Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక్కడు చంపు వేరొక్కడు చచ్చునను మాట మాత్రం నికార్సయిన నిజం చంపువాడ్ని దుష్టుడని, దుర్మార్గుడని విలన్ అనీ చెప్పుకుంటాం. విలన్ అయిన వాడికి చంపడమనే బాధ్యత ఉంటుంది. చంపకపోతే వాడు విలన్ కాదు. చంపటమే వాడి తక్షణ కర్తవ్యం అయితే ఈ చంపటం అన్న కర్తవ్యాన్ని నెరవేర్చడానికి విలనను వాడు అనేక పద్ధతులు అనుసరిస్తాడు. సాధారణంగా ఏ విలనూ స్వయంగా కత్తిపట్టి, పిస్తోలు ఎక్కుపెట్టి రంగంలోకి దిగడు. విలన్‌కి కూడా తను మంచి వాడినని అనిపించుకోవాలనే ఉంటుం దేమో. లేక తాను విలన్ని అనే విషయం తెలియకుండా ఉండాలని అనుకుంటాడేమో. అందువల్ల చాలా మంది దుర్మార్గపు విలన్లు తమ చేతికి మట్టి అంటకుండా మర్డర్ చెయ్యాలని ఉవ్విళ్ళూరుతారు. తాము ఎవడి ఆధార్కార్డ్ని చించేయాలనుకుంటారో వాడ్ని, తాము రంగం ప్రవేశం చెయ్యకుండా మూడో కంటికి తెలీకుండా గోడమీద ఫొటోగా మార్చి దండేసి దండాలు పెట్టిస్తారు.
తమ చేతికి మట్టి అంటుకోవడం ఇష్టం లేని విలన్లు చంపాలనుకున్నవాడ్ని గుట్టు చప్పుడు కాకుండా గుట్టుక్కు మనిపించడానికి ఎన్ని కష్టాలు పడతారో పాపం. టీవీ సీరియళ్ళలో ఆడవిలన్లయితే యిప్పుడు వాళ్ళ జనాభాయే ఎక్కువ కదా మరీ అవస్థపడటం చూడలేకుండా కదా ఉన్నాం. ఎవరి 'రిటర్న్‌టికెట్' కన్ఫం చెయ్యాలో వారు తినే తిండిలో విషం కలపడం, మెట్లకి అడ్డంగా సన్నటి తీగ కట్టటం, పాలరాతి గచ్చుమీద పారాచూట్ కొబ్బరి నూనె పోసి అలకడం వంటివి మట్టి అంటకుండా మరణమృదంగం మోగించడమే కదా! రోడ్డంట పన్నెండు చక్రాల హెవీలారీలు అడ్డదిడ్డంగా వచ్చి గుద్దేయడం, గదిలోకి పొడుగాటి పాము వచ్చి కస్సుబుస్సని కాటేయడం ఇవన్నీ విలన్లకు కలిసివచ్చే సిట్సుయేషన్లే కదా! చచ్చినవాడు ఎలా చచ్చాడో తెలీకుండానే చంపేవాడు చాలా ఈజీగా, చురుగ్గా, సరదాగా చంఫేయగలిగే రోజులివి. చంపే వాడికి మట్టే కాదు. ధూళి కూడా అంటని కాలమిది.
ఒకడు మనల్ని చంపడమేమిటి డామిట్ మన ప్రాణం మనిష్టం. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, కోసుకుంటాం, చంపుకుంటాం అనుకునే నరమానవులు కూడా లేకపోలేదు. సెల్ఫీలు తీసుకోవడమే కాదు 'సెల్ఫ్‌గోల్' చేసుకునే వాళ్ళూ ఉండకపోరు. చంపటమైనా చచ్చటమైనా 'చావు తెలివి' అనే భావించాలి. రెంటికీ తెలివే అవసరం. చంపడానికి ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో చావడానికీ అన్ని రకాల మార్గాలు కూడా ఉన్నాయి. చంపాలనుకున్నవాడు చంపే వాడిని చంపడానికి పెద్ద కారణాలేమీ ఉండక్కర్లేదు. వీడు చావ చితగ్గొట్టేంత తప్పు చేశాడా అని ఒకటికి పది కాక పోయినా అయిదు సార్లు అయినా చంపే వాడు. ఆలోచించడు. అదే విధంగా చావాలనుకున్నవాడు చచ్చి ఊరు కోవడానికి పెద్ద కారణాలేమీ ఉండక్క ర్లేదు. భర్త టీవీ రిమోట్ లాక్కున్నాడని భార్య, భార్య క్రికెట్ లైవ్ చూడలేదని భర్త ప్రాణత్యాగం చెయ్యవచ్చు. వెధవ ప్రాణాలు ఉంటేనేం పోతేనేం. అన్నీ వస్తువుల ధరా, డిమాండూ పెరిగిపోయేయి కాని ప్రాణాలు మీరీ 'చవక' అయిపోయేయి. తండ్రి సెల్‌ఫోన్ కొనివ్వలేదని చచ్చేవాడొకడయితే, బ్రిడ్జీ రెయిలింగ్ మీద ఒంటి కాలు మీద నిలబడి సెల్ఫీ తీయుంచు కోనివ్వలేదని చచ్చి సాధించేది ఒకరు. అసలు చావడానికి కారణాలెందుకు బతికీ బతికీ బోరు కొడుతుందని చస్తే ఎలా ఉంటుందో చూద్దామనీ చావడానికి సిద్ధపడే వాళ్ళు సిద్ధపడితే తప్పేమిటి? ఎవరి చావు వారు చావాల్సిందే కదా! ఆత్మహత్య మహాపాపం అన్నాడట ఎవడో పిరికి సన్నాసి. అసలు ఆత్మహత్యకు చావు అనేదేలేదని శాస్త్రాలు ఘోషిస్తుంటే ఆత్మహత్యేమిటి అర్థం పర్థం ఉందా! శరీర హత్య అనో స్వశరీర హత్యో అనాలి కాని. చచ్చేవాడు చావాలని ఫిక్సయ్యాక చచ్చు తెలివితేటలు ఉపయోగించాల్సిందే. ఇళ్ళల్లో చూరుకు వేలాడే ఫ్యాన్లూ, చెట్ల కొమ్మలూ గాలి విసరడానికే కాదు పీక పిసికేసుకునేందుకు కూడా పనికొస్తాయి. కళ్ళు మూసుకు దూకేయడానికి బావులు లేకపోతేనేం. చెరువులు కరు వయ్యాయా! దూకడానికి కొండలు దొరక్కపోతే అపార్టుమెంటులూ బాల్కనీలు కలవు అవి లేకపోతే పాయిజన్ బాటిళ్ళూ పురుగుల మందు డబ్బాలూ ఉండకపోవు.
చంపేవాడు ఓటుకోసం, సీటుకోసం, నోటుకోసం చంపవచ్చు. చచ్చేవాడు బ్రతుక్కోసం, బ్రతకలేక బ్రతకరాక చావవచ్చు. చంపేవాడు తన చేతికి మట్టి అంటకుండా చంపాలన్నా, చచ్చేవాడు చడీ చప్పుడూ కాకుండా 'బకెట్' తన్నేయాలన్నా కావాల్సింది ఇదే... ఇదే!!!
-చింతపట్ల సుదర్శన్, 9299809212