Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ ఆశయాలలో ఒకటైనా అస్పృశ్యతా నివారణలో భాగంగా గడియారం రామకృష్ణ శర్మ నిమ్న కులాలనబడే వారికి సహచర్యులుగా ఉండి తన ఇంట్లోకి తీసుకెళ్ళారు. సమాజం సాంఘిక దురాచారాలతో భ్రష్టు పట్టిందని కుమిలిపోయిన సంస్కరణ వాదైన శర్మ వితంతు వివాహం చేసుకొని సంఘ సంస్కర్తగా తన సహృదయతను చాటుకున్నారు. నిజాం విముక్తి పోరాటంలో ప్రభుత్వాన్ని నిరసిస్తూ కాంగ్రెసు నాయకుల ఆదేశం మేరకు అలంపూరు పరిసర గ్రామాలలో సత్యాగ్రహులని నిర్ణయించి కార్యకర్తల చేత సత్యాగ్రహం చేపట్టారు.
భారత ప్రభుత్వం స్వాతంత్య్ర సమర యోధుడిగా గుర్తించి ఇచ్చిన మూడెకరాల పొలాన్ని అమ్మి జోగులాంబ ఆలయానికి ఇచ్చిన దాతృత్వ శీలి. ఆంధ్రదేశంలో పూర్వపు పాలమూరు జిల్లా చరిత్ర తెలుసుకోవడానికి కేర్ ఆఫ్ అడ్రస్ గడియారమే. ఆయన జ్వాలాపతి, సుబ్బమ్మ దంపతులకు 1919 మార్చి 6 జన్మించారు. వీరి బాల్యం అంతానూ కదిరి, శింగవరంలో గడిచింది. శర్మ కూడా బాబాసాహెబ్ పల్లెలోని వీధి బడిలో చదువుకున్నారు. వీధిలోని ఇసుకలో అక్షరాలు దిద్ది, గురువుల ప్రోత్సాహంతో చిన్ననాడే మహా గ్రంథాలు చదివారు. పలు పౌరాణిక నాటకాలలో నటుడిగా తన ప్రతిభను కనబరిచారు.
సాంఘిక ఉద్యమం : మాట్లాడే స్వేచ్చ లేని, ప్రశ్నించే హక్కు లేని హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలను, ప్రభుత్వం గురి చేస్తున్న దారుణ, మారణ కాండల నుంచి మేల్కొల్పడానికి ఒక ఆంధ్రయువజన నాట్య మండలి అవసరమని తలిచిన శర్మ... దాన్ని స్థాపించారు. ఈ నాట్య మండలి సురవరం రాఘవరెడ్డి అధ్యక్షులుగా, రామకృష్ణ శర్మ కార్య దర్శిగా ప్రారంభమైంది. సంస్థాన ప్రజలను సమాయత్తపరచడానికి, సాంస్కృతికంగా మేల్కొల్పడానికి ఆంధ్రమహాసభ అలంపూరు తాలుకా రామకృష్ణ శర్మ కార్యదర్శిగా ఏర్పడింది. జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ ఆశయాలలో ఒకటైనా అస్పృశ్యతా నివారణలో భాగంగా గడియారం రామకృష్ణ శర్మ నిమ్న కులాలనబడే వారికి సహచర్యులుగా ఉండి తన ఇంట్లోకి తీసుకెళ్ళారు. సమాజం సాంఘిక దురాచారాలతో భ్రష్టు పట్టిందని కుమిలిపోయిన సంస్కరణ వాదైన శర్మ వితంతు వివాహం చేసుకొని సంఘ సంస్కర్తగా తన సహృదయతను చాటుకున్నారు. నిజాం విముక్తి పోరాటంలో ప్రభుత్వాన్ని నిరసిస్తూ కాంగ్రెసు నాయకుల ఆదేశం మేరకు అలంపూరు పరిసర గ్రామాలలో సత్యాగ్రహులని నిర్ణయించి కార్యకర్తల చేత సత్యాగ్రహం చేపట్టారు. ఈ సత్యాగ్రహంలో భాగంగా శర్మ చెన్నిపాడులో జెండాను ఆవిష్కరించి ఊహకందని రీతిలో రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభించారు.
గొప్ప గౌరవం : ఎన్నో ఏండ్ల అవిరామ పోరాటాల ఫలితంగా హైదరాబాదు రాష్ట్రం స్వాతంత్య్రం సాధించిన తరువాత సెప్టెంబర్ 19న మిలిటరీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సందర్భంలో ప్రభుత్వానికి సలహాదారులుగా కొంత మంది నియామకమయ్యారు. వారిలో అలంపూరు తాలుకా నుంచి సలహాదారులుగా రామకృష్ణ శర్మను భారత ప్రభుత్వం నియమించింది.
సంఘ సేవాసక్తి :1952లో అసెంబ్లీ ఎన్నికల వేళ అలంపూరు నుంచి టి. చంద్రశేఖర రెడ్డి స్వతంత్రుడిగా పోటీ చేసినపుడు ఆయనకు మద్దతుగా నిలిచిన శర్మ తన సాహిత్యంతో ప్రచారం చేశారు. 1943లో పదవ ఆంధ్ర మహాసభలోనే పునాది పడిన ఆంధ్ర సారస్వత పరిషత్తు 11 మంది కార్యవర్గ సభ్యులలో రామకృష్ణ శర్మ ఒకరు.
ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని హిందీ విశ్వవిద్యాలయంగా మార్చాలని పెట్టిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఏర్పడిన సిటిజన్స్ కమీటిలో సభ్యులుగా ఉన్నారు. చాలా మంది తాము చదువుకున్న పాఠశాలను మర్చిపోతారు. కాని శర్మ మాత్రం తాను చదువుకున్న పాఠశాలలో ఏమాత్రం అభివృద్ధి లేకపోవడం చూసి బాధ పడ్డారు. దాంతో ఎంతో శ్రమపడి నూతన భవనాన్ని నిర్మించి అప్పటి విద్యా శాఖ కార్యదర్శి ఎల్. ఎన్. గుప్తా చేత ప్రారంభింపచేశారు. ఇది చాలా అరుదైన విషయం. ప్రపంచంలో ఎవరైనా పాతబడ్డ చరిత్రను, శిల్ప సంపదను విస్మరిస్తారు. కాని శర్మ మాత్రం భవిష్యత్తరాలకు ఆ జ్ఞాననిధిని అందించాలని తలిచి వాటినొకచోట చేర్చి అలంపూరంలో మ్యూజియాన్ని ప్రారంభింపచేశారు. దేవాలయాల, వాస్తు శిల్పాల మీద శర్మ గారికి అధిక ఆసక్తి ఉండేది. దాంతో ఆ చరిత్రను తెలుసుకోవడానికి సిద్ధమైనపుడు అది ఆంగ్లంలో ఉండడం వల్ల చదవలేకపోయాడు. కాని ఎలాగైనా భారత దేవాలయాల విశిష్టతను తెలుసుకోవాలనే జిజ్ఞాసతో తన 27 వ యేట ఆంగ్లం నేర్చుకున్నారు.
అలంపూరంలోని ప్రాచీన, చారిత్రక శాసనాలలో ఏముందో తెలుసుకొని పలు పత్రికలనూ ఆకరాలుగా చేసుకొని వాటన్నిటిని అధ్యయనం చేసి 1946లో 'అలంపూరు శిథిలాలు' పేరుతో పుస్తకం రాశారు. శర్మ రాసిన 'మాన్యుమెంట్స్ ఆఫ్ ఆలంపూరు' పుస్తకానికి పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్న స్టెల్లా క్రామరోష్ అనే అతను ముందుమాట రాశారు.
అందరిలా సాహిత్యానికే పరిమితం కాలేదు శర్మ. గడియారంలా అన్నింటినీ చుట్టివచ్చారు. క్షేత్ర చరిత్ర, దేశ చరిత్ర, జీవిత చరిత్ర, వాస్తు శిల్పం, శాసన పరిశోధన, అనువాదం, బాల సాహిత్యం వంటి వైవిధ్యమైన జ్ఞానశాఖల్లో ధ్యానం చేసి వాటి ఫలాల్ని వెలిగే తెలుగు లోకానికి అందించి అమృతమూర్తి అయిన గడియారం 2006 జూన్లో మరణించారు.
- ఘనపురం సుదర్శన్,
9000470542