Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుట్టుకతో ఆస్థిపాస్తులలో ఉన్నతులు. చదువుకో వాలన్న జిజ్ఞాసతో బడికెళ్తే బడి పంతులు బయటికి పొమ్మన్నారు. అయినా నిరుత్సాహపడలేదు. నిరాశ చెందలేదు. ప్రకతిని మించిన గురువెక్కడున్నాడనుకొని అశేషమైన శక్తిని కలిగిన ప్రకతినే తన గురువుగా భావించుకొని స్వశక్తితో అనేక గ్రంథాలు చదివి ఆకర్షింపబడ్డారు. ప్రకతినే గురువుగా మార్చుకొని ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల చైతన్యం కోసం పరితపించి స్వాతంత్య్రోద్యమంలో అడుగుపెట్టి సత్యాగ్రహం చేసి నూనుగు మీసాల వయసులో గడీల గోడల నుంచి వచ్చి జైలు గోడల మధ్య స్వరాజ్యం కోసం నిర్భంధించబడ్డారు. అనవరతం ఏదో చెప్పాలని, ప్రజా సంక్షేమాన్ని, స్వాతంత్య్రాన్ని కోరిన ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తే రామారావు.
జననం : గొప్ప దేశభక్తులు, జాతీయవాది, అభ్యుదయ కవి, స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన వీరుడు అయిన రామారావు, పొట్లపల్లి శ్రీనివాసరావు, చెల్లమ్మ దంపతులకు వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో 1917 లో జన్మించారు.
విద్యాభ్యాసం : భూస్వాముల కుటుంబంలో పుట్టిన రామారావు వీధిబడిలోనే ఏడవ తరగతి వరకు చదువు సాగించారు. పదమూడేండ్ల వయసులో ఉన్నప్పుడే వివా హమాడిన ఇతను పై చదువుల కోసమని పట్టణానికి వెళ్ళినా ఆర్ధిక కారణాల దష్ట్యా ప్రారంభంలోనే తన చదువుకు స్వస్తి పలకవలసి వచ్చింది. ఏ గురువు దగ్గర ఎక్కువ కాలం చదువు నేర్చుకోలేక పోయినా తన స్వంత అభిలాషతో, స్వయం కషితో వేలాది పుస్తకాలు చదివి లోకాన్ని తనదైన కోణంలో నుంచి అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి తన చుట్టూతా ఉన్న సాంఘిక సమస్యల గురించి తనను తాను ప్రశ్నించుకొని, ఆ సాంఘిక సమస్యలకు కారణమైన ప్రభుత్వంపై తన రచనావేశాన్ని ఝలిపించారు. హైదరాబాదు సంస్థానం పలు భాషల సంగమం కావడంతో అవసరం రీత్యా అయినా, ఆసక్తితోనైనా ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. బాల్యంలో ఉన్నప్పుడు ఏదో కారణం చేత బడికి వెళ్లనందుకు రికార్డు నుంచి పేరు తీసివేయబడడంతో మరుసటి రోజు బడి నుంచి బయటికి గెంటి వేయబడ్డారు.
ఉద్యమం: 1938 సంవత్సరంలో నిజాం ప్రభుత్వం స్టేట్ కాంగ్రెసుపై నిషేధం విధించినపుడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసి అరెస్టయి జైలులో నిర్భంధించబడ్డారు. వరంగల్లులో సత్యాగ్రహం జరిపిన వ్యక్తులలో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి ఇతను. తాను పోరాటం చేస్తున్న క్రమంలోనే కవిత్వం రాసి దాని ద్వారా ప్రజలకు ఉద్యమ మార్గం చూపి వారికి దారి దీపంగా మారారు. స్థానిక భూస్వాములపై, నిజాం ప్రభుత్వంపై ఆవేశంతో ప్రజల మెదళ్ళలో ఆవేశాత్మక విత్తనాలు వెదజల్లారు. జాతీయోద్యమంలో భాగంగా వందేమాతర ఉద్యమంలో పాల్గొని అరెస్టయి 22 సం||రాల వయసులో 2-11-1938 నుంచి 10-4-1939 వరకు వరంగల్ కేంద్ర కారాగారంలో జైలు జీవితాన్ని అనుభవించారు. మహాత్మాగాంధీ ఆశయాలతో ముందుకు సాగుతూ జాతీయవాదిగా నిజాం వ్యతిరేక పోరాటంలో కాళోజీ నారాయణరావు సహచరునిగా పోరాడారు. ఈ క్రమంలోనే కాళోజి రామేశ్వరరావుతో సన్నిహి తంగా మెలగడం వలన ఈయన దష్టి అంతా సజనాత్మకత వైపు మళ్ళింది. వట్టికోట ఆళ్వారుస్వామి, రావి నారాయణ రెడ్డి, స్వామీ రామానంద తీర్థ లతో జాతీయోద్యమంలో పాల్గొన్నారు.
రచనలు : ఆత్మవేదన, ఈ ఆత్మవేదన రచనకు కాళోజి నారాయణరావు ముందుమాట రాశారు. చుక్కలు(1965), మెరుపులు, మా ఊరు, అక్షర దీప్తి(1993), సర్ బారాహి (నాయకత్వం వహించడం), న్యాయం, పాద ధూళి, పగ(నాటికలు), జైలు కథలు (1945), సైనికుని జాబులు లేఖలు(1947), ముల్లా కథలు, ఆచార్యుల వారి కథలు రాశారు. తన రచనలో నిజాం కాలం నాటి భూస్వాముల ఆగడాలను, ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆడించిన వెట్టి చాకిరి బానిస కత్యాలను, నిజాం రజాకార్ల రాక్షసాలను, ప్రజలలో ఉండవలసిన ఐక్యమత్యాన్ని గురించి తెలిపారు. 1994 సం||లో వీరి సజనను గుర్తించిన తెలుగు విశ్వవిద్యాలయం వారు సజనాత్మక సాహిత్య పురస్కారం అందచేశారు. పొట్లపల్లి రామారావుకు సాహిత్య సభలన్నా, సన్మాన, సత్కారాలన్నా ఇష్టం ఉండేది కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక భారత ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులకు అందించే భూమిని, పెన్షన్ను పొందకుండా తిరస్కరించారు. ఈ విధంగా ప్రజల శ్రేయస్సును కోరి, భారత, హైదరాబాదు స్వాతంత్య్రం కొరకు ఉద్యమంలో పాల్గొంటూనే ప్రజా చైతన్యాత్మక సాహిత్యం రాసి ప్రజలను ఉద్యమంలో మమేకం చేసిన పొట్లపల్లి రామారావు లివర్ క్యాన్సర్ కారణంగా 2001లో సెప్టెంబర్10న హైదరాబాదులో కన్నుమూసారు.
- ఘనపురం సుదర్శన్,
9000470542