Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పండిత నెహ్రూ పుట్టిన రోజు/బాలల పండుగ రోజు అది/బాలల కెంతో మోజు' అని చెబుతూ బాలల పండుగ 'సిరి వెన్నెల పండుగ రోజు' అంటారు. ఆటపాటలతో, ఆనందంగా, సంతోషంగా ఎదిగే బాల్యానికి ఇది అసలైన పండుగని ఆయన ఆంతర్యం. ఉపాధ్యాయుడు కదా! అందుకేనేమో పిల్లల పండుగ అంటే అంత ఇష్టం ఆయనకు. తెలుగు నేల మీద ఎంత ప్రేమగా, అభిమానంగా 'జేజేలు' పలికారో అంతే భక్తితో కవి'దేశభక్తి'ని పిల్లలకు బోధిస్తారు.
తెలుగునేలపై విద్వత్కవి, పుంభావ సరస్వతి డాక్టర్ వేముగంటి నరసింహాచార్యుల పరిచయంలేని సాహితీవేత్త ఉండరన్నది నిజం. డా|| సినారె మాటల్లో చెప్పాలంటే ఆయన 'విద్వత్కవి, వినయభారనమ్ర విద్వన్నిధి.' 14 జూలై, 1930న జన్మించారు. 1940 ప్రాంతంలోనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించినప్పటికీ తొలి రచనగా అచ్చయ్యింది 1946లో మీజాన్ పత్రికలో.
పద్యాన్ని ఎంత ప్రౌఢంగా రాసారో, వచనాన్ని, గేయాన్ని అంతే సరళంగా రాశారు వేముగంటి. పద్యగేయాలే కాక పిల్లల కోసం అంతే ప్రేమతో బాలల కోసం గేయాలను కూడా రాయడం ఉపాధ్యాయునిగా ప్రతిరోజు ఏ పిల్లలకైతే పాఠాలు చెబుతున్నారో వారిపట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనం. 1979 అంతర్జాతీయ బాలల సంవత్సరం సందర్భంగా తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో లబ్దప్రతిష్టులైన కవువులు బాల సాహిత్యాన్ని సృజించి పిల్లలకు కానుకగా అందించారు. పద్యవిద్యకు పట్టుగొమ్మ అయిన వేముగంటి పిల్లలకోసం 'తెలుగు బాలనీతి' శతకాన్ని కూర్చారు. 'తెలుగుబాల సుగుణకలిత' అనే మకుటం కలిగిన ఈ శతకం బాలబాలికలకు బాల్యంలోనే నేర్చుకుని, అలవర్చు కోవాల్సిన నీతిని, రీతిని, మంచితనం, మానవీయ విలువలు నేర్చుకునేందుకు ఒక కానుకగా అందించారు.
ఈ కోవలోనే వేముగంటి పిల్లల కోసం 'బాల గేయాలు' రాయగా, సిద్ధిపేట సాహితీ వికాస మండలి వాటిని ప్రచురించింది. ఈ ఒక్క సంవత్సరమే వందలాది బాలల పుస్తకాలు ప్రచురించ బడడం విశేషం. 'తెలుగు తల్లికి జేజేలు / వెలుగు తల్లికీ జేజేలు' అంటూ అన్నపూర్ణగా, లలిత కళామూర్తిగా, ధీర శూరతల దివ్యమూర్తిగా తేజరిల్లుతున్న తెలుగు తల్లికి, ఆనాటి నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలకు 'జేజేలు' పలుకుతారు వేముగంటి ఇందులోని తొలి గేయంలో. ఈ పుస్తకం 14 నవంబరు, 1979న ఆవిష్కరించబడింది. బాలల దినోత్సవం రోజున ఇది బాలలకు అందిన కానుక.
'పండిత నెహ్రూ పుట్టిన రోజు/బాలల పండుగ రోజు అది/బాలల కెంతో మోజు' అని చెబుతూ బాలల పండుగ 'సిరి వెన్నెల పండుగ రోజు' అంటారు. ఆటపాటలతో, ఆనందంగా, సంతోషంగా ఎదిగే బాల్యానికి ఇది అసలైన పండుగని ఆయన ఆంతర్యం. ఉపాధ్యాయుడు కదా! అందుకేనేమో పిల్లల పండుగ అంటే అంత ఇష్టం ఆయనకు. తెలుగు నేల మీద ఎంత ప్రేమగా, అభిమానంగా 'జేజేలు' పలికారో అంతే భక్తితో కవి 'దేశభక్తి'ని పిల్లలకు బోధిస్తారు. మహాకవి గురజాడ చెప్పినట్టు 'దేశమంటే మనుషులోరు' అన్న మాటను అచ్చంగా నమ్మి 'దేశమంటే జనం' అంటూ చెబుతూనే తనదైనదిగా 'దేశమంటే మనం' అంటారు వేముగంటి.
డా|| వేముగంటి పండిత కవి. ఉర్దూ, సంస్కృతం, తెలుగులు చదువుకున్నారు, మహాకవి. కానీ, ఆయన పిల్లల కోసం రాసిన గేయాలుచూస్తే అంతటి మహా పండితుడు ఇంత సరళంగా ఎలా రాసాడా అని ఆశ్చర్యం కలగకమానదు. అది వారి ప్రతి గేయంలో కనిపిస్తుంది. 'తెలుగు భాష' పేరుతో ఆయన రాసిన గేయం చూద్దాం. వేముగంటి మాటల్లో 'తెలుగుభాష' ఎటువంటిదటా అంటే- 'పలుకు పలుకులోన / అమృతము చిలికించు / పదము పదములోన / పాటలు పలికించు' అమృతతుల్యమైన భాష నట. ఇంకా 'మెత్తదనములోన / క్రొత్తదైన వెన్న' లాంటి తెలుగు భాష 'తేనెకన్న మిన్న' అంటారు. గొప్పతనాన్నే కాక భాషపట్ల పిల్లల కర్తవ్యాన్ని ఇలా చెబుతారు. 'తెలుగుమాట పలికి / తెలుగు తేనె లొలికి / తెలుగుదనం నిలుపడం / తెలుగుబాల బాధ్యత' అని వేముగంటి పిల్లల కోసం చెప్పారు కానీ ఇది మనందరి బాధ్యత కూడా.
అమ్మ గొప్పదనాన్ని, ప్రేమను ఎంత వర్ణించినా ఎప్పటకీ వొడవని ముచ్చటనే. పిల్లలకోసం రాసినప్పుడు 'అమ్మ'ను, 'చందమామ'ను గురించి రాయకుండా ఉండలేము. వేముగంటి కూడా 'అమ్మ' అనే చక్కని గేయాన్ని రాసారు. రాయడమే కాదు అమ్మకు ఆయన ఇచ్చిన నిర్వచనం చాలా గొప్పగా ఉంది. 'అమ్మ మనకు దైవమురా!/ అమ్మ ప్రేమరూపమురా!/ అమ్మవంటి దేవత ఈ/ అవనిలోన లేదురా!' అంటారు. 'అమ్మను మించి దైవమున్నదా/ ఆత్మను మించి అద్దమున్నదా' అనే ఇటీవలి సినిమా పాట మనకు తెలిసిందే. వేముగంటి 1979లోనే ఈ గేయం రాశారు.
'హరిజనులైనా, గిరిజనులైనా / అందరు మన సోదరులే / ముస్లింలైనా క్రైస్తవులైనా / అందరు మన బంధువులే' అని చెప్పిన వేముగంటి, 'పిల్లల మనసులు/తెల్లన తెల్లన/పిల్లల చూపులు/చల్లన చల్లన/పిల్లల మాటలు/తీయన తీయన' అని చెబుతారు.1947లో అచ్చయిన 'ప్రభోదము' నుంచి 'తెలుగు తెలివిడి' వరకు నలబైకి పైగా గ్రంథాలు రాసిన డా||. వేముగంటి నరసింహాచార్యులు పిల్లల కోసం తెలంగాణలో పరితపించిరాసిన కవి, ఆదర్శ ఉపాధ్యాయుడు, పాత కొత్తల వారథి.
- డా|| పత్తిపాక మోహన్ 9966229548