Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సాహిత్యం సందేశాత్మకంగా, వ్యక్తికి, సమాజాలకు సంస్కరణాత్మకం'' గా ఉండాలన్నది రాములు అభిమంతంగా ఉండేది. 1945లో రాసిన కథ 'బ్రహ్మపత్ర భక్త సమాజం'. ఆర్య సమాజ ప్రభావంతో రాసిన పెద్దకథ 'ఆత్మఘోష'. 1952లో నవలిక 'పిచ్చి శాయన్న'. 954లో అచ్చయిన నవల 'పెరటి చెట్టు'. జి.రాములు కేవలం సంస్కరణ దృక్పథంతోనే కాక బాలల కోసం కూడా రచనలు చేశారు.
కరీంనగర్ జిల్లా తొలి కథా రచయితగా డా|| మలయశ్రీ తన సిద్ధాంత గ్రంథంలో నిరూపించిన కథా రచయిత, కవి, అనువాదకులు జి.(గోపగారి) రాములు జూన్ 6, 1926లో నాటి నిజాం రాష్ట్రంలోని సిరిసిల్లలో చేనేత కుటుంబంలో పుట్టారు. విద్యార్థి దశలోనే అభ్యుదయ భావాలకు ఆకర్శితులై ఆర్య సమాజ కార్యకర్తగా వివిధ ఉద్యమాల్లో పాల్గొన్నారు.
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి తాత వీరిని లింగంపల్లికి పిలిపించి, ఇంట్లో ఉంచుకుని సి.నా.రెకు లెక్కలు బోధించేందుకు నియమించారు. ''సాహిత్యం సందేశాత్మకంగా, వ్యక్తికి, సమాజాలకు సంస్కరణాత్మకం''గా ఉండాలన్నది రాములు అభిమంతంగా ఉండేది. 1945లో రాసిన కథ 'బ్రహ్మపత్ర భక్త సమాజం'. ఆర్య సమాజ ప్రభావంతో రాసిన పెద్దకథ 'ఆత్మఘోష'. 1952లో నవలిక 'పిచ్చి శాయన్న'. 954లో అచ్చయిన నవల 'పెరటి చెట్టు'. జి.రాములు కేవలం సంస్కరణ దృక్పథంతోనే కాక బాలల కోసం కూడా రచనలు చేశారు. పిల్లలకోసం పద్యాలు, నాటికలు, గేయాలతో పాటు గాంధీసూక్తులను అనువాదం చేశారు. మహాత్మా గాంధి మరణానంతరం 1948లో గాంధీ సూక్తులను 'శ్రీ మహాత్మా గాంధీ సూక్తినిధి' పేరుతో పిల్లల కోసం అనువదించారు. ఈ సూక్తుల వెనుక ఒక కథ కూడా ఉంది. ఆనంద టి హింగోరాని గాంధీ ఆశ్రమవాసుల్లో ఒకరు. అతని భార్య మరణించినప్పుడు అతనిని ఓదార్చేందుకు రొజుకొక సూక్తిని, అభిప్రాయాన్ని రాస్తూ ఇచ్చేవారు. ఒకసారి ఆనంద భీమవరంలోని ప్రకృతి చికిత్సాలయంలో చికిత్సకోసం వెళుతూ తనకు రోజుకొక సూక్తి రాసి పంపమని కోరారు. అతని అభ్యర్ధనతో దాదాపు రెండు సంవత్సరాలపాటు అనగా, నవంబర్ 20, 1944 నుంచి 10 అక్టోబర్, 1946 వరకు గాంధీ సూక్తులను రాసి పంపారు. మీనవ జీవిత సత్యాలకు ఈ సూక్తులు ప్రతిబింబంగా ఉండేవి. వీటిని జి.రాములు తెలుగులోకి అనువాదంచేసి బాలబాలికలకు అందేలా చిన్న పాకెట్ పుస్తకంగా ప్రచురించారు.
'మనము పాపాలను నిరసింప వలనేగాని పాపులను ద్వేషించగూడదు' / 'చేసిన తప్పును దిద్దుకోకుండా బ్రతికే మనిషి జీవితం నిరర్ధకము' / 'ప్రజాభిప్రాయమే యుద్ధం కంటె బలమైన ఆయుధము' / 'విజయం సాధించడం కష్టమైనంత మాత్రాన సాధనను విడువరాదు' వంటి సరళ సుందరమైన సూక్తులను జి,రాములు అనువాదం చేశారు. పిల్లలకోసం జి.రాములు చేసిన మరో రచన 'శాంతి పథము' గేయ నాటిక, ఇది 1958లో అచ్చయ్యింది. 1958లో లెబనాన్ సివిల్వార్, అవినీతి, యుద్ధమేఘాలు కమ్ముకుని కురుస్తున్న ఆటంబాంబుల ధాటికి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను పరిశీలించి ఆవేదనతో చేసిన రచన యిది.
1979 అంతర్జాతీయ బాలల సంవత్సరం కానుకగా కృత్యారంభంలో వివరించి రాసిన పుస్తకం 'బాలనీతి'. ఇది యాభై పద్యాల అర్థ శతకం'. 'జ్ఞానబోధ జేయబూని లోకమునకు / ప్రజల భాషయందు ప్రజ్ఞమీర / కవిత జెప్పినట్టి కవి, యోగి-వేమన / కర్పణముగ దీని నందజేతు' అంటూ ఆటవెలది ఛందస్సు లో పద్యాలు రాసి జాతిజనుల నోళ్ళలో జాగృతమైనిలిచిన వేమనకు ఈ కృతిని అంకితం చేశారు కవి. జి. రాములు. పిల్లలకు ఏది బోధించాలో, ఎలా బోధించాలో తెలిసిన ఉపాధ్యాయులు వీరు, భావి భారత పౌరులైన బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు బాల్యంలోనే విత్తనాలు నాటాలని బలంగా నమ్మినవారు.
'శ్రీకరమగు నాంధ్రసీమ యందున్నట్టి / బాలురిందులోని పద్యములను / చదువుకొనిన యెడల నొదపును జ్ఞానంబు/ తెలిసి నడుచుకొనుము తెలుగుబాల' అంటూ అర్థశతక ఆరంభంలోనే తన రచన వెనుకవున్న ఉద్ధేశ్యాన్ని చక్కగా వివరిస్తారు జి.రాములు.
పిల్లలకోసం తేటమాటలు, తీయని పదాలు ప్రతి పద్యంలో గుమ్మరించారు రాములు. భావాలు ఎంత సరళంగా ఉన్నాయో పద్యాలు అంత అందంగా ఉంటాయిందులో. ఆటపాటలు, చదువుల గురించి- 'చదవదగిన వేళ చదువుచు, నాటలు/ఆడదగిన వేళ ఆడవలెను/ఆట, చదువు అవపరంబీ రెండు' ,విద్యార్థుల్లో బాల్యం నుంచి అలవడాల్సిన వినయం గురించి-'గొప్పవారితోడ కూడి పోవునపుడు / ఒకటి-రెండడుగుల నొప్పుగాను / వారికంటె వెనుక జేరి నడుచుటప్పు' అంటారు. ఇదే విధంగా మాతృభాష గురించి '... సవతి తల్లిగాదు కన్నతల్లి సాటి / మాతృభాష కటులె మరియేది సరికాదు' అని చెప్పిన జి. రాములు మరితంత వివరంగా కింది పద్యంలో చెప్పడం చూడవచ్చు. 'అన్యభాషలందు నధికమౌ వ్యామోహ/ముండి, మాతృభాష నుర్వియందు/చిన్నచూపుజూచుటెన్నగా దోషంబు' వంటివి ఇందులోని పద్యాలు.
కథకులుగా, నవలాకారులు, నాటకకర్తగా, అనువాదకులుగా పరిచితులైన జి. రాములు పిల్లలకోసం చక్కని రచనలు చేశారు. తెలుగు బాల సాహిత్య చరిత్రలో నమోదు కాని మరో తెలంగాణా సాహితీ వేత్త జి. రాములు.
- డా|| పత్తిపాక మోహన్ 9966229548