Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సాహిత్యం దేశచిత్రపటంపై తలెత్తుకొని నిలబడిన సందర్భం ఇది. ఆధిపత్యాలు, అహంకారాలను తట్టుకొని ఆత్మగౌరవం విజయకేతనం ఎగరేసిన వేళ ఇది. అక్షరాల సేద్యంతో పల్లె తెలంగాణ దు:ఖాన్ని బతుకును బొమ్మకట్టించిన మూడు కలాలకు దక్కిన సమున్నత గౌరవం ఇది. సమాజంలోనే కాదు, సాహిత్యంలోనూ తన వాటాకోసం నినదించింది తెలంగాణ నేల. ఆ తండ్లాట ఇవాళ గెలిచి నిలిచిన వేళ ఇది. కేంద్రసాహిత్య అకాడెమి ప్రతీ యేట ప్రకటించే అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రమే మూడు విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. అందుకు ఆధారంగా నిలిచిన విజేతలుగా నిలిచిన గోరటి వెంకన్న, దేవరాజు మహరాజు, తగుళ్ల గోపాల్ మన మట్టిబిడ్డలే. ఇవాళ తెలంగాణ మట్టిగుండెలు పులకరిస్తున్నాయి. తెలంగాణ నేలను తడిమి చూసుకుంటున్నాయి. వారి కృషికి కేంద్రసాహిత్య అకాడెమి దాసోహమయ్యేందుకు వేదికగా నిలిచిన వారి అక్షరాలకు జేజేలు పలుకుతున్నాయి!
గోరటి వెంకన్నను, అతని సాహిత్యాన్ని కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పాటంటే తెలంగాణ, తెలంగాణ అంటే పాట. ఆ పాటను పదునెక్కించిన కలం వెంకన్న. జీవితాన్ని పాటల్లోకి ఒంపడం తెలిసిన పాటల జీవధార గోరటి వెంకన్న. ఉద్యమాలను పాటతో వెలిగించిన నేల తెలంగాణ. తెలంగాణలో అనేక మంది వాగ్గేయకారులున్నా, గోరటి వెంకన్నలో ఉన్న వైవిధ్యమే అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. పాటను ప్రజల గుండెల్లోకి చేర్చడంలో వెంకన్నది అందెవేసిన చెయ్యి. అందుకే తెలుగు నేల మీద మూడు దశాబ్దాలుగా వెంకన్న పాటలు ప్రవహించని పల్లె లేదంటే అతిశయోక్తి కాదు. ఖండాంతరాలకు విస్తరించిన ఖ్యాతి వెంకన్న సొంతం. స్థానికమైనా, అంతర్జాతీయమైన కనిపించని కుట్రలను కండ్లముందుంచుతుంది వెంకన్న పాట. తెలంగాణ నుడికారంతో, పదాలను పరవళ్లు తొక్కించే గోరటి వెంకన్న పాట, తెలంగాణ ఉద్యమకాలంలో జనం నోళ్లల్లో నానినతనం మరువలేనిది. ప్రతీ కుట్రను విడమరిచి ప్రజలకు అర్థం చేయించి, ఉద్యమ లడాయికి సిద్ధం చేసింది వెంకన్న పాట.
మహానగరాలకు మట్టి మోసింది పాలమూరు జిల్లా. ఒకనాడు ఓ వెలుగు వెలిగిన జిల్లా, అనంతరం క్రమంగా వట్టిపోయింది. కరువు వలసలకు చిరునామాగా మారింది. సాహిత్య వికాసం కుంటుపడిందనుకున్న కాలంలో వెంకన్న ఒక తారాజువ్వలా దూసుకొచ్చాడు. వెనుకబడ్డ ప్రాంతంగా మారిన మహబూబ్‌నగర్ జిల్లా ఉద్యమాలకు నిలయంగా మారింది. వామపక్ష, విప్లవోద్యమాలు ఊపు మీదున్న కాలంలోనే గోరటి వెంకన్న పాటకవిగా ఎదిగొచ్చాడు. మహబూబ్‌నగర్ జిల్లా తెలకపల్లి మండలం గౌరారం పల్లె కన్న పాలధారల గొంతు గోరటి వెంకన్న. వెంకన్నది మౌఖిక సాహిత్య వారసత్వం. వెంకన్న తండ్రి నర్సింహ్మ కూడా అద్భుతమైన జానపద కళాకారుడు. ఉదయాన్నే తాను పాడే పాటతోటే పల్లె నిదురలేచేది. ఆ పాటల ఒరవడిని చిన్ననాడే అందిపుచ్చుకున్నాడు వెంకన్న. అలా విద్యార్థి దశ నుంచే పద్యాలు అల్లడం, నాటకాలు వేయడం, పాటలు రాయడం అలవోకగా అలవడింది. జానపద వారసత్వాన్ని ఒడిసిపట్టుకొని, తనదైన దృష్టితో గేయసృజన మీద దృష్టి సారించాడు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల మీద పాటలు అల్లాల్సిన బాధ్యతను స్వీకరించాడు. అట్లా వందల పాటలు రాశాడు వెంకన్న.
తెలుగు సమాజంలో పాటకవులు ఎక్కువగా వామపక్ష, విప్లవ భావజాలాల నుండే ఉద్భవించారు. ఈ నేపథ్యంలోనే గోరటి వెంకన్న కూడా సమాజాన్ని మొదట మార్క్సిస్టు ఐడియాలజీతోనే చూశాడు. వర్గదృక్పథంతో పాటలు అల్లి ప్రజలను మెప్పించాడు. ఆ తరువాత 90వ దశకంలో వచ్చిన అస్తిత్వ పోరాటాలు వెంకన్న కలాన్ని మరింత పదునెక్కించాయి. మారోజు వీరన్న ఆధ్వర్యంలో కొనసాగిన కులవర్గ పోరాటానికి గోరటి వెంకన్న పాటలే మార్చ్ఫాస్ట్ గీతాలయ్యాయి. లక్షలాది మందితో ఏర్పాటు చేసిన సభల్లో మారోజు వీరన్న మాటను పాటను ఏకం చేసి దోపిడి కోటల మీదకి బల్లెంలా విసిరింది, ఎంకన్న రాసిన ''అందుకోర గుతుపందుకో'' పాటనే. అట్లా దళిత, బహుజన ఉద్యమాలకు పదునైన పాటలను అందించాడు వెంకన్న. దళిత జీవితాన్ని అనుభవించిన తనానికి తోడు, బలమైన తాత్విక పునాదిని కలిగి ఉండడం వల్ల వెంకన్న పాట రాసే శైలిలో వైవిధ్యం ఉంటుంది. సమస్యను పైపైన తడమడం వెంకన్నకు తెలియదు. ఒక మేధావిలా సమస్య మూలాల్లోకి పోయి పాటను అల్లుకొస్తాడు. సమస్య గురించి ఎక్కుపెట్టినంత మాత్రాన వెంకన్న విప్లవ రచయితలు చెప్పినట్టు మూసధోరణిలో ఇది చెయ్యి, అది చెయ్యని చెప్పడు. సమస్యకు గల మూలాలను వివరించే తీరులోనే, ప్రజలకు ఏం చేయాలో చెప్పకనే చెప్పే శైలి ఎంకన్న పాటల్లో కనిపిస్తుంది. అలా వెంకన్న ఒక సూఫీ గురువులా తెలుగు పల్లెలన్నీ పర్యటించాడు.
తొంభైల తర్వాత ప్రపంచీకరణ దేశాన్ని కుదిపేసింది. ఈ గ్లోబలైజేషన్ కనిపించని కుట్రలను ఒడిసి పట్టుకున్నాడు వెంకన్న. అట్లా పుట్టుకొచ్చిందే ''పల్లె కన్నీరు పెడుతోందో'' పాట. దశాబ్దకాలం పాటు ఈ పాట జాతీయ గీత స్థాయిలో ఊరూర మార్మోగింది. ప్రజల బతుకు దినదినం పతనం ఎట్లా అంచులకు చేరుతున్నదో వివరించాడు వెంకన్న. ఇక తెలంగాణ ఉద్యమాన్ని తన పాటతో ఉర్రూతలూగించాడు వెంకన్న. తెలంగాణ ఉద్యమ కాలంలో వందలాది పాటలు వచ్చాయి. వీటిలో ఎంకన్న రచించిన పాటలు తెలంగాణ దు:ఖాన్ని, చరిత్రను కళ్ల ముందుం చాయి. తెలంగాణ వాగ్గేయకారుల్లో అత్యంత ఎక్కువగా విషయసాంద్రత కలిగిన కవి ఎంకన్న. అడుగంటిన తెలంగాణ వ్యవసాయమైనా, చిధ్రమైన చేతి వృత్తుల దు:ఖమైనా, వివక్షతలకు, అవహేళనలకు గురవుతున్న సంస్కృతైనా వెంకన్న పాటల్లో జీవం పోసుకొని తొణికిసలాడు తుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో వెంకన్న పాల్గొన్న సభల్లో, ప్రజలు అత్యంత ఉత్సాహాన్ని పొందారంటే అతని పాటలే కారణం.
వెంకన్న పాటలకు ప్రాణం కవిత్వమే. ఏ విషయాన్ని ఎంచుకున్న అందులో ప్రకృతిని జతచేసి కవిత్వీకరించే తీరు, ఏ దిగ్గజ వచన కవికి తక్కువకాదు. అందుకే ''ఏమి మారెను ఈ పేదల బతుకులు'' పాటలో బల్లి గుడ్లను సున్నంతో, సాలె పురుగులు అల్లిన పరదాలను దేవుడిచ్చిన దోమ తెరలుగా వర్ణించాడు. ఇంతటి జీవన సౌందర్యాన్ని పట్టుకున్న మహాకవి వెంకన్నలో, మిగిలిన పాటకవుల కంటే కూడా బలమైన రాజకీయ స్పృహ కనిపిస్తుంది. కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతూ, ప్రజల జీవితంలో సంభవిస్తున్న మార్పులను, వాటి మూలాలను వెతికి పట్టుకొని పహారా కాస్తాడు. ఇందుకోసం నిరంతర అధ్యయనాన్ని ఆశ్రయిస్తాడు. అలా సమగ్ర అవగాహన ఏర్పడిన తర్వాతే వెంకన్న, పాట రాయడానికి పూనుకుంటాడు. ఆయన కృషికి కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు దక్కడం తెలంగాణపాటకు గర్వకారణం.
ఇక దేవరాజు మహారాజు తెలంగాణ ప్రజల భాషకు పట్టంకట్టిన రచయితగా సుప్రసిద్ధులు. సమాజంలో నెలకొన్న అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలపై కొరడా ఝళిపించాయి దేవరాజు అక్షరాలు. సైన్సును, సాహిత్యాన్ని ఊపిరిగా భావించే ఈ తెలుగు కలం, తెలంగాణకు గుండెబలం. ప్రజలను చైతన్యపరచడమే తన జీవనవిధానంగా మార్చుకున్న ఈ ప్రజాసైంటిస్టు కృషికి దక్కాల్సిన గౌరవమే ఇది. ఐదు దశాబ్దాల పాటు నిర్విరామంగా కొనసాగుతున్న సాహిత్య కృషిలో అనేక మైలురాళ్ల వంటి పుస్తకాలు వెలువరించారు దేవరాజు. శాస్త్రవేత్తగా, రచయితగా, కవిగా, హేతువాదిగా, కాలమిస్ట్‌గా, విమర్శకునిగా, బాల సాహిత్యకారునిగా బహుముఖీనమైన కృషి దేవరాజు సొంతం. తెలంగాణ ప్రజాజీవన సరళిని ఒడుపుగా పట్టుకొని అక్షరాలకు ఎత్తిన రచయితగా ఇప్పటికే సుప్రసిద్ధులు. బాల సాహిత్యం రాసి రేపటి తరాలు అలవర్చుకోవాల్సిన ఆలోచన విధానాన్ని నీతికథలుగా అందించి ఈ జాతికి గొప్ప మేలు చేసిన కలం దేవరాజు మహారాజు.
వరంగల్ జిల్లా కోడూరు గ్రామ కొంగు బంగారం దేవరాజు మహారాజు. చిన్ననాటి నుండే చదువే ప్రపంచంగా ఎదిగి వచ్చారు. సైన్స్ పట్ల తనకు ఉన్న మక్కువతో అందులోని పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్నారు. జువాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తూ ఎంతోమంది ఉత్తమ పరిశోధకులను తయారు చేశారు. అలాగే అనువాదకునిగా భారతీయ సాహిత్యానికి ఎంతో విలువైన సేవ చేశారు. ఆ కృషికి సాహిత్యలోకం దేవరాజును ''అభినవ కొడవటిగంటి''గా కొనియాడింది. ఇక సమాంతర సినిమా సాహిత్యంపై దేవరాజు ప్రసరించిన వెలుగులు వెండితెర కవిత్వంగా పాఠకుల గుండెల్లో నిలిచాయంటే అతిశయోక్తి కాదు. సినిమా, జానపదం ఒక్కటని కాదు, ఏకకాలంలో ఇంత విస్తృతమైన సాహిత్య సేవ చేసిన రచయిత తెలంగాణలోనే కాదు, తెలుగులో కూడా అరుదంటే అతిశయోక్తి కాదు. పలు భాషల సాహిత్యంతో దేవరాజుకున్న అనుబంధం, తెలంగాణ సాహిత్య గౌరవాన్ని మరోమెట్టు ఎక్కించింది. తాను రాసిన బాలల కథలకు ఈ బాల సాహిత్య పురస్కారం తెచ్చిపెట్టింది.
ఇక ఈ యేడాది కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారానికి ఎంపికయ్యాడు యువకవి తగుళ్ల గోపాల్. తెలంగాణ ఉద్యమంలో కళ్లు తెరిచిన గోపాల్ కవిత్వమంతా మట్టిపల్లె కేంద్రమైందే. మట్టిమనుషుల అనుబంధాలు, ఆత్మీయతలను గోపాల్ కవిత్వం ఒడిసి పట్టుకుంది. యువతరంలో ఇంత హృద్యంగా రాసే కవిగా గోపాల్ ఇప్పటికే పాపులర్ అయ్యాడు. మట్టిమీద, మనిషి మీద గోపాల్‌కు విపరీతమైన మమకారం. తన సాంస్కృతిక మూలాలను వీడనితనంతోటే తన కవిత్వానికి 'దండకడియం'అనే పేరును పెట్టుకున్నాడు. నిత్యం కవిత్వమై జీవిస్తూ తెలంగాణ భాషను, యాసను మరింత పదిలంగా అక్షరీకరించే పనికి పూనుకున్నాడు. కవిగా రాణించాలంటే ముందు కవిగా జీవించాలన్న ఎరుక కలిగినోడు. పాలమూరు మట్టిని పిడికిట పట్టి తెలంగాణ సాహిత్యంలో తనదైన గొంతుకను వినిపిస్తున్నాడు. నోరులేని మూగజీవాల నుండి, నోరుకలిగిన మనుషుల దాకా ప్రతీది గోపాల్ కవిత్వానికి వస్తువే. సింగిడి తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో జెన్ కాలేజ్‌లో జరిగే సాహిత్య సమావేశాలకు హాజరై తన కవిత్వ అడుగులను పదును పెట్టుకున్నాడు. ఉద్యమానికి అండగా నిలబడ్డాడు. కవిసంగమంలో సమూహమై తన స్వరాన్ని సవరించుకున్నాడు. నిత్యం యువకవుల మధ్య అన్యోన్యంగా మెలుగుతూ పచ్చి పచ్చి అక్షరాలతో ఎందరిచేతనో మన్ననలు పొందాడు. ఎన్ని అవార్డులు వచ్చినా గోపాల్లో ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే తనమే అతణ్ణి కవిగా నిలబెట్టింది. అక్షరాలు మానవత్వానికి జీవం పోయాలనేతనం తన జీవినవిధానంగా మారింది. బడిలో పాఠాలు చెప్తూ పిల్లలను తయారు చేస్తున్న యువ ఉపాధ్యాయుని మొదటి కవితా సంపుటి దండకడియానికి ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడెమి యువపురస్కారం కల్వకుర్తికి కాలి నడకన తరలొచ్చింది.
ఇట్లా తెలంగాణ మట్టి ముద్ర ఈ యేడాది అకాడెమి అవార్డుల్లో బలంగా కనిపిస్తున్నది. తెలుగు సాహిత్యాన్ని కబ్జా చేసినట్టే అకాడెమి అవార్డుల్లో సైతం ఎన్నో యేండ్లు వివక్ష రాజ్యమేలింది. అందుకే ఆత్మగౌరవ ఉద్యమం పురుడుపోసుకున్నది. తన వాటా తనకు దక్కాలని కొట్లాడింది. ఇప్పటికైనా ఆ నేల సాహిత్యంలో ఓ మేరకు తన వాటా తాను దక్కించుకునేందుకు ఆధారంగా నిలిచిన ఈ కలాలకు గుండె నిండుగా శుభాకాంక్షలు. మరింతగా తమ సాహిత్య సృజనను విస్తరింపజేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని విజయపతాకను చేసి ఎగరేయాలని ఆశిద్దాం.
-డా|| పసునూరి రవీందర్, 77026 48825