Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలికలలో అక్షరాస్యత శాతాన్ని పెంచి విద్యా వంతులుగా మార్చి వారి కాళ్ళ మీద వారు నిలబడగలిగేలా చేసి మహిళల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా సమాజ పురోగతి సాధ్య మవుతుంది నగరాలలో చూసినపుడు మాత్రమే బాలికా విద్య అధికంగా ఉన్నట్టు కనిపిస్తుంది. పల్లెటూళ్ళు, గ్రామాలలో ఇప్పటికీ బాలికా విద్య అంతంత మాత్రంగానే ఉంటున్నది. విద్యను అభ్యసిస్తే బాల్య వివాహాల శాతం తక్కువవుతుంది. కుటుంబంలో కూడా బాలికలు శ్రమ దోపిడికి గురౌతున్నారు. మగపిల్లలతో పాటు సమానమైన చదువులు, జీతాలు రెండూలేవు. ప్రపంచ వ్యాప్తంగా బాలికలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. బాలి కలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి వారి హక్కులను వారికి తెలియచేసేందుకు ఐక్య రాజ్యసమితి అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. విద్య, పోషణ, వైద్య సంరక్షణ, రక్షణ, చట్ట పరమైన హక్కులు, గృహహింస, బలవంతపు బాల్వ వివాహాలు వంటి ఎన్నోరకాల అసమానతలను బాలికలు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో సరియైన మరుగు దొడ్లు లేక ఎన్నో సమస్యల పాలవుతున్నారు. సహజ రుతుస్రావ సమయాల్లో ఎలాంటి పరిశుభ్రత పాటించాలో తెలియక అనారోగ్యం పాలవుతున్నారు.
ఆసియా ఖండంలోని దేశాలలో ఒక్క భారత దేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత కలిగిన బాలి కలు న్నారు.ఈ నాటికీ మహిళల జనాభాలో అక్ష రాస్యులైన మహిళలు నలభైశాతం కన్నా తక్కు వగానే ఉన్నారు అంటే నేెటికీ భారత దేశంలో కనీసం 20 కోట్ల మంది నిరక్ష రాస్యులే ఉన్నారు. ఈ నిరక్షరాస్యత అనేది కేవలం వారి జీవితం పైనే కాదు వారి కుటుంబ జీవితం పైన కూడా వ్యతిరేక ప్రభావం చూపుతుంది.
నిరక్షరాస్యులైన మహిళలే (ప్రసవ సమయాల్లో ఎక్కువగా మరణిస్తున్నట్టుగా అనేక అధ్యయనాల బట్టి తెలుస్తున్నది. పోషకాహారం తక్కువగా తీసుకోవటం, రక్తహీనతకు గురవటం తత్ఫలితంగా ప్రసవ మరణాలు సంభవించటం చూస్తున్నాం. ఇవే కాక వారి పిల్లల పెంపకం మీదా తల్లుల అక్షరాస్యతా శాతం ప్రభావం చూపిస్తున్నది. తల్లి చదువుకున్నదయితే పిల్లల ఆరోగ్యం, పెంపకం, టీకాల విషయంలో జాగ్రత్త పడుతుంది. పిల్లలకు మంచి విలువలు బోధించటంలో తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. బాలికలకు కనీసం ప్రాధమిక
విద్యను బోధించేలా విద్యా సంస్కరణలను చేపట్టి ఆదిశగా ప్రభుత్వాలు కృషి చేస్తు న్నాయి. నిరక్ష రాస్యత జనాభా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడు తుంది. విద్యా పరంగా వెనకపడిన గ్రామాల్లో కస్తూరిబా గాంధీ బాలికల విద్యా లయాలు ఏర్పాటు చేయబడ్డాయి. పసి కందుల మరణాలకూ, తల్లి అక్షరాస్యతకూ సంబంధం ఉందని అంతర్భాతీయ పిల్లల వైద్యా నిపుణుల సమావేశాల్లో తెలిపారు నెలలు నిండకుండా పుట్టిన పిల్లల రక్షణకు చెప్పే సూత్రాలను, పద్ధతులను అర్థం చేసుకోవాలంటే ప్రాథమిక విద్య అవసరం.
మంచి వాతావరణం నుంచి వచ్చిన పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. ఎలాంటి పరిస్థితినైనా విజయవంతంగా అధిగమించగలరు కుటుంబం, పాఠశాల, సమాజం వాతావరణాలలో కలిసి మెలసి బతకాలంటే మంచి ప్రవర్తన అవసరం మంచి వాతావరణంలో పెరగని వారు నేర ప్రవృత్తి కలిగి ఉంటారని చాలా అధ్యయనాల్లో తెలిసింది. పిల్లల్ని ప్రతి భావంతులుగా మలిచే విషయంలో తల్లిదండ్రులూ ఉపాధ్యా యులే ప్రధాన పాత్ర వహిస్తారు.
బాలికలు ఆరోగ్యంగా పెరిగినట్లైతే) ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారు. 18 సంవతల్సరాలకు ముందుగా పెళ్ళి చేయకుండా అంటే బాల్య వివాహాలు జరగకుండా చూడటం కూడా సమాజం బాధ్యత. సమాజంలో బాలికల పెంపకంతో కట్నాలు వంటి దురాచారాల వలన తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వడ్లగింజ గొంతులో వేసి చంపేయడం... ఏ ముళ్ళపొదల్లోనో పారేయడం వంటి అమానవత్వ సంఘటనలకు పాల్పడు తున్నారు. ఇంకా వైద్యశాస్త్రంలోని టెక్నాలజీని వాడుకొని కడుపులో ఉన్న బిడ్డ ఆడా, మగా అని తెలుసుకొని ఆడబిడ్డల్ని చంపేసే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఫలితం జీవసమతుల్యతలో ఆడపిల్లలు తగ్గిపోయి కేవలం మగ పిల్లలు మాత్రమే ఉంటే భవిష్య సమాజంలో పెళ్ళిళ్ళ ఎలా జరుగుతాయి. ఆడపిల్లల పెంపకాలు భారం కావటం వల్లనే తల్లిదండ్రులు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయడం లేకపోతే తల్లిదండ్రులు ఆనందంగా ఆడపిల్లల్ని పెంచుతారు.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చేసిన సర్వేలో బాలల్లో ముఖ్యంగా 6-12 సంవత్సరాల మధ్య వయసు వారు లైంగిక అత్యాచారాలకు హింసకు గురవుతున్నారని తెలిపింది. 21శాతం బాలికలు తీవ్రమైన లైంగిక అత్యాచారాలకు గురవుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రతి ముగ్గురి బాలికల్లో ఇద్దరు శ్రమ దోపిడికి గురవుతున్నారు.
88శాతం బాలలు తమ తల్లిదండ్రుల ద్వారానే శ్రమ దోపిడికి గురవుతున్నారు. 50 శాతం లైంగిక అత్యాచారాలు పిల్లలకు బాగా నమ్మకమున్న వారు, కుటుంబంలోని బంధువుల వలననే జరుగుతున్నాయి అస్సాం, బీహార్, ఢిల్లీ, తెలుగు రాష్ట్రాలలోని బాలికలు ఎక్కువ శాతం లైంగిక అత్యాచారాలకు గురవుతున్నారు. చాలా వరకు తల్లిదండ్రులే బాలికలను వివక్షతో చూస్తారు. మానసిక వేధింపులు విషయంలో బాల బాలికల మధ్య తేడా ఉండడం లేదు. బాలలైతే చాలు వేధింపులు అను భవిస్తున్నారు.
దోపిడి వివక్ష వంటి వాటిలో బాల కార్మికులు ముందుంటున్నారు. ఈనాడు ఇటుక బట్టీల్లో క్యారీల్లో కర్మాగారాల్లో కంటికి కనిపించే బాల కార్మికులుంటే రెసిడెన్షియల్ స్కూళ్ళు, హాస్టళ్ళలో పైకి చదువుకుంటూ కనిపించి బాల కార్మికులుంటారు. వారికి సరియైన నిద్ర, వ్యాయామం, మానసికోల్లాసం లేకుండా జైళ్ళలాంటి స్కూళ్ళలో వత్తిడికి గురవుతున్నారు. పెద్ద జీతాల కోసం ఆశపడుతూ పిల్లల సామర్థ్యాన్ని లెక్కలోకి తీసుకోకుండా పెద్ద చదువుల కోసం పోటీ పడమని తల్లిదండ్రులు హాస్టళ్ళలో తోస్తున్నారు. మంచి చెడు వ్యత్యాసాలు చెప్పేవారు లేక ఏది చేసినా మందలించే వారు లేక హాస్టళ్ళలో వింత ప్రవర్తనలు, నేర్చుకుంటున్నారు. పిల్లల హక్కులను తల్లిదండ్రులు పరిరక్షించాలి. స్వేచ్ఛా వాతావరణంలో పిల్లలు పెరిగేలా చూడాలి.
- డా|| కందేపి రాణీప్రసాద్, 9866160378