల కథలు సాహితీ పరిపుష్టి కల్గించాయి. ఉద్యోగం మాని అమెరికా నుంచి ఇండియా వచ్చి, గిరిజన పిల్లలకు విలువిద్య నేర్పడానికి వచ్చి... తన ఆలోచన అమలు చేసిన విజరు లాంటి వారు మన సమాజానికి ఎంతో అవసరం... సహకరించిన కుటుంబ సభ్యుల చేయూత అభినందనీయం. అద్దేపల్లి జ్యోతి ''గెలుపు పిలుపు''లో కథీకరించిన తీరు బాగుంది.
ఒక రాజు-రాణి- స్థపతి - (శిల్పి) పూర్ణ చంద్ర, కళావతిల మధ్య ప్రణయం చారిత్రక కథగా బలభద్ర పాత్రుని ఉదయశంకర ''స్వర్ణ మంజీరాలు'' యువ ప్రేమికుల్ని అలరిస్తుంది. కాని సమకాలీనతకు చాలా దూరంగా ఉన్న కథ. కుటుంబ నియంత్రణ ఆవశ్యకత తెలియజేసే మంచి కథ ''నేరం'' రచయిత్రి డా|| జయప్రద రాసారు. నేటి సమాజంలో చాలా మంది వేణు - మాధవిల్లానే ఆలోచిస్తున్నారు. రూపాకుల నాగలక్ష్మి రాసిన ''పడిన చోటే వెతుకు'' కథ చాలా బాగుంది. భర్త లేకున్నా అత్తగారితో వుంటూ ఇద్దరు పిల్లల్ని బాగా చదివించి వారికి పట్నంలో మంచి ఉద్యోగం (క్యాంపస్ ద్వారా) వచ్చేదాకా కష్టపడిన 'చారుమతి' పాత్రను చాలా మలిచారు రచయిత్రి... మధ్యతరగతి మనస్తత్వాలు, బాల కథల్లో ప్రతిబింబించాయి. మంచి కధానికలున్న మంచి కథా సంపుటి ఇది.
'మనసు చెప్పిన కథలు'
సంకలనం:
డా|| పాతూరి అన్నపూర్ణ
వడలి రాధాకృష్ణ
పేజీలు: 343, వెల. రూ. 300/-
ప్రతులకు : డా|| పాతూరి అన్నపూర్ణ
ఇ.నెం. 1156/26-1, ప్రశాంతినగర్
నవలాకుల గార్డెన్స్, నెల్లూరు - 524 002
9490230939
- తంగిరాల చక్రవర్తి , 9393804472