Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రామంలోని సబ్బండ వర్ణాలపట్ల, గ్రామ జీవితం, కళలు, కళారూపాలపట్ల ప్రేమ, అవగాహన వుంది. వాటిని తన తరువాతి తరం వారికి వారసత్వంగా అందించాలనుకున్న కవి అవసరంలేకున్నా పిల్లలు ఆటలు ఆడుకుని ఇంటికి వెళ్ళే సమయంలో మన కళలు, కళారాపాలును పరిచయం చేస్తారు. అందులో భాగంగా 'బహురూపు'ల వేషగాళ్ళను పరిచయం చేస్తారు. మన తుపాకీ రాముని గురించి చెబుతారు. తుపాకిరాముని గప్పాలు ఎలా ఉంటాయో, పిల్లలకు తెలుపుతారు. చరిత్ర రచనలాగే నిబద్ధతతో బాలల కోసం చక్కని రచన చేసిన బాల సాహితీమూర్తి... నిత్య చైతన్య స్పూర్తి బి.ఎన్. శాస్త్రి.
'చరిత్ర రచనలోనూ తెలంగాణాకు దగా'' అంటూ ఆవేదన చెందిన బి.ఎన్.శాస్త్రి 10 డిసెంబర్, 1932న నల్లగొండజిల్లా తుమ్మల గూడెంలో పుట్టారు. ఒక్క చేతిమీదుగా వేలాది పుటలను రాసిపోసిన డాక్టరేటు లేని పరిశోధకులు. ఉమ్మడి రాష్ట్రంలోని దాదాపు నాలుగువేల గ్రామాలు పర్య టించి, వందలాది శాసనాలు, తాళ పత్రాలను సేకరించిన శాస్త్రి త్రిపురాం తకానికి చెందిన 105 శాసనాలు, ముఖలింగానికి చెందిన 147 శాసనాలను పరిష్కరించి ప్రచురించారు. 75కు పైగా గ్రంథాలను రచించిన శాస్త్రిగారు విష్ణుకుండినుల చరిత్ర ద్వారా తెలంగాణా చరిత్రకు మరో అయిదు వందల సంవత్సరాల ఆయుష్షును పోసారు.
బి.ఎన్.శాస్త్రి తొలినాళ్ళ నుంచి సృజనశీలి. 1954 రచనకు శ్రీకారం చుట్టి రెండు నాటికలు, తొమ్మిది నవలలు రాసారు. తెలంగాణ వైతాళికుడు పులిజాల రంగారావుగారి జీవిత చరిత్ర రాసారు. ఆంధ్రదేశ చరిత్ర మూడు సంపుటాలు, భారతదేశ చరిత్ర 21 సంపుటాలు శాస్త్రిగారి చేతుల్లో రూపుదిద్దుకున్నాయి. రచయితగా ఎన్నో విలువైన రచనలు చేసిన బి.ఎన్.శాస్త్రి కూడా తొలితరం సాహితీవేత్తలలాగే నవలలు, నాటికలతో పాటు తమవంతు బాధ్యతగా పిల్లల కోసం 'పాపాయి పతకం' అనే బాలల గేయ కావ్యం రాశారు.
ఆనాటి హైదరాబాద్ బాలల రచనాలయం నిర్వహించిన కార్యశాలలో పాల్గొని రచనలు చేసినవారిలో వీరొకరు. 1960లోనే పిల్లల కోసం రచనలు చేసిన బి.ఎన్.శాస్త్రి పేరు కూడా బాల సాహిత్య చరిత్రలో నమోదుకాలేదు. వీరి ఈ 'పాపాయి పతకం' చక్కని గేయ కథా కావ్యం. బాల్యాన్ని, బాల్యంలోని స్నేహాన్ని, మాధుర్యాన్ని వివరించడమే కాక ఆటలు, పాటలు, పిల్లలు, వాళ్ళ మనస్తత్వాల్ని అందంగా చిత్రించిన గేయకథా కావ్యమిది. పిల్లలు ఎక్కడైనా పిల్లలే! బాల్యం ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుంది. దాని ఆనందం, ఆశలు, ఆలోచనలు, కోరికలు ఒకేలా ఉంటాయి. ఇది ఇద్దరు అన్నాచెల్లెళ్ళ కథ. ఆనందు, అతని చెల్లెలు పాపాయి ఇందులోని ప్రధాన పాత్రలు. చిన్నారి పాపాయి అంటే ఇంటిల్లిపాదికే కాక ఆనందు మిత్రులకు కూడా ముద్దే. అటువంటి పాపాయికి ఎంతో ప్రేమతో అమ్మానాన్నలు బంగారు గొలుసును, దానికి ఒక పతకాన్ని చేయించి మెడలో వేస్తారు. ఒకనాడు ఆటలాడుకునేప్పుడు అది ఎక్కడో జారి పడిపోతుంది, ఆ తరువాత జరిగిన సంఘటనలు, పరిణామాలను ఇందులో కథగా మలిచారు కవి. నిరంతర పరిశోధన, శాసనాల పరిష్కారం వంటి విషయాల్లో తలమునకలైవుండే శాస్త్రి పిల్లలకోసం రాయడం గొప్ప విషయం. అందులోనూ అలతిఅలతి పదాలతో బాలల స్థాయికి ఎదిగి గేయాన్ని చెప్పడం వారి పరిణతికి నిదర్శనం. గేయకథ ఆరంభంలోని ఎత్తుగడే గేయంపట్ల వారికిగల సాధికారతను తెలుపుతుంది.
'అనగనగా ఒక ఊరు/ ఆ వూరిలోన/ ఆనందు అనియేటి/ అబ్బాయి కలడు' అంటూ నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, మేనత్తలు పిల్లలకు ఏడు చేపలకథ చెప్పినట్టు చెప్పే ఆకర్షణీయమైన పద్దతి కనిపిస్తుంది. ఇది చతురస్రగ గతిలో సాగిన గేయకథ. పాడడానికి అనువుగా సాగుతుంది. గేయానికి ప్రాణం లయ. ఆ లయ ఈ గేయకథలో చక్కగా సాగడమేకాక ఆసక్తిని కూడా కలిగిస్తుంది. 'ఓ పాప మా పాప/ఓ చిన్ని పాప/ ఆడుకోబోదాము/అందరితో మనము', 'భయమేల చెల్లిరో!/బాబాయి లేడా! అమ్మ మననేమన్న/అతనడ్డు రాడా!' వంటివి పిల్లలను, వాళ్ళ మనస్తత్త్వాన్ని అతి దగ్గరగా చూసినవాళ్ళు మాత్రమే రాయగలరు.
ఉమ్మడి కుటుంబపు ప్రేమలు, ఒక తరం నుంచి మరోతరానికి వారసత్వంగా వస్తున్న ఆప్యాయతా, అనురాగాలు, విలువలు బాల్యం నుంచే ఎలా అలవడుతాయనేది కవి ఎంత చక్కగా చెప్పారో చూడవచ్చు. పాపాయికి ఆనందు మిత్రుల్లో కొందరు నచ్చకున్నా పక్కన రాంబాబు, గోపాలు, వాసంతి, కమల, గోపాలకృష్ణ, శాంతమ్మ, విమల, కాంతమ్మ, పాల రామన్న, బుజ్జాయి అందరు కలిసి ఆడుకుంటారు. ఆటముగిసినాక వెళ్ళి వాగులో దూకుతారు. ఇసుకలో ఆడుగూ, పాడుతూ ఉంటారు. ఈ సందర్భంలో కవి బాలలు చేసే చేష్టలను ఎంతో అద్భుతంగా వర్ణిస్తారు. 'ఇండ్లెన్నో కట్టారు/ఇంపుగా వారు/బావులు త్రవ్వారు/బాట లేశారు/కాల్వలు తవ్వారు/కట్ట లేశారు/చెట్లను నాటారు / గట్లు పోశారు' అంటారు. నల్లగొండ జిల్లాలోని పల్లెటూరులో పుట్టిపెరిగిన కవి శాస్త్రి. తన గ్రామంలోని సబ్బండ వర్ణాలపట్ల, గ్రామ జీవితం, కళలు, కళారూపాలపట్ల ప్రేమ, అవగాహన వుంది. వాటిని తన తరువాతి తరం వారికి వారసత్వంగా అందించాలనుకున్న కవి అవసరంలేకున్నా పిల్లలు ఆటలు ఆడుకుని ఇంటికి వెళ్ళే సమయంలో మన కళలు, కళారాపాలును పరిచయం చేస్తారు. అందులో భాగంగా 'బహురూపు'ల వేషగాళ్ళను పరిచయం చేస్తారు. మన తుపాకీ రాముని గురించి చెబుతారు. తుపాకిరాముని గప్పాలు ఎలా ఉంటాయో, పిల్లలకు తెలుపుతారు. చరిత్ర రచనలాగే నిబద్ధతతో బాలల కోసం చక్కని రచన చేసిన బాల సాహితీమూర్తి... నిత్య చైతన్య స్పూర్తి బి.ఎన్. శాస్త్రి.
- డా|| పత్తిపాక మోహన్ 9966229548