Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది ఓ అడవి. అడవి అన్నాక చెట్లూ, పుట్టలూ, కొండలూ కోనలూ, బావులూ, చెర్లూ, కాలువలూ మాత్రమే ఉండవు కదా. చెట్లమీద ఎగిరేవీ, పుట్టల్లో పాకేవీ కొండ గుహల్లో ఉండేవి ఉంటాయి కదా. రెండు కాళ్ళవి నాలుక్కాళ్ళవి. రెక్కలున్నవి, కోరలున్నవి, తోకలున్నవి, నీళ్ళలో ఉండేవి, నీళ్ళమీద ఈదుతూ నేలమీద పరుగెడ్తూ ఉండేవి అనేకం ఉన్నాయి.
ఇన్ని ఉన్నాయి కాని గాండ్రించేది, గర్జించేది లేక పోవడంతో అడవి ఇది వరకులా లేదు. ఎవరి ఇష్టం వాళ్ళు తిరిగేస్తున్నారు. జాతి లక్షణాలకు వ్యతిరేకంగా ఏదేదో చేస్తున్నారు. ఓ పద్ధతి పాడూ లేకుండా ఓ నియమమూ నీతి లేకుండా గడిపేస్తున్నారు. అసలు భయం అన్నదే లేకుండా పోయింది ఏ జీవికీ.
ఇది వరకు ఏ పొదల చాటునుంచో గ్రాండ్రింపు వినపడితే చాలు చీమలు చిటుక్కుమనేవి కాదు. కోతులు కిచకిచలాడేవి కాదు. పక్షులు రెక్కలు దాచుకునేవి. ఇంకా పెద్ద జీవాలు ఇళ్ళల్లోకి పరుగెత్తి పోయేయి. ఇప్పుడు గ్రాండించే రాజు ఏలేవాడు లేకపోవడంతో జంతు ప్రపం చంలో క్రమశిక్షణ అనే మాట అసలులేకుండా పోయింది.
అప్పుడప్పుడు చెట్ల నీడన సేదతీరుతుండే ముసలి జంతువులు ఈ విషయమే మాట్లాడుకుంటుండేవి. ఇది వరకు గాండ్రించే రాజు హయాంలో అంతా సాఫీగా జరిగిపోయేది. అంతకు ముందు గర్జించే రాజు జూలు విదిలిస్తే అంతా సవ్యంగా జరిగిపోయేది. ఇప్పుడు గాండ్రింపు, గర్జింపూ లేక అడవంతా ఆగమాగంగా ఉంది. అరుపులు, కేకలతో చెవులు చిల్లులు పడుతు న్నాయి. రాజులేకపోతే అడవి అయితేనేం రాజ్యం అయితేనేం. కుదురుగ్గా ఉండవు అనుకునేవి.
ఈ 'సిట్యూయేషన్'లో ఈ అడవికి ఎవడో ఒకడు రాజుగా వచ్చి తీరాలి అప్పుడే పెద్దలమయిన మనకు మర్యాద దక్కుతుంది. ఒంటరిగా ఉండే ఆడ జంతువులకు 'ప్రొటెక్షన్' చిక్కుతుంది అనేకునే వారు.
ఒకనాటి, మిట్ట మధ్యాహ్నం ఓ కొత్త జంతువు అడవి మధ్యకు పరుగులు పెడుతూ వచ్చింది. అదలారావడం గమనించిన మిగతా జంతువులకు అదేమిటో తెలియలేదు. దాన్ని వాళ్ళు ఎప్పుడూ చూసి ఉండలేదు. అడవి మధ్యకు వచ్చాక నాలుక్కాళ్ళ మీద నిలబడి బూడిద రంగులో ఉన్న ఆ జంతువు పొట్టి తోకను పైకెత్తి గిరగిరా తిప్పసాగింది.
గూళ్ళల్లోంచి, రాళ్ళల్లోంచి, గుహ ల్లోంచి, మట్టి పుట్టల్లోంచి ఎవరికి వాళ్ళు ఈ కొత్త శాల్తీ ఈ స్ట్రేంజర్ ఈ ఆగంతకుడు ఎవరా అని మౌనంగా చూస్తూ ఉంటే ఓ కోతి చెట్టు కొమ్మ మీదినించి కిందకి గెంతింది.
కోతి గదా కోతి బుద్ధి వదలదు కదా, చెట్టుమీదినించి కిందకు గెంతిన కోతి కొత్తగా వచ్చిన జంతువు వెనుకవైపుకి వెళ్ళి దాని కాలి పిక్క మీద గీరింది. అంతే!
ఏమైందో అర్థం కాలేదు దానికి. గాలిలో ఎగిరి దబ్బుమని నేల మీద పడింది. కళ్ళు బైర్లుకమ్మినయి. అది దేని కాలి పిక్కమీద గీరిందో అది అదాట్టున తన వెనక కాళ్ళు పైకి లేపి దాన్ని వాటితో 'ఫెడీ'మని తన్నింది. ఊహించని ఈ కిక్కి 'షాక్' అయి అది నేలను కర్చుకుంది. అదలా నేలమీద తోక ముడుచుకుని చతికిల బడ్డంతో దాని 'బ్యాక్కిక్' ఫవర్కు అదే తెగ మురిసిపోయి నోరు తెరిచి 'డోల్బీడిజిటల్' సౌండ్‌తో దిక్కులు పిక్కటిల్లేట్టు అరిచింది.
గాండ్రిపుకీ గర్జింపుకీ భయపడ్డ జంతువులన్నీ కడుపులో దేవినట్టూ చెవుల్లో సీసం కరిగించి పోసినట్టూ ఉన్న కర్ణకఠోర ధ్వనికి అధిరిపడ్డాయి. ఆ అదిరిపాటే కొత్తగా వచ్చిన జంతువుని ఆ అడవికి రాజును చేసింది.
అడవికి రాజు దొరికాడు కదా అని సీనియర్ జంతువులు సంబర పడ్డవి. కానీ క్రమంగా వాటికి తెల్సి వచ్చింది. కొత్త రాజావారికి పెద్దా చిన్నా బేధం లేదని వెనక కాళ్ళతో ఫెడీ ఫెడీ తన్నడం, నోరు బార్లా తెరిచి నోటికొచ్చిన కూతలు కుయ్యడం తప్ప మరేమీ చెయ్యదని.
అడవిలో క్రమశిక్షణ అనేదేమీ, కొత్తగా లేదు. కానీ ఉన్నది కూడా ఊడ్చుకుపోయింది. నీతిని నిలువెత్తు గొయ్యి తీసి పాతి పెట్టింది. అవినీతి కొత్తరాజు. పాత చట్టాల కాగితాలనీ తెప్పించి అన్నీ చూస్తుండగానే నోట్లో కుక్కుకుని నమిలి మింగేసింది. తర్వాత కొత్త చట్టాలు తనే దస్తాల కొద్దీ కాగితాల మీద రాయించడం వాటిని తనే తర్వాత నమిలి మింగేయడం, అసలు నమిలి మింగేయడం కోసం చట్టాలు చేయడం మొదలు పెట్టింది. ఒకనాటి అర్థరాత్రి పూట అడవి మధ్య గాండ్రింపు వినిపివచింది. జంతు వులన్నీ పాత రాజు వచ్చాడని సంతో షపడ్డవి. కొత్తగా వచ్చిన రాజు బానపొట్ట నిండా మింగిన చట్టాలతో ఎటో పారిపోయింది,
ఓండ్రకీ గాండ్రింపుకీ తేడా తెల్సుకోవలసిన అవసరం ఉంది. జంతువులకైనా మనుషులకైనా!!
- చింతపట్ల సుదర్శన్, 92998092912