Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత స్వాతంత్య్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో, శాయిరెడ్డి హైదరాబాదులో నిజాం ప్రభుత్వానికి వైముఖంగా పోరాడారు. స్టేట్ కాంగ్రెసు, ఆర్య సమాజం, హిందూ మహాసభ,కమ్యునిస్టులు ప్రకటించిన పిలుపును అందుకొని ఎందరో యువకులు పోరాటంలోకి ప్రత్యక్షంగా దిగారు. వారిలో గంగుల శాయిరెడ్డి ఒకరు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న కారణంగా అరెస్టు అయి ఏడాదిపాటు జైలులో ఉన్నారు. హైదరాబాదు రాష్ట్రంలో నిజాం ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూ, ప్రజలను సాంస్కృతికంగా మేల్కొల్పుతూ ఆంధ్రమహాసభ తన అద్వితీయ పాత్రను పోషించింది. ప్రతీ జిల్లాలో ఒక్కో ఏడాది సమావేశం నిర్వహించి పలు తీర్మానాలను ప్రవేశపెట్టిన ఆంధ్రమహాసభ సమావేశాలలో శాయిరెడ్డి పాల్గొన్నారు.
తాను ప్రభవించి అనుభవించిన ఎన్నో సమస్యల లోతులను, తాను గడించి పండించిన పంటల పరిమళాలను, ఆరుగాలం కష్టించి నశించని ప్రకృతి అందాలను, కర్షక జీవుల మూగ కేకలను, మూగ జీవుల అమూల్య శ్రమాలను పదాల గూడులో పదిలంగా పొదివి, వేలాడుతున్న కొమ్మలకు రెమ్మలను తొడిగి, చెట్టు మొదలును కాపును చేసి వ్యవసాయ పద్యకావ్య పంటను పండించి కాపుబిడ్డగా ఫలాన్ని పొందారు. గంగుల శాయిరెడ్డి స్వాతంత్య్ర సంగ్రామ వీరుడిగా, ప్రబోధకుడిగా, సమాజ సంక్షేమ సంస్కర్తగా, రచయితగా కీర్తిని పొందారు.
జననం : శాయిరెడ్డి వరంగల్లు జిల్లాలోని రామ చంద్రగూడెంలో 1890 సంవత్సరంలో ఉదయించారు. శ్రీమతి వెంకమ్మ, వెంకటరెడ్డి ఇతని తల్లిదండ్రులు. శాయిరెడ్డి పుట్టిన కొన్నాళ్ళకు శ్రీమతి రామక్క, శివారెడ్డి దంపతులు దత్తత తీసుకున్నారు.
విద్య : గంగుల శాయిరెడ్డి జీడికల్లులోని వీధిబడిలో అక్షరాలు దిద్దారు. వరంగల్లు జిల్లాలోని చేర్యాల గ్రామంలో నివసించే మల్లారెడ్డి గారి వద్ద తెలుగు నేర్చుకున్నారు. మరొక పంతులు తెలుగు భాషలో, సాహిత్యంలో మేలకువలు నేర్పించారు. రామాయణ, భారత, భాగవతాలను తెలుగులో ఆసక్తిగా నిగూఢమైన అధ్యయనం చేశారు. సంకీర్తనల మీద మక్కువతో సంకీర్తనకారులు సృజించిన కీర్తనలను ఆలపిస్తూ ఇతరుల చేత ఆలపింపచేస్తూ ఉండేవారు.
జీడికల్లులోని రామాలయంలో సంస్కృత భాషను బోధించారు. ఆలేరు, పెంబర్తి, కొలనుపాక, అలాగే తన స్వగ్రామంలోనూ వీధి బడులు పెట్టి ఎందరో బాలలకు విద్యా గంధాన్ని పూసారు. హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం ప్రసారం చేసే గ్రామస్తుల కార్యక్రమానికి సలహాదారునిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి సన్మానాన్ని అందుకున్నారు.
స్వాతంత్య్రోద్యమం: భారత స్వాతంత్య్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో, శాయిరెడ్డి హైదరాబాదులో నిజాం ప్రభుత్వానికి వైముఖంగా పోరాడారు. స్టేట్ కాంగ్రెసు, ఆర్య సమాజం, హిందూ మహాసభ, కమ్యునిస్టులు ప్రకటించిన పిలుపును అందుకొని ఎందరో యువకులు పోరాటంలోకి ప్రత్యక్షంగా దిగారు. వారిలో గంగుల శాయిరెడ్డి ఒకరు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న కారణంగా అరెస్టు అయి ఏడాదిపాటు జైలులో ఉన్నారు.
హైదరాబాదు రాష్ట్రంలో నిజాం ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూ, ప్రజలను సాంస్కృతికంగా మేల్కొల్పుతూ ఆంధ్రమహాసభ తన అద్వితీయ పాత్రను పోషించింది. ప్రతీ జిల్లాలో ఒక్కో ఏడాది సమావేశం నిర్వహించి పలు తీర్మానాలను ప్రవేశపెట్టిన ఆంధ్రమహాసభ సమావేశాలలో శాయిరెడ్డి పాల్గొన్నారు.
రచనలు : సర్వ జనమంతా జ్ఞానులుగా మారాలనే సంకల్పంతో వయోజనులకు ఉపయోగకరంగా ఉంటుందని బాలశిక్షలు రాశారు. వీటిని 'తెలుగు పలుకు' పేర ప్రచురించారు. తెలంగాణ మట్టి రేణువులను దోసిలిలో పట్టి అక్షరాలలో పెట్టి కావ్యంగా మలిచి సువాసనాభరితమైన గ్రంథాన్ని రాశారు. అదే 'కాపుబిడ్డ'(1937). 'గోలకొండ కవుల సంచిక వెలువడిన రెండు మూడేళ్ళకే గంగుల శాయిరెడ్డి ఈ కాపుబిడ్డ గ్రంథం (వ్యవసాయ పద్య కావ్యం) వెలువడిందని ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారన్నారు'. ఈ గ్రంథం మొదటి ముద్రణకు సురవరం ప్రతాపరెడ్డి పరిచయ వాక్యాలు రాశారు. అలాగే కట్టమంచి రామలింగారెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమరావులు ఈ కాపుబిడ్డను చదివి ఈ గ్రంథం తాలూకు వైశిష్ట్యాన్ని తెలిపారు. అలాగే 'వర్షయోగము, గణిత రహస్యం, జేర్పకుంటి మహాత్య్మం' వంటి పలు గ్రంథాలను కూడా శాయిరెడ్డి రాశారు.
శాయిరెడ్డి ఏ ఒక్క వృత్తికే పరిమితం కాకుండా, ఏ ఒక్కదానికే సరిహద్దులు గీసుకోకుండా వ్యవసాయం చేస్తూ, వీధులలో బడులు నడుపుతూ, ఆలయాలలో సంస్కృత పాఠాలు బోధిస్తూ, రచనలు రాస్తూ, ప్రకృతి వైద్యం, ఆయుర్వేద, పశువైద్యం చేస్తూ పలువురి మన్ననలను అందుకున్నారు.
స్వయంశక్తితో పలు వృత్తులను చేపట్టి, చేపట్టిన ప్రతీ వృత్తిలో ప్రతిభతో రాణిస్తూ, రచనల ద్వారా బడుగు జీవుల భారాన్ని వెల్లడిస్తూ చక్కని కావ్యాన్ని అందించిన శాయిరెడ్డి 1975 సం||లో 85 వత్సరాల వయసులో సెప్టెంబర్ 4న మరణాన్ని పొందారు. పవిత్ర భారత భూమిపై రైతున్నంత కాలం కాపుబిడ్డ పదిలంగానే ఉంటుంది. అలాగే చిరకాలం పదిలంగా ఉండే కాపుబిడ్డను సాహితీ లోకానికి అందించిన శాయిరెడ్డీ పదిలంగానే ఉంటారు.
- ఘనపురం సుదర్శన్,
9000470542