Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితంలో ఓ దశలో తల్లిదండ్రులకు, సమాజానికి తప్పులుగా కనిపించేవి నిజానికి పిల్లలు జీవితాన్ని కొత్త కోణం నుంచి చూడటం కావచ్చు కూడా. తరం మారేకొద్ది ఆలోచనల్లో మార్పులు వస్తాయి. జీవితం పట్ల అవగాహన, వైవిధ్య వాతావరణాల ప్రభావం కూడా ఉంటుంది. జీవితంలో మనిషికి జీవితాన్ని వివిధ కోణాల్లో, వివిధ అనుభవాల ద్వారా దర్శించే స్వేచ్చను ఇవ్వాలి. ఆ స్వేచ్చ అభిప్రాయాలు, నిర్బంధాల నుంచి విముక్తి పొందాలి. వైరుధ్య అభిరుచులకు గౌరవం ఇవ్వాలి. పర్ఫెక్ట్ చైల్డ్ లను ఎవరు తయారు చేయలేరు. తయారు చేసినా ఆ పిల్లలు కేవలం తల్లిదండ్రుల ఆలోచనలకు ప్రోటో టైప్స్ మాత్రమే కానీ స్వతంత్ర మోడల్స్ కాదు. ఆ మోడల్స్ అయ్యే స్వేచ్చను ఇవ్వడమే తల్లిదండ్రులు ప్రేమను వ్యక్తీకరించే పద్ధతి.
బాల్యం-యవ్వనం దశలు మనిషి జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న దశలు. ఈ రెండు దశల్లో తెలిసి, తెలియక జరిగే నిర్లక్ష్యాలు మనుషులలో నిర్ణయాలను తీసుకునే శక్తిని, జీవితాన్ని చూసే దృక్కోణాన్ని, ఒత్తిడిని తట్టుకునే పద్ధతులను, బాధలను ఎదుర్కునే తీరును, ఆకర్షణల పట్ల వ్యవహరించే తీరును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆర్థిక నేపథ్యం గొప్పదైనా సరే పిల్లల పట్ల వారికున్న ప్రేమను సరైన పద్ధతిలో పిల్లలకు అర్ధమయ్యేలా స్పష్టం చేయలేకపోతే వారు జీవితాలలో తీసుకునే నిర్ణయాలు వారిని జీవితంలో లక్ష్యం లేకుండా కొట్టుకు పోయేలా చేస్తాయి. అటువంటి పరిస్థితుల్లో యవ్వనంలో ఉన్న ఓ అమ్మాయి, జీవితంలో అన్నింటిని ప్లానింగ్ ప్రకారం చేసే ఓ అబ్బాయి ప్రేమలో పడటం, వారి జీవితాల్లో ఒకరి ప్రభావం ఇంకొకరి మీద ఉండటం వారి జీవితాల్లో ఎటువంటి మార్పును తీసుకువచ్చిందో, ఈ ప్రేమ వల్ల వారు జీవితం గురించి ఏం తెలుసుకున్నారో స్పష్టం చేసే నవలే భారతీయ ఆంగ్ల రచయిత్రి ప్రీతి షెనారు రాసిన 'వెన్ లవ్ కమ్స్ కాలింగ్.'
ఈ నవలలో ముఖ్య పాత్రలు ఆరూష్, పూజ. ఆరూష్ తల్లిదండ్రులు భారతీయులు అయినా వారు బ్రిటన్‌కు వలస వెళ్ళడంతో ఆరూష్ అక్కడే పుట్టి పెరిగాడు. అతని తల్లిదండ్రులు అక్కడ భారతీయ బట్టల షాపు నడుపుతున్నారు. ఆరూష్కు ఆరేండ్ల చెల్లెలు. విదేశంలో ఉంటున్నవారు అక్కడ ఉన్న విదేశీయతను తమ జీవితంలో భాగం చేసుకున్నా కొన్ని విషయాల్లో అవి వారు వదులుకోలేదని ఆరూష్ భావిస్తాడు. ఆరూష్ ఓ ఇంజనీర్ లేదా డాక్టర్ అవ్వాలని అతని తల్లిదండ్రులు ఆశించడమే ఆరూష్ అలా భావించడానికి కారణం. భారత దేశంలో ఉన్న ఈ విద్యా వ్యాపార మనస్తత్వం తన తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టలేదని అనుకుంటాడు. కానీ పట్టుదలతో తనకు నచ్చిన ఆర్ట్స్‌లో స్కాలర్‌షిప్‌తో సాధిస్తాడు. ఆరూష్ ముగ్గురు మిత్రులతో కలిసి ఓ ఫ్లాట్‌లో ఉంటూ అక్కడే తన చదువు కొనసాగిస్తూ ఉంటాడు. ఆరూష్ మంచి పెయింటర్ కూడా. ఆర్ట్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆరూష్ ఏదైనా విదేశంలో ఓ రెండు నెలలు ఏదైనా స్వచ్చంద సంస్థలో కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. ఆరూష్ దానికి భారత దేశాన్ని ఎంచుకుంటాడు. ఈ కారణం మీద రెండు నెలలు కేరళలోని వేనాడ్కు వెళ్తాడు.
పూజ తల్లి డాక్టర్. తండ్రి వ్యాపారవేత్త. ఇద్దరు కష్టపడి పైకి వచ్చిన వారు. పూజ అక్క దివ్య. దివ్య తన తల్లి చెప్పినట్టు చదువుకుని ఉద్యోగం తెచ్చుకుంది. తల్లిదండ్రులు కుదిర్చిన ఓ ధనవంతుడితో పెళ్ళికి ఒప్పుకుంది. అందుకే ఆమె ఆ ఇంట్లో పర్ఫెక్ట్. పూజ అలా కాదు. ఆమెకు తన లక్ష్యం ఏమిటో తెలియదు. ఆమెకు దేని మీద ఆసక్తి ఉందో తెలియదు. ఏదోలా సమయాన్ని గడపటమే తప్ప ఆమెకు జీవితం పట్ల స్పష్టత లేదు. సెలవుల్లో ఇంట్లో ఉన్న పూజను ఆమె తల్లి చైత్ర బలవంతం చేసి ఓ వాలంటీర్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వేనాడ్ పంపిస్తుంది.
అలా వేనాడ్‌లో ఆ స్వచ్చంద కార్యక్రమం వల్ల పూజ, ఆరూష్ కలుసుకుంటారు. వీరితో పాటు సుజిత్ అనే పూజ స్కూల్ స్నేహితుడు, ఇంకో ఇద్దరు కూడా ఉంటారు. ఓ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఉన్న పిల్లలకు గోడ మీద ఆలోచింపేజేసేలా ఆరూష్ ఓ పెయింటింగ్ వేసే బాధ్యత తీసుకుంటే, పూజ అక్కడి పిలల్లకు బోధించే టీచర్‌కు సాయం చేసే పనిలో భాగం అవుతుంది. పూజ, ఆరూష్ మంచి స్నేహితులు అవుతారు. ఆరూష్ వల్ల పూజ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటుంది.
పూజ రోజు అర్ధరాత్రి దాటే వరకు ఆరూష్ గదిలోనే పుస్తకాల గురించో లేక ఏదో ఒక విషయం గురించో మాట్లాడుతూనే సమయం గడుపుతూ ఉంటుంది. తర్వాత ఓ రోజు సెలవు ఉండటం వల్ల పూజ, ఆరూష్, సుజిత్, మిగిలిన ఇద్దరు ఓ ట్రెక్కింగ్ ట్రిప్‌కు వెళ్తారు. ఆ ట్రిప్‌లో ఆరూష్, పూజ సన్నిహితంగా ఉంటారు. ఆ ట్రిప్ తర్వాత వారిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నదన్న అంశం మీద స్పష్టత వస్తుంది.
ఇక తిరిగి వచ్చాక ఎప్పటిలానే పూజ ఆరూష్ గదిలో ఉండగా అర్ధరాత్రి పోలీసులు వచ్చి ఆమె బ్యాగ్‌లో మత్తు మందులు ఉండటం ఉండటం వల్ల నార్కోటిక్స్ చట్టం కింద ఆమెను అరెస్ట్ చేస్తారు. ట్రెక్కింగ్‌లో ఆమె బ్యాగ్ సుజిత్‌కు ఇచ్చినప్పుడు అతను అందులో ఆ మందులు పెట్టాడు. పూజ తండ్రి ఆమెను విడిపిస్తాడు. ఆ రాత్రి పోలీస్ స్టేషన్‌కు పూజ కోసం ఆరూష్ కూడా వెళ్తాడు. తన మీద ఆరూష్కు ఉన్న ప్రేమను చూసి మురిసిపోతుంది పూజ. ఆ తర్వాత పూజను అరెస్ట్ చేసిన సంగతి లోకల్ న్యూస్ పేపర్లో వస్తుంది. సుజిత్ అప్పటికే వెళ్లిపోతాడు. పూజను ఆ కారక్రమం పూర్తి కాకముందే ఇంటికి తీసుకువస్తాడు ఆమె తండ్రి.
ఆరూష్ అక్కడి పని పూర్తి చేసుకుని ఇంకో ఆర్ట్ హౌస్‌కు వెళ్తాడు. పూజ, ఆరూష్ ఇద్దరు వీడియో కాల్స్, మెయిల్స్ ద్వారా టచ్ ాలో ఉంటారు. ఆరూష్ ఉంటున్న ఆర్ట్ హౌస్ పూజ ఇంటికి దగ్గరలోనే ఉండటం వల్ల రోజు కాలేజీకి, కోచింగ్‌కు వెళ్తున్నానని చెప్పి పూజ రోజు ఆరూష్‌ను కలుసుకుంటూ ఉంటుంది. పూజను ఇబ్బందుల్లో నెట్టిన సుజిత్‌ను ఎదుర్కోవాలని ఆలోచించిన ఆరూష్ సుజిత్ డ్రగ్స్ అమ్ముతాడని తెలుసుకుని అతన్ని రప్పించినా, అతనితో పాటు ఉన్న ఇంకో ఇద్దరిని చూశాక వారి దగ్గర అప్పు తీసుకున్న సుజిత్ నుంచి డబ్బు తీసుకోవడానికి వారు అక్కడికి వచ్చారని తెలుసుకుంటాడు ఆరూష్. ఆరూష్ కావాలని ఇదంతా చేశాడని తెలుసుకున్న వాళ్ళు ఆరూష్‌ను గాయపరుస్తారు. వారి గురించి ముందే తెలిసిన సుజిత్ అక్కడి నుంచి ముందే పారిపోయినా ఆరూష్‌ను హాస్పటల్లో చేర్చమని ఆరూష్ ఆర్ట్ స్కూల్లో తెలియజేస్తాడు.
ఆరూష్ ఆర్ట్ టీచర్ ముకుందన్ ఆరూష్‌ను హాస్పటల్లో చేర్పిస్తాడు. అతను ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. పూజకు ఈ విషయం తెలియడంతో ఆరూష్‌ను చూడటానికి హాస్పటల్‌కు వస్తుంది. ముకుందన్ ఈ అంశం నుంచి తన రాజకీయ బలం పెంచుకోవాలని మీడియాను పిలిపిస్తాడు. అదే సమయంలో అక్కడ పూజను గుర్తించిన మీడియా ఆమె అంతకు ముందే అరెస్ట్ అవ్వడం, ఆమె మళ్ళీ అక్కడ ఉండటంతో ఆమెను కూడా ప్రెస్ కవరేజ్‌లోకి లాగుతుంది. ఆరూష్ డ్రగ్స్ కొనడానికి వెళ్ళి గాయపడినట్టు ప్రచారం జరుగుతుంది. పూజను టీవీలో చూసిన ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇంటికి రమ్మని కాల్ చేస్తారు.
పూజ కాలేజీకి, కోచింగ్‌కు వెళ్ళడం లేదని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆమె ఆరూష్‌ను రోజు కలుస్తుందని గ్రహించి ఆమె ఫోన్, ల్యాప్‌టాప్ తీసుకుంటారు. ఆరూష్ బ్రిటిష్ హై కమిషన్ తిరిగి వచ్చేయమని సూచించడంతో తిరిగి బ్రిటన్ వెళ్ళిపోతాడు. ఫోన్, ల్యాప్ టాప్ లేకపోవడం వల్ల పూజ ఆరూష్‌తో జరిగింది చెప్పలేకపోతుంది. పూజ నుంచి మెయిల్స్, కాల్స్ లేకపోయేసరికి ఆమె తనని మర్చిపోయి ఉంటుందని భావించిన ఆరూష్ కూడా ఆమెను మర్చిపోవాలని నిర్ణయించుకుని ఆమె మెయిల్‌ను బ్లాక్ చేస్తాడు.
పూజ తన తండ్రి డెస్క్ టాప్ ద్వారా ఆరూష్‌తో కమ్యూనికేట్ చేద్దామని ప్రయత్నించినప్పుడు ఆమె తండ్రి డెస్క్‌లో పూజకు ఆమె నాయనమ్మ ఇచ్చిన 35 లక్షలు పూజ పేరు మీద బ్యాంక్ అకౌంట్లో ఉండటం చూసి ఆమె తానే ఆ డబ్బుతో ఆరూష్‌ను కలవడానికి బ్రిటన్ వెళ్ళాలనే నిర్ణయం తీసుకుంటుంది. తల్లిదండ్రులకు తెలియకుండా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వీసా సంపాదించి మొత్తానికి బ్రిటన్ వెళ్తుంది. పూజ ఆరూష్కు సర్ప్రైజ్ ఇద్దామని ఆరూష్ దగ్గరకు వెళ్ళినప్పటికి ఆరూష్ ఆమె అలా వస్తుందని ఊహించకపోవడం వల్ల షాకవుతాడు. ఆమె తన తల్లిదండ్రులకు చెప్పకుండా అలా వచ్చేసి తప్పు చేసిందని, జీవితంలో ఏం చేయాలో తెలియకుండా అలా ఉండటం మంచిది కాదని చెప్తాడు. దానితో కోపంగా పూజ హోటల్‌కు తిరిగి వెళ్లిపోతుంది.
పూజ ఇంట్లో లేకపోవడంతో ఆమె కుటుంబం కంగారు పడుతుంది. పూజ ఆరూష్కు జరిగింది అంతా స్పష్టం చేస్తూ రాసుకున్న నోట్ బుక్ ద్వారా ఆమె ఎలా ఎక్కడికి వెళ్ళిందో వారికి అర్ధమవుతుంది. ఆమె తల్లి చైత్ర తాను పూజ ఎలా ఉండాలని అనుకుంటుందో ఎప్పుడు అడగలేదని, ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని, తన తప్పు ఉందని భావిస్తుంది. దివ్య సలహాపై చైత్ర, ఆమె భర్త, దివ్య ముగ్గురు ఆమెకు మెయిల్స్ పెడతారు. చైత్ర పూజను మెయిల్లో క్షమాపణ అడుగుతుంది. ఆ మెయిల్స్ చదివిన పూజ తన తల్లిదండ్రులకు తన మీద ఉన్న ప్రేమ, ఆరూష్ చెప్పిన దానిలో సత్యం స్పష్టం అవుతాయి. వెంటనే ఇండియా వెళ్లిపోతుంది.
రూష్ ఆమెను వెతుక్కుంటూ హోటల్‌కు వచ్చినా ప్రయోజనం ఉండదు. ఆరూష్కు కూడా పూజ తాను జరిగింది అర్ధం చేసుకునే స్పష్టతతో ఉన్నానని మెయిల్ చేస్తుంది. పూజ ఇంటికి తిరిగి వచ్చాక ఆమె కుటుంబం ఆమె ఏం చేయాలనుకుంటుంది అని అనుకున్నప్పుడు తాను చైల్డ్ సెంటర్ పెట్టాలనుకుంటున్నని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత ఆరూష్, పూజ మెయిల్స్, కాల్స్ ద్వారా అంతకు ముందే లానే ఉండటంతో నవల ముగుస్తుంది.
ఈ నవలలో పూజ ఏం చేయాలో అన్న అంశం పట్ల స్పష్టత లేని అమ్మాయి. కానీ ఆరూష్‌ను ప్రేమించానని ఆమె నిర్ణయించుకున్నాక ఆమె విదేశం వెళ్ళడానికి కూడా వెనుకాడకుండా తాను తీసుకున్న నిర్ణయం పట్ల స్థిరంగా ఉంటుంది.
ఆరూష్, పూజ తమ ప్రేమ ద్వారా తమ మధ్య ఉన్న ఆకర్షణ లోనే కొత్త అభిరుచులను పంచుకున్నారు. ఆరూష్ తన అంకిత భావాన్ని పూజ వైపు ప్రసరింపచేయగలిగితే, ఏదైనా అనుకుంటే సాధించే మొండి పట్టుదల ఉన్న పూజ తన ధృడత్వాన్ని ఆరూష్కు స్పష్టం చేసింది.
జీవితంలో ఓ దశలో తల్లిదండ్రులకు, సమాజానికి తప్పులుగా కనిపించేవి నిజానికి పిల్లలు జీవితాన్ని కొత్త కోణం నుంచి చూడటం కావచ్చు కూడా. తరం మారేకొద్ది ఆలోచనల్లో మార్పులు వస్తాయి. జీవితం పట్ల అవగాహన, వైవిధ్య వాతావరణాల ప్రభావం కూడా ఉంటుంది. జీవితంలో మనిషికి జీవితాన్ని వివిధ కోణాల్లో, వివిధ అనుభవాల ద్వారా దర్శించే స్వేచ్చను ఇవ్వాలి. ఆ స్వేచ్చ అభిప్రాయాలు, నిర్బంధాల నుంచి విముక్తి పొందాలి. వైరుధ్య అభిరుచులకు గౌరవం ఇవ్వాలి. పర్ఫెక్ట్ చైల్డ్ లను ఎవరు తయారు చేయలేరు. తయారు చేసినా ఆ పిల్లలు కేవలం తల్లిదండ్రుల ఆలోచనలకు ప్రోటో టైప్స్ మాత్రమే కానీ స్వతంత్ర మోడల్స్ కాదు. ఆ మోడల్స్ అయ్యే స్వేచ్చను ఇవ్వడమే తల్లిదండ్రులు ప్రేమను వ్యక్తీకరించే పద్ధతి. అలాగే పిల్లలకు మాట్లాడే స్వేచ్చ, తమ ఆలోచలనలను గౌరవించే వాతావరణంలో పెరిగే అవకాశం ఉండాలి. వీటి గురించి ఆలోచించకుండా కేవలం చదువులు, ఉద్యోగాల ద్వారా పిల్లల జీవితాన్ని గొప్పగా మారుస్తున్నామని తల్లిదండ్రులు అనుకుంటే అది భ్రమే!
- శృంగవరపు రచన, 8790739123