Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిరంకుశ రాజ్యానికి వ్యతిరేకంగా సాగిన గ్రంథాలయోద్యమం,ఆంధ్రోద్యమం వంటి పలు రాజకీయ ఉద్యమాలలో భాగస్వామి అయ్యారు.జాతీయోద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడానికి మహాత్మాగాంధీ బొంబాయి వస్తున్న విషయం తెలుసుకున్న హైదరాబాద్ యువకులు వార్ధా వెళ్ళి ఆయనను కలిశారు. అలా హైదరాబాద్ నుంచి వెళ్ళిన యువ జాతీయోద్యమ వీరులలో దేవులపల్లి రామానుజరావు ఒకరు.
సాహితీ సుగంధపు తోటలో విరబూసిన లేత మల్లెపువ్వు అతడు. సాంస్కృతిక సౌధంలో నిలబడిన యవ్వనపు వీర యోధుడతడు.హైదరాబాద్ స్వాతంత్య్రం కోసం సమరశంఖం పూరించిన సాహిత్య సాహస సంస్కారవంతుడు అతడు. అతడే దేవులపల్లి రామానుజరావు. వరంగల్లు పట్టణంలోని మట్టెవాడలో ఒక సంపన్న జమీందారీ కుటుంబంలో 1917 ఆగస్టు 25న జన్మించారు. తల్లిదండ్రులు దేవులపల్లి ఆండాళమ్మ, వేంకటా చలపతిరావు. వేంకటాచలపతిరావు ఆ కాలంలోనే ప్రసిద్ధ న్యాయ వాదిగా, సాహితీ పోషకుడిగా సమకాలికుల మన్ననల్ని అందుకున్నారు.
విద్యాభ్యాసం
సాంస్కృతిక, సాహిత్యాలకు ఆలవాలమైన ఓరుగల్లు పట్టణంలోని హన్మకొండలో ఆంగ్లమాద్యంలో ప్రాథమిక విద్య సాగింది. ఆ తరువాత ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వచ్చి మద్రాసు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న నిజాం కళాశాలలో డిగ్రీ విద్యను అభ్యసించారు. 1934లో తెలుగును సెకండ్ లాంగ్వేజ్‌గా నిజాంలో చదువుకుంటున్న సమయంలోనే రామానుజరావుకు బూర్గుల రామకృష్ణారావు, ఎన్.కె. రావు, మందుముల నరసింగరావు, కొండా వెంకట రంగారెడ్డి వంటి ప్రభృతులతో పరిచయం ఏర్పడింది. విద్యాభ్యాసం అనంతరం రామానుజరావు న్యాయవాద వృత్తినారంభించి కొన్నాళ్ళకు స్వస్తి పలికి సంఘ సేవలోకి వచ్చారు.
గొప్ప సాహితీవేత్తలైన కాళోజి హన్మకొండ బడిలో, సురవరం ప్రతాపరెడ్డి నాగపూర్ న్యాయ కాలేజిలో రామానుజరావుకు సహాధ్యాయిలు.
గోపాలకృష్ణ గోఖలె అభిమాని అయిన రామానుజరావు గొప్ప జాతీయవాది, అంతకు మించిన దేశభక్తుడు, మహాత్మా గాంధీ ప్రభావాన్ని సొంతం చేసుకున్న సౌమ్యులు. నిరంకుశ రాజ్యానికి వ్యతిరేకంగా సాగిన గ్రంథాలయోద్యమం, ఆంధ్రోద్యమం వంటి పలు రాజకీయ ఉద్యమాలలో భాగస్వామి అయ్యారు. జాతీయోద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడానికి మహాత్మాగాంధీ బొంబాయి వస్తున్న విషయం తెలుసుకున్న హైదరాబాద్ యువకులు వార్ధా వెళ్ళి ఆయనను కలిశారు. అలా హైదరాబాద్ నుంచి వెళ్ళిన యువ జాతీయోద్యమ వీరులలో రామానుజరావు ఒకరు. హైదరాబాద్ ప్రజలను జాగృతం చేయడానికి, స్వాతంత్య్రం సాధించడానికి నడిపిన అన్ని ఉద్యమాలలోను రామానుజరావు తన పాదాన్ని ముందుంచారు.
రచనలు, సాహిత్య సేవ
'యాభై సంవత్సరాల జ్ఞాపకాలు, పచ్చతోరణం, సారస్వత నవనీతం, అనుభవములు జ్ఞాపకములు' వంటి రచనలు చేశారు. దేవులపల్లి రాసిన పచ్చతోరణం కవితా సంకలనాన్ని రాయప్రోలు సుబ్బారావు, వేలూరి శివరామశాస్త్రి, పింగళి లక్ష్మీకాంతం, మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి ఉద్దండులు ప్రశంసించారు. దాశరథి రాసిన 'అగ్నిధార' కవితా సంకలనానికి పీఠిక రాశారు. ఉర్దూ భాషలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన 'గుబారెఖాతిర్' గ్రంథాన్ని తెలుగులో చేశారు.
వరంగల్లులో ఉన్న శబ్దాను శాసనాంధ్ర భాషా నిలయానికి కార్యదర్శిగా ఉన్నారు. ప్రజలను నిలువు దోపిడీకి గురిచేస్తూ స్వేచ్చా స్వాతంత్య్రాలకు ఆటంకం కలిగిస్తూ ఉన్న అరాచక ప్రభుత్వ విధివిధానాల గురించి తెలపడానికి మాడపాటి వారి సూచన మేరకు 'శోభ' అను పత్రికను వరంగల్‌లో ప్రారంభించారు. గొప్ప ప్రశంసలను అందుకున్న సాహిత్యాన్ని విరచించిన రామానుజరావు తన కలానికి ప్రమోద్ కుమార్ అని స్వనామకరణం పెట్టారు.
1957 ఆగస్టు 7న ప్రారంభించబడ్డ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి కార్యదర్శిగా (22 ఏండ్లు), అనంతరం ఉపాధ్యక్ష, అధ్యక్ష బాధ్యతలను కూడా చేపట్టి గణనీయమైన పాత్రను పోషించారు. తన బాధ్యతా కాలంలో ఎన్నో ప్రాచీన గ్రంథాలను శోధించి వాటి గురించి తెలుగు సమాజానికి ఎరుక చేశారు. 1960లో రాజ్యసభకు ఎంపికై రెండేళ్ళ పాటు ఆ హోదాలో ఉన్నారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం సిండికేటు సభ్యులుగా ఎన్నికయ్యారు. పిదప 1972- 76 మధ్య ఐదు సార్లు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తాత్కాలిక ఉప కులపతిగా ఉన్నారు.
ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇప్పటికి ఇలా ఉందంటే దానికి కారకులైనవారిలో రామానుజరావు ఒకరు. విశ్వవిద్యాలయానికి అలీయావర్ జంగ్ ఉపకులపతిగా ఉన్నప్పుడు విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం హిందీ విశ్వవిద్యాలయంగా మార్చాలనే ప్రతిపాదన అప్పటి ప్రభుత్వానికి పంపారు. ఆ విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 'సిటిజన్స్ కమిటీ' వేసి దాని తరపున నిష్ట్రaఅసర శీటట శీరఎaఅఱa బఅఱఙవతీరఱ్y నినాదంతో గొప్ప ఉద్యమం చేసి కేంద్రం ఆధీనంలోకి వెళ్ళకుండా కృషి చేశారు.
ఇలా స్వాతంత్య్ర సమరయోధుడిగా, చట్ట సభలో సభ్యులుగా, సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా పలు బాధ్యతలు చేపట్టి ఆ హోదాలకు వన్నెను తీసుకొచ్చిన నిత్య స్మరనీయుడైన రామానుజరావు జూన్ 8, 1993లో దివంగతులయ్యారు.
- ఘనపురం సుదర్శన్,
9000470542