Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చట్ట పరిరక్షణను మించిన సురక్షితత్వం సంస్కృతి సంప్రదాయాలు పౌరులకు ఇవ్వగలవు.
చట్టాలు ఒక సమస్యకు పెదవి దాపు మాటలుగానే తప్ప, సంస్కృతి సంప్రదాయాల వలె
మనిషి గుండెలోతులను తడిమే ఆనవాలు కాలేవు. అందుకే సమస్యల పరిష్కారానికి చట్టాల కంటే సాంస్కృతిక విధాన రూపకల్పనే ఆశించిన ఫతాలితాలనివ్వగలదు.
సమాజంలో ఏ మార్పు అయినా చట్టాల ద్వారానే సాధ్యం. దీన్నెవరూ కాదనలేరు. ఐతే మనదేశంలో చట్టాలు ఎన్ని ఉన్నప్పటికినీ సంస్కృతి సంప్రదాయాలు సమాజ నడవడికను నిర్దేశిస్తాయన్న సత్యాన్ని మనం మరువరాదు. రాజ్యాంగం ప్రకారం చట్టాల రూపకల్పనాధికారం చట్ట సభలకూ చట్టాల అమలునూ సమీక్షించే అధికారం చట్టసభలతోపాటు కోర్టులకూ ఉంది. కానీ సంస్కృతి సంప్రదాయాలు చట్టసభల పరిధిలో కోర్టుల పరిధిలో ఉండవు. సమాజం పరిధిలో ఉంటాయి. ప్రజల సాంఘిక నైసర్గిక వారసత్వ సంబంధ బాంధవ్యాల పరిధిలో ఉంటాయి. అందుబాటులోని జీవన వనరులతో సమ్మిళితమై ఉంటా యి. సంస్కృతి సంప్రదాయాలకు ఒక మహత్తరమైన శక్తి ఉంటుంది. అదేం టంటే, సమాజ ఆవిర్భావం మొదలుకొని అభివృద్ధి వికాసాలు విశాలత దాని క్రమాన్ని సంస్కృతి సంప్ర దాయాలు నియంత్రిస్తుంటాయి. ఒక దేశం యొక్క విశిష్టత చట్టాల్లో కంటే అక్కడి సంస్కృతి సంప్రదాయాల్లో
నిక్షిప్తమై ఉంటుందనేది సామాజిక వేత్తల అభిప్రాయం. ప్రముఖ ఐరోపా సాంస్కృతిక విధాన విశ్లేషకులు డామెన్ హెల్లీ ''సంస్కృతి అనేది మూలికలు, పువ్వులు విత్తనాల వంటిది, అవి మొలకెత్తుతాయి, భయంకరమైన శిథిలాలను వాటి మొగ్గతో కప్పివేస్తాయి. సంస్కృతి ప్రజలకు ఆశను పునః ప్రసాదిస్తుంది. గాయపడిన వారి ఆత్మలకు వారి పీడకలలు, ఆగ్రహావేశాలు, ప్రతీకారం నుంచి ఉపశమనం పొందే అవకాశం సంస్కృతి కల్పిస్తుంది'' అంటాడు. నిజమే, చట్ట పరిరక్షణను మించిన సురక్షితత్వం సంస్కృతి సంప్రదాయాలు పౌరులకు ఇవ్వగలవు. చట్టాలు ఒక సమస్యకు పెదవి దాపు మాటలుగానే తప్ప, సంస్కృతి సంప్ర దాయాల వలె మనిషి గుండెలోతులను తడిమే ఆనవాలు కాలేవు. అందుకే సమస్యల పరిష్కారానికి చట్టాల కంటే సాంస్కృతిక విధాన రూపకల్పనే ఆశించిన ఫతాలితాలనివ్వగలదు. ఇది మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏండ్లకు పెంచుతూ డిసెంబర్ 16న నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికీ వర్తిస్తుంది.
మహిళల వివాహ వయస్సు పెంపు గురించిన చర్చకు వద్దాం. కిందటి శతాబ్దాల్లో పసితనంలోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు జరిగేవి. సంఘసంస్కర్తలు స్త్రీజనోద్ధరణలో భాగంగా బాల్య వివాహాలపై ఉద్యమిస్తూ వచ్చారు. 1860లో భారతీయ శిక్షాస్మృతి మొదటి సారిగా అమలులోకి వచ్చినప్పుడు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికతో లైంగిక సంబంధం నిషేధించబడింది. 12 ఏండ్ల లోపు బాలికతో వివాహాన్ని చట్టవిరుద్ధం చేసే ఏజ్ ఆఫ్ కాన్సెంట్ బిల్లు-1927ను తీసుకురావాలని మహిళా హక్కుల కార్యకర్తలు నాటి బ్రిటీష్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచారు. పర్యవసానంగా బాల్య వివాహాల నిరోధక చట్టం 'శారదా యాక్ట్' ఏప్రిల్ 1,1930 నుంచి అమలులోకి వచ్చింది. తత్ఫలితంగా స్వాతంత్య్రా నంతరం 1949 వరకు అమ్మాయిలకు 14, అబ్బాయిలకు 18 సంవత్సరాలుగా వివాహ కనీసం వయస్సుగా నిర్ణయమైంది. ఆ తర్వాత అమ్మాయిలకు 15 సంవత్సరాలు కొనసాగుతూ 1978లో మహిళలకు 18, పురుషులకు 21 సంవత్సాలుగా నిర్ణయించారు. ఇదే ఇప్పటిదాకా అమలులో ఉంది. అయినప్పటికీ దళితుల్లో 35శాతం, గిరిజనుల్లో31శాతం బాల్యవివాహాలు జరిగినట్టు 'బాలల జాతీయ కార్యాచరణ ప్రణాళిక -2017'ను పరిశీలిస్తే తెలుస్తుంది. గత ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మహిళలకు చట్టబద్దమైన వివాహ వయస్సును 21కి పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తత్ పర్యవసానమే ఇప్పుడీ బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లు. ఇందుకు ''ఆడపిల్లలు చదువుకోవడానికి, పురోగమించడానికి సమయం కావాలని మేము దీన్ని తెస్తున్నాం. దేశం తన కుమార్తెల కోసం ఈ నిర్ణయం తీసుకుంటోంది. మహిళలు తమ విద్యను పూర్తి చేయడానికి, ఉపాధి అవకాశాలను పొందేందుకు, వివాహానికి ముందు మానసిక పరిపక్వతను సాధించడానికి, లింగ సమానత్వాన్ని నిర్ధారించడానికి వారికి ఎక్కువ సమయం ఇవ్వడం ద్వారా సమాన అవకాశాలను అందించడమే లక్ష్యం'' అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న అంశాలు నూటికి నూరుపాళ్లు సహేతుకమైనవే.'' మన దేశంలో స్త్రీ సమానత్వాన్ని వివాహ వయస్సులో చూడాలని నేను కోరుకుం టున్నాను. విభిన్న విశ్వాసాలకు చెందిన విభిన్న వివాహ చట్టాలను సమీక్షిస్తూ, సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు నేను ముందుకొచ్చాను'' అని మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటులో వెల్లడించడమూ హర్షించదగిందే. కాకపోతే, ముందు ప్రస్తావించినట్టు మన దేశంలో రాజ్యాంగం నిర్మించే శాసనాల చెల్లుబాటుకన్నా సంస్కృతి సంప్రదాయాలకు అందునా వ్యవస్థీకృత పితృస్వామ్యానికి పైచేయి ఉంటుంది. ఇక్కడే దిద్దుబాటు మొదలు కావాలి.
అడుగడుగునా సామాజిక అంతరాలున్న దేశం మనది. భిన్న కులాలు, మతాలు, తెగలు, ప్రాంతాలుగా స్థానీయ ముద్రతో ఎక్కడికక్కడ జనం జీవిస్తారు. గ్రామీణ సమాజాలు అంతరాలకు వివక్షకు పెట్టినపేరు. ఇప్పటికీ బడిలో అడుగిడని బాలికలు కోట్లల్లో ఉండటం ఇందుకో ఉదాహరణ. ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్న సమాజమూ కావటాన నిరుపేద తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను ఇంటిపనుల్లోనో పశుపోషణలోనో పొలం పనుల్లోనూ లేదా తమ వెంట శ్రమలోనో పెడతున్నారు. పట్టణాల్లో అయితే నిరుపేద ఆడపిల్లలు సంపన్నుల మేడల్లో పనిమనుషులుగా మారిపోయి 'ఆధునిక వెట్టి' నెలకొంది. ప్రపంచీకరణ అనంతరం విపరీత వ్యాపార విలువలు ముందుకొచ్చి శరీర రాజకీయాలకు స్త్రీలు బలవుతున్నారు. లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆడపిల్లల సంరక్షణ, చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాల్సివుంది. లేదంటే తమ పిల్లలను స్థితిమంతుల వలె పెద్ద చదువులకూ పెద్ద ఉద్యోగాలకూ పంపే పరిస్థితి లేక, ఈ కొత్త చట్టం కారణంగా ఇరవైఒక్కఏండ్ల వరకూ ఇంట్లో పెట్టుకోలేక తల్లిదండ్రులు నలిగిపోతారు. ఇదే సందర్భంలో వైద్యనిపుణులు చెబుతున్న 'శతాబ్దం క్రితం 16 ఏండ్లు పైబడ్డాకే యౌవనస్తులయ్యే పరిస్థితి నుంచి ఇప్పుడు 12 ఏండ్లకే బాలికలు ఎదుగుతున్నారు' అనే అంశాన్నీ అందరం గుర్తెరగాల్సి వుంది. ఈ పరిస్థితుల్లో అటు చదివించలేక, ఇటు పెండ్లిలు చేసే వీలూ లేక నిరుపేదలు మొదలుకొని మధ్య తరగతి దాకా ఇండ్లల్లో 'నిరాశామయ యువతుల సమూహపు నిలుపుదల' సంభవిస్తుంది. ఈ నిలుపుదల సమాజంలో ఇతరేతర జాడ్యాలకూ వక్రగతులకూ దారితీస్తుంది. అయితే ప్రధాని చెప్పిన ''మహిళలకు అవకాశం ఇచ్చినప్పుడల్లా, వారు భారతదేశాన్ని గర్వించేలా చేశారు, వ్యవస్థలను బలోపేతం చేశారు. వారికి స్వయం ఉపాధిని, ఉద్యోగావకాశాలను సమానంగా అందించ డమే మా సంకల్పం. ప్రభుత్వం తన కూతుళ్లు, సోదరీమణుల ఆరోగ్యం గురించి నిరంతరం శ్రద్ధ వహిస్తుంది. ఆడబిడ్డలను పోషకాహార లోపం నుంచి రక్షించడానికి, వారికి సరైన వయస్సులో వివాహం చేయడం ఎంతో అవసరం'' అంటున్న స్ఫూర్తిదాయక వాక్యాలు నిజం కావడానికి చట్టంతో పాటు ఆడశిశువుకు జన్మనిచ్చే విషయం దగ్గర నుంచి పెంపకం, కుటుంబ భాగస్వామ్యం, ఆర్థిక స్వావలంబన, సామాజిక గౌరవం వరకు గల పితృస్వామ్య భావజాలం దాన్ని పెనవేసుకున్న సంస్కృతి సంప్రదాయాల్లో మార్పు రావడానికి, తేవడానికి కావాల్సిన మౌలిక చైతన్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించాలి.
మహిళల చట్టబద్ధమైన వివాహ వయస్సును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనకు మద్దతు ఇస్తూ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి. చిదంబరం ఈ చట్టాన్ని 2023లో మాత్రమే అమలులోకి తీసుకురావాలని సూచించారు. ఒక వ్యక్తికి 21 ఏండ్లు నిండిన తర్వాత మాత్రమే వివాహం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి రాబోయే సంవత్సర కాలాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలన్న చిదంబరం సూచనా సబబైందే. ప్రతిపాదిత చట్టాన్ని హాస్యాస్పదంగా అభివర్ణిస్తూ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షులు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, స్త్రీలు, పురుషులు ఇద్దరూ 18 సంవత్సరాల వయస్సులో చట్టబద్ధంగా వివాహం చేసుకోవడానికి అనుమతించాలని అన్నారు. చట్టం ప్రకారం వారిని ఎన్నికల ప్రయోజనాల కోసం ' ఓటు వేసే పెద్దలు' గా పరిగణించినప్పుడు వివాహం కోసమే ఎందుకు పిల్లలుగా చూడాలని వరుస ట్వీట్లలో నిరసన తెలుపుతున్న ఓవైసీ వాదనా ఆలోచించదగిందే. దీనికంటే ముందు ముఖ్యంగా అన్ని వర్గాల మహిళలకు న్యాయం జరిగేటట్టుగా చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లును సవరించి ఉభయ సభల ఆమోదానికి కేంద్రప్రభుత్వం కృషిచేయాలి.
అభివృద్ధి చెందిన పాశ్చాత్య ప్రపంచంలో ఏ దేశమూ 18 ఏండ్లలోపు వివాహాలను అనుమతించదు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, మనదేశంలో ప్రతి ఏటా కోటిన్నర బాల్య వివాహాలు జరుగుతున్నాయి. మన వివాహ వ్యవస్థకు సంబంధించిన సాంఘిక విషాదం గురించి ఇటీవలి ఒక సంఘటన మీకు తెలియపరుస్తాను. రాజస్థాన్‌లో పదహారేండ్ల కోమల పాఠశాలకు శ్రద్ధాసక్తులతో వెళ్తుంది. ఒక్క రోజు కూడా గైరాÛజరు కాదు. ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయికి వెళ్లాలనుకున్న విద్యార్థిని. అయితే, తన సోదరుడి వధువు కోసం తల్లిదండ్రులు ఆమెను మార్పిడి చేయడంతో ఆమె వధువు కావాల్సి వచ్చింది. రాజస్థాన్‌లో ఈ వివాహ ఆచారాన్ని' అట్టా-సత్తా' అంటారు. దీన్ని మన దగ్గర 'కుండ మార్పిడి' అంటాం. ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకున్న కోమల కలలు ఆమె పదిహేడేండ్లకే గర్భవతి కావడంతో కల్లలయ్యాయి. ఈ నేపథ్యంలో1978 తో పోల్చిచూస్తే తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (చీఖీనూ 5 2019-21) 40 ఏండ్లతర్వాత కూడా బాల్య వివాహాల ప్రమాదకర రేటు 23శాతం వద్ద దేశం ఉందనేది భయంకరమైన వాస్తవం. ఇది వెనుకబడిన, పేదరిక పీడిత ప్రాంతాలలో ఉన్న బాలికలకు అవకాశాలు కల్పించడం లేదా ఆరోగ్య సంరక్షణకు మెరుగైన సదుపాయం కల్పించడం అనే లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రభుత్వం వైఫల్యాన్ని ఇది సూచిస్తుంది. ఇది స్త్రీల పట్ల మారని సంప్రదాయవాద, మహిళా వ్యతిరేక వైఖరికి దర్పణం. 21వ శతాబ్దంలో భారతదేశంలో వివాహానికి చట్టబద్ధమైన వయస్సు 18 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ, రాజస్థాన్‌లో కోమల వివాహాల వంటి వివాహాలు ప్రబలంగా జరిగే ప్రాంతాలు ఉదంతాలు మనదేశంలో కోకొల్లలు.కోమల కథనం అమ్మాయిల వివాహ వయస్సును 18 నేంచి 21 సంవత్సరాలకు పెంచాల్సిన ఆవశ్యకతను ఘోషిస్తూనే ప్రస్తుత చట్టం కంటే మెరుగైన అమలుతో కొత్త కఠినమైన చట్టాన్ని కోరుతోంది. సమతా పార్టీ అధ్యక్షురాలు జయా జైట్లీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ నివేదిక చెబుతున్నట్టుగా మహిళల వివాహ వయస్సు పెంచడం వల్ల శిశుమరణాల రేటు, ప్రసూతి మరణాల నిష్పత్తి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అయితే ,ఒక్క వివాహ వయస్సు పెంపుతోనే మహిళా సాధికారత సిద్ధించదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. వివాహం తదనంతర స్థితిగతుల్లో స్త్రీల జీవితాల్లో గౌరవప్రదమైన మార్పులకు యూనిసెఫ్ సూచిస్తున్న 'స్కేల్-అప్ స్ట్రేటజీ' ఇక్కడ కీలకమైంది. సోషియో కల్చరల్ అంశాలతో ముడివడిన కౌమార వివాహాల సంక్లిష్టతలను నిర్మాణాత్మకంగా పరిష్కరించాలనే యూనిసెఫ్ సలహాను ప్రభుత్వం స్వీకరించాలి. ఇది ఇలా ఉండగా టాస్క్ ఫోర్స్‌కు ప్రతిస్పందనగా ఏర్పడిన 96 పౌర సమాజ సంస్థలతో కూడిన 'యంగ్ వాయిస్: నేషనల్ వర్కింగ్ గ్రూప్' జూలై 25, 2020న ప్రచురించిన తన నివేదికలో కూడా ఈ చర్యను వ్యతిరేకించింది. 15 రాష్ట్రాల్లోని దాదాపు 2,500 మంది కౌమారదశలో ఉన్నవారిని సర్వే చేసి విడుదల చేసిన రిపోర్టులో ''మహిళల నిర్వీర్యానికి గల మూల కారణాలను పరిష్కరించకపోతే వివాహ వయస్సును పెంచడం వల్ల దానికే నష్టం, లేదా ప్రభావం ఉండదు.'' అని పేర్కొనడం చూస్తే మహిళా సాధికారతకు పితృస్వామిక సంస్కృతి ప్రతిబంధకంలా మారి ఏ స్థాయిలో మోకాలడ్డుతూ ఉగ్రరూపం దాల్చి ఉందో తెలుస్తున్నది. కేవలం కాగితాలపై చట్టాలు చేసి చేతులు దులుపుకోవడం కాకుండా స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ప్రపంచంలో మూడింట ఒక వంతు వధువులున్న మనదేశంలో సామాజిక మార్పుకోసం ఒక పటిష్ఠమైన ఒక సమీకృత ప్రజాస్వామిక సాంస్కృతిక విధానాన్ని రూపొందించి ప్రణాళికా బద్దంగా ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి వుంది. వివహ వయస్సు పెంపును నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తన్న మహిళా సంఘాలు కోరుతున్నట్టు స్త్రీ సమానత సాధికారత అంతస్సూత్రంగా పౌర సమాజంలో జీవన విలువల స్థాపన జరగాల్సి వుంది.
-డా|| బెల్లి యాదయ్య, 98483 92690